26, నవంబర్ 2009, గురువారం
కంగుతిన్న కాంగ్రెస్
తొలిసారి జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలొచ్చాయి. గ్రేటర్ ఓటరు ఏ పార్టీకి పూర్తి మెజార్టీ కట్టబెట్టలేదు. ఎక్స్ అఫీషియో మెంబర్లు ఎక్కువగా ఉండడంతో.. సింగిల్‌గానే మెజార్టీ సాధిస్తామనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు పెద్ద షాకే. కేవలం 52 డివిజన్లను మాత్రమే కాంగ్రెస్ పార్టీ దక్కించుకోగలిగింది.
మేయర్ పీఠం దక్కాలంటే ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం వంద సీట్లు ఉండాలి. కానీ.. కాంగ్రెస్ ఆ మార్క్‌ను దాటలేకపోయింది. ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనూహ్యంగా పుంజుకున్న తెలుగుదేశం 45 స్థానాల్లో విజయం సాధించింది. పాతబస్తీలో ఎప్పటిలానే MIM తన సత్తా చూపించింది. ఆ పార్టీ 4౩ చోట్ల విజయభేరి మోగించింది. BJP-5 స్థానాల్లో గెలుపొందింది.. PRP ఒక్కసీటుతో సరిపెట్టుకోగా.. లోక్‌సత్తాకు సత్తా లేదని తేలిపోయింది మొత్తమ్మీద చూస్తే మేయర్ పదవికి అన్ని పార్టీలు దూరంగానే ఉన్నాయి. కాంగ్రెస్ - MIM లేదా TDP-MIM కలిస్తే తప్ప మేయర్‌పీఠాన్ని కైవసం చేసుకునే పరిస్థితులు లేవు.
కాంగ్రెస్‌కు షాకే..
శివారు ప్రాంతాల్లో కాంగ్రెస్ బాగా దెబ్బతిన్నది. కాంగ్రెస్ MLA సుధీర్‌రెడ్డి నియోజకవర్గం ఎల్‌బినగర్ పరిధిలోని 8 డివిజన్లలో ఏడింట ఆ పార్టీ ఓటమి పాలైంది. మంత్రి సబిత నియోజకవర్గం మహేశ్వరం కిందకు వచ్చే రెండు డివిజన్లూ టీడీపీ కైవసమయ్యాయి. జగన్ ప్రచారం చేసిన చాలాచోట్ల కాంగ్రెస్‌కు నిరాశతప్పలేదు. ఆయన ప్రచారం ప్రారంభించిన ఆర్‌కెపురంలో కూడా హస్తం వాడిపోయింది. మొత్తంమీద ఆ పార్టీ మేయర్ పదవికి చాలాదూరంలో నిలిచిపోయింది. ఆ పార్టీకి మొత్తం 31 ఎక్స్ అఫిషియో ఓట్లు ఉన్నాయి. దీంతో ఆ పార్టీ బలం 8౩కి చేరింది. మరో మూడుచోట్ల ఆ పార్టీ రెబల్స్ విజయం సాధించారు. వారిని కలుపుకున్నా ఆ పార్టీ మేయర్ పీఠానికి కొంతదూరంలోనే నిలిచిపోతుంది.
అస్తమించిన సూర్యుడు...
పోటీ చేయాలా వద్దా అన్న మీమాంసలోనే చివరి వరకూ గడిపిన ప్రజారాజ్యం.. అత్యంత ఘోరంగా ఓడిపోయింది. కనీసం 30నుంచి 40 స్థానాలపై కన్నేసిన PRP ఆశలు అడియాశలయ్యాయి. చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు.. ఒకే ఒక్కస్థానంలో విజయం సాధించగలిగింది. ఓల్డ్‌బోయినపల్లిలో ఆ పార్టీ అభ్యర్థి నర్సింహయాదవ్ విజయం సాధించారు. నగరంలోని ఏ డివిజన్‌లోనూ ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఉదయం ఫలితాలు వెలువడడం మొదలుపెట్టిన దగ్గర్నుంచి ఎక్కడా PRP అభ్యర్థులు లీడ్‌లో లేరు. దీంతో ఆ పార్టీకి ఒక్కసీటు కూడా దక్కదని అందరూ భావించారు. అయితే చివరకు ఓల్డ్‌బోయినపల్లిని ఆ పార్టీ గెలుచుకుని కాస్త ఊపిరి పీల్చుకుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి