22, ఫిబ్రవరి 2010, సోమవారం
టాలీవుడ్‌లో డ్రగ్ మాఫియా..
హైదరాబాద్‌కు ఉన్న క్రెడిట్స్‌లో ఇప్పుడు మరోటి చేరింది. అదే డ్రగ్ మాఫియా. మాదకద్రవ్యాలను పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్న రాకెట్ రాష్ట్ర రాజధానిని కేంద్రంగా చేసుకొని వ్యవహారం నడుపుతున్న విషయం వెలుగులోకివచ్చింది. ఈ ముఠాకు.. టాలీవుడ్‌లోని కొంతమంది నేతృత్వం వహించడంపై.. ఎన్నో అనుమానాలు.
హైదరాబాద్‌లో డ్రగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. రాజధాని కేంద్రంగా సాగుతున్న డ్రగ్ స్మగ్లింగ్‌ను పోలీసులు చేధించగలిగారు. చిన్న అనుమానంతో.. పెద్ద చేపను పట్టుకున్నారు. ఈ డ్రగ్ ముఠాకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు.. టాలీవుడ్‌లో చిన్న సినిమాల నిర్మాత కావడం విశేషం. అంతేకాదు.. ఓ సినిమాలో ఉపయోగించిన కారునే.. డ్రగ్స్ రవాణాకు వాడడం చూస్తుంటే.. అత్యంత పకడ్బందీగా.. డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. మాదకద్రవ్యాలు రవాణా చేస్తుండగా.. అరెస్టు చేసిన సినీ నిర్మాత కామినేని వెంకటేశ్వరరావు, భోజరాజు శ్యామరాజు అనే ఇద్దరిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కర్ణాటక నుంచి ఎపిడ్రిన్ అనే మాదకద్రవ్యాన్ని.. వీరు సరఫరా చేస్తున్నారు. ఓ పార్టీకి అందించడానికి జూబ్లీహిల్స్‌లో వీరు ఎదురుచూస్తుండగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 30 కిలోల ఎపిడ్రిన్‌తో పాటు.. ఐదు లక్షల రూపాయలనూ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి.. దీన్ని ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. కామినేని వెంకటేశ్వరరావు.. ఇదివరకే సర్కార్ అనే సినిమా నిర్మించారు. నాగబాబు, రమ్యకృష్ణ ఈ సినిమాలో ప్రధానపాత్రధారులు. టాలీవుడ్‌లో పెద్ద పెద్ద నిర్మాతల దగ్గర నుంచి.. ఇండస్ట్రీలో కీలకమైన వారందరితోనూ కెవీరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇండస్ట్రీలోని వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు... డ్రగ్స్ సరఫరా చేయడంలో ఈయనది కీలకపాత్రని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారంలో రాజకీయ నాయకులతోపాటు చిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది సహాయం చేస్తున్నట్లు సమాచారం.
వీరికి ముంబై, ఢిల్లీల్లో డ్రగ్స్ సరఫరా చేసే రాకెట్లతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. కేవీ రావుతో పాటు.. మరొకరు అరెస్ట్ అయినా.. డ్రగ్ రాకెట్‌లో కీలక సూత్రధారులు మాత్రం తప్పించుకున్నారు. ఈ ముఠాలు మరింత మంది ఉండొచ్చంటున్న పోలీసులు.. వారికోసం గాలింపు మొదలుపెట్టారు.
పెద్దల పాత్ర
డ్రగ్స్ బిజినెస్‌లో టాలీవుడ్ పాత్ర ఏమిటి?
డ్రగ్ బిజినెస్‌లో పాత్రధారులు ఎవరు?
నటీనటులకూ ఈ మాఫియాతో లింకుందా...
తెలుగు సినీ హీరోలూ డ్రగ్స్ వాడతారా... ?
సర్కార్ సినీ నిర్మాత కామినేని వెంకటేశ్వరరావు పోలీసులకు చిక్కడంతో అందరి మదిలోనూ తలెత్తుతున్న ప్రశ్నలివి. వాస్తవానికి టాలీవుడ్ కేంద్రంగా డ్రగ్స్ వ్యాపారం పెద్ద ఎత్తునే సాగుతోంది. చాలామందికి ఈ అక్రమ వ్యాపారంలో హస్తమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో పేరున్నవారికీ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. కామినేని వెల్లడించే వివరాల ఆధారంగానే వీరిపై చర్యలు తీసుకునే అవకాశముంది.
తాజాగా పోలీసులు పట్టుకున్న ఎపిడ్రిన్‌ను.. ఇండస్ట్రీలో ఫైట్‌మాస్టర్లు ఎక్కువగా వాడతారు. విపరీతమైన మత్తును ఇది కలగజేస్తుంది. దీంతో పాటు.. హెరాయిన్ సరఫరా కూడా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ఈ డ్రగ్ మార్కెట్‌లోకి ఎంటరయ్యే వారి నేపథ్యమూ.. కాస్త వింతగానే ఉంటోంది. ఒకటీ రెండు సినిమాలు తీసి తీవ్రంగా నష్టపోయిన వారే.. ఈ స్మగ్లింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం వస్తుందన్న ఆశే.. వీరిని డ్రగ్స్ స్మగ్లింగ్‌కు ప్రేరేపిస్తోంది. కామినేని చరిత్ర కూడా ఇలాంటిదే. ముంబై మాఫియాకు చెందిన ప్రత్యేక టీంలు ఇలాంటి వారికి ఆకర్షించడానికి కాచుకుని కూర్చుంటాయి. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సహా.. ఎన్నో ముఠాలు.. టాలీవుడ్‌పై కన్నేశాయి. ఇక్కడివారిని వాడుకొంటూ.. తెలివిగా.. డ్రగ్స్ రవాణా చేస్తున్నాయి. హైదరాబాద్‌లో డ్రగ్స్ దొరకడం ఇదే తొలిసారి కాదు.. ఇంతకు ముందు కూడా ఎంతో మంది పట్టుబడ్డారు. ఆజ్‌కా మసీహా సినిమాలో విలన్ పాత్ర చేసిన వ్యక్తి కూడా హైదరాబాద్‌లోనే డ్రగ్స్ స్మగుల్ చేస్తూ పట్టుబడ్డాడు. 15 ఏళ్ల క్రితం హైకోర్టు న్యాయవాది ఫిరోజ్ రుపానీ, అడిషనల్ ఎస్పీ ఖాన్ భార్య దుర్‌దానా కూడా నగరంలో పోలీసులకు చిక్కారు. డ్రగ్స్ సరఫరా చట్ట వ్యతిరేకం. దొరికే పదేళ్ల జైలు శిక్ష పడే ప్రమాదమూ ఉంది. అయినా.. స్మగుల్ చేయడానికి కారణం.. కోట్లల్లో సంపాదన. మనదగ్గర అతి తక్కువ ధరకు లభించే ఎపిడ్రిన్ టాబ్లెట్ విదేశాల్లో వందరెట్లు అధికంగా పలుకుతుంది. అందుకే.. ఎంతకైనా తెగిస్తారు.
బాలీవుడ్ మార్గంలో..
మోడలింగ్ కావచ్చు... బాలీవుడ్ ప్రపంచం కావచ్చు.. డ్రగ్స్ వాడడం అన్నది సర్వసాధారణంగా మారిపోయింది. ఇండస్ట్రీలో కీలక వ్యక్తుల సహకారంతో విస్తరించిన డ్రగ్ మాఫియా.. ఎంతోమందిని తన వల్లో వేసుకుంది. మత్తుకు బానిసలను చేసింది. బాధలను మర్చిపోవడానికి.. డ్రగ్స్ మాత్రమే ప్రత్యామ్నయం అనుకునే స్థాయికి నటీనటులంతా ఎదిగిపోయారు. బాలీవుడ్లో 70 ల్లోనే.. డ్రగ్స్ వాడకం వెలుగుచూసింది. అప్పటి స్టార్లు.. పర్వీన్ బాబి, ప్రోతిమా బేడిలు డ్రగ్స్ వాడుతున్నట్లు అంగీకరించారు కూడా. అయితే.. మాదకద్రవ్యాల విషయం ఎక్కువగా ప్రచారం పొందింది సంజయ్‌దత్ వ్యవహారంతోనే. సునీల్ దత్ కొడుకుగా సినీరంగ ప్రవేశం చేసి.. యూత్‌ని అట్రాక్ట్ చేసిన ఈ కండలవీరుడు.. మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. ఆ తర్వాత.. అక్రమఆయుధాల కేసులోనూ ఇరుక్కున్నాడు. చివరకు.. రిహాబిలిటేషన్ సెంటర్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుని.. మామాలు మనిషిగా మారాడు.
