11, జులై 2009, శనివారం
భగ్గుమన్న చైనా
చైనా పశ్చిమ ప్రాంతంలో ఉన్న జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో మొదలైన మతఘర్షణలను చైనా ప్రభుత్వం ఎట్టకేలకు కంట్రోల్ చేయగలిగింది. ప్రధాన పట్టణాల్లో ప్రశాంత వాతావరణం నెలకొన్నప్పటికీ.. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం.. ఇప్పటికీ ఘర్షణ వాతావరణమే నెలకొంది. ఆందోళనకారులను అదుపుచేయడానికి భారీ సైన్యాన్ని చైనా ప్రభుత్వం.. జిన్‌జియాంగ్‌కు తరలించింది. వారంరోజుల క్రితం.. చైనా జిన్‌జియాంగ్ రాజధాని ఉరుంకిలో అల్లర్లు మొదలయ్యాయి. ఓ ఫ్యాక్టరీలో మొదలైన ఘర్షణ కాస్తా.. పెరిగి పెద్దదై.. రెండు జాతుల మధ్య ఘర్షణగా మారిపోయింది. జిన్‌జియాంగ్‌లో ఎటుచూసినా ....
ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిన్‌జియాంగ్‌లో ఎప్పటినుంచో ఉంటున్న యుగుర్లకు.. చైనాలో ఉండే హాన్ జాతీయులకు మధ్య ఈ దాడులు సాగుతున్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో.. భారీ ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించింది. ఇంతవరకూ దాదాపు 184 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి అదుపు తప్పడంతో.. చైనా ప్రభుత్వం చాలా తీవ్రంగా స్పందించింది. పారామిలటరీ బలగాలను భారీఎత్తున.. అల్లర్లు జరుగుతున్న ప్రాంతానికి పంపించింది. జిన్‌జియాంగ్ ప్రావిన్స్ ను పూర్తిగా భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. మీడియాకు కూడా ప్రావిన్స్‌లోకి అనుమతించడం లేదు. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న కస్గరం ప్రాంతం వరకే అనుమతిస్తున్నారు. పైగా శుక్రవారం రోజు.. మసీదుల్లో సామూహిక ప్రార్థనలను నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చాలామంది ఇళ్లకే పరిమితమైనప్పటికీ కొంతమంది మాత్రం.. మసీదులకు వెళ్లారు. ప్రభుత్వం అధికారికంగా చెబుతున్న విషయాలకు, యుగర్లు ఆరోపిస్తున్న దానికి భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. శాంతియుతంగా చేస్తున్న నిరసనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అదుపు చేసే నేపథ్యంలో ఇప్పటివరకూ 800 మందిని చంపారని ఆరోపిస్తున్నారు. ఏ రకంగా చూసినా.. చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతంలో మాత్రం.. రెండు వర్గాలమధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొనే ఉన్నాయి.
అల్లర్లకు కారణం ఏమిటి?
జిన్‌జియాంగ్ ప్రావిన్స్ జరుగుతున్నది కేవలం మత ఘర్షణలే అనుకోవడానికి వీల్లేదు. ఇది రెండు జాతుల మధ్య పోరాటం. ఒకరిపై మరొకరి ఆధిపత్యాన్నికి చిరకాలంగా సాగుతున్న ప్రయత్నం. జిన్‌జియాంగ్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని యుగుర్లు పోరాడుతుంటే.. తమ దేశంలో అంతర్భాగంగా మార్చేసుకోవడానికి కుటిలయత్నాలు చేస్తోంది చైనా ప్రభుత్వం. ఈ ప్రావిన్స్.. చైనాకు పశ్చిమ భాగంలో ఉంటుంది. ఈ ప్రాంతానికి పాకిస్తాన్, ఖజకిస్తాన్,పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఓవైపు.. మంగోలియా మరోవైపు సరిహద్దులు. ఇక్కడ ఉండేవారిని యుగుర్లుగా పిలుస్తారు. వీరి అచ్చమైన చైనీయులు కాదు. కొన్ని శతాబ్దాల క్రితం.. టర్కీ నుంచి వలస వచ్చిన ముస్లిం గిరిజన జాతే.. యుగుర్గుగా గుర్తింపుపొందారు. తమ సంస్కృతి ఇప్పటికీ పాటిస్తూవస్తున్నారు. టర్కిష్ భాషనే చాలామంది మాట్లాడుతుంటారు. శతాబ్ధం క్రితమే తూర్పు టర్కిస్థాన్‌గా వీరు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నప్పటికీ... చైనా దాన్ని గుర్తించలేదు. 1949లో ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న కమ్యూనిస్ట్ చైనా.. టిబెట్ తరహాలోనే స్వయంప్రతిపత్తి హోదాను ఇచ్చింది. జిన్‌జియాంగ్‌ను ఆర్థికంగా అభివృద్ధి చేయడంతో పాటు.. స్కూళ్లు, కాలేజీలు, ఫ్యాక్టరీలు నిర్మించి యుగుర్లను తమకు అనుకూలంగా మార్చుకోవచ్చని చైనా భావించింది. కానీ ఇది సాధ్యం కాకపోవడంతో.. చైనా నుంచి ఆ ప్రాంతానికి వలసలను ప్రోత్సహించింది. హాన్ చైనీయుల రాకతో.. స్థానికంగా అనేక వైషమ్యాలు తలెత్తాయి. చైనీయుల జనాభా క్రమంగా పెరిగి 40 శాతానికి చేరుకుంది. ఇదే సమయంలో యుగుర్ల జనాభా మాత్రం.. 45 శాతానికి పడిపోయింది. ఇక ఉద్యోగాల్లో ఉన్నత స్థాయి పదవులన్నీ చైనీయులకే దక్కుతున్నాయని యుగుర్లు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. మరోవైపు.. తమ భాష, సంస్కృతి సంప్రదాయాలను ప్రభుత్వం అణిచివేస్తుందన్న ఆగ్రహం ఎప్పటినుంచో యుగర్లలో అంతర్లీనంగా ఉంది. అవకాశం వచ్చినప్పుడల్లా అది బయటపడుతోంది. తాజా ఘర్షణలకు కూడా ఇదే కారణం. స్వతంత్ర దేశంగా జిన్‌జియాంగ్‌ను ప్రకటించాలని పోరాడుతున్న వారిని టెర్రరిస్టులంటూ ప్రచారం చేస్తోంది చైనా ప్రభుత్వం. వారిపై నిషేధం విధించింది. యుగుర్ల తరపున పోరాడడమే కాకుండా... వారికి ఆర్థికంగా సహాయసహకారాలందించిన.. రెబియా ఖదీరే ఈ మొత్తం గొడవలకు కారణమన్నది చైనా ఆరోపణ. ప్రస్తుతం ఆమె వాషింగ్‌టన్‌లో నివాసం ఉంటున్నారు. ఆయిల్ నిల్వలు.. సహజవాయు నిక్షేపాలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాన్ని చేజార్చుకోకూడని భావిస్తోంది చైనా. అందుకే.. ఈ ఆందోళనలకు అడ్డుకట్ట వేయడానికి తనకు తెలిసిన హింసాత్మక పద్దతులన్నింటినీ అవలంభిస్తోంది. అయితే.. మిలటరీ యాక్షన్ ద్వారా.. యుగుర్లను కంట్రోల్ చేయడం సాధ్యం కాకపోవచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి