ఆశలు అడియాశలయ్యాయి.. అంచనాలు తలకిందులయ్యాయి. సర్కార్‌పై ఉన్న భారాన్ని తొలగించుకోవడమే లక్ష్యంగా తయారైన కేంద్ర బడ్జెట్.. సామాన్యుడికి గుదిబండనే చెప్పాలి. ఈ బడ్జెట్‌తో ప్రతీ వస్తువు ధరా ఎంతో కొంత పెరగనుంది.
ప్రణబ్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వరాలతో పాటు వడ్డింపులూ ఉన్నాయి. అంతేకాదు.. కొన్ని వర్గాలను సంతోషంలో ముంచేస్తే .. మరికొందరికి మాత్రం తీవ్ర నిరాశనే కలగజేయనుంది. చిన్న ఉద్యోగులకు.. ప్రణబ్ నిర్ణయాలు పెనుభారంగానే మారనున్నాయి. కనీసం రెండు లక్షల వరకన్నా వ్యక్తిగత పన్ను మినహాయింపు ఇస్తారనుకున్న ఆశలు నెరవేరలేదు. లక్షా 60 వేల రూపాయల వరకూ ప్రస్తుతం అమలవుతున్న పన్ను మినహాయింపును అలానే కొనసాగించారు. 1.6 లక్షల నుంచి 5 లక్షల వరకూ పది శాతాన్ని, 5 నుంచి 8 లక్షల వరకూ 20 శాతాన్ని, 8 లక్షల రూపాయలకు పైబడిన వారికి ౩౦ శాతం పన్ను విధించారు. పన్ను స్లాబ్‌లను మార్చడం.. ఉన్నత వేతన జీవులకు కాస్త ఊరటే. ౩ లక్షల నుంచి 5 లక్షల వరకూ ఉన్న స్లాబ్‌ను తొలగించి.. దాన్ని 1.6 లక్షల నుంచి 5 లక్షల వరకూ మార్చారు. దీనివల్ల 2౦ శాతం పన్ను చెల్లింపు దారులకు లబ్ది కలుగుతుందన్నది ప్రణబ్ నమ్మకం. కానీ వాస్తవం మాత్రం వేరు. సేవింగ్స్ పోగా.. పన్ను కట్టాల్సిన మొత్తం 5 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికే ఉపయోగం.
ధరలు పెరగేవి
సామాన్య, మధ్యతరగతి జీవితాలను ప్రణబ్ ముఖర్జీ పద్దు ప్రభావితం చేస్తోంది. ఎక్సైజ్ సుంకాన్ని పెంచడంతో ప్రస్తుతం అందరికీ కనీస అవసరాలుగా మారిపోయిన వస్తువుల ధరలు పెరగనున్నాయి. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీల ధరలు భారీగానే పెరగనున్నాయి. వీటన్నింటినీ బడ్జెట్ తర్వాత కొందామనుకున్నవారు.. కాస్త తొందరపడితేనే మేలు.
ఇక బంగారం, వెండి పైనా ప్రణబ్ కన్ను పడింది. పదిగ్రాముల బంగారం, ప్లాటినంపై 300 రూపాయలు.. కిలో వెండిపై.. 1500 రూపాయలను కస్టమ్స్ డ్యూటీ వడ్డిస్తున్నట్లు పేర్కొన్నారు. బంగారు ఆభరణాలపై దీని ప్రభావం ఉండొచ్చు. ఇక కార్లపైనా ప్రణబ్ ఎక్సైజ్ డ్యూటీని వడ్డించారు. రికవరీ మొదలయ్యింది కాబట్టి.. ఇక ఉద్దీపన ప్యాకేజీ అవసరం లేదని భావిస్తున్నట్లు చెప్పిన ప్రణబ్ లగ్జరీ కార్లపై ఎక్సైజ్ డ్యూటీని పెంచేశారు. దీని ఎఫెక్ట్ అప్పుడే కనపడడం మొదలయ్యింది. మారుతీ 2 శాతం ధరలను పెంచుతున్నట్లు ప్రకటించగా.. హుండాయ్ 6 నుంచి 25 వేలు, టయోటా 15 వేల రూపాయల వరకూ పెంచొచ్చని తెలిపాయి.