మరో బాలీవుడ్ హీరో.. ఫర్దీన్ ఖాన్ 2001లో కొకైన్‌తో పట్టుబడ్డాడు. డ్రగ్స్ కొంటూ ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి చిక్కాడు. ఉల్లాసంగా ఉండడం కోసమే.. కొకైన్ సేవిస్తున్నట్లు ఫర్దీన్ ఒప్పుకున్నాడు. ముంబైలో పట్టుబడ్డ డ్రగ్ డీలర్ కరీమ్ షేక్... బాలీవుడ్‌లో డ్రగ్స్‌వాడుతున్న ప్రముఖల పేర్లన్నీ బయటపెట్టాడు. సల్మాన్ ఖాన్, జాకీష్రాఫ్‌లు కూడా మాదకద్రవ్యాలు వాడినట్లు ఆరోపణలున్నాయి. 2005 లో బాలీవుడ్ నటుడు విజయ్‌రాజ్ డ్రగ్స్ తరలిస్తుండగా అబుదాబి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ వెళితే.. చాలామంది. ఫాం హౌస్‌ల్లోనో, నైట్‌క్లబ్‌ల్లోనో ఎక్కువగా ఈ డ్రగ్స్‌ను వాడుతుంటారు. వీఐపీల పార్టీల్లోనూ.. డ్రగ్స్ కామన్‌గానే కనిపిస్తాయి.
పెద్ద బిజినెస్..
ప్రపంచంలో మాదక ద్రవ్యాల బిజినెస్ ఏటా 25 లక్షల కోట్ల రూపాయలు. పెట్రోలియం, ఆయుధాల వ్యాపారాల తర్వాత.. మూడోస్థానం డ్రగ్స్ అమ్మకాలదే. లాటిన్ అమెరికా దేశాల్లో అయితే.. ప్రభుత్వాలనే శాసించే స్థాయిలో మాఫియా ముఠాలు పనిచేస్తున్నాయి. మన దేశం విషయానికి వస్తే.. కోటిమందికి పైగా మాదకద్రవ్యాలకు బానిసలైనవారు ఉన్నట్లు అంచనా. వీరిలో దాదాపు 50 లక్షల మందికి హెరాయిన్ తీసుకోకపోతే.. క్షణం కూడా గడవదు.
గంజాయి, నల్లమందు, ఆషీష్, హెరాయిన్, ఓపిఎమ్, ఇవన్ని నిషేదిత మత్తు పదార్ధాలు. వీటిలో గంజాయి మన రాష్ట్రంలోని మెదక్, వరంగల్, ఖమ్మం,వైజాగ్‌లలో అక్రమంగా సాగుచేస్తున్నారు. మిగతా మత్తు పదార్ధాలకు సంబంధించిన ముడి సరకు కర్నాటక,తమిళనాడు,కేరళ రాష్ట్రాల నుంచి మన దగ్గరకు చేరుతోంది. ముడి సరుకును హైదరాబాద్‌కు తీసుకువచ్చి మాదకద్రవ్యాలను దొంగ చాటుగా తయారు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎపిడ్రిన్, మాండ్రాక్స్ ట్యాబెట్ల తయారీ యూనిట్లు హైదరాబాద్‌తో పాటు గుంటూరు, కృష్ణాజిల్లాల్లోనూ ఉన్నాయి. పరిమిత సంఖ్యలో మాత్రమే వీటిని తయారు చేయాలన్నది ప్రభుత్వ ఆదేశం. వీటి తమారీకి సంబంధించి ప్రతి విషయాన్ని అధికారికంగా చూపించాల్సి ఉంటుంది అయితే.. అవసరానికి మించి తయారు చేస్తూ.. అక్రమమార్గాల్లో విదేశాలకు తరలిస్తున్నారు. కోట్లాది రూపాయలు గడిస్తున్నారు. మన దగ్గర తయారయ్యే మత్తు పదార్థాలకు ఆఫ్రికన్ దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే.. సినిమా షూటింగ్‌ల కోసం వెళుతున్న బృందాలు.. ఈ డ్రగ్స్‌ను చాలా తెలివిగా తమతో పాటు తీసుకువెళ్లుతున్నారు. మేకప్ కిట్లు.. కార్పెట్లలో రహస్యంగా ఉంచి సరిహద్దులు దాటిస్తున్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడమూ డ్రగ్స్ స్మగ్లర్లకు కలిసి వస్తోంది. ఇప్పుడు పోలీసులకు చిక్కింది చిన్న పాము మాత్రమే. అతనిపైన పనిచేసే.. ఎన్నో పెద్దపాములు ఇండస్ట్రీలో ఉన్నాయి. కనుసైగలతో స్మగ్లింగ్‌ను నడిపించే.. తలకాయలూ ఉన్నాయి. వాటిని పట్టుకోగలిగితేనే ఈ అక్రమ వ్యాపారానికి అడ్డుకట్టపడుతుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి