కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలపై రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు సీమాంధ్రలో కొంతమంది వ్యతిరేకిస్తున్నా.. ఎక్కువమంది మాత్రం.. వీటికి సానుకూలంగానే స్పందిస్తున్నారు. ఇక తెలంగాణలో మాత్రం కేంద్రప్రభుత్వ ప్రకటన.. తీవ్ర ఆందోళనలను సృష్టించింది. ముఖ్యంగా.. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంపస్‌లో కమిటీకి వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించారు. శనివారం తెలంగాణ బంద్‌కు విద్యార్థులు పిలుపునిచ్చారు.
ఎవరి దారి వారిదే?
సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత పార్టీలకతీతంగా ఏకమైన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు.. ఇప్పుడు ఎవరిదారిని వారు చూసుకుంటున్నారు. కమిటీ విధివిధానాలపై తలోరకంగా స్పందిస్తున్నారు. ఈ విషయంలో పార్టీల వారీగా విభజన స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయంలో పూర్తి వ్యతిరేకంగా స్పందించింది మాత్రం.. తెలంగాణ రాష్ట్ర సమితే. కేంద్ర ప్రభుత్వ ప్రకటన తర్వాత పార్టీ నేతలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన టిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. విధివిధానాలు పూర్తిగా మోసపూరితమని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను వ్యతిరేకించేలా ఉన్నాయన్న ఆయన.. వాటిని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. పదినెలల గడువు విధించడంపైనా ఆయన తీవ్రంగానే స్పందించారు. వారం రోజులకన్నా గడువెక్కువ అవసరం లేదన్నది కేసీఆర్ భావన. మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసినప్పుడు .. ఎలా వ్యవహరించారో.. తెలంగాణ విషయంలోనూ అదేరీతిలో వ్యవహరించాలని కోరారు. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 13 మంది ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి.. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ మాత్రం.. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసింది. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగానే ఉన్నాయని పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఎవరినీ మోసం చేయాల్సిన అవసరం లేదన్నారు. రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదుకాబట్టి.. కమిటీకి అందరూ సహకరించాలని డీఎస్ విజ్ఞప్తి చేశారు. ఒకవేళ రాజీనామాలు చేస్తే.. సమస్య మళ్లీ వెనక్కి పోతుందని.. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఇప్పటివరకూ చురుగ్గా పాల్గొన్న రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా.. కమిటీ విధివిధానాలపై సానుకూలంగానే స్పందించారు. కాలపరిమితిపైనా ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే.. తెలంగాణపై మాత్రమే కాకుండా.. సమైక్యాంధ్రపై కూడా అధ్యయనం చేయాలనడాన్ని వ్యక్తిగతం వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు మాత్రం.. వీటిని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. 53 ఏళ్ల తెలంగాణ పోరాటాన్ని.. వారం రోజుల సీమాంధ్ర ఉద్యమాన్ని ఒకేలా చూడడం సరికాదని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అభిప్రాయపడ్డారు. పార్టీ తరపున తెలంగాణ ప్రాంత ఎమ్మెలంతా కలిసి నిర్ణయం తీసుకున్నతర్వాతే.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు. అయితే.. జేఏసీలో ఉన్నప్పటికీ టిఆర్‌ఎస్ ఒంటరిగా నిర్ణయం ప్రకటించడంపై మాత్రం నాగం జనార్దనరెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కేంద్రప్రభుత్వం చేసిన ఒకే ప్రకటన.. తెలంగాణ ప్రాంత నేతల్లో మళ్లీ దూరాన్ని పెంచింది. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసుకున్న ఐక్య కార్యాచరణ కమిటీ ఇక ముందుకు సాగదేమో అన్న అనుమానాలను కలిగిస్తోంది.
అసలు గొడవ
కమిటీ విధివిధానాలు తెలంగాణకు అనుకూలమా? సమైక్యకు సానుకూలమా? పదినెలల్లో కమిటీ రిపోర్ట్‌ను అందిస్తుందా? ఎలాంటి ఇబ్బందులు లేకుండా కమిటీ పనిచేస్తుందా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందా.. .లేక సమైక్యంగానే ఉంటామా..... జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు ఖరారయ్యే సరికి ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో పరిస్థితులపై అధ్యయనం చేయడానికి కమిటీకి తుదిరూపం వచ్చేసరికి సమస్య మరింత జటిలంగా మారింది. ముఖ్యంగా కమిటీ కోసం రూపొందించిన విధివిధానాలు.. వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. రెండు ప్రాంతాల వారిని సంతృప్తి పరచడానికి కేంద్రం ఎంతో జాగ్రత్తగా వీటిని రూపొందించినప్పటికీ.. ఆందోళనలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోయింది. ముఖ్యంగా.. ప్రత్యేక రాష్ట్రంతో పాటు.. రాష్ట్రాన్ని యదాతథంగా ఉంచడంపైనా.. అధ్యయనం చేయాలనడమే వివాదాస్పదమవుతోంది. తెలంగాణలో దీనిపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కేవలం కాలయాపన చేసేలానే.. ఉందన్నది నిపుణుల అభిప్రాయం.
తెలంగాణ ఏర్పాటుకు ప్రాసెస్ మొదలుపెడతామంటూ.. డిసెంబర్ 9న చిదంబరం చేసిన ప్రకటనకు.. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలకు అసలు పొంతనేలేకుండా ఉందన్న అభిప్రాయం తెలంగాణ వాదుల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ ఏర్పాటుపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లుగానే కనిపిస్తోందంటున్నారు. రాష్ట్ర విభజన ఎలా జరగాలన్నదానిపై అధ్యయనం చేయాలి గానీ.. రాష్ట్రాన్ని విభజించాలా వద్దా అని పరిశీలించడం అన్యాయమే అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ కమిటీ.. పదినెలల పాటు కష్టపడిన తర్వాతైనా.. ఫలితం వస్తుందన్న నమ్మకం లేదంటున్నారు రాజకీయవిశ్లేషకులు. దీనికి తోడు.. కమిటీని స్వాగతిస్తున్న సీమాంధ్రనేతలు... ఒకవేళ తెలంగాణకు అనుకూలంగా నివేదికను ఇస్తే మాత్రం అంగీకరించకపోవచ్చన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలోనూ ఇప్పుడు మరింత స్పష్టత రావాల్సి ఉంది. కమిటీ విధివిధానాలతో తెలంగాణ విషయంలో మరింత స్పష్టత వస్తుందనుకున్న రాజకీయ నేతలకు.. కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఓ రకంగా అసంతృప్తినే మిగిల్చింది.
12, ఫిబ్రవరి 2010, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి