పొదుపు చేయాలని అందరికీ ఉంటుంది కానీ ఈ రోజు రేపు అనుకుంటూ రోజులు, సంవత్సరాలే గడిపేస్తుంటారు చాలామంది. కనీసం ఈ ఏడాదైనా దానిని ఆచరణలో పెట్టండి. ఎంత తొందరగా ప్రారంభిస్తే అంత తక్కువ మొత్తంతో ఎక్కువ నిధిని సమకూర్చుకునే అవకాశం మీ సొంతం అవుతుంది. మొత్తం ఒకేసారి పెట్టుబడి పెట్టడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. వాయిదాల పద్ధతి అయితే ఎవరికైనా అనుకూలమే. మరి ఎందుకు ఆలస్యం.. ఏ బాదరబందీ లేని యువకుల నుంచి, బరువు బాధ్యతల భారాన్ని మోస్తున్న మధ్య వయసు వారి వరకు... ఇలా ఏ వయసు వారైనా నెలకు ఓ రెండు వేల రూపాయలను మదుపు చేయగల్గితే? వారి అవసరాన్ని బట్టి కాల వ్యవధిని నిర్ణయించుకోగల్గితే? అందుకు చాలా పథకాలు అందుబాటులో ఉన్నాయి. అంతకంటే ముందు మీ అవసరాలు ఇవేనా?
* రోజువారీ అవసరాలకు ఇబ్బందులు కల్గకుండా పిల్లల ఉన్నత చదువులకు ఇప్పటి నుంచే సొమ్ము కూడబెట్టాలి. పదేళ్ల ప్రణాళిక ఇది.
* రుణం ద్వారా సొంతింటిని నిర్మించుకునే వారు ముందస్తు చెల్లింపు కోసం కొంత సొమ్ముని సిద్ధం చేసుకోవాలి. ఇది స్వల్పకాల కార్యాచరణ.
* కలల కారును రుణ భారం లేకుండా సొంతం చేసుకోవాలి. మూడు, నాలుగేళ్ల ఆచరణ.
* ఇంట్లోకి ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయాలి. ఒకటి రెండేళ్ల కాలవ్యవధి.
* భారం కాకుండా జీవిత బీమా ప్రీమియం చెల్లించాలి. సరదాగా వెళ్లే విహారయాత్రల బడ్జెట్‌కు లోటు లేకుండా ఉండాలి. ఏడాది ప్రణాళిక ఇది.
ఇవే కాదు, అనారోగ్యంలో ఆదుకోవాలన్నా, ఉద్యోగ అభద్రత నుంచి రక్షణ ఉండాలన్నా అందుబాటులో కొంత సొమ్ము ఉండాలి. ఇలా వేర్వేరు అవసరాల కోసం ప్రణాళికా బద్ధంగా ముందు నుంచే చిన్న మొత్తాలతో మదుపు ప్రారంభిస్తే భారం అనిపించదు.
ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్)
ఎవరైనా ఖాతా ప్రారంభించొచ్చు. ఏడాదిలో తక్కువలో తక్కువ రూ. 500 నుంచి మొదలెట్టవచ్చు. గరిష్ఠంగా రూ. 70 వేల వరకు జమ చేయవచ్చు. వ్యవధి 15 ఏళ్లు. అసలుకు ఢోకా లేకుండా 8 శాతం రాబడి హామీ. సెక్షన్ 80సి కింద పెట్టుబడిపై, గడువు తర్వాత అందుకునే రాబడిపైన పన్ను మినహాయింపు వర్తిస్తుంది. దీర్ఘకాల మదుపు ఆలోచన ఉన్నవారు పీపీఎఫ్‌లో మదుపు చేయవచ్చు. తపాలా కార్యాయాల్లో, ఎస్‌బీఐ, మరికొన్ని బ్యాంకుల్లో ఈ ఖాతాని తెరవొచ్చు.
రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ)
వ్యక్తిగతంగా, ఉమ్మడిగా ఈ ఖాతాని తెరవవచ్చు. పెద్దలు సంరక్షకులుగా పిల్లల పేరు మీద ప్రారంభించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో 50 రూపాయల నుంచి జమ చేసే అవకాశం కల్పిస్తున్నాయి బ్యాంకులు. పట్టణాల్లో కనీస మొత్తం రూ. 100గా నిర్ణయించారు. గరిష్ఠ మొత్తంపై ఎలాంటి పరిమితి లేదు. వడ్డీని ప్రతి మూడు నెలలకోసారి లెక్కిస్తారు. అవసరాలను బట్టి ఆరు నెలల నుంచి 12 ఏళ్ల వరకు కాలవ్యవధులను ఎంచుకోవచ్చు. తపాలాలో ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ మాత్రమే అందుబాటులో ఉంది. 7.5 శాతం రాబడి హామీ ఇస్తోంది. అత్యవసరాల్లో జమ అయిన సొమ్ములోంచి 90 శాతం వరకు తక్కువ వడ్డీకి రుణంగా తీసుకోవచ్చు. బ్యాంకు పొదుపు ఖాతా ఉన్నట్లయితే ఆదేశాలు ఇవ్వడం ద్వారా ప్రతినెలా నిర్ణయించిన తేదీన నేరుగా ఆర్‌డీలోకి సొమ్ము బదిలీ అయ్యే సౌకర్యాన్ని బ్యాంకులు ఉచితంగానే కల్పిస్తున్నాయి. నిర్ణీత తేదీకి ఆలస్యంగా సొమ్ము జమ చేస్తే అపరాధ రుసుము తప్పదు. ఆర్‌డీలో జమ చేసిన సొమ్ముపై పన్ను మినహాయింపు వర్తించదు. ఈ ఖాతాలను తపాలా, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో ఎక్కడైనా ప్రారంభించవచ్చు.
రాబడితో పాటు రక్షణ
అటు రక్షణ ఇటు రాబడి కావాలనుకునేవారికి బీమా పాలసీలు నప్పుతాయి. యులిప్స్‌లో అయితే కనీస ప్రీమియం పదివేల పైనే ఉంది. వెసులుబాటు కోసం నెలనెలా చెల్లించొచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. పథకాన్ని బట్టి ప్రీమియంలో కొనుగోలు రుసుము కొంత శాతం ఉంటుంది. ఫండ్ నిర్వహణ కింద, పరిపాలన ఛార్జీలు ఉంటాయి. ప్రారంభ సంవత్సరాల్లో రుసుముల బెడద ఎక్కువే. మదుపర్ల నుంచి సేకరించిన ప్రీమియాన్ని ప్రభుత్వ సెక్యూరిటీలు, డెట్ పథకాలు, పొర్ట్‌ఫోలియోను అనుసరించి ఈక్విటీల్లో మదుపు చేస్తారు. ఎండోమెంట్ పాలసీల్లో రాబడికి హామీ ఉంటుంది. బీమా కంపెనీల లాభాలను బట్టి గడువు తర్వాత బోనస్ చెల్లిస్తారు. యులిప్స్‌లో మాత్రం రాబడికి హామీ లేదు. సెక్షన్ 80సి కింద చెల్లించిన ప్రీమియంపై మినహాయింపు వర్తిస్తుంది. మూడేళ్లు తర్వాత బట్టి పాక్షికంగా లేదంటే పూర్తిగా సొమ్ముని తీసుకోవచ్చు. సాధారణ పాలసీల్లో స్వాధీన విలువ వచ్చాక రుణంగా తీసుకోవచ్చు. బీమా కంపెనీల నుంచి వీటిని కొనుగోలు చేయవచ్చు.
స్వచ్ఛంధ భవిష్య నిధి (వీపీఎఫ్)
ఈపీఎఫ్ సౌకర్యం ఉన్న ఉద్యోగస్థులు మాత్రమే వీటిలో మదుపు చేయగలరు. దీర్ఘకాల అవసరాల దృష్ట్యా స్థిరంగా కొంత మొత్తం నిర్దేశించుకోవచ్చు. లేదా జీతంలో కొంత శాతంగా నిర్దేశించుకుంటే వేతనం పెరిగినపుడల్లా ఆ మేరకు వీపీఎఫ్ వాటా కూడా పెరుగుతుంది. ప్రస్తుతం రాబడి హామీ 8.5 శాతంగా ఉంది. సెక్షన్ 80సి కింద పెట్టుబడి, రాబడిపై పన్ను మినహాయింపు క్లెయిం చేసుకోవచ్చు. కొన్ని పరిమితుల మేరకు అత్యవసర పరిస్థితుల్లో సొమ్ముని పాక్షికంగా డ్రా చేసుకునే వీలుంది.
కొత్త పింఛను పథకం (ఎన్‌పీఎస్)
పద్దెనిమిది ఏళ్లు నిండిన భారతీయులెవరైనా ఈ పథకంలో చేరొచ్చు. ఖాతాలో ఏడాదిలో కనీసం రూ. 6వేలు జమ చేయాలి. గరిష్ఠ పరిమితి లేదు. 60 లోంచి ప్రస్తుత వయసును తీసేస్తే వచ్చేన్ని సంవత్సరాలు మదుపు చేయాలి. ప్రభుత్వ సెక్యూరిటీలు, డెట్ ఫండ్లలో, మీరు ఎంచుకున్న పోర్ట్‌ఫోలియోను బట్టి 50 శాతం వరకు ఈక్విటీలలో పెట్టుబడి పెడతారు. రాబడికి హామీ లేదు. సెక్షన్ 80సి కింద పెట్టుబడులకు మినహాయింపు, గడువు తర్వాత అందుకునే సొమ్ముపై పన్ను చెల్లించాలి. గడువు తర్వాత ఒకేసారి 60 శాతం నిధిని తీసుకోవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకుల్లో ఈ ఖాతాని తెరవొచ్చు.
మ్యూచువల్ ‘సిప్'
ఫండ్లలో 18 ఏళ్లున్న భారతీయులెవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి ప్రయోజనం పొందాలంటే వీటిలో ఏకమొత్తం పెట్టుబడి కంటే వాయిదాల్లో కొనసాగించడం ఎక్కువ ప్రయోజనం. కనీసం నెలకు రూ. 50 మదుపు చేయగల స్థోమత ఉంటే చాలు ఈ క్రమబద్ధ పెట్టుబడి విధానం (సిప్)లో మదుపు మొదలెట్టవచ్చు. గరిష్ఠ పరిమితి ఏమీ లేదు. మార్కెట్ ఆధారంగా రాబడులు ఉంటాయి. ఈఎల్‌ఎస్‌ఎస్ పథకాల్లో అయితే కనీసం మూడేళ్లు మదుపు చేస్తేనే పన్ను మినహాయింపు వర్తిస్తుంది. పాకిక్షంగానైనా లేదంటే మొత్తంగానైనా ఎప్పుడైనా యూనిట్లను అమ్ముకోవచ్చు. వీటిలో మదుపు చేయాలంటే డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతా తప్పనిసరి. స్టాక్ బ్రోకర్లు, డిపాజిటరీ పార్టీసిపెంట్ల నుంచి ఈ ఖాతాని తెరవొచ్చు..
బంగారంగానూ...
బంగారాన్ని కొనాల్సిన అవసరం లేకుండా లాభాలను అందుకోవడానికి చక్కని వేదిక గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్లు. ఇవి మ్యూచువల్ ఫండ్ల పనితీరునే పోలి ఉంటాయి. మార్కెట్ ట్రేడింగ్ వేళల్లో యూనిట్లు కొనడం, అమ్మడం చేయవచ్చు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అమ్ముకునే సౌలభ్యం ఉంటుంది. ఆ రోజు ఉన్న బంగారం ధర ఆధారంగా మీకు ఎంత వస్తుందన్నది ఆధారపడి ఉంటుంది. యూనిట్లు కొన్నప్పుడు, అమ్మినప్పుడు ఛార్జీలు భరించాల్సి వస్తుంది. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ పన్ను ఉంటుంది. గత ఏడాది కాలంలో దాదాపు 32శాతం వరకూ రాబడిని అందించాయివి. ఇప్పటికే ఇతర పెట్టుబడులు ఉన్నవారు బంగారం ధర తగ్గినప్పుడల్లా వీలును బట్టి ఈ పథకాల యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. క్రమం తప్పకుండా కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఫలితంగా సగటు విధానం వల్ల లాభాలు రావడానికి ఆస్కారం ఉంది. వీటిలో పెట్టుబడి పెట్టాలంటే ముందుగా డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు ఉండాలి.
స్థిరాస్తిలో...
వైవిధ్య పెట్టుబడుల్లో భాగంగా స్థిరాస్తుల్లో కొంత శాతం మదుపు చేయడం తెలివైన నిర్ణయం. నగరాల నుంచి పట్టణాల వరకు స్థోమతను బట్టి వీటిని ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చు. నెలకు రూ. 500 నుంచి మొదలు వాయిదాల్లో చెల్లించే సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి స్థిరాస్తి సంస్థలు. నగరాల్లో అయితే ఈ వాయిదా మొత్తం కాస్త ఎక్కువే ఉంటుంది. దీర్ఘకాల అవసరాల కోసం కొనడం మేలు. క్రయవిక్రయాల్లో రిజిస్ట్రేషన్, ఇతరత్రా రుసుములు ఎక్కువగా ఉంటాయి. వృద్ధితో పోలిస్తే ఇదేమంత ఖర్చు కాదు. పేరున్న సంస్థలు, నమ్మకం ఉన్న వారి నుంచి వాయిదాల్లో కొనుగోలు సురక్షితం. న్యాయపరమైన చిక్కులు రాకుండా అన్ని పత్రాలు సరిచూసుకున్నాకే కొనుగోలు చేయడం మేలు.
8, జనవరి 2010, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Memoo eenadu paper chaduvuthunnaamandi...