సిఐడి మాయలో మాజీ ఎమ్మెల్యే
చెన్నై గ్యాంగ్ కోసం గాలింపు
అనుమానాస్పద ఫోన్ కాల్స్
రామారావు కేసులో రాజకీయ మలుపులు
కొవ్వూరు ఎమ్మెల్యే రామారావు ఎపిసోడ్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ఇంకో బలమైన సాక్షి తెరమీదకు రాబోతున్నాడు. ఇదంతా కట్టుకథలుగా తెలుగుదేశం పార్టీ కొట్టేస్తున్న తరుణంలో ఊహించని ఈ పరిణామం అన్ని వర్గాలను కంగు తినిపించే అవకాశం ఉంది. నిందితుడు రామారావు గురువు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు కథలో కీలక వ్యక్తి కాబోతున్నట్టు సమాచారం. ఈ సంఘటనపై ఆయన సిఐడి ఎదుట సాక్ష్యం చెప్పేందుకు రంగం సిద్ధమైంది. కళాశాలలో కొంతమంది విద్యార్థినులు తన వద్ద ఫిర్యాదు చేసినట్టు ఆయన పోలీసులకు వాగ్మూలం ఇవ్వొచ్చని ఓ సిఐడి అధికారి అభిప్రాయపడుతున్నారు. కారణాలు ఏవైనా టిడిపి వ్యక్తే ఈ కేసును బలపర్చడం ప్రభుత్వానికి ఊరటగా కన్పిస్తోంది. తాజా పరిణామం రాజకీయంగా కలకలం సృష్టించే వీలుందని పలువురు భావిస్తున్నారు.
కృష్ణబాబు తెలుగుదేశం పార్టీకి చెందిన వాడైనా, ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌తో మంచి సంబంధాలున్నట్టు తెలుస్తోంది. కొన్ని వ్యాపార లావాదేవీల్లోనూ ఆయన ప్రభుత్వం నుంచి మేలు పొందినట్టు సమాచారం. స్పృహ నర్సింగ్ కాలేజీ వ్యవహారంపై దళిత సంఘాలు ఆందోళన చేస్తున్నా, కృష్ణబాబు మాత్రం మౌనంగా ఉన్నారు. శిష్యుడిని సమర్థించిన దాఖలాలు లేవు. ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించినట్టు కన్పించలేదు. ఇవన్నీ ఇలా ఉంటే రెండు రోజులుగా సిఐడికి చెందిన ఓ సీనియర్ అధికారి కృష్ణబాబుతో ఈ కేసు విషయమై మాట్లాడినట్టు తెలియవచ్చింది. రాజకీయంగానూ ఆయనపై ఒత్తిడి ఉందని తెలుస్తోంది.
సీనియర్ రాజకీయ నాయకుడిగా దీనిపై ఆయన అభిప్రాయం తీసుకోవాలని సిఐడి అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో కొన్ని వాస్తవాలు ఆయన వెల్లడించే వీలుందని చెబుతున్నారు. అవేమిటి? ఎందుకు? అనే అంశాలను మాత్రం అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ముఖ్యమంత్రికి అతి సన్నిహితుడైన ఓ రాజకీయ నాయకుడు సైతం కృష్ణబాబును ఒప్పించేందుకు, ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటన చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇదే నిజమైతే రామారావు కథ మరో మలుపు తిరగడం ఖాయం.
సిఐడి అదుపులో డ్రైవర్?
బాధితుల ఫిర్యాదు తర్వాత సిఐడి అధికారులు ఎన్నో అడుగులు వేశారు. సంఘటన సమయంలో హాస్టల్‌లో ఉన్న కొంతమంది సిబ్బందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. తాజాగా ఆదివారం ఓ డ్రైవర్‌ను కస్టడీలోకి తీసుకున్నారని తెలియవచ్చింది. రామారావు కుమారుడు శేఖర్ తమను బెదిరించి ఓ వాహనంలో చెన్నై దాటించాడనేది ఫిర్యాదులోని కీలకాంశం. ఇందుకు ఉపయోగించిన ఓ ప్రైవేటు వాహనాన్ని అధికారులు గుర్తించారు. వాహనం ఓనరు, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. డ్రైవర్ ద్వారా అనేక విషయాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు నిడదవోలు నుంచి బయల్దేరిన వాహనం రెండు చోట్ల ఆగినట్టు, ఒక చెక్‌పోస్టులో నెంబర్ కూడా నమోదైనట్టు గుర్తించారు. చెన్నైకి వెళ్ళే మార్గం మధ్యలో ఒక హోటల్ వద్ద ఆపినట్టు తేలింది.
అక్కడ ఓ రూములో విద్యార్థినుల కొద్ది సేపు ఉంచారని, ఇంటికి వెళ్లాక ఏ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తగా ఉండాలని శేఖర్ వారికి చెప్పినట్టు వాహనం యజమాని సిఐడికి చెప్పినట్టు తెలిసింది. వాహనం డ్రైవర్ సాక్ష్యంతో శేఖర్‌ను అరెస్టు చేయవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. అదే విధంగా నిందితుల సెల్‌ఫోన్ నెంబర్లను కూడా అధికారులు వాకబ్ చేశారు. ఈ క్రమంలో కొన్ని కాల్స్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శేఖర్ సెల్ నుంచి అదే సమయంలో కొన్ని కాల్స్ చెన్నైకి వెళ్ళినట్టు తెలుస్తోంది. ఆ నెంబర్లు కలిగిన వ్యక్తులు శేఖర్ ఆదేశాలను అమలు చేశారా? బాధిత విద్యార్థినులను కేరళ పంపేందుకు సహకరించారా? అనే సందేహాలు సిఐడి వర్గాల నుంచి వస్తున్నాయి. చెