12, జనవరి 2010, మంగళవారం
భలే మంచి కాస్ట్‌లీ బేరము...
గ్రహణ వస్తుందంటే ఒకప్పుడు ఎంతో భయం. గ్రహణ సమయంలో బయటకు అడుగుపెట్టకూడందంటూ.. ఇళ్లకే పరిమితమైపోవడం.. చాలాకాలం పాటు మనదేశంలో ఉన్న ఆచారం. ఇటీవల కొంత మార్పు వచ్చినా.. ఇప్పటికీ.. దాన్ని ఆచరించేవారు ఎంతోమంది. పైగా గ్రహణం అయిపోగానే.. కీడు తొలగిపోయిందంటూ స్నానాలు చేయడం కూడా మన సంప్రదాయమే. గ్రహణం అంటే.. మన శాస్త్రాల ప్రకారం అశుభం. అందుకే.. ఆ సమయంలో అన్ని గుళ్లూ మూసివేస్తారు. కానీ.. ఈ గ్రహణమే ఇప్పుడు పెద్ద బిజినెస్ అయ్యింది. కార్పొరేట్ సంస్థలకు కొన్ని కోట్ల రూపాయలను
సంపాదించిపెడుతోంది...
సుదీర్ఘ గ్రహణం
కనుమ రోజు సూర్యగ్రహణం సంభవించనుంది. ఇది ఈ సహస్రాబ్దిలోనే సుదీర్ఘమైన సూర్య గ్రహణం. ఆఫ్రికా దేశం ఉగాండాలో తొలుత కనిపించే ఈ ఎక్లిప్స్... భారత్, బంగ్లాదేశ్, చైనా వాసులను అలరించనుంది. హిందూమహాసముద్రంలో 11 నిమిషాల 8 సెకన్ల పాటు కనిపిస్తుంది. ఇంత సుదీర్ఘమైన గ్రహణం... మరో 1033 ఏళ్లకు కానీ సంభవించదు.. అంటే.. మళ్లీ చూడగలేది 3043 సంవత్సరంలోనే అన్నమాట. పైగా ఇది అన్యూలర్ ఎక్లిప్స్. అంటే సూర్యుని మధ్య భాగాన్ని చంద్రుడు కప్పేస్తాడు. ఈ సమయంలో సూర్యుడు ఓ రింగ్‌లా కనిపిస్తాడు. సూర్యునికి భూమి అతి దగ్గరగా వచ్చి చంద్రుడు అత్యంత దూరంలో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ఎక్లిప్స్ సాధ్యం. ఈ మిలేనియంలో ఇదే తొలి ఆన్యూలర్ ఎక్లిప్స్. భారత్‌లోని కేరళ, తమిళనాడులో మాత్రమే గ్రహణం కనిపిస్తుంది. రామేశ్వరంలో మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాలకు ప్రారంభమయ్యే గ్రహణం 10 నిమిషాల 4 సెకన్ల పాటు ఉంటుంది. కన్యాకుమారి, నాగపట్నం, శివగంగలలో కూడా గ్రహణాన్ని చూడవచ్చు. తమిళనాడులో ఇంతకాలంపాటు గ్రహణం కనిపించటం 108 ఏళ్లలో ఇదే తొలిసారి. బంగ్లాదేశ్, మయన్మార్, టిబెట్, చైనాలలో కూడా గ్రహణం కనిపిస్తుంది.
మంచి బిజినెస్..
గ్రహణం ఇప్పుడు బిజినెస్‌గా మారిపోయింది. గ్రహణాలపై అపోహలు క్రమంగా తొలిగిపోతుండడంతో.. అరుదుగా జరిగే ఈ ప్రకృతి వింతను చూడడానికి జనం ఆసక్తి చూపుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఇదో టూరిజంగా మారిపోయింది. జూలై 12, 2009న సంభవించిన సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా ఈ విషయం బయటపడింది. దేశ విదేశాల నుంచి పాట్నా సమీపానికి వేలాది మంది వచ్చి.. గ్రహణాన్ని వీక్షించారు. కొంతమంది అయితే.. 39 వేల అడుగుల ఎత్తున మేఘాలతో దోబూచులాడుతూ గ్రహణాన్ని చూపించడానికి ప్రత్యేక విమానాలు కూడా ఏర్పాటు చేశారు. వీటికి పర్యాటకుల నుంచి మంచి స్పందనే లభించింది. ఆ స్పూర్తితోనే.. కనుమ రోజు వచ్చే గ్రహణంపై భారీగా బిజినెస్ చేసుకోవడానికి కొన్ని సంస్థలు సిద్ధమయ్యాయి. హిందూ మహాసముద్రంలోనే అధిక సమయం కనిపించనుండటం.. భారీ షిప్‌ల యజమానులు ఇప్పుడే కాసులు సంపాదించుకోవాలనుకుంటున్నారు. గ్రహణం చూడాలనుకునేవారి కోసం ప్రత్యేక నౌకను సిద్ధం చేస్తోంది స్పేస్ ఏజెన్సీ అనే సంస్థ. లూయిస్ క్రూయిజ్ అనే కంపెనీతో టైఅప్ అయిన ఈ సంస్థ... కొచ్చి నుంచి ప్రత్యేక నౌకను నడుపుతోంది. జనవరి 13న కొచ్చి నుంచే బయల్దేరే ఈ నౌక 14న మాల్దీవుల తీరానికి చేరుకుంటుంది. ఇక్కడే హిందూమహాసముద్రపు హోరు మధ్య ... సుదీర్ఘ సూర్యగ్రహాణాన్ని చూసే వీలు కలుగుతుంది. ఇక్కడ 10 నిమిషాల 20 సెకన్లపాటు సూర్యునికి, భూమికి మధ్య చంద్రుడు రానున్నాడు. 10 నిమిషాల పాటు ఉంగరంలా మారనున్న సూర్యుడిని సముద్రంలో చూడాలనుకుంటే ఖర్చు మాత్రం కాస్త ఎక్కువే అవుతుంది. ఇందుకోసం లూయిస్ క్రూయిజ్ 30వేల నుంచి 70వరకు వసూలు చేస్తోంది. 1200మందికి ఈ నౌకలో ప్రయాణించవచ్చు. సూర్యగ్రహణాన్ని స్పష్టంగా చూసేందుకు నౌకలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇందులో టెలిస్కోప్, ప్రత్యేకమైన కళ్లద్దాలు, ఫిల్టర్లు అందుబాటులో ఉంటాయి. వీడియో చిత్రీకరించాలని ముచ్చటపడేవారికి కూడా క్రూయిజ్ సిబ్బంది సహకరిస్తారు. మొత్తం మీద.. గ్రహణాన్ని చూడొద్దనుకునే రోజుల నుంచి.. చూడడానికి వేలాది రూపాయలు ధారపోసే రోజులు వచ్చేశాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి