27, అక్టోబర్ 2009, మంగళవారం
జనాన్ని మింగుతున్న రాకాసి బొగ్గు
దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థగా గుర్తింపుపొందిన సింగరేణి కాలరీస్.. ప్రజల పొట్టను కొడుతోంది. కంపెనీ విస్తరణకోసం అధికారులు వేస్తున్న అడుగుల కింద.. పచ్చని తెలంగాణ పల్లెలు నలిగిపోతున్నాయి. జనం జీవనం ఛిద్రమవుతోంది. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఓపెన్ కాస్ట్ గనుల విస్తరణ కోసం.. సింగరేణి ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. విస్తరణలో భాగంగా.. కొత్తగా పదకొండు ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులను తవ్వడానికి సింగరేణి సిద్ధమవడంతో.. అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో మొత్తం 109 గ్రామాలకు ఈ ముప్పు పొంచి ఉంది. మరి వీరంతా ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలి? ఎలా బతకాలి?
గనుల తవ్వకానికి సింగరేణి కాలరీస్‌ఇప్పటికే భూసేకరణను మొదలుపెట్టింది. గ్రామగ్రామాల్లో సర్వేలు జరిపింది. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా.. భూములు లాక్కోవడం తధ్యమన్న రీతిలో.. సింగరేణి అధికారులు ప్రవర్తిస్తుండడం.. స్థానికులను తీవ్రంగా కలవరపెడుతోంది. పోనీ పరిహారమన్నా.. మార్కెట్ ధరకు చెల్లిస్తారా అంటే.. ఆ పరిస్థితీ కనిపించడం లేదు. 2005లో విడుదలైన జీవో 68 ప్రకారమే.. ఇప్పుడు చెల్లింపులు చేస్తామని సింగరేణి నిష్కర్కగా ప్రకటించడం.. నిర్వాసితుల గుండెల్లో మంటలు రగిలించింది. అందుకే.. తిరుగుబాటు చేస్తున్నారు. తమ ఆస్తుల పరిరక్షణకు నడుం కడుతున్నారు. గోదావరి తీర ప్రాంతంలో ఉండే ఈ భూముల్లో.. ఏడాదికి రెండు పంటలు పండుతున్నాయి. ప్రాణాధారమైన ఈ భూములను.. సింగరేణి తన్నుకుపోవాలని చూస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేదే లేదని తేల్చిచెబుతున్నారు.
ఓపెన్‌కాస్ట్‌ల కింద.. కేవలం పంటపొలాలు మాత్రమే కాదు.. గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోనున్నాయి. ఇళ్లూ..బడులూ.. చెరువులు.. ఒక్కటేమిటి.. ఓపెన్‌కాస్ట్ పడిన చోట కనుచూపు మేరలో మానవనివాసం అనేది కనిపించకుండా పోతుంది. తరతరాలుగా.. గ్రామాలను అంటిపెట్టుకుని.. ఉన్నంతలో హాయిగా ఉంటున్న జనాన్ని వలసపక్షులను చేసి.. సింగరేణి తరిమేస్తోంది. అందుకే.. ఇప్పటివరకూ.. తెలంగాణేకే తలమానికమని సింగరేణిని ప్రస్తుతించిన జనం.. ఇప్పుడాపేరు వింటేనే మండిపడుతున్నారు. తమ జీవితాలను నాశనం చేస్తుందంటూ ఆవేదన వెళ్లగక్కుతున్నారు.
జనం మేలు మరిచి
నల్లబంగారాన్ని వెలికి తీసి... ప్రపంచవ్యాప్తంగా మన ఖ్యాతిని ఇనుమడింప చేసిన ఘనత సింగరేణి కాలనీది. బ్రిటిష్ పాలనలో ఖమ్మం జిల్లాలో మొదలైన బొగ్గుగనుల తవ్వకాలు.. 120 ఏళ్లుగా నిరంతరాయంగానే సాగుతున్నాయి. ఖమ్మం నుంచి కరీనంగర్,ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు క్రమంగా ఈ గనులు విస్తరించాయి. తొలినాళ్లలో పూర్తిగా భూగర్భం నుంచే బొగ్గు వెలికితీత జరిగేది. ఇలాంటివి 67 వరకూ గనులు సింగరేణి అధీనంలో ఉండేవి. ఓ దశలో దాదాపు లక్షా 20 వేల మంది కార్మికులు ఉన్నారంటే... ఎంత పెద్ద ఎత్తున స్థానికులకు ఉపాధిని ఈ సంస్థ అందించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. క్రమంగా పరిస్థితి మారిపోయింది. పూర్తిగా లాభాలపైనే దృష్టి పెట్టిన సింగరేణి యాజమాన్యం.. ఆదాయ మార్గాలను అన్వేషించింది. నిర్వహణ, బొగ్గు వెలికితీత కష్టమైన భూగర్భ గనులకంటే.. ఉపరితలంపైనే తవ్వకాల ద్వారా.. తక్కువ ఖర్చుతోనే బొగ్గు ఉత్పత్తి చేయవచ్చని గ్రహించింది. ఇలా 1989లోనే.. ఓపెన్‌కాస్ట్ విధానానికి సింగరేణి శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచి.. ఇప్పటిదాకా.. ఇలా 14 ఓపెన్‌కాస్ట్ గనులను సింగరేణి ఏర్పాటు చేసింది. ఈ ఐదేళ్లలోనే.. మూడు ఓపెన్‌కాస్ట్‌లను ఏర్పాటు చేసింది. మరో పదకొండింటికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇలా ఉపరితల గనులు పెరిగే కొద్దీ.. భూగర్భ గనులను మూసివేస్తూ వస్తోంది. ప్రస్తుతం 36 భూగర్భ గనుల్లో మాత్రమే బొగ్గు తవ్వకాలు జరుగుతున్నాయి. దీన్ని సాకుగా చూపించి.. దాదాపు 50 వేల మందిని ఉద్యోగాల నుంచి యాజమాన్యం తొలగించింది. సింగరేణికి.. జనానికి మధ్య ఉన్న అనుబంధం ఇక్కడి నుంచే విచ్చిన్నమవ్వడం మొదలయ్యింది.
అయితే.. కార్మికుల పొట్టకొట్టారన్న నిజాన్ని మాత్రం అంగీకరించడానికి సిద్ధంగా లేదు సింగరేణి కంపెనీ. భూగర్భ గనుల నుంచి ఒక్క మెట్రిక్‌టన్ను బొగ్గు వెలికి తీయడానికి దాదాపు 1900 రూపాయలు సింగరేణికి ఖర్చవుతోందన్నది అధికారుల వాదన. బయట మార్కెట్‌లో మాత్రం మెట్రిక్‌టన్ను బొగ్గు 1200 రూపాయలే పలుకుతోంది. అంటే.. అండర్‌గ్రౌండ్ మైనింగ్ ద్వారా మెట్రిక్‌టన్నుకు 700 రూపాయలు సింగరేణికి నష్టం వస్తోంది. అదే ఉపరితలం నుంచి బొగ్గు సేకరిస్తే.. మెట్రిక్ టన్నుకు కేవలం 850 రూపాయలే ఖర్చవుతుంది. పైగా ఓపెన్‌కాస్ట్‌ల నుంచి చాలా ఎక్కువ మొత్తంలో బొగ్గును.. అతి తక్కువకాలంలో సేకరించవచ్చు.2008-09 ఆర్థిక సంవత్సరంలో.. 36 భూగర్భ గనులనుంచి 13 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా.. 14 ఓపెన్‌కాస్ట్ గనుల నుంచి 37 మిలియన్ టన్నులకు పైగా బొగ్గును ఉత్పత్తి చేశారు. ఓపెన్‌కాస్ట్ ఉత్పత్తి ఎక్కువగా ఉండడం వల్లే.. నష్టాలను అధిగమించి.. సింగరేణికి లాభాలు కురుస్తానయని అధికారులు చెబుతున్నారు.ఏడాది 40 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి చేస్తున్న సింగరేణి.. ఈసారి మాత్రం.. 50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకోంది. అందుకు ఓపెన్‌కాస్ట్‌గనుల ఉత్పత్తిపైనే ప్రధాన దృష్టి పెట్టింది. వీలైనంత త్వరగా.. కొత్తప్రాంతాల్లో బొగ్గుఉత్పత్తి మొదలుపెట్టాలని ఉవ్విళ్లూరుతోంది.
ఓపెన్‌కాస్ట్‌తో నష్టమేమిటి?
ఓపెన్‌కాస్ట్ మైనింగ్ వల్ల.. సింగరేణి భారీగానే లాభాలందుతున్నాయి. ఒక్కో ఓపెన్‌కాస్ట్ గని.. వెయ్యి హెక్టార్లకు పైగా ఉంటుంది. ఇంత విశాలంగా ఉన్న ఈ ప్రాంతంలో.. బొగ్గు తవ్వకం కూడా చాలా సులువే. చాలావరకూ పనిని పూర్తిగా యంత్రాలే చేసేస్తాయి. బ్లాస్టింగ్‌లు కూడా పెద్ద ఎత్తున చేసుకోవచ్చు. పైగా తవ్విన చోటనుంచి బొగ్గును తరలించడమూ కష్టమైన పనేమీ కాదు. అందుకే సింగరేణి ఈ ఓపెన్‌కాస్ట్‌లపై విపరీతమైన ఆసక్తి కనబరుస్తోంది. అయితే.. ఈ విధానం వల్లే ఏర్పడే సమస్యలను మాత్రం గుర్తించడంలేదు. ఉపరితలంలో బొగ్గును తవ్వడం వల్ల.. ఈ ప్రాంతంలో వ్యవసాయం పూర్తిగా నాశనం కానుంది. భూగర్భ జలాలు అడుగంటిపోతాయి.
అయితే.. ఇక్కడి జనం పొట్ట గొట్టి.. సంపాదించే లాభాలు ఎవరికోసమన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది. సింగరేణి కోసం.. వేలాది ఎకరాలు త్యాగం చేస్తున్న ప్రజల కోసం.. లాభాల్లో ఒక్కశాతం కూడా కేటాయించడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు.. సింగరేణి ఏటా 500 కోట్ల రూపాయలను ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో చెల్లిస్తూనే ఉంది. ఇందులోనూ.. ఒక్కపైసా కూడా.. ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగించడం లేదు. పర్యావరణానికి కూడా.. ఈ విధానం ద్వారా ఎంతో నష్టం జరగనుంది. మైనింగ్ జరిగే సమయంలో వచ్చే దుమ్ముధూళి కారణంగా ఆ ప్రాంతంలో గాలి పూర్తిగా పాడవుతుంది. ఇక నీటికాలుష్యం సంగతి సరేసరి. అసలు.. దీనివల్ల జరిగే విధ్వంసం ఇంతని అంచనా వేయలేం.సింగరేణి మాత్రం ఈ విషయాలను పట్టించుకోవడంలేదు. పైగా.. ప్రజలు.. ప్రభుత్వం అనుమతితోనే ఈ ఓపెన్‌కాస్ట్ల్‌లు నిర్వహిస్తున్నామంటోంది. అయితే.. ఇటీవల కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రజాభిప్రాయసేకరణ జరిగినప్పుడు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవడం లేదు. పైగా.. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకిస్తున్న వారిని.. సమావేసానికి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారన్నఆరోపణలూ ఉన్నాయి. పైగా.. 1983లో సేకరించిన భూములకే ఇంతవరకూ పరిహారాన్ని సింగరేణి అందించలేదు. అప్పుడు భూములు కోల్పోయిన వారు.. వీధిన పడ్డారు. కోర్టుకేసులతో.. సింగరేణి జాప్యం చేస్తూనే వస్తోంది తప్ప.. వీరిని పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకే.. ఇప్పుడు భూములు ఇవ్వాలంటే జనం వెనకడుగు వేస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి