అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించడంలో పూర్తిగా విఫలమైన ప్రజారాజ్యం పార్టీ.. త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై దృష్టి సారించింది. ఇందుకోసం ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు మినహా మిగిలిన పార్టీలను కలుపుకుని సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతోంది. ముఖ్యంగా...
హైదరాబాద్‌లో మంచి ఓటు బ్యాంకు కలిగిన లోక్‌సత్తా పార్టీతో చెలిమి చేయాలని భావిస్తోంది. తదనుగుణంగా ఆ పార్టీ పావులు కదుపుతోంది. ముగిసిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో చతికిలబడినప్పటికీ.. గ్రేటర్ ఎన్నికల్లో కొత్త రక్తం ఎక్కించాలని చిరంజీవి భావిస్తున్నారు. ఈ స్థితిలో ఇప్పటి నుంచే చిరంజీవి తన ప్రయత్నాలు ప్రారంభించారు.
బలం చాటుకోవడానికి పొత్తులే శరణ్యమనే అభిప్రాయానికి వచ్చారు. ఇందుకోసం లోక్‌సత్తాతో పొత్తు పెట్టుకునేందుకు చర్చలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. లోక్‌సత్తా రాష్ట్రంలో చెప్పుకోదగిన ఓటు బ్యాంకు ఉంది. ముగిసిన ఎన్నికల్లో ఈ పార్టీకి నాలుగు నుంచి ఐదు శాతం ఓట్లు వచ్చాయి. ముఖ్యంగా, పట్టణ మధ్యతరగతి, యువత లోక్‌సత్తా పట్ల ఎక్కువ మొగ్గుచూపుతున్నారు.
దీంతో హైదరాబాద్‌లో లోక్‌సత్తాతో పొత్తు వల్ల తమకు కలిసి వస్తుందని చిరుతో పాటు పీఆర్పీ నేతలు భావిస్తున్నారు. అదేసమయంలో హైదరాబాద్‌లో గణనీయమైన ఓటు బ్యాంకు కలిగిన భారతీయ జనతా పార్టీతో కూడా చేతులు కలపాలని చిరు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అదేసమయంలో వామపక్ష పార్టీల్లో సీపీఎం జతకట్టినా కట్టకపోయినా.. సీపీఐ మాత్రం తన వెంటే వస్తుందని ఆయన నమ్మకంతో ఉన్నారు.
జాతీయ రాజకీయ సమీకరణాల దృష్ట్యా సీపీఎం.. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందువల్ల సీపీఐ రాష్ట్ర నాయకులు మాత్రం సీపీఎంతో చేతులు కలపడం కంటే.. పీఆర్పీతోనే పొత్తు పెట్టుకునేందుకు మొగ్గు చూపవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే సీపీఎం, సీపీఐల మధ్య మంగళగిరి మంటలు ఇంకా ఆరలేదు. మొత్తం మీద చిరంజీవి పొత్తులకు అర్రులు చాస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
15, జులై 2009, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
లోక్‌సత్తాకు అన్ని వోట్లు రాలేదనుకుంటా.. 1.5 - 1.6 శాతం దాకా సాధించినట్టుంది. అది మాత్రం తక్కువేమీ కాదనుకోండి.