ఆర్టీసీ ఛార్జీలు ఊహించని రీతిలో పెరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఈ ఛార్జీలు పెరిగాయి. ఛార్జీల పెంపు తప్పని సరి అయినప్పటికీ.. ఈ స్థాయిలో పెరగడం మాత్రం... అందరికీ ఆగ్రహం కలిగిస్తోంది. అయితే.. ఈ ఛార్జీల పెంపు తమకు తెలియదంటూ.. ప్రభుత్వం అడ్డం తిరగడమే విస్మయ పరుస్తోంది. ప్రభుత్వానికి తెలియకుండా.. ఓ ప్రభుత్వ సంస్థ ఏకపక్ష నిర్ణయాన్ని ఎలా తీసుకోగలదు.. రాష్ట్రంలో ఆందోళనలను పక్కదారి పట్టించడానికి ప్రభుత్వం ఆడుతున్న నాటకమా....
కొత్త ఏడాది వచ్చి వారంరోజులయ్యిందో లేదో.. రాష్ట్ర ప్రజలకు మహా షాక్ ఇచ్చింది.. APSRTC. ఎప్పుడూ లేనంతగా ఛార్జీలను పెంచేసింది. ఆర్డనరీ బస్సెక్కే లోక్లాస్ దగ్గరి నుంచి.. వోల్వోలో ప్రయాణించే హైక్లాస్ వరకూ.. అందరి నెత్తినా భారీగానే భారం మోపింది. మినిమం ఛార్జీలు మారిపోయాయి. సిటీలో తొలి నాలుగు కిలోమీటర్లకు ఇంతవరకూ 2 రూపాయలుగా ఉన్న టికెట్ ఇప్పుడు 5 రూపాయలు అయ్యింది. ఇంత భారం మోయడం చాలా కష్టమే. ఉదయాన్నే బస్సెక్కిన ప్రయాణీకుడి జేబుకు చిల్లుపెట్టింది ఆర్టీసీ. అందుకే.. ఛార్జీల పెంపుపై ఎప్పుడూ లేనంత తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆర్టీసీ టికెట్ ఛార్జీలు పెంచక తప్పదన్న సంకేతాలు ఎప్పటినుంచో వెలువడుతున్నాయి. జనం కూడా.. ఏదో కొద్దిగా పెరగొచ్చులే అని భావించారు. కానీ.. ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం మాత్రం... అందరికీ షాక్ ఇచ్చింది. ఎప్పుడూలేనంతగా ఛార్జీలు పెరగడంతో.. జనంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గ్రామాల్లో తిరిగే ఆర్డినరీ బస్సుల్లో.. ప్రతీ కిలోమీటరుకు.. 8 పైసలు టికెట్ ధర పెరిగిపోయింది. అంటే దాదాపు 21.5 శాతం పెరిగాయి. ఆర్డినరీ బస్సులతో పోల్చితే.. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో వెళ్లాలనుకునేవారు మాత్రం మరింత చమురు వదుల్చుకోవాల్సి వస్తుంది. ఈ బస్సుల్లో ప్రయాణించేవారిపై 22.72 శాతం భారం పడింది. ఇక డీలక్స్, సూపర్ లగ్జరీ, ఓల్వోల సంగతి సరేసరి. ఓల్వో ఛార్జీలు 25 శాతం, సూపర్ లగ్జరీ టికెట్ ధరలు 220.8 శాతం, డీలక్స్ ఛార్జీలు 22.44 శాతం చొప్పున ఒకేసారి పెరిగిపోయాయి. కొద్దిదూరమైతే.. పెద్దగా భారం తెలియదు కానీ.. వంద కిలోమీటర్ల పైబడి ప్రయాణించేవారికి మాత్రం.. చేతి చమురు వదలడం ఖాయమే. టికెట్ ధరలు భారీగా పెరగడంతో.. జనం రోడ్డెక్కారు. అన్ని రాజకీయ పార్టీలు.. ఆందోళనలు మొదలుపెట్టాయి. పైగా.. టికెట్ ధరలు పెంచామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే.. హడావిడిగా అమలు చేయడమూ వివాదాస్పదమవుతోంది.
నష్టాలు పేరుకుపోవడం... ఉద్యోగుల సమ్మెను నివారించడానికి జీతాలను పెంచుతామని ఆర్టీసీ యాజమాన్యం హామీ ఇవ్వడంతో.. ఛార్జీలు పెంచకతప్పదని బుధవారం మధ్యాహ్నమే రవాణాశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు సూచన ప్రాయంగా చెప్పారు. అయితే.. కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్న తర్వాతే పెంపు ఉంటుందనీ చెప్పారు. కానీ.. సాయంత్రం కల్లా సీన్ మారిపోయింది. ఛార్జీలను పెంచుతున్నట్లు.. ఆర్టీసీ ఎండీ.. ఎస్.ఎస్.పి. యాదవ్ నుంచి ప్రకటన కూడా వచ్చేసింది. అర్థరాత్రి నుంచి కొత్త ధరలు అమల్లోకీ వచ్చేశాయి. ఏదైతేనేం.. జనం నడ్డి మాత్రం విరిగిపోయింది.
ప్రభుత్వం పాత్ర ఎంత?
రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తోందా?... ముఖ్యమంత్రి రోశయ్యకు పాలనపై పట్టుందా? ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించగల సత్తా సర్కారుకు ఉందా? ఆర్టీసీ ఛార్జీల పెంపు కారణంగా.. ఈ సందేహాలు ప్రతీ ఒక్కరికీ వస్తున్నాయి. ఆర్టీసీ నష్టాల్లో ఉందని.. ఛార్జీలు పెంచక తప్పదని కొన్ని రోజులుగా ప్రభుత్వానికి అధికారులు నివేదిస్తూనే ఉన్నారు. అయినా... సర్కారు స్పందించలేదు. రోడ్డు రవాణా సంస్థను ఆదుకోవడానికీ ప్రయత్నించలేదు. చివరకు ఛార్జీల పెంచడానికే.. మొగ్గుచూపింది. దీనికి అనుకూలంగానే ప్రకటనలూ వెలువడ్డాయి. చివరకు.. టికెట్ ధరలు పెంచుతున్నట్లు సడన్‌గా ప్రకటన వచ్చినా ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. ఇక విపక్షాలు, సామాన్యులు ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ.. రోడ్డు ఎక్కడంతో.. సర్కారు రూటు మార్చేసింది. తమకు తెలియకుండానే ఆర్టీసీ యాజమాన్యం ఛార్జీలు పెంచిందంటూ ఇప్పుడు బోరుమంటోంది. స్వయంగా రవాణాశాఖమంత్రే.. ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తున్నారు. ఆర్టీసీ ఎండీ తీరుపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రికి చెప్పిన తర్వాతే.. టికెట్ ధరలను పెంచినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అయితే.. ఈ విషయం ముఖ్యమంత్రికి ఏమాత్రం తెలియదని.. ఆర్టీసీ సొంతగా నిర్ణయం తీసుకొందంటోంది ప్రభుత్వం. ఇందులో ఎవరివాదన కరెక్ట్ అని అనుకోవాలి. ఎవరిని తప్పుపట్టాలి. ఇప్పటివరకూ ఆర్టీసీ ఛార్జీలు ప్రభుత్వం సూచించిన మేరకే పెరిగాయి. మరి ఈసారి ప్రభుత్వాన్ని కాదని.. ఆర్టీసీ నిర్ణయం ఎందుకు తీసుకొంది. ఈ విషయంలో అందరూ వేలెత్తి చూపుతోంది.. ఒక్కరిపైకే.. ఆయనే SSP యాదవ్. మాజీ డీజీపీ.. ప్రస్తుత ఆర్టీసీ వైఎస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఛార్జీలు పెంచుతున్నామంటూ ప్రకటన చేసింది కూడా ఆయనే. అందుకే.. ఇప్పుడు అందరికీ టార్గెట్ అయ్యారు యాదవ్. కాకపోతే.. ఆయనేమో.. తాను తప్పుచేయలేదంటున్నారు.. మరి ముఖ్యమంత్రి ఆమోదం లేకుండా.. ఛార్జీలను ఎందుకు పెంచాల్సి వచ్చిందన్నదానికి మాత్రం యాదవ్ దగ్గర స్పష్టమైన సమాధానం లేదు. ఆర్టీసీ స్వతంత్ర్య సంస్థ అనే బదులిస్తున్నారు. ఛార్జీలను పెంచకపోతే.. ఆర్టీసీని మూసేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
రోశయ్య డమ్మీనా?
ఇక్కడ ముఖ్యమంత్రి రోశయ్య పాలనపైనా దృష్టి పెట్టాల్సి ఉంది. ముఖ్యమంత్రిని ఎదిరించి మరీ సొంత నిర్ణయం తీసుకునే పరిస్థితి ఓ ఐపీఎస్ అధికారికి ఎలా వచ్చింది. అదీ.. రాష్ట్రంలో ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేసే అంశంలో ముఖ్యమంత్రిని సంప్రదించలేదంటే.. ఏమని అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉందని భావించాలా.. లేక.. అధికారులపై ప్రభుత్వానికి పట్టులేదనుకోవాలా... ఈ పరిస్థితిని రోశయ్య ఎలా ఎదుర్కొంటారు.. ఇదే ఇప్పుడు తేలాల్సి ఉంది.
ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికా?
రాష్ట్రంలో పరిస్థితులు నెలరోజులుగా అదుపులో లేవు. ప్రత్యేక తెలంగాణ కోసం మొదలైన ఉద్యమం.. అనేక మలుపులు తిరిగి.. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని రగలించింది. అప్పటినుంచి.. రాష్ట్రం అగ్నిగుండానే మండుతోంది. ఎక్కడోచోట ఆందోళనలు.. ఏదోతరహా నిరసన ప్రదర్శనలు. వీటిని అడ్డుకోవడానికి రోశయ్య సర్కార్ ఎంతగానో ప్రయత్నించినప్పటికీ.. శాంతియుత పరిస్థితులను నెలకొల్పడంలో మాత్రం విఫలమయ్యింది. సరిగ్గా ఈ సమయంలోనే ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రకటన వెలువడింది. అంతే.. తెలంగాణ, సమైక్య ఆందోళనలు సద్దుమణిగి... ఆర్టీసీ వ్యతిరేక ఆందోళనలు రాష్ట్రమంతా మొదలయ్యాయి. టికెట్ ధరల పెంపునకు నిరసనగా పోరాటం ప్రారంభమయ్యింది. బహుశా ప్రభుత్వం వ్యూహం ఇదేనా.. ఇష్యూను డైవర్ట్ చేయడానికే.. ఆర్టీసీ ఛార్జీల పెంపును తెరపైకి తెచ్చిందా.. ఇవి చాలామందికి కలుగుతున్న అనుమానాలు. ఈ సందేహాలు నిజమని చెప్పడానికి ఆధారాలు దొరకడమూ కష్టమే. ఇక ఛార్జీల పెంపు విషయానికి వస్తే.. 2002 తర్వాత ఇప్పటివరకూ పెంచలేదు. డీజిల్ ధరలు పెరిగినా.. ఇతర నష్టాలు వచ్చినా ఆర్టీసీ ఓపిగ్గానే భరిస్తూ వచ్చింది. ప్రభుత్వం ఆదుకోకపోవడంతో.. ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి వచ్చింది. అయితే.. ఇంత భారీగా ఎందుకు పెంచారన్నదే ఆలోచించాల్సిన విషయం. అసలే నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర సర్కార్.. ఆర్టీసీని ఆదుకునే పరిస్థితుల్లో లేదు. ఇప్పుడు ప్రకటించిన స్థాయిలో పెంచితే తప్ప.. ఆర్టీసీ బతికి బట్టకట్టడం సాధ్యం కాదు. అందుకే.. ఆర్టీసీ సంచలన నిర్ణయం తీసుకొంది. టికెట్ ధరలు పెంచితే.. ప్రజలనుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి.. ఎంతోకొంత తగ్గిస్తే.. మళ్లీ పరిస్థితి చక్కబడొచ్చు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆలోచిస్తోంది ఈ దిశలోనే.. ఎంతో కొంత తగ్గించి జనాన్ని శాంతింపచేయాలనుకొంటోంది.
యాదవ్ ప్రతీకారం
ఈ అడ్డగోలు ఛార్జీల పెంపులో మరో కోణమూ ఉంది. అదే ఎస్.ఎస్.పి. యాదవ్ వ్యవహారం. డీజీపీగా రాష్ట్ర అత్యుతున్నత పోలీస్ పదవిలో పనిచేసిన యాదవ్.. ప్రభుత్వాగ్రహం కారణంగా.. ఆర్టీసీ ఎండీ పదవికి దిగజారాల్సి వచ్చింది. దీనిపై ఆయన న్యాయ పోరాటాన్ని కూడా చేస్తున్నారు. ఓ రకంగా ప్రభుత్వానికి.. ఈ మాజీ డీజీపీకి మధ్య సత్సంబంధాలు ఏమాత్రమూ లేవు. రాష్ట్రంలో తీవ్ర ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలంటే.. ఛార్జీలను పెంచడానికి మించిన మార్గం లేదు. అంటే.. ఓరకంగా సర్కార్‌పై కక్షసాధింపు చర్యను యాదవ్ చేశారా... ఈ అనుమానాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వానికి.. అధికారులకు మధ్య సాగుతున్న ఈ వార్‌లో బలైంది మాత్రం సామాన్యులే. అందులోనూ పండగసీజన్‌లో ఆర్టీసీ టికెట్ ధరలను పెంచడంతో.. మరింత ఎక్కువమంది... నష్టపోనున్నారు. ఏదైతేనేం.. ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంతో... ప్రయాణం సామాన్యుడికి గుదిబండగా మారిపోయింది.
7, జనవరి 2010, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి