అందరూ ఊహించినట్లుగానే.. రాష్ట్రంలోని ప్రధాన సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వ శ్రీకృష్ణ రాయబారాన్ని పంపుతోంది. జస్టిస్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని పరిస్థితులపై ప్రజలు, రాజకీయ పార్టీలు, సంఘాలతో విస్తృతమైన సంప్రదింపులను ఈ కమిటీ జరుపుతుందని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలుపెడుతున్నామంటూ..
డిసెంబర్ 9న హోమంత్రి చిదంబరం చేసిన ప్రకటన, సంప్రదింపులంటూ డిసెంబర్ 23న చేసిన ప్రకటన, జనవరి 5న రాజకీయ పార్టీలతో సమావేశం... ఆధారంగానే ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కమిటీ సభ్యులుగా.. నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ రణబీర్ సింగ్, అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ రీసెర్చ్ ఫెలోడాక్టర్ అబుసలే షరీఫ్, ఢిల్లీ ఐఐటీలో హ్యుమానిటీస్ సోషల్ సైన్సెస్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ కౌర్, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి వినోద్ కె.దుగ్గల్ను నియమించింది. వీరిలో దుగ్గల్ కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తారు..
కమిటీ నియామకంపై.. తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమైక్యాంధ్రగా ఉండడానికి కమిటీ అవసరం లేదు కాబట్టి.. తెలంగాణ ఏర్పాటు కోసమే అన్నది కొంతమంది అభిప్రాయం. దీంతో పాటు.. రాష్ట్ర విభజన విషయంలో కోస్తాంధ్ర నేతల అనుమానాలు తీరుపోవచ్చని కూడా ఆశిస్తున్నారు. అయితే.. కమిటీ విషయంలో కాలపరిమితి విధించకపోవడం, తెలంగాణ ఊసు ప్రస్తావించకపోవడం.. నియమ నిబంధనలను రూపొందించకపోవడంతో తెలంగాణ ప్రాంతంలో కొంతమంది ఈ కమిటీపై పెదవి విరుస్తున్నారు. కమిటీలతో ఒరిగేదేమీ ఉండదంటున్నారు.
ఇక అటు ఆంధ్రప్రాంతంలోనూ దాదాపు ఇదే పరిస్థితి. కమిటీ విషయంలో కొంతమంది సానుకూలంగా స్పందిస్తుండగా.. మరికొంతమంది మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వమే విధివిధానాలను ఖరారు చేయకపోవడాన్ని తప్పు బడుతున్నారు. దేశవ్యాప్తంగా చిన్నరాష్ట్రాలకు సంబంధించి ఎన్నో డిమాండ్లు ఉండగా... ఆంధ్రప్రదేశ్ విషయంలోనే కమిటీ ఏర్పాటు చేయడం సరికాదంటున్నారు. మొత్తంమీద.. కమిటీ ఏర్పాటుతోనే ఇంత గందరగోళం ఏర్పడితే.. ఇక విధివిధానాలు రూపొందించిన తర్వాత.. మరిన్ని సమస్యలు వచ్చేలానే కనిపిస్తున్నాయి.
కమిటీ తేల్చేదేమిటి?
తెలంగాణ ఏర్పాటులో భాగంగా కమిటీని ఏర్పాటు చేస్తున్నారా.. లేక .. ఆంధ్రప్రదేశ్‌ను యదాతథంగా ఉంచడానికా అన్న విషయాన్ని ప్రకటనలో ప్రభుత్వం పేర్కొనలేదు. చాలా చాకచక్యంగా ఈ ప్రకటనను రూపొందించారు. ఏ ప్రాంతానికి మద్దతుగా ఈ ప్రకటన లేకుండా జాగ్రత్తపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులపై సంప్రదింపులకోసం కమిటీని ఏర్పాటు చేశామని ప్రకటించారు. అయితే.. ఇవి ఏ పరిస్థితులన్నది కూడా ప్రకటన పూర్తి పాఠంలో లేదు. రాష్ట్ర విభజన విషయంలో హోంమంత్రి చేసిన ప్రకటనలతో పాటు.. రాజకీయ పార్టీలతో సమావేశానికి అనుగుణంగానే కమిటీని ఏర్పాటు చేస్తున్నామంటూ అందులో వివరణ ఇచ్చారు. ఇప్పుడు అందరి సందేహం.. కమిటీ తెలంగాణకు అనుకూలమా.. వ్యతిరేకమా అన్నదే. అయితే... ఈ విషయంలో సింపుల్‌గా ఓ అభిప్రాయానికి వచ్చేయడానికి ఏమాత్రం అవకాశం లేదు. కమిటీలో ఉన్నవారంతా ఉన్నతస్థాయిలో ఉన్నవారే. పైగా.. రాజకీయంగా కానీ, భౌగోళికంగా మనరాష్ట్రంలో ఏమాత్రం సంబంధం లేనివారు. తెలంగాణపై ఇప్పటికీ వీరందరికీ ఓ అభిప్రాయమంటూ ఉండకపోవచ్చు. ప్రజలు, పార్టీలు, సంస్థలతో విస్తృతమైన సంప్రదింపులను కమిటీ చేస్తుందని ప్రకటించారు కాబట్టి.. ఆ సంప్రదింపుల ఆధారంగానే వీరంతా ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అయితే.. ఏ ఏ అంశాలను వీరు పరిశీలిస్తారన్నది ఇంకా తేలాల్సి ఉంది.
కమిటీలో మాత్రం ప్రభుత్వం కీలకమైన వ్యక్తులకే ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పాలి. కీలకమైన కమిటీలకు నేతృత్వం వహించిన ఘనత జస్టిస్ శ్రీకృష్ణది. ఇక నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా పనిచేస్తున్నరణబీర్ సింగ్‌కూ ఈ కమిటీలో స్థానం కల్పించారు. న్యాయపరమైన సమస్యలపై ఈయన దృష్టి పెట్టే అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి వినోద్ కె.దుగ్గల్ ను నియమించడం ద్వారా.. శాంతిభద్రతల అంశంపైనా.. ఈ కమిటీ పరీశీలిస్తుందని ప్రభుత్వం సూచన ఇచ్చింది. ఇక మిగిలిన ఇద్దరు సభ్యులు అబుసలే షరీఫ్, డాక్టర్ రవీందర్ కౌర్‌లు రాష్ట్ర విభజనకు ఏర్పడే ఇబ్బందులను విశ్లేషించవచ్చు. అయితే.. అందరితో సంప్రదింపులు జరిపిన తర్వాతే వీటిపై తుదినిర్ణయం తీసుకోవచ్చు.
మొత్తంమీద అన్ని విషయాలపైనా.. ఈ కమిటీ దృష్టి పెట్టే అవకాశం ఉంది. అయితే.. కమిటీ ఛైర్మన్ జస్టిస్ శ్రీకృష్ణతో చర్చించిన తర్వాతే విధివిధానాలను రూపొందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి.. కమిటీ ఏ ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తుందన్నది తేలాల్సి ఉంది.
జస్టిస్ శ్రీకృష్ణ బ్యాక్ గ్రౌండ్
రాష్ట్రంలోని పరిస్థితులపై సంప్రదింపులు జరపడానికి ఏర్పాటు చేసిన కమిటీ సారధ్య బాధ్యతలను జస్టిస్ శ్రీకృష్ణకు అప్పగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని కీలకమైన కమిటీలకు ఆయన నేతృత్వం వహించారు. సంచలనం సృష్టించిన బొంబాయి అల్లర్ల సంఘటనపై విచారణ జరిపింది కూడా జస్టిస్ శ్రీకృష్ణే. అప్పటికి.. బోంబే హైకోర్టులో ఆయన జూనియర్ జడ్జిగా ఉన్నారు. మతకలహాలకు సంబంధించిన ఈ కేసును విచారించే కమిటీకి నేతృత్వం వహించడానికి సీనియర్లు కూడా వెనుకడుగు వేసిన తరుణంలో జస్టిస్ శ్రీకృష్ణ ముందుకు వచ్చారు. దీనిపై.. సుదీర్ఘ విచారణను జరిపారు. దాదాపు ఐదేళ్ల పాటు బాధితులను విచారిస్తూనే ఉన్నారు. శివసేనపై తన రిపోర్ట్‌లో విమర్శలు కూడా చేసినట్లు సమాచారం. మధ్యలో ఓ సారి ఈ కమిటీని శివసేన ప్రభుత్వం రద్దు చేసినా.. ప్రతిపక్షాల ఆందోళనతో మళ్లీ పునరుద్దరించింది. తుది నివేదికను ఇచ్చినా ఇంతవరకూ మహారాష్ట్ర సర్కార్ దాన్ని ఆమోదించడం కానీ.. అమలు గానీ చేయలేదు.
మద్రాస్ హైకోర్టులో ఫిబ్రవరి 19, 2009న లాయర్లకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలపైనా జస్టిస్ శ్రీకృష్ణ ఏకసభ్య కమిషన్ విచారణ జరిపింది. సంఘటనకు సంబంధించిన కారణాలతో.. మార్చి 4, 2009న ఆయన సుప్రీంకోర్టుకు మధ్యంతర నివేదికను సమర్పించారు. అంతకు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరో వేతన సంఘానికి ఛైర్మన్‌గా జస్టిస్ శ్రీకృష్ణ పనిచేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులపై సంప్రదింపులు జరిపే కమిటీ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. అయితే.. టైం ఫ్రేమ్ పెట్టకపోవడంతో.. విపరీతమైన జాప్యం జరగవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జస్టిస్ శ్రీకృష్ణపై మాత్రం.. పూర్తి వ్యతిరేకత ఎక్కడా వ్యక్తం కావడం లేదు. ఆయన వీలైనంత త్వరగానే ఈ విషయాన్ని తేల్చుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. సంప్రదింపుల వరకే ఈ కమిటీ పరిమితయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్రాన్ని విడగొట్టాలా వద్దా అన్నది తేల్చకపోవచ్చు.
ఆనాడు మహాభారత సంగ్రామాన్ని నివారించడానికి వెళ్లిన శ్రీకృష్ణుడు.. యుద్ధం జరగడానికి ఓ రకంగా కారణమయ్యాడు. మరి ఈ శ్రీకృష్ణుడు రాష్ట్రాన్ని విడగొట్టమని చెబుతాడా.. లేక కలిసిఉంటే చాలని తేల్చేస్తాడా... ఏం జరుగుతుందో చూడాలి..
4, ఫిబ్రవరి 2010, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి