9, జనవరి 2010, శనివారం
పండగెందుకొచ్చింది...
పండగమ్మ పండగ..
ఏడాది పండగ..
పండగెందుకొచ్చింది..
పప్పులుతింటానికొచ్చింది.
కూతురెందుకొచ్చింది..
కుడుములు తింటానికొచ్చింది
అల్లుడెందుకొచ్చాడు..
అరిసెలు తింటానికొచ్చాడు..
పండగమ్మ పండగ..
ఏడాది పండగ..
భోగి పండగకు వారం రోజుల ముందు నుంచే ఇలా మా పండగ సందడి మొదలయ్యేది. బడి నుంచి రాగానే పుస్తకాల బ్యాగ్‌ను ఇంట్లో ఓ మూలకి విసిరేసి.. వీధిలోకి పరిగెత్తేవాళ్లం. నలుగురైదుగురం కలిసి ఓ పెద్ద తట్ట పట్టుకుని వేటకు బయల్దేరేవాళ్లం. వేటంటే మరోటి అనుకునేరు.. భోగిమంట వేయడానికి కావల్సిన పిడకలు, కర్రలు తీసుకురావడానికనమాట. మా ఊళ్లో చాలావరకూ వ్యవసాయ కుటుంబాలే కాబట్టి.. అందరి ఇళ్లల్లోనూ కర్రలు, పిడకలు పెద్దఎత్తునే ఉండేవి. చాలామంది ఒక్కసారి పాట పాడగానే ఇచ్చేసేవాళ్లు. మరికొంతమంది మాత్రం ఇస్తే తప్ప పాడటం ఆపేలా లేరని.. కొంతసేపటికి ఎలాగొలా కదిలేవారు. కానీ, మరికొంతమంది ఉండేవాళ్లు.. వీళ్లకి మేమన్నా.. మా పాటన్నా మహామంట. ఒక్క పిడక కూడా వేసేవాళ్లు కాదు.
వారం రోజుల ముందు నుంచీ మా ప్రయత్నాలు ఎందుకంటే.. మా ఊళ్లో.. మా వీధిలోనే అతిపెద్ద భోగిమంటవేసేవాళ్లం. పైగా.. మూడు రోజుల దాకా ఆరకూడదన్నది మా లక్ష్యం. అందుకే.. వీలైనన్ని కర్రలు, పిడకలు పోగుచేసేవాళ్లం. మా కన్నా వయస్సులో కాస్త పెద్దవాళ్లు మాత్రం.. దుంగలు తెచ్చేవాళ్లు. ఈ వ్యవహారమంతా ఓ వైపు కొనసాగుతుండగానే.. మరోవైపు.. ఆవు పేడతో చిన్న చిన్న పిడకలు తయారు చేసుకునేవాళ్లం. వీటిలోనూ చాలా రకాలు ఉండేవి. వీటన్నింటిని ఎండబెట్టి.. దండలా తయారు చేసుకునే వాళ్లం.(వీటిని గోగిదండలనేవాళ్లం) ఇలా భోగిపండుగకు ముందురోజునాటికే.. సర్వంసిద్ధమయ్యేవన్నమాట.
ఏడాది పాటు.. ఎంతగానో ఇలా ఎదురుచూసే సంకురాత్రి.. తెల్లారేలోగా వస్తుందని... ఆ రాత్రంతా అసలు నిద్రేపట్టేది కాదు. తెల్లవారుఝామునే నాలుగింటికల్లా నిద్రలేచి.. ఓ వైపు చలి వణికిస్తున్నా భోగిమంట వేయడానికి పరుగులు తీసేవాళ్లం. భోగిమంట వేసి.. ఉవ్వెత్తున ఎగసిపడే ఆ మంటలకు చలికాగుతుంటే.. దాన్ని అనుభవించాలే తప్ప.. మాటల్లో చెప్పలేం. కాసేపు మంట కాగేసరికల్లా.. నీటిబిందెలు, కుండలు మంట చుట్టూ చేరిపోయేవి. నీళ్లుమరగడం ఆలస్యం.. తలస్నానం చేయించేది మా అమ్మ. కచ్చితంగా కుంకుడుకాయ పులుసుతోనే చేయాలని మా అమ్మ.. చేయనని నేనూ.. కాసేపు వాదించుకునేవాళ్లం. చివరకు అమ్మమాటే నెగ్గేది. తలపై కుంకుడుకాయ పులుసు పడేది. నా భయానికి తగ్గట్లే.. పులుసు కళ్లల్లోకి వెళ్లిపోయేది.. కళ్లు మండడం మొదలయ్యేది. ప్రతీ ఏడాదీ ఇదే తంతు. స్నానం అయిపోగానే.. నోట్లో ఉప్పుకళ్లు వేసి.. మంట తగ్గిపోతుందనేది అమ్మ. ఇక కొత్త బట్టలు తొడుక్కుని మళ్లీ భోగిమంట ముందు ప్రత్యక్షమయ్యే వాళ్లం. అందరి స్నానాలూ అయిన తర్వాత.. జాగ్రత్తగా ఉంచిన, గోగుదండలు దెచ్చి భోగిమంటలో వేసేవాళ్లం. అవి కాలి బూడిదైన తర్వాత.. దాన్ని తీసుకుని నుదుటన బొట్టు పెట్టుకునేవాళ్లం. ఇలా ఉదయం కార్యక్రమం పూర్తయ్యేది.
ఇక సంక్రాంతి అంటే పిండివంటలు ముందే తయారైపోతాయి కదా.. ఇక వాటిపై దండయాత్ర చేసేవాళ్లం, అరెసలు, బెల్లం బూందీ లడ్లు, ముఖ్యంగా సున్నుండలు మా టార్గెట్. సాయంత్రం దాకా ఎవో ఆటలు. అన్నట్లు చెప్పడం మరిచాను.. మా ఇంటి ముందు పే..ద్ద రేగి చెట్టు ఉండేది. భోగి రోజు సాయంత్రం ఏదో ఓ చిన్నపిల్లాడిని తీసుకురావడం.. భోగిపళ్లు పోయడమూ జరిగిపోయేది. రేగిపళ్లు కోసం కాదు కానీ.. వాటితో పాటు వేసే పావలా, అర్థరూపాయి బిళ్లలను దక్కించుకోవడానికి మాత్రం విపరీతమైన పోటీ.
భోగి గడిచి సక్రాంతి వచ్చేది. ఉదయాన్నే స్నానం.. కొత్త బట్టలు.. ఆ తర్వాత గాలిపటాలు. ఆ మరుసటి రోజు కనుమ. మా పక్క ఊళ్లో కోడిపందాలు జరిగేవి. మా ఇంటిలో రెండు పందెంకోళ్లు ఉండేవి. ఒక దాని పేరు డేగ. బంగారురంగులో పెద్దగా ఉండేది. దాన్ని సైకిలుమీద తీసుకువెళ్లడానికి మానాన్న దానికో చొక్కా కూడా కుట్టించాడు. ఇంకొకదాని పేరు గుర్తు లేదు కానీ.. సన్నగా, పీలగా ఉండేది, కానీ పందెంలో దిగిందంటే మాత్రం ఎంతపెద్దదైనా దానిముందు దిగదుడుపే. రెండుసార్లు పందెం గెలిచిందది.
మూడు రోజుల పండగైనప్పటికీ.. నాకు మాత్రం భోగి ఒక్కటే పండగ. ఆ ఒక్కరోజు కోసమే ఎంతగానో ఎదురు చూసేవాడిని. ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చేశాం. ప్రతీ ఏడాది సంక్రాంతి రాగానే నాకు ఎప్పుడెప్పుడు పండగ పాటే గుర్తొస్తుంది. ఒకటీ రెండు సార్లు మినహా ప్రతీ ఏడాది సంక్రాతికి మా ఊరు వెళుతుంటాను. కానీ మాలా పెద్ద పెద్ద భోగిమంటలు వేసేవాళ్లు కనిపించరు. భోగిమంటలు వేయడానికి పిడకలు, కర్రలు తెచ్చే పిల్లలూ కనిపించరు. అక్కడక్కడా చిన్న చిన్న భోగిమంటలు కనిపిస్తుంటాయి. పండగ రోజంతా.. ఇంట్లో జనమంతా టీవీలకే అతుక్కుపోతున్నారు. ఛానళ్లు వేసే సినిమాలు చూస్తూ రోజును గడిపేస్తున్నారు. పండగెప్పుడొస్తుందా అని ఎదురు చూసే నాకు.. ఇప్పుడు పండగెందుకొస్తుందా అని అనిపిస్తోంది. కాలాన్ని వెనక్కి తిప్పగలిగితే.. నా చిన్నతనంలోకి... అందులోనూ భోగిపండుగ రోజుకెళ్లి.. ఆగిపోవాలనుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
nice post. the way you ended it very very nice.