9, జనవరి 2010, శనివారం
శాటిలైట్ కిల్లర్స్...
Categories :
ఒక దేశ సార్వభౌమత్వానికి.. సరిహద్దు రక్షణకు ఏమాత్రం విఘాతం కలగకుండా ఉండాలంటే.. బలమైన సైనిక పాటవం కావాలి. అత్యాధునిక ఆయుధాలు కావాలి. వాటిని సరైన దిశలో నడిపించగల సమర్దవంతమైన నాయకత్వం కావాలి. కానీ, ఇవి మాత్రమే ఉంటే.. ఇప్పుడు లాభం లేదు. అంతరిక్షంలోనుంచి దూసుకువచ్చే ముప్పునూ తట్టుకోగలగాలి. అందుకే.. ఆ దిశలోనే అడుగులు వేస్తోంది మనదేశం. శత్రుదేశాల ఉపగ్రహాల పనిపట్టే.. అత్యాధునిక టెక్నాలజీని అభివృద్ధి చేసుకొంటోంది..
అంతరిక్ష యుద్ధానికి భారత్ సిద్ధమవుతోందా.. శత్రుదేశాల ఉపగ్రహాలను నాశనం చేసే టెక్నాలజీని తయారు చేస్తోందా.. వీటన్నిటికీ అవునన్న సమాధానమే వస్తోంది. యాంటీ శాటిలైట్ వెపన్ సిస్టం ను అభివృద్ధి చేస్తున్నట్లు.. డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్ వి.కె.సారస్వత్ ప్రకటించారు. "భారత శత్రుదేశాల శాటిలైట్లను నిర్వీర్యం చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే ప్రయోగాలు జరుగుతున్నాయి. దీనిద్వారా అంతరిక్షంలో మన ఉపగ్రహాలను కూడా రక్షించుకోగలం. ఈ టెక్నాలజీపైనే పరిశోధనలు చేస్తున్నాం. దీనివల్ల శత్రువులు తమ అంతరిక్ష పరికరాలను మన భూభాగంపై ఉపయోగించలేరు." ఇటీవల తిరువనంతపురంలో జరిగిన 97వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సభల్లో పాల్గొన్న ఆయన... సరికొత్త ఆయుధాల తయారీపై పెదవి విప్పారు. శత్రుదేశాల ఉపగ్రహ వ్యవస్థలపై దాడి చేసే అత్యంత ఆధునిక టెక్నాలజిపై DRDO విస్త్రత స్థాయిలో పరిశోధనలు చేస్తోందని ఆయన తెలిపారు. దీంతో అంతరిక్షంలో భారత భూకక్ష్యలో పరిభ్రమించే శత్రుదేశాల నిఘా ఉపగ్రహాలు, సైనిక ఉపగ్రహాలపై మనం దాడిచేసే సత్తా భారతసైన్యానికి అందుబాటు లోకి వస్తుంది.
యాంటీ శాటిలైట్ వెపన్స్ ఎందుకు?
కేవలం శత్రుదేశాల ఉపగ్రహాలను నాశనం చేయడమే కాదు.. మన శాటిలైట్లపైకి దూసుకువచ్చే మిసైల్స్‌ను అడ్డుకోవాలి. అప్పుడే మన అంతరిక్ష పరిశోధనలు సజావుగా జరుగుతాయి. సరిగ్గా ఈ లక్ష్యంతోనే టెక్నాలజీని అభివృద్ధి చేయాలనుకొంటోంది రక్షణరంగ సంస్థ డీఆర్డీఓ. ముఖ్యంగా భూమికి సమీపంలో తిరిగే ఉపగ్రహాలనే టార్గెట్ చేసుకుంటూ.. ఈ కొత్త వెపన్ సిస్టంకు రూపకల్పన చేస్తోంది. 2014 నాటికల్లా దీన్ని సైన్యానికి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉపగ్రహాలను నాశనం చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందంటే.. అంతరిక్షయుద్ధం చేయడానికి మనం సిద్ధమైనట్లే.
అయితే.. ఈ ఉపగ్రహ వినాశులను మనం మాత్రమే తయారు చేయడంలేదు. ఈ విషయంలో అగ్రరాజ్యాలు మనకన్నాముందే ఉన్నాయి. శాటిలైట్ కిల్లర్స్‌ను తమ అమ్ములపొదిలో ఎప్పుడో సమకూర్చుకున్నాయి. అంతరిక్ష పరిశోధనలను ప్రపంచంలో తొలిసారిగా మొదలుపెట్టిన.. అమెరికా, సోవియెట్ యూనియన్లే.. ఈ విధ్వంసకర ఆయుధాల తయారీకి శ్రీకారం చుట్టాయి. కోల్డ్‌వార్ సమయంలోనే ఈ రెండు దేశాలు కలిసి దాదాపు 54 సార్లు ఈ యాంటీ శాటిలైట్ వెపన్స్‌ను పరీక్షించాయి. ఒకదేశంపై మరొకటి దాడి చేయడం కోసం.. కొన్ని నెలలపాటు.. వీటిని ప్రయోగానికి సిద్ధంగా మోహరించాయి. 1985లో తన వెదర్ శాటిలైట్ స్లోవిండ్‌ను అమెరికా... ఇదే పద్దతిలో కూల్చేసింది. సెప్టెంబర్ 13, 1985న భూమికి 555 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న ఉపగ్రహాన్ని.. ఎఫ్-15 నుంచి దూసుకెళ్లిన మిసైల్ తునాతునకలు చేసింది..
ఇదే తరహాలో సోవియెట్ ఎన్నో ప్రయోగాలు చేసింది. అయితే.. యూనియన్ విచ్చిన్నం కావడంతో.. పెద్ద దేశంగా మిగిలిన రష్యా.. అంతరిక్ష యుద్ధంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇతరత్రా ప్రయోగాలు జరిగినా.. యాంటీ శాటిలైట్ వెపన్స్‌ను ఉపయోగించాల్సిన అవసరం అమెరికా, రష్యాలకు రాలేదు. దాదాపు రెండు దశాబ్దాలపాటు ప్రశాంతంగా ఉన్న అంతరిక్షంలో.. బాంబుపేల్చింది.. చైనా. ప్రపంచ దేశాల అభ్యంతరాలను ఏమాత్రం లెక్కచేయకుండా.. 2007, జనవరి 17న యాంటీ శాటిలైట్ టెస్ట్ జరిపింది. ఫెంగ్యున్ - 1సి వెదర్ శాటిలైట్ చెడిపోయిందని చెప్పిన చైనా.. S-19 మిసైల్‌ను పంపించి.. దాన్ని పేల్చేసింది. చైనా ఉపగ్రహం దాదాపు 40 వేల ముక్కలైనట్లు అంచనా. ఇవి ఇప్పటికీ భూమిచుట్టూ తిరుగూతూనే ఉన్నాయి. చెడిపోయిన ఉపగ్రహాన్ని నాశనం చేయడానికే పేల్చేశామని చైనా చెబుతున్నా.. దాని ఆంతర్యం మాత్రం వేరన్న సంగతి అందరికీ తెలిసిందే. శత్రుదేశాల ఉపగ్రహాలను నాశనం చేయగల సత్తా తనకుందని నిరూపించుకోవడానికే.. చైనా ఈ ప్రయోగం చేసిందన్న వాదనా ఉంది. అయితే.. అమెరికా మాత్రం.. అనూహ్యంగా రియాక్ట్ అయ్యింది. చైనాను తలదన్నే రీతిలో యాంటీశాటిలైట్ వెపన్ సిస్టంను ప్రయోగించింది. 2006 డిసెంబర్ 14న అమెరికా ప్రయోగించిన నిఘా ఉపగ్రహం USA - 193ని ఈ ప్రయోగానికి ఎన్నుకొంది. పసిఫిక్ సముద్రంలో మోహరించిన యుద్ధ నౌక నుంచి.. ఫిబ్రవరి 20, 2008న SM-3 మిసైల్‌ను పంపి.. స్పై శాటిలైట్‌ను కూల్చేసింది. చైనా చూపించిన సాకునే.. అమెరికా ఇక్కడా చూపించింది. ఈ స్పై శాటిలైట్ పనిచేయడం లేదన్న అమెరికా.. అందులో 450 కిలోల టాక్సిక్ హైడ్రోజన్ ఉందని.. అది భూమిపై కూలిపోతే.. పెను ప్రమాదం జరుగుతుందని ఊదరగొట్టింది. కానీ.. వాస్తవం మాత్రం వేరు. చైనాకు దీటుగా తన శక్తిసామర్థ్యాలను ప్రదర్శించడానికే ఈ ప్రయోగం చేసిందన్నదే.. ఆ వాస్తవం.
అమెరికా, రష్యా, చైనాల తీరుతో.. మన దేశం కూడా త్వరపడక తప్పడం లేదు. ఎదుటి దేశాల మీద దాడి సంగతి పక్కన పెడితే.. మనల్ని, మన ఉపగ్రహాలను కాపాడుకోవాలన్నా.. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసుకోకతప్పదు. పైగా.. ఉపగ్రహ ప్రయోగాల్లో ముందున్నమనకు.. ఈ తరహా రక్షణ తప్పనిసరి. యాంటీ శాటిలైట్ వెపన్ సిస్టంను డీఆర్డీఓ అభివృద్ధి చేయడానికి కారణం ఇదే.
శాటిలైట్లకు రక్షణ లేదా?
టెక్నాలజీ ఇప్పుడు భూ ప్రపంచపు అంచులను దాటిపోయింది. వైర్లెస్ కనక్టివిటీ పెరిగిపోయింది. క్షణకాలం సెల్ఫోన్లు ఆగిపోయినా.. టీవీలు పనిచేయకపోయినా.. ప్రపంచమంతా అల్లకల్లోలమైపోతుంది. ఇవి సరిగ్గా పనిచేయాలంటే.. అంతరిక్షంలో ఉండే ఉపగ్రహాలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదు. వాతావరణాన్ని అంచనా వేయడం దగ్గర మొదలుపెడితే.. మిలటరీ అవసరాలు తీర్చడం వరకూ.. ఇప్పుడు ఉపగ్రహాలదే కీలక పాత్ర. పైగా.. ఇటీవలి కాలంలో నిఘా ఉపగ్రహాలను ప్రయోగించడం ఎక్కువయ్యింది. శత్రుదేశాల కదలికలను తెలుసుకోవడంలో ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయి. అంతేకాదు.. యుద్ధసమయంలో శాటిలైట్లను పనిచేయకుండా ఆపగలిగితే.. ఎనిమీ వెనక్కి తగ్గడం ఖాయం. అందుకే.. ప్రపంచ అభ్యంతరాలను లెక్కచేయకుండా చైనా ఈ ప్రయోగానికి తెగించింది.
మన దేశం విషయానికి వస్తే.. ఇస్రో చేస్తున్న ప్రయోగాలు చాలా వరకూ విజయవంతమైనవే. 1975 నుంచి ఇప్పటివరకూ 54 భారత ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించింది. వాతావరణ శాటిలైట్లను మొదలుకొని.. నిఘా ఉపగ్రహాలవరకూ ఈ జాబితాలో ఉన్నాయి. చైనాకు మనకూ మధ్య ఉన్న విభేదాలను దృష్టిలో పెట్టుకుంటే.. ఈ శాటిలైట్లన్నింటినీ రక్షించుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో మన రక్షణ రహస్యాలు.. శత్రు దేశాలకు చిక్కకుండానూ చూసుకోవాలి. అందుకే.. సరిహద్దు రక్షణతో పాటు.. అంతరిక్ష రక్షణ కూడా ఎంతో కీలకం. ఈ విషయంపైనా దృష్టి పెట్టిన భారత సైన్యం.. ఇస్రో సహకారంతో కలిసి ఏరో స్పెస్ కమాండ్ ఏర్పాటుకు కృషి చేస్తోంది. పొరుగు దేశాలనుంచి ముప్పు పొంచి ఉండటంతో ఏరోస్పేస్ కమాండ్ వ్యవస్థ భారత్‌కు రక్షణ కవచంగా దోహదపడనుంది. ఈ కమాండ్‌ను త్రివిధదళాలను అనుసంధానం చేసి శాటిలైట్ పంపే చిత్రాలు... రాడార్స్ పంపే సిగ్నల్స్ ఆధారంగా శత్రుదేశాల కదిలికలను గుర్తించి ముందస్తుగా దాడి చేసే అవకాశం ఉంటుంది. ఈ తరహా టెక్నాలజీని అమెరికా, రష్యా, చైనాలు సమకూర్చుకున్నాయి...
సుఖోయ్, మిరాజ్ వంటి యుద్దవిమానాలతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎయిర్‌ఫోర్స్‌లో ఒకటిగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు ఎంతో మంచి పేరుంది. వేల కిలోమీటర్లు ప్రయాణించి లక్ష్యాలను చేధించగల అగ్ని బాలిస్టిక్ మిసైల్స్ కూడా భారత్ వద్ద ఉన్నాయి. వీటికి కొద్దిగా మార్పులు చేసి యాంటీ శాటిలైట్ మిసైల్స్గా అభివృద్ధి చేయవచ్చు. అయితే.. ఉపగ్రహాలను కచ్చితంగా పేల్చగలగాలంటే మాత్రం రాడార్ సిస్టంను ఇంకా మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. 2001లోనే టెక్నాలజి ఎక్స్పర్మెంట్ శాటిలైట్‌ను ఇండియా ప్రయోగించింది. సైనిక నిఘా అవసరాల కోసం కార్టో సెట్ - 2 ను 2008లో ప్రయోగించింది. భూమి మీద ఒక మీటర్ దూరం వరకు ఈ శాటిలైట్లు ఫోటోలు తీయగలవు. ఇదే క్రమంలో 2009 ఏప్రిల్‌లో రిశాట్-2 ను నింగిలోకి పంపించింది. ఈ ఉపగ్రహం రాత్రి వేళల్లో సైతం స్పష్టమైన ఫోటోలను తీయగలగడంతో పాటు.. సరిహద్దుల్లో శత్రుదేశాల సైనికుల కదిలికల్ని సైతం గుర్తిస్తుంది. ఇప్పుడు యాంటీశాటిలైట్ వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటే.. శత్రుదేశాలు మన ఉపగ్రహాలవైపు కన్నెత్తిచూసే సాహసం చేసే అవకాశం ఉండదు.
అంతరిక్ష యుద్ధం తప్పదా?
అంతరిక్షం ఎవరి సొత్తూ కాదు. అన్ని దేశాలకు సమాన హక్కులు ఉన్నాయి. స్సేస్ఏజ్ మొదలైనప్పటి నుంచీ.. రెండు దేశాల ఆధిపత్య ధోరణులను ప్రపంచ దేశాలు.. ఖండిస్తూనే ఉన్నాయి. దీనికి తగ్గట్లుగానే.. ఐక్యరాజ్యసమితి కూడా.. ఔటర్ స్పేస్ విషయంలో ఓ తీర్మానం చేసింది. 1967లో ఐక్యరాజ్యసమితి ఆమోదించిన ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం.. అంతరిక్షం మానవజాతి మొత్తానికి చెందుతుంది. కానీ.. ప్రస్తుతం ప్రయోగాలు చేయగల సామర్థ్యం.. స్పేస్‌లోకి శాటిలైట్లను పంపించగల టెక్నాలజీ కొన్ని దేశాలకు మాత్రమే ఉండడంతో అవి మాత్రమే వాడుకోగలుగుతున్నాయి.. భూమండలంపై బిగ్‌బాస్‌గా వ్యవహరిస్తున్నఅమెరికా.. అంతరిక్షంలోనూ తానే లీడర్‌ను కావాలనుకొంటోంది. ప్రపంచాధిపత్యంకోసం ఎదురుచూస్తున్న చైనాకు సహజంగానే ఇది ఏమాత్రం నచ్చడం లేదు. అందుకే.. పోటాపోటీగా ఆయుధాలను తయారు చేస్తోంది. అంతేకాదు.. అమెరికాకు 2006లోనే చైనా షాక్ ఇచ్చింది. చైనా భూభాగంపైకి వెళ్లిన అమెరికా మిలిటరీ స్పై శాటిలైట్ అనేక ఇబ్బందులకు గురయ్యింది. ఈ ఉపగ్రహంపై లేజర్ కిరణాలతో దాడి జరిగిందంటూ అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. ఈ దాడి తర్వాత.. శాటిలైట్‌లోని కొన్ని వ్యవస్థలు పనిచేయకుండా పోయాయనీ ప్రకటించింది. ఇది చాలు.. చైనా సమరసిద్ధతను అర్థం చేసుకోవడానికి. 2007లో అంతరిక్షంలోని ఉపగ్రహాన్ని పేల్చివేయడం ద్వారా.. తన యాంటీ శాటిలైట్ వెపన్స్ సామర్థ్యాన్ని చైనా చెప్పకనే చెప్పింది. కాబట్టి.. చైనాతో కయ్యానికి దిగే సాహసం చేయలేదు అమెరికా.
రష్యా దగ్గర కూడా.. శాటిలైట్ కిల్లర్స్ ఉన్నాయి. శత్రుదేశ ఉపగ్రహాన్ని గుర్తించిన వెంటనే.. భూమిపై నుంచి మిసైల్స్ దూసుకువెళతాయి. శాటిలైట్‌కు చేరువలోకి వచ్చిన తర్వాత వాటంతట అవే పేలిపోతాయి. దీంతో.. శాటిలైట్ కూడా నాశనమవుతుంది. దాదాపు కిలోమీటర్ ముందే మిసైల్ పేలినా.. శాటిలైట్ విధ్వసం కావడం ఖాయం. అయితే.. మిసైల్స్ ద్వారా కన్నా.. లేజర్ కిరణాల ద్వారానే ఇతర దేశాల శాటిలైట్లను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది రష్యా.
వాస్తవంగా చూస్తే.. అంతరిక్ష యుద్ధానికి భారత్ పూర్తి వ్యతిరేకం. తొలినాళ్లలో చైనా కూడా ఇదే సిద్ధాంతాన్ని అవలంభించినా.. రెండేళ్లక్రితమే స్వయంగా నిర్దేశించుకున్న పరిధులను దాటేసింది. దీంతో.. ఇప్పుడు ఆ హద్దును చెరిపివేసుకోవాల్సిన అవసరం మనకూ వచ్చింది. ఈ పోటాపోటీగా ఉపగ్రహ విధ్వంసక ఆయుధాలను తయారు చేసుకోవడంతో.. యుద్ధం వచ్చేస్తుందని.. స్పేస్‌వార్ మొదలైందని భావించలేం. ఎందుకంటే.. శత్రుదేశంపైకి ఒకదేశం వెపన్‌ను ప్రయోగించిన కొన్ని క్షణాల్లోనే.. ఎదుటి దేశం నుంచి ప్రతిస్పందిన కచ్చితంగా వచ్చి తీరుతుంది. దీనివల్ల రెండు దేశాలకూ తీరని నష్టం వాటిల్లుతుంది. కాకపోతే.. మరోదేశం దాడి చేయకుండా ఉండాలంటే మాత్రం.. మనకు ఎదురుదాడి చేయగల సత్తా ఉందని చాటిచెప్పాలి. ఇప్పుడు భారత్ చేస్తోంది కూడా అదే. ఓ చెంప మీద కొడితే.. మరో చెంప చూపించమన్నాడు గాంధీ.. కానీ.. మొదటి దెబ్బే పడకూడదంటే.. మనమూ కొట్టగలమని ఎదుటివాడికి తెలియాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
how can you prevent a missile from approaching one of our satellites unless the missile is stationed in space? Am i missing something?
బుడుగు గారూ..
మన ఉపగ్రహాలపైకి దూసుకువస్తున్న మిసైల్స్‌ను రాడార్స్ ద్వారా ముందుగానే పసిగట్టగలిగే సామర్థ్యం ఈ వ్యవస్థ ద్వారా అందుబాటులోకి వస్తుంది. కాబట్టి వాటిని మధ్యలోనే మరో మిసైల్ ద్వారా అడ్డుకోవచ్చు.
ఇక రెండోది.. ప్రతీ దేశానికి శాటిలైట్లు ఎంతో అవసరం కాబట్టి.. మనం దాడి చేయగలం అని తెలిసినప్పుడు.. వారు దాడి చేయడానికి ధైర్యం చేయలేరు.
మీ డౌట్ తీరిందనుకుంటాను.. ఇంకా ఏమైనా ఉంటే అడగండి..