30, నవంబర్ 2009, సోమవారం
తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ హైజాక్ చేస్తోందా?
తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ హైజాక్ చేస్తోందా? తెలంగాణ క్రెడిట్ కేసీఆర్‌కు దక్కకూడదనుకొంటోందా? తెలంగాణలో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం ద్వారా కాంగ్రెస్ నేతలు లాభం పొందాలనుకుంటున్నారా?
తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు చూసినా.. తెలంగాణ ఉద్యమ చరిత్రను పరిశీలించినా.. అందరికీ సహజంగానే కలిగే సందేహాలివి. మూడు దశాబ్దాల క్రితం మొదలైన తెలంగాణ పోరాటం కూడా.. కాంగ్రెస్ నేతల పన్నిన కుట్రలతోనే నీరుగారిపోయింది. పెద్దమనుషుల ఒప్పందాన్ని అమలు పర్చాలంటూ.. 1969 జనవరి 9న ఖమ్మంలో ఓ విద్యార్థి నిరహారదీక్షకు దిగడంతో.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలయ్యింది. ఇది క్రమంగా తెలంగాణలోని అన్ని జిల్లాలకు విస్తరించింది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. వీరి చొరవతోనే.. తెలంగాణ ప్రజాసమితి ఏర్పడింది. రాజకీయాలకు అతీతంగా ఉద్యమం మొదలైనా.. మధ్యలో మర్రి చెన్నారెడ్డి, కె.వి.రంగారెడ్డిలతో పాటు.. మరికొంతమంది నేతలు కూడా ఇందులో చేరడంతో.. రాజకీయ రంగు పులుముకొంది. జనవరి నుంచి.. సెప్టెంబర్ వరకూ కళాశాలలను.. తరగతులను వదిలి విద్యార్థులంతా ఉద్యమంలో పాల్గొన్నారు. మార్చి నుంచి తీవ్రరూపం దాల్చిన ఈ ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో, అగంతకుల దాడుల్లో దాదాపు 370 మంది బలయ్యారు. ఏప్రిల్ ఆరో తేదీన టీపీఎస్ హైదరాబాద్‌లో నిర్వహించిన ర్యాలీపై పోలీసులు జరిపిన కాల్పుల్లోనే యాభై మందికి పైగా విద్యార్థులు మరణించారు. ఈ కాల్పుల తర్వాత.. తెలంగాణలో హింసాత్మక ఘటనలు మరింత ఎక్కువయ్యాయి. మరో రెండేళ్ల పాటు సాగిన తర్వాత.. 1971 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో తెలంగాణలోని పది స్థానాలను గెలుచుకొని టిపీఎస్ చరిత్ర సృష్టించింది. కాకపోతే.. దేశవ్యాప్తంగా ఇందిరా కాంగ్రెస్ ఘన విజయం సాధిచండంతో.. టిపీఎస్‌ను ఆమె లెక్కచేయలేదు. ఇదే సమయంలో చెన్నారెడ్డి టిపీఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో.. ప్రత్యేక పోరాటం ముగిసిపోయింది. అయితే.. కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్న వాదనను.. ఇప్పటి సీనియర్లు అంగీకరించడం లేదు. ఇతర పార్టీలే ప్రజలను మోసం చేశాయని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చెబుతున్నారు. ఇలాంటి ఉద్యమాలు కాంగ్రెస్‌కు అలవాటేనంటున్నారు. ఇక కాంగ్రెస్‌లోనే కొంతమంది నేతలు చేస్తున్న ప్రకటనలూ.. సీనియర్ల తీరుపై అనుమానాలను కలుగ జేస్తున్నాయి. తెలంగాణలోని కొంతమంది నేతల వల్లే తెలంగాణ రావడం లేదంటూ నిజామాబాద్ ఎంపీ మధుయాష్కి ఆరోపణలు గుప్పించారు. ఇతర పార్టీల్లోని తెలంగాణ నేతలూ కలిసికట్టుగా పోరాడితే తప్ప ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదంటున్నారు. అంతేకాదు.. తెలంగాణ ఉద్యమంలో భాగం కావాలనుకుంటున్నారే తప్ప.. లీడ్ తీసుకోవడానికీ కాంగ్రెస్ సీనియర్లు సిద్ధంగా లేరు. అధిష్టానంతో పోరాడి.. ప్రత్యేక రాష్ట్ర్రాన్ని సాధించాలన్న ఆలోచనా లేదు. సోనియాగాంధీకి విన్నవించుకోవడం తప్ప.. డిమాండ్ చేసే అవకాశమే లేదు. పైగా వారిలో వారికే ఎన్నో భేషజాలు.. మరెన్నో అభిప్రాయ భేదాలు. అధిష్టానం దృష్టిలో చెడ్డ పేరు తెచ్చుకోకూడన్న ఆలోచనలు.. వీటి మధ్య.. ఢిల్లీ వెళ్లి వీరంతా కలిసికట్టుగా పోరాడే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. మొత్తం మీద చూస్తుంటే.. ఉద్యమం క్రెడిట్ ఒక్క టిఆర్‌ఎస్‌కు .. అందులోనూ కేసీఆర్‌కు మాత్రమే దక్కకూడదనే.. కాంగ్రెస్ నేతలు మళ్లీ గళమెత్తడానికి కారణంగా కనిపిస్తోంది. శాసనమండలిలో ప్రత్యేకంగా సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు ఇదే అభిప్రాయానికి వచ్చారు. ఉద్యమాన్ని మరోసారి హైజాక్ చేయడానికి సిద్ధమవుతున్నారు..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అవును ఖచ్చితంగా ఇది తెలంగాణ క్రెడిట్ ను హైజాక్ చేయడమే!!!
మానవ హక్కుల కమిషన్ చెబితేగాని కదలని యంత్రాంగ బలమున్న వలస పాలకుల క్రింద తెలంగాణ ప్రజలు మగ్గిపోతున్నారు - అనడానికి ఇంతకంటే రుజువేం కావలె? మానవ హక్కుల కమిషన్ ఆదేశిస్తేగాని ఒక తెలంగాణ ప్రజాప్రతినిధికి తగిన గౌరవం దక్కదన్న మాట. మరి మాములు జనం మాటేంటి?