4, ఫిబ్రవరి 2010, గురువారం
కూలుతున్న కాపురాలు
జన్మజన్మల బంధంగా భావించే.. వివాహం.. విడాకులు అనే ఒకే ఒక్కపదంతో పుటుక్కున తెగిపోతోంది. చిన్న చిన్నఅనుమానాలు, అపార్థాలు.. వెరసి.. కాపురాలను కూలదోస్తున్నాయి. గత నాలుగైదు ఏళ్లుగా.. ఇలా విడాకులు కావాలంటున్న వారి సంఖ్య.. కుప్పలుతెప్పలుగా పెరిగిపోతోంది. అందులోనూ.. లైంగిక కారణాలు చూపించే కేసులు ఎక్కువవుతున్నాయి..
పెళ్లంటే నూరేళ్ల బంధం.. పెళ్లంటే జీవితాన్ని స్త్రీపురుషులిద్దరూ సమానంగా పంచుకోవడం. అందుకే.. పెళ్లి సమయంలో భార్యాభర్తలిద్దరి చేత ప్రమాణాలు చేయిస్తారు. ధర్మేచ, అర్దేఛ, కామేచ, మేక్షేచ, నాతిచరామి అనిపించి కన్యాదానం చేస్తారు. ఒకసారి పెళ్లైతే.. జీవితాతం కలిసుండడమే ఒకప్పుడు మనవాళ్లకు తెలుసు. చిన్నాపెద్దా సమస్యలొచ్చినా.. గొడవలు పెద్దవై విడిపోయినా.. అది తాత్కాలికంగానే ఉండేది. అయితే.. ఫాస్ట్ కల్చర్‌లో మార్పులూ ఫాస్ట్‌ఫాస్ట్‌గానే వచ్చేస్తున్నాయి. చిన్న గొడవ వచ్చినా విడిపోవడం కామన్ అయిపోయింది. అదీ చట్టబద్ధంగానే. అందుకే... విడాకులు కోరుకుంటున్నవారి సంఖ్య ఇటీవలికాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ఇందుకు చూపిస్తున్న సాకులు కూడా వింటే ఆశ్చర్యపడాల్సిందే. విడాకులు తీసుకోవడానికి చూపించగలిగే కారణాల్లో లైంగిక సామర్థ్యం కూడా ఒకటి. భర్త గానీ, భార్యగానీ తన జీవిత భాగస్వామని లైంగికంగా సంతృప్తి పరచలేకపోతే, విడాకులు కోరుకోవచ్చు. సరిగ్గా ఈ అంశాన్ని ప్రాతిపదికగా చేసుకొనే ఎన్నో కేసులు కోర్టు మెట్లెక్కుతున్నాయి. అయితే.. అసలు కారణం మాత్రం వేరే ఉంటోంది.
విడాకుల కేసులను పరిశీలిస్తే.. పెళ్లిళ్లు ఎలా ఛిద్రమవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మన రాష్ట్రంలో విడాకులు కోసం దాఖలవుతున్న పిటిషన్లలో అత్యధికభాగం.. సెక్సువల్ ఇంపోటెన్సీనే సాకుగా చూపిస్తున్నాయి. పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత కూడా.. ఇలా విడాకులు కోరుకోవడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే.. తప్పుడు ఆరోపణలు చేసి.. లైంగిక సామర్థ్యం ఉన్నా లేదని విడాకులు కోరితే.. అది చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. దాన్ని నేరంగా పరిగణించాల్సి వస్తుంది. దీనిపై సరైన అవగాహన లేకపోవడంతో.. చాలామంది ఆ సాకుతోనే విడాకులు పొందే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక భార్యల దగ్గర నుంచి విడాకులు కోరుకుంటున్న భర్తలు కూడా.. దాదాపుగా ఇలాంటి సాకునే చూపిస్తున్నారు. అయితే.. వ్యభిచారం చేస్తున్నారనే కారణాన్ని చూపిస్తున్నారు. అందుకు అనవసరమైన ఆరోపణలు కూడా చేస్తున్నారు. భార్యాభర్తలు కలిసి ఉండలేమని నిర్ణయానికి వచ్చేస్తే.. పరస్పర అవగాహనతో విడిపోవడమే మేలు.. కానీ.. ఇలా అనవసర కారణాలు చెప్పడం ద్వారా సమాజంలో పరువు పోగొట్టుకుంటున్నారు. అంతేకాదు.. .. అసలు కారణాన్ని చెప్పకుండా.. లైంగిక కారణాలను చూపించి.. చట్టాన్ని దుర్వినియోగం చేయడం ప్రమాదకరమే.
ఆధిపత్యమే అసలు కారణం
మన సమాజంలో చాలాకాలం పాటు పురుషాధిక్యమే. కానీ, ఇప్పుడు మహిళలు ముందంజలోకి వచ్చేశారు. అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారు. వంటిల్లుకే పరిమితం కావడం లేదు. ఆర్థికంగా స్వావలంభన సాధించారు. అందుకే.. పురుషుల డామినేషన్‌ను ఏమాత్రం ఒప్పుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు. కానీ, మగవాళ్లలో ఎక్కువమంది మాత్రం, ఆ పాత వాసనలను ఇంకా వదిలించుకోవడం లేదు. దాని ఫలితమే నిత్యం గొడవలు. టీవీ రిమోట్ దగ్గర నుంచి మొదలై.. కలిసి కాపురం చేయలేని పరిస్థితి సృష్టించేదాకా సాగుతాయి.
ఒకప్పుడు మనవన్నీ ఉమ్మడి కుటుంబాలు. భార్యాభర్తల మధ్య ఏ వివాదం వచ్చినా.. దాన్ని సామరస్యంగా పరిష్కరించగలిగే పెద్దలు ఇంట్లో ఉండేవారు. కానీ ఇప్పటి కాలం చిన్న కుటుంబాలది. ఉద్యోగాల కోసమో, వ్యాపారాల కోసం సొంతప్రాంతాలను వదిలి నగరాలను చేరుతున్నారు. వీరిలో భార్యాభర్తలు మాత్రమే ఉండే సంసారాలు ఎన్నో. వీరి విషయాలు పట్టించుకోవడానికి, వీరి మధ్య తగువులు తీర్చడానికి ఇళ్లల్లో పెద్దలెవరూ ఉండరు. ఒకవేళ ఉన్నా, వారిని లెక్క చేసే పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు. పైగా ఇద్దరూ సంపాదించేవారే అయితే.. ఆ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. క్రమంగా అది విడాకులకు దారి తీస్తోంది
ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న మహిళల సంఖ్య.. 1997 తో పోల్చితే.. 2007 నాటికి 50 శాతానికి పైగా పెరిగింది. ఆర్థికంగా మహిళలు భర్తపై ఆధారపడడం చాలా వరకూ తగ్గిపోయింది. కొన్ని కుటుంబాల్లో అయితే.. మహిళల సంపాదనే ఎక్కువగా ఉంటోంది. ఈ నేపధ్యంలో భర్త, అతని కుటుంబ సభ్యులతో సమస్యలు ఏవైనా వస్తే.. వేరు పడడానికే సిద్ధమవుతున్నారు.
ఇక మరో సమస్య ఇంటర్నెట్ ప్రేమలు. గంటలు గంటలు నెట్ లో చాటింగ్ చేయడం .. ఒకరినొకరు ఇంప్రెస్ చేయడానికి అందమైన అబద్దాలు అల్లుకోవడం .. ఈ పరిచయానికి తుది మజిలీ.. పెళ్లే అని మూడు ముళ్లు వేయించుకుంటున్నారు. తీరా కొంత కాలం పోయాకా నిజాలు ఒక్కటొక్కటిగా అసలు నిజాలు బయటకు వస్తుంటాయి.. మోసం చేశారన్న భావనతో విడాకులను ఆశ్రయిస్తున్న జంటల సంఖ్య ఈ మధ్య పెరుగుతోంది.
పెరుగుతున్న విడాకులు
జీవితాతం కలిసిమెలిసి సాగుదామన్న నమ్మకపు పునాదిపై కట్టిన తాళి... అపనమ్మకపు బీటలమధ్య తెగిపోతోంది.
ప్రపంచంలో విడాకుల రేటు ఎక్కువగా ఉన్న దేశం అమెరికా. అక్కడ 45 నుంచి 50 శాతం పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. ఇక మన దేశానికి వస్తే.. 1990 వరకూ ఒక్క శాతం కన్నా తక్కువగానే విడాకులు తీసుకునేవారి సంఖ్య ఉండేది. అయితే.. 2001 జనాభా లెక్కలను విశ్లేషిస్తే.. మన దేశంలో విడాకుల రేటు 7 శాతాన్ని దాటి పోయిందని తేలింది. ఒక దశాబ్దకాలంలో విడాకుల్లో ఇంత వృద్ధి కనపించడం ఓరకంగా షాకే. అయితే.. ప్రస్తుతం ఈ రేటు పది శాతాన్ని దాటేయవచ్చని అంచనా. ఒక్కమాటలో చెప్పాలంటే.. కష్టమైనా, నష్టమైనా కలిసి ఉండాలనే సూత్రానికి భార్యాభర్తలిద్దరూ చెల్లు చెప్పేస్తున్నారు. విడాకులు తీసుకోవడమూ పెద్ద అవమానంగా ఈ కాలంలో భావించడం లేదు.
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునే కొద్దీ, ఈ విడాకుల రేటు పెరిగిపోతోంది. అయితే, ఇందులో మహిళలను మాత్రమే తప్పుపట్టాలని లేదు. ఇందులో మగవాళ్ల పాత్ర కూడా ఎంతో ఉంది. మారుతున్న సమాజానికి తగ్గట్లుగా మగాడు మారడం లేదు. కనీసం.. మహిళల శ్రమను గుర్తించే పరిస్థితుల్లో కూడా లేడు. అందుకే.. ఈ విడాకులు.
ఇక.. విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతున్న మహిళలందరికీ విడాకులు వచ్చేస్తున్నాయా అంటే అదీ లేదు. మహిళలను ఇబ్బంది పెట్టడానికి పురుషుల దగ్గర ఎన్నో అస్త్రాలుంటాయి. లాయర్లు కూడా వాటికి వంతపాడుతుండడంతో.. అందరికీ న్యాయం జరగడం లేదు. తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టినవారికి సులువుగానే విడాకులు వస్తున్నా... నిజంగా బాధపడుతున్న మహిళలకు మాత్రం ఈ విషయంలో చుక్కెదురే అవుతోంది. ఇలా బాధపడుతున్న వారిలో న్యాయవాదులు కూడా ఉండడం.. గమనార్హం. విడాకులు తీసేసుకోవాలనగానే లభించవు.. అందుకు ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే కాబోలు.. సులువుగా విడాకులు దొరికే మార్గాలను అంతా అన్వేషిస్తున్నారు.
ఎక్స్‌పార్టీ డైవోర్స్
ఎక్స్‌పార్టీ డిక్రీ.. వ్యాపార లావాదేవీల్లోనో, ఇతర లీగల్ వ్యవహారాల్లోనే కోర్టులు ఎక్కువగా ఈ తరహా తీర్పులను ఇస్తుంటాయి. కేసులో ఒకపార్టీ విచారణకు హాజరుకాకపోయినా, కోర్టు పంపించిన నోటీసులకు స్పందించకపోయినా.. మరో పార్టీకి అనుకూలంగా తీర్పు నిచ్చేస్తారు. అయితే.. ఈ సంస్కృతి ఇప్పుడు విడాకుల కేసులకూ అంటుకొంది. భార్యతో ఒకే ఇంటిలో ఉంటూ కాపురం చేస్తూనే.. ఆమెకు తెలియకుండా విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భార్యాభర్తల్లో ఒకరికి తెలియకుండా మరొకరు విడాకులు తీసుకోవడమే.. ఈ ఎక్స్‌పార్టీ. అడ్రస్‌లు తప్పుపెట్టి, మేనేజ్ చేయడం ద్వారానో లేదంటే.. భార్య లేని సమయంలో నోటీసులు వచ్చేలా అరేంజ్ చేసుకోవడమో చేస్తుంటారు. ఎక్స్ పార్టీ డిక్రీ ద్వారా విడాకులు పొందుతారు. ఇలా విడాకులు అందుకున్న వారు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇలాంటి కేసులను పరిష్కరించడానికి కోర్టులు బాధితులకు ప్రత్యేక అవకాశాలను కల్పిస్తున్నాయి. కౌంటర్ దాఖలు చేసి.. విడాకులను రద్దు కూడా చేసుకోవచ్చు. అయితే.. ఈ విషయం తెలిసి.. కోర్టులను ఆశ్రయించే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. అందుకే.. పరస్పర అంగీకారంతో తీసుకోవాల్సిన విడాకులను ఇలా ఎక్స్‌పార్టీగా ఇవ్వకుండా కోర్టులు వ్యవహారించాల్సిన అవసరం ఉంది.
భార్యాభర్తల్లో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదు.. ఇద్దరూ సమానమే. డైవోర్స్ తీసుకునే ముందు.. ఇద్దరూ మనసువిప్పి మాట్లాడుకున్నా.. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా.. సమస్యను సులువుగానే దాటేయొచ్చు. కలకాలం కలిసి కాపురం చేయొచ్చు. డైవోర్స్ తీసుకుంటున్న జంటలు బాగానే ఉంటున్నా.. వారి పిల్లలు మాత్రం తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అందుకే.. వారి కోసమైనా ఒక్కసారి విడాకులు తీసుకునేముందు ఆలోచించండి. మీ కాపురాలు కూలిపోకుండా జాగ్రత్త పడండి..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
*భార్యాభర్తల్లో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదు.. ఇద్దరూ సమానమే.*
సారు మీరింకా ఏ రోజుల్లో ఉన్నారో నాకేమొ తెల్వటం లేదు. మీ వ్యాసం భార్యాభర్తలను కలపటానికి రాసినట్లు ఉన్నాది. మొగుడు పెళ్ళాలు సమానం అని చట్టాలు చేసుకున్న దేశాలలో వారి జనాభాలో పెళ్ళిలు ఎన్ని జరుగుతున్నాయి? ఎనతమంది కలసి ఉనంట్టున్నారు? ఎనతమంది విడి పోతున్నారు? ఒకసారి చూసేది. అన్నిటికి సమాన మంటె ఎలా? పెళ్ళి అనేది ఎప్పుడు చట్ట బద్దమౌతుందొ అది ఒక వ్యాపారం లాంటిదే దానికి కొన్ని రూల్స్ ఉనంటాయి. మీరు వ్యాపారం లో ఎక్కడైన 50:50 పార్ట్నెర్షిప్ ఉండదు గమనిచండి మాగ్సిమం 51:49 పార్ట్నార్షిప్ ఉంట్టుంది. పెళ్ళి కూడా అంతే 51:49 అది ఆడా మగ వారి వారి పరపతిని బట్టి వారే ఒక నిర్ణయానికి రావాలి. ఊరకనే నోరు ఉంది గదా అని హక్కులు తొక్కులు అడుగు తూ పోతూ ఉంటె కొంపలు కొలేరు లౌతాయి. ఈ మధ్య కాలం లో ఆడవారు తెగ రెచ్చి పోతున్నారు వీరే డైవర్స్లో ముందుంట్టున్నారు. వీరి తల్లిదండృలు అమ్మాయికి విడాకులు ఇప్పించే వరకు నిద్ర పోవటం లేదు.
ఈ రోజుల్లో విడాకులు తీసుకున్నే కారణాలు చూస్తుంటే ఒకపక్క బాధగా ఉంది,ఒక పక్క నవ్వొస్తోంది...ఇటీవల మా బంధువుల్లో ఓ అమ్మాయి తను తెచ్చిన చొక్కా భర్త వేసుకోలేదని విడాకుల కోసం కోర్టుకెక్కింది..వాళ్ళ అమ్మానాన్నలు కూడా వంతపాడారు...వాళ్ళకీ మగపిల్లాడుంటే అవతల అబ్బాయి పరిస్థితి అర్థం చేసుకున్నేవాళ్ళేమో...ఇంతకీ ఆ అమ్మాయి కి ౩ ఏళ్ళ పిల్లాడున్నాడు...వాడి గురించి కనీసం ఆలోచించినా పరిస్థితి కోర్టు దాకా వెళ్ళేదికాదేమో!
పెళ్లి అనేది నా ఉద్దేశం లో ఒక కాంట్రాక్టు లాంటిది. కంపెనీ లో సి ఐ ఓ ఉన్నట్లే ఒకరు అధికారం లో ఉండాలి. అమెరికా లో అయితే అధికారం పంచు కుంటారు. పెళ్లి కి ముందరే చర్చి లో ప్రిస్ట్ వీరి చేత ఎవరు ఏపని చేస్తారో, దేనిలో ఎవరికి అధికారం ఉంటుందో రాయిన్చుకుంటారు . చెత్త ఎవరు తీస్తారు అనే దగ్గిర నుండి.అప్పటికి డివోర్స్ రేట్ ఫిఫ్టీ పెర్సెంట్. నా ఉద్దేశం లో డివోర్స్ కి కారణం ఆకర్షణలు మారటం. వాడు ఇంకా బాగుంటాడు అనో ఆమె అయితే ఇంకా బాగుంటుంది అనో అనుకోవటం తోటి విడిపోవటానికి సిధమవుతారు. మిగతా చెప్పే కారణాలు ఉత్తువి. క్షమించండి తెలుగు టైపింగ్ నాకు కొంచం కష్టం.
ఇతను చెప్పిన కారణాలు నమ్మశక్యంగా లేవు. కేవలం సెక్సువల్ ఇంపొటెన్సీ వల్ల విడాకులు తీసుకునేవాళ్ళు ఇండియాలో లేరు. ఇక్కడ సెక్స్ అనేదే వినకూడని పదం అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. అమెరికాలో సెక్స్ కోసం విడాకులు తీసుకునేవారు ఉంటారంటే నమ్మొచ్చు కానీ ఇండియాలో ఉంటారంటే నమ్మలేం.
ప్రవీణ్ గారు, కల్లబొల్లిగా రాసిన ఆర్టికల్ కాదిది. మీకు తెలిసిన లాయర్లు ఎవరన్నా ఉంటే ఒక్కసారి కనుక్కోండి.. డైవోర్స్‌లో ఎక్కువగా చూపించే సాకు ఏమిటనేది. నా ఆర్టికల్‌లో సాకు అనే వాడాను ఎందుకంటే.. అన్ని కేసుల్లోనూ ఇది నిజం కాదు కాబట్టే. వాస్తవంగా సెక్స్ సామర్థ్యం ఉన్నప్పటికీ.. విడాకుల కోసం తనను తృప్తిపరచలేకపోతున్నాడని భార్యలు పిటిషన్‌లో చెబుతున్నారు.
కొంచెం ఎకనామీ బూం వస్తెనె మన వాళ్ళకి ఒంటి మీద గుడ్డ నిలబడటం లేదు. పేళ్ళిళు ఇలా పేటకులు అవుతూ నేను గమనిచిన వాటిలో అధిక శాతం 90% అమ్మాయిలదే తప్పు ఎందుకంటె వారి వన్ని గొంటెమ్మ కోరికలు, వాటికి వాళ్ళ తల్లిదండ్రులు సిగ్గూ ఎగ్గు లేకుండా వంతపాడుతున్నారు. నా మిత్రుడు డాటబెస్ డి.బి.ఎ. గా పని చెస్తు ఉంటె వాడికి కంపేనీ లో పెద్ద ఇస్యు వచ్చి 2 రోజులు పగలు రత్రి ఉండవలసి వచ్చింది. అది చూసి వాడి పేళ్ళాం నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అని అనుమానిచి పేల్లి అయిన నేల రోజులలో విడాకులకి దరఖస్తు పేట్టుకుందీ. ఇంకే ఆమ్మాయి
కోర్టు సెక్స్ కోసం విడాకులు మంజూరు చెయ్యదు. సామాజిక కట్టుబాట్ల వల్ల సెక్స్ చెయ్యనివాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ భార్యాభర్తలు కారా? ఒక వ్యక్తికి సెక్సువల్ పొటెన్సీ ఉందో లేదో వైద్య పరీక్షల ద్వారా చెప్పడం సాధ్యం కాదు. సిగరెట్లు, మద్యం లాంటి దురలవాట్లు ఉన్నవాళ్ళకి సెక్సువల్ పొటెన్సీ తగ్గుతుంది కానీ అసలు లేకపోవడం జరగదు. సెక్స్ కోరికలు ఉన్నా సామాజిక కట్టుబాట్ల వల్ల సెక్స్ చెయ్యనివాళ్ళు చాలా మంది ఉంటారు. అమెరికాలో జరిగేవి ఇండియాలో జరుగుతున్నాయంటే నమ్మలేము.