ఫ్రెంచ్ జాతీయ దినోత్సవ (నేషనల్ డే) వేడుకలకు జరిగిన పెరేడ్‌లో భారత్‌కి చెందిన 400 మంది జవాన్లు పాల్గొన్నారు. మిలటరీ బ్యాండ్‌లపై 'సారే జహాన్ సే అచ్ఛా' అనే గీతాన్ని ఆలపించడం అపూర్వమైన, అరుదైన ఘట్టం. ఇరుదేశాల మధ్య మైత్రికి ప్రతీకగా ఈ కార్యక్రమానికి తొలి సారి భారత ప్రధాని ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మన్మోహన్‌సింగ్‌కు మాత్రమే ఈ అపూర్వమైన గౌరవం దక్కింది. జాతీయ దినోత్సవ వేడుకలకు విదేశీ ప్రముఖులను క్రమం తప్పకుండా ఆహ్వానించే...
జాతీయ దినోత్సవ వేడుకలకు విదేశీ ప్రముఖులను క్రమం తప్పకుండా ఆహ్వానించే సంప్రదాయం ఫ్రాన్స్‌కి లేదు. ఏవో కొన్ని సందర్భాల్లో మాత్రమే విదేశీ నాయకులను ఆహ్వానించిన దాఖలాలు ఉన్నాయి. ఈ సందర్భంగా జరిగిన పెరేడ్‌లో భారత్‌లోని త్రివిధ దళాల జవాన్లు 400 మంది పాల్గొనడం అరుదైన సంఘటన. మిలటరీ బ్యాండ్ మీద 'సారే జహాన్ సే అచ్ఛా'గీతాన్ని ఆలాపిస్తూ మన జవాన్లు సాగిన దృశ్యం భారత గణ తంత్ర దినోత్సవంనాడు ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో కన్నుల పండువగా సాగే పెరేడ్‌ని తలపింపజేసింది. ఫ్రెంచ్ సైనికులతో కలిసి వారు 1.5 కిలో మీటర్ల పొడవున కవాతు నిర్వహించారు. భారత సైన్యంలో అత్యంత ప్రాచీనమైన మహారాఠా రెజిమెంట్ ఈ పెరేడ్‌లో పాల్గొంది.1768లో ఏర్పడిన ఈ రెజిమెంట్‌ని రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నియోగించారు. ఆర్మీ బ్యాండ్ భూపాల్‌నీ, 'హంస్‌తే లూసై', 'వీర్ సిఫాయి' గీతాలను వినిపించింది. నౌకాదళం బ్యాండ్ 'జై భారతి', 'ఐఎన్‌ఎస్ విక్రాంత్' రాగాలను ఆలాపించింది.వైమానికి దళం బ్యాండ్ గీతాన్ని ఆలాపిస్తూ సాగిపోతున్నప్పుడు వీక్షకులు హర్షధ్వానాలు చేశారు.
ఫ్రెంచ్ జాతీయ దినోత్సవాన్ని 'బాస్టిలి డే' పిలుస్తారు. 1789లో జూలై 14వ తేదీన ఫ్రెంచ్ విప్లవానికి నాందిగా ఆనాటి ప్రజలు బాస్టిలీ జైలులోకి దూసుకుని వెళ్ళారు.15వ లూయీ చక్రవర్తి ఏకఛత్రాధిపత్యాన్నీ, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆనాడు ఇదే రోజున ప్రజలు తిరుగుబాటు చేశారు.అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరునకు పరాకాష్టగా జైలు బ్రేక్ సంఘటన చరిత్రలో శిలాక్షరంగా నిలిచిపోయింది. 1792లో సర్వసత్తాక ప్రతిపత్తిగల దేశంగా ఫ్రాన్స్ ఏర్పడిందిత. బాస్టిలీ డేని ఫ్రెంచ్ జాతీయ దినోత్సవంగా ఆనాటి నుంచి పాటిస్తున్నారు.
మన్మోహన్‌కి సర్కోజీ విందు
ఫ్రెంచ్ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడు మైకేల్ సర్కోజీ విందు ఏర్పాటు చేశారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం 12 బిలియన్ యూరోలకు చేరుకోవాలన్న లక్ష్యాన్ని నిర్దేసించారు. గడిచిన కొద్ది సంవత్సరాల్లో ఫ్రాన్స్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం ఏటేటా పెరుగుతోంది. అయితే, ఈ ఏడాది ఆర్థిక మాంద్యం కారణంగా తగ్గింది. మహారాష్ట్రలో రెండు అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటులో ఫ్రాన్స్ సహకారాన్ని అందిస్తున్న తరుణంలో ప్రధాని జరుపుతున్న ఫ్రాన్స్ పర్యటనకు ప్రాధాన్యం ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని జైతాపూర్‌లో 1650 మెగావాట్ల వంతున ఉత్పాదక సామర్ధ్యం కలిగిన రెండు అణు విద్యుత్ ప్లాంట్‌ల ఏర్పాటుకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పిసిఐఎల్), ఫ్రెంచ్ న్యూక్లియర్ కంపెనీ అరెవాలు కాంట్రాక్టును కుదుర్చుకున్నాయి. కాగా, ఫ్రెంచ్ నేషనల్ డే పెరేడ్‌కు కాంబోడియా అధ్యక్షుడు హ్యున్ సెన్, జర్మనీ అధ్యక్షుడు హోర్ట్స్ కోచ్లెర్‌లు కూడా అతిధులుగా హాజరయ్యారు
15, జులై 2009, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
చాలామంచి సమాచారం ఇచ్చారు. బాస్టిలీడే గురించి విన్నాను కానీ సరిగా తెలియదు. థాంక్స్