9, జనవరి 2010, శనివారం
యాభైఏళ్ల శ్రీవెంకటేశ్వర మహత్యం
కళియుగ ఆరాధ్య దైవంగా కోట్లాది భక్తుల హృదయాలలో కొలువైన శ్రీ వెంకటేశ్వరుని మహత్మ్యాలు కోకొల్లలు. ఒక్కో భక్తునికి ఒక్కో అనుభవం. అలాంటి ఆపదమొక్కులవాడి కథను తీసుకుని దర్శకుడు పి.పుల్లయ్య రెండుసార్లు సినిమాగా తీయడం విశేషం. పద్మశ్రీ పిక్చర్స్ బ్యానర్‌పై ‘శ్రీ వెంకటేశ్వర మహత్మ్యం’ చిత్రాన్ని ఆయనే నిర్మించి (పుల్లయ్య మేనల్లుడు వెంకటేశ్వర్లు నిర్మాతగా వ్యవహరించారు) దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 9 జనవరి 1960లో విడుదలైంది. అంటే నేటికి సరిగ్గా 50 ఏళ్లు.గోల్డెన్ జూబ్లీ ఇయర్‌లోకి అడుగు పెట్టిన ఈ చిత్రంలో యన్‌టిరామారావు (విష్ణువు, శ్రీనివాసుడు), సావిత్రి (పద్మావతి), ఎస్.వరలక్ష్మి(లక్ష్మీదేవి), గుమ్మడి (భృగువు), చిత్తూరు నాగయ్య (భావాజి), శాంతకుమారి (వకుళమాత), షావుకారు జానకి (ఎరుకలసాని), సూరిబాబు (నారదుడు) సంధ్య, రాజనాల, రేలంగి తదితరులు నటించారు. ఈ చిత్రంలో ప్రముఖ గాయకుడు ఘంటసాల ‘శేషశైలావాస శ్రీ శ్రీవేంకటేశా’ పాటను ఆలపిస్తూ కనిపిస్తారు. వెండితెరపై ఘంటసాల కనిపించడం అదే తొలిసారి.. అదే ఆఖరిసారి కూడా. పిఎల్ రాయ్ ఛాయాగ్రహణం నెరపిన ఈ చిత్రానికి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్ని అందించగా, ఆత్రేయ, మల్లాది రామకృష్ణశాస్ర్తి, ఆరుద్ర, నరసారెడ్డిలు గేయసాహిత్యాన్ని సమకూర్చారు.
ఇదే చిత్రాన్ని 14 జనవరి 1939లో పి.పుల్లయ్య దర్శకత్వంలోనే ఫేమస్ పిలిమ్స్ బ్యానర్‌పై రామయ్య నిర్మించారు. ఇందులో శ్రీనివాసునిగా సిఎస్‌ఆర్ ఆంజనేయులు, పద్మావతిగా శాంతాకుమారి నటించారు. ఈ చిత్రానికి కథ అందించింది పుల్లయ్యే. ప్రచారంలో ఉన్న కథకు కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి ఈ చిత్రాన్ని రూపొందించారు. పుల్లయ్యను వివాహం చేసు కున్న తర్వాత శాంతకుమారి నటించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమా కూడా ఎంతో ఘన విజయాన్ని సాధించింది. కథ విషయానికి వస్తే కలియుగంలో పాపం విస్తరించడం చేత కశ్యపమునివంటి వారు యజ్ఞయాగాదులచేత దేవుడికి మొరపెట్టుకుంటారు. ఈ క్రమంలో భృగుమహర్షి మహావిష్ణువువు దగ్గరకు వెళతాడు. ఆ సమయంలో విష్ణువు మహాలక్ష్మితో కూడి పరిసరాల్ని మరచిపోయి ఉంటాడు. భృగువు వచ్చిన సంగతిని కూడా గ్రహించడు. మహర్షికి కోపం వస్తుంది. దానితో విష్ణువు గుండెలపై తన్నుతాడు. మహర్షిని ప్రసన్నం చేసుకుని ఈ ఆగ్రహమంతా దేనికని అడుగుతాడు విష్ణువు. కలియుగంలో జరుగుతున్న అకృత్యాలను ఏకరవు పెడతాడు భృగువు.
జరిగిన సంఘటనను జీర్ణించుకోలేని లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచిపెట్టి భువికి దిగి వస్తుంది. ఆమెను వెతుక్కుంటూ విష్ణువు కూడా భూమికి వస్తాడు. అలా పద్మావతి, శ్రీనివాసులుగా భూమికి దిగివచ్చిన వారిద్దరూ వివాహం చేసుకోవడంతో కథ ముగుస్తుంది. 1957 సంవత్సరం డిసెంబరు నెలలో 5వ తేదీన మద్రాసులోని వాహిని స్టూడియోలో ఈ చిత్రం ప్రారంభమైంది. ఇదే స్టూడియోలో తిరుమల ఆలయం సెట్‌ని నిర్మించారు. షూటింగ్ చేస్తున్నన్ని రోజులూ ఈ విగ్రహానికి యూనిట్ వారు పూజలు నిర్వహించేవారట. షూటింగ్ అయిపోయాక కూడా దానిని అలాగే ఉంచేశారు. అప్పట్లో షూటింగ్ చూడటానికి మద్రాసు వచ్చేవారు తప్పనిసరిగా ఈ సెట్‌ని కూడా దర్శించుకుని పరవశించేవారట. ఈ సెట్‌తో పాటు అన్నామలై, తిరుపతి, ఊటి తదితర ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. దాదాపు రెండేళ్లకు పైగా ఈ సినిమా షూటింగ్ సాగింది. ఈ చిత్రానికి అప్పట్లోనే పదిలక్షల రూపాయలకు పైగా ఖర్చయ్యింది.
తెలుగులో విశేష విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని హిందీలో ‘భగవాన్ బాలాజీ’ పేరుతో డబ్ చేస్తే అక్కడ కూడా ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.మరో ప్రత్యేకమైన అంశం ఏమిటంటే ఈ చిత్రానికి ఆత్రేయ త్రిపాత్రాభినయం చేయడం. మాటలు రచయితగా, పాటల రచయితగా వ్యవహరిస్తూనే ఆకాశరాజు పాత్రలో నటించారాయన. యన్‌టిఆర్‌కి వెండితెర వేల్పుగా పేరు తెచ్చిన చిత్రాల్లో ఇది కూడా ప్రధానమైనది. ఆయన ఈ చిత్రంతో భగవత్ స్వరూపునిగా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. విడుదలైన ప్రతి థియేటర్‌లో ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. తిరుపతి వెంకన్న హుండీ నిండినట్టుగా నిర్మాతకు కనకవర్షాన్ని కురిపించింది. ప్రతి థియేటర్‌లోను వెంకటేశ్వరుని విగ్రహం ఏర్పాటు చేసి హుండిని కూడా పెట్టారంట. ప్రతిరోజూ ఆట మొదలకు ముందు ఆ విగ్రహానికి పూజాదికాలు నిర్వహించేవారంట. ప్రేక్షకభక్తుల వేసిన డబ్బులతో హుండీలు నిండిపోయేవంట.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
aanaaTi aanavaaLLu pustakaMlOMci mottaM teesi raasukunnaTTuMdi. please credit the author.
చాలా బాగా ఉన్నది మీ విశ్లేషణ. మునుపు తీసిన(14 జనవరి 1939లో పి.పుల్లయ్య దర్శకత్వంలొ ఫేమస్ పిలిమ్స్ వారి) విడియో మీ దగ్గర ఉన్నదా? ....విజయ్