ధరలు తగ్గేవి
బడ్జెట్‌లోనే పన్ను తగ్గింపులు మినహాయింపులు ఇవ్వడంతో కొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. వీటిలో.. విద్యుత్‌ను ఆదాచేసే సీఎఫ్‌ఎల్ బల్బులు, సోలార్ ప్యానెళ్లు, ఎల్.ఈడీ లైట్లు, ఎలక్ట్రిక్ కార్లు, వైద్య పరికరాలు, బొమ్మలు, సెట్‌టాప్ బాక్సులు, సీడీలు ఉన్నాయి. దేశీయ మైక్రోఓవెన్‌ల తయారీని ప్రోత్సహించడానికి రాయితీ ఇస్తున్నట్లు ప్రణబ్ ప్రకటించారు. వీటితో పాటు.. మొబైల్‌ఫోన్ల విడిభాగాలు కూడా ఇకపై తక్కువధరలకే అందుబాటులోకి రానున్నాయి.
పొగాకుకు మంట
సిగరెట్లు తాగే వారిపైనా.. గుట్కాలు తినేవారిపైనా ప్రణబ్ ఏమాత్రం కరుణచూపలేదు. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రతీ సిగరెట్ ప్యాక్‌పైనా ౩ నుంచి 5 రూపాయల వరకూ పెరగొచ్చు.
వరాలు.. వడ్డింపులు
బడ్జెట్ ప్రవేశపెట్టడంలో ప్రణబ్ ముఖర్జీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఓ వైపు.. వరాలు కురిపిస్తూనే.. మరో వైపు వడ్డింపుల వాతలనూ పెట్టారు. ఓ రకంగా బడ్జెట్‌తో మేలు జరుగుతుందో.. లేక.. జేబుకు చిల్లు పడుతుందో తెలియని పరిస్థితిలోకి నెట్టేశారు. అయితే.. వంటింటిపై నేరుగా భారం మోపకపోయినా.. పరోక్షంగా వడ్డించారు. పెట్రోల్ ధరలను పెంచేయడంతో.. దాని ప్రభావం నిత్యావసరధరలపై పడనుంది. అంటే.. దాదాపుగా అన్ని ధరల్లో మార్పు రావచ్చు. ప్రతీఇంటిపైనా.. ఎంతలేదన్నా.. వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ప్రతీనెలా ఇకపై ఖర్చు చేయాల్సి రావచ్చు.
ఓ వైపు తగ్గిస్తూనే.. మరో వైపు పెంచడం ప్రణబ్ ముఖర్జీకే చెల్లింది. 10 లక్షల రూపాయల లోపు గృహరుణాలకు ఒకశాతం సబ్సిడినీ మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ప్రణబ్ ప్రకటించారు. అయితే.. దీన్ని వరంగా భావించి.. ఇంటి నిర్మాణానికి సిద్ధమైతే మాత్రం నడ్డి విరిగినట్లే. ఈ బడ్జెట్‌లోనే.. సిమెంట్, ఇనుముపై ఎక్సైజ్ డ్యూటీని ప్రణబ్ పెంచేశారు. ఇప్పటికే.. ధరలు పెరుగుతున్న ఈ వస్తువులు మరింత పెరుగుతాయి.
రైతులను మాత్రం ఆదుకునేందుకు ప్రణబ్ ఈ బడ్జెట్‌లో ప్రయత్నించారు. వ్యవసాయ పనిముట్లపై సుంకాలను తగ్గించారు. ఉత్పత్తులను భద్రపరుచుకోవడానికి నిర్మించే కోల్డ్‌స్టోరేజీ యూనిట్లకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. రుణ చెల్లింపు వ్యవధిని మరో ఆరు నెలలు పొడిగించారు. కాలపరిమితిలోగా చెల్లించే వారికి 5 శాతానికే రుణాలిస్తామని హామీ ఇచ్చారు. అయితే.. ఎరువుల సబ్సిడీపై కీలక నిర్ణయాలను బడ్జెట్‌లో ప్రస్తావించారు. సబ్సిడీకోసం కొత్త విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఈ పద్దతిలో రైతులకే నేరుగా సబ్సిడీ అందిస్తామన్నారు.
27, ఫిబ్రవరి 2010, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి