8, అక్టోబర్ 2009, గురువారం
మరో రామన్
Categories :
భారతీయ మేధోసంపత్తికి మరో ఘనమైన గుర్తింపు లభించింది. ప్రపంచ అత్యున్నత పురస్కారమైన నోబెల్ బహుమతి.. జీవరసాయన శాస్త్రంలో అరుదైన పరిశోధనలు చేసి.. విజయం సాధించినందుకు.... వెంకట్రామన్ రామకృష్ణన్‌కు అందింది.శతాబ్దాల తరబడి ఎంతోమంది ప్రయత్నించి విఫలమైపోయిన.. రైబోజోమ్ గుట్టును రామకృష్ణన్ విజయవంతంగా విప్పగలిగారు. ఈ పరిశోధనకు గానూ.. మరో ఇద్దరు శాస్త్రవేత్తలు.. థామస్ స్పీట్జ్, అదా యోనత్‌లతో కలిసి సంయుక్తంగా ఈ ఏటి రసాయనశాస్త్ర నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. మానవశరీరంలో కీలక పాత్ర పోషిస్తాయి రైబోజోమ్‌లు. డీఎన్‌ఏ సీక్వెన్స్‌ను ప్రోటీన్ సీక్వెన్స్ మార్చి.. కణజాలానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ఈ రైబోజోమ్‌లకు సంబంధించి పరమాణు రహస్యాలను వెంకట్రామన్ రామకృష్ణన్ బృందం ఒడిసి పట్టింది. అందుకే.. అత్యున్నత నోబెల్ పురస్కారం ఆయనకు అందివచ్చింది. అయితే.. ముందుగా సన్నిహితుల నుంచి ఈ వార్తను విన్నప్పటికీ నమ్మలేకపోయానంటున్నారు.. రామకృష్ణన్.
రైబోజోమ్‌లపై పరిశోధనలకు గానూ.. నోబెల్ బహుమతిని గెలుచుకున్న రామకృష్ణన్ స్వస్థలం తమిళనాడులోని చిదంబరం. తల్లిదండ్రులిద్దరూ శాస్త్రవేత్తలే. వెంకీ అని ముద్దుగా పిలుచుకునే.. వెంకట్రామన్ రామకృష్ణన్ కూడా వారి బాటలోనే పయనించారు. తొలినాళ్లలో భౌతికశాస్త్రాన్ని అధ్యయనం చేసినప్పటికీ.. ఆ తర్వాత మాత్రం.. జీవరసాయన శాస్త్రం వైపు మళ్లారు. బరోడాలో డిగ్రీ పూర్తి చేసుకుని.. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. ప్రస్తుతం కేంబ్రిడ్జ్‌లోని MRC మాలిక్యులర్ బయాలజీ లేబరేటరిలో సీనియర్ సైంటిస్ట్ పనిచేస్తున్నారు. అక్కడే.. ఈ రైబోజోమ్‌లపై కీలక పరిశోధనలు చేస్తున్నారు. రామకృష్ణన్‌కు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి రావడంపై.. దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మనదేశాన్ని వదలివెళ్లి చాలా కాలం అయినప్పటికీ.. ఇక్కడి వారితో ఆయన సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ బహుమతి.. జీవరసాయన శాస్త్రంలో పరిశోధనలను మరింతగా ప్రోత్సహిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. యూనివర్సిటీ ప్రొఫెసర్లు.
రామకృష్ణన్ పరిశోధనల వల్ల మనకొచ్చేదేమిటి?
మానవశరీరం మొత్తం కణాల నిర్మితం. మన శరీరంలో కొన్ని కోట్ల కణాలుంటాయి. మనం జీవించాలంటే.. ప్రోటీన్లు ఎంతో అవసరం. రైబోజోమ్‌ల ద్వారా ఈ ప్రోటీన్లు తయారవుతాయని సైంటిస్టులు కనుగొన్నారు గానీ.. ఎలా తయారవుతాయన్నది మాత్రం కనుక్కోలేకపోయారు. రైబోజోమ్‌ల బ్లూప్రింట్ తయారు చేయడం కూడా ఎవరికీ సాధ్యం కాలేదు. సరిగ్గా ఈ సమస్యపైనే దృష్టి పెట్టిన వెంకట్రామన్ రామకృష్ణన్ బృందం.. దాన్ని చేధించడంలో విజయం సాధించారు. ప్రతీకణంలోనూ ఉండే రైబోజోమ్‌ల ఉనికిని పసిగట్టడంతో పాటు వాటి.. అణునిర్మాణాన్ని కూడా ఆవిష్కరించారు. కణం అంటేనే.. అతి చిన్న అణువు. ఇక అందులో ఉండే రైబోజోమ్ సైజ్ ఎంత ఉంటుందో ఊహించుకోండి. ఒక్కమాటలో చెప్పాలంటే మాత్రం.. మీటర్లో వంద కోట్లో వంతు. రక్తంలో ఆక్సిజన్‌ను తీసుకెళ్లే హిమోగ్లోబిన్ నుంచి బ్యాక్టీరియాలను ఎదుర్కొనే.. యాంటీబాడీలు, ఇన్సులిన్ వంటి హార్మోన్లన్నీ.. ప్రోటీన్లే. ఒక్కో ప్రోటీన్‌ది ఒక్కో తరహా పని.. పనికి తగ్గట్లే ఆకారమూ వేరుగా ఉంటుంది. మన శరీరాన్ని పూర్తిగా నియంత్రించే.. ఈ ప్రోటీన్లను తయారు చేయడమే రైబోజోమ్‌ల పని. అత్యంత కష్టమైన వీటి పనితీరునే .. రామకృష్ణన్ ఆవిష్కరించారు. అంతేకాదు.. X-రే క్రిస్టిలోగ్రఫీ ద్వారా.. ఈ రైబోజోమ్‌ల త్రీడీ మ్యాప్‌ను కూడా తయారు చేయగలిగారు. రైబోజోమ్‌లో ఉండే లక్షలాది అణువుల నిర్మాణాన్ని కనిపెట్టగలిగారు. DNA ను mRNA గా మార్చడం.. ఆ తర్వాత దాన్ని ప్రోటీన్‌గా మార్చడం ఎలానో శాస్త్ర ప్రపంచానికి తెలియజెప్పింది.. ఈ పరిశోధన. దీని ఫలితంగా.. అంతుచిక్కని ఎన్నో వ్యాధులకు మందు కనుక్కోవడం సులభం కానుంది. రోగాలను కలిగించే బ్యాక్టీరియా పైనే.. నేరుగా దాడి చేసేలా ఇప్పుడు మందులు తయారవుతున్నాయి. అయితే.. ఇన్‌ఫెక్షన్ కలిగించే వ్యాధుల విషయంలో మాత్రం.. ఈ మందులు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. శరీరంలోని కణాల్లో రైబోజోమ్‌లు ఉన్నట్లే.. బ్యాక్టీరియాలోని కణాల్లోనూ రైబోజోమ్‌లు ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలోని రైబోజోమ్‌లను పనిచేయకుండా చేయగలిగితే.. బ్యాక్టీరియాను చంపేయవచ్చు. ఫలితం.. వ్యాధి తగ్గిపోతుంది. రైబోజోమ్ త్రీడీ మ్యాప్ రూపొందించడం ద్వారా.. హానికర బ్యాక్టీరియాలను అడ్డుకోవడం మరింత సులవవుతుంది. బ్యాక్టీరియాలను నిరోధించగలిగే కొత్తతరం మందుల తయారీకి మార్గం సులభమవుతోంది.
నోబెల్ దక్కించుకున్న భారతీయులు
ప్రపంచ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన.. నోబెల్ బహుమతి తొలిసారిగా దక్కించుకున్న భారతీయుడు విఖ్యాత కవి.. మన జాతీయం గీతం రచయత రవీంద్రనాథ్ ఠాగోర్. సాహిత్యంలో ఆయన చేసిన సేవలకు గానూ.. 1913లో ఈ పురస్కారం ఆయన్ను వరించింది.
నోబెల్ బహుమతి అందుకున్న రెండో వ్యక్తి.. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్. 1930లో నోబెల్ బహుమతిని ఆయన అందుకున్నారు. కాంతి ప్రయాణంలో ఫోటాన్లు ఎంతగా పరివ్యాప్తమవుతాయో కనుగొనుగొన్నందుకు భౌతికశాస్త్ర విభాగంలో ఈ బహుమానం దక్కింది. రామన్ ఎఫెక్ట్‌గా బౌతికశాస్త్ర రంగంలో పరిశోధనలను కొత్త పుంతలు తొక్కించింది ఈ ఆవిష్కరణ.
వైద్య శాస్త్ర్రంలోనూ భారతీయుల ప్రతిభకు నోబెల్ దాసోహమంది. 1968లో నోబెల్‌ను హరగోబింద ఖురానా అందుకున్నారు. జన్యువులను కనుగొనడం, మానవశరీరంలో ప్రోటీన్ సమ్మేళనాల పాత్రను గుర్తించనందుకు.. నోబెల్ ద్కకింది.
ఆల్బేనియాలో పుట్టినా.. మన దేశాన్నే ... తన సేవాకార్యక్రమాలకు కేంద్రంగా మార్చుకున్న మానవతామూర్తి మదర్ థెరిసాకు.. 1979లో నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపిక చేశారు.
నక్షత్రాల పుట్టుకపై పరిశోధనలకు చేసినందుకు గానూ.. సుబ్రమణ్యం చంద్రశేఖర్‌కు భౌతిక శాస్త్రంలో 1983లో నోబెల్ దక్కింది. భౌతికశాస్త్రంలో భారత్‌కు నోబెల్ దక్కడం ఇది రెండోసారి.
జనసంక్షేమం దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను చాటిచెప్పినందుకు గానూ.. 1998లో ఆర్థిక శాస్త్ర విభాగంలో అమర్త్యసేన్‌కు నోబెల్ దక్కింది. అమర్త్యసేన్ ప్రతిపాదించిన సిద్ధాంతాల కారణంగా.. ఐక్యరాజ్యసమితి కార్యాచరణకూడా మారిపోయింది.
ఇక 2001లో సాహిత్యానికి గానూ.. భారత సంతతికి చెందిన వి.ఎన్.నైపాల్‌కు, పర్యావరణ పరిరక్షణకు చేసిన సేవలకు గానూ 2007లో ఆర్.కె పచౌరికి.. నోబెల్ బహుమతులు వచ్చాయి. అయితే.. 1983 తర్వాత మళ్లీ సైన్స్‌లో నోబెల్ అందుకొని.. భారతీయ శాస్త్రవేత్త ప్రతిభను ప్రపంచం నలుదిక్కులకూ చాటిచెప్పారు వెంకట్రామన్ రామకృష్ణన్. అంతేకాదు.. సైన్స్‌లో నోబెల్ దక్కించుకున్న ముగ్గురు శాస్త్రవేత్తలు.. సర్. సి.వి.రామన్, సుబ్రమణ్యం చంద్రశేఖర్, వెంకట్రామన్ రామకృష్ణన్‌లు తమిళనాడుకు చెందినవారు కావడం మరో విశేషం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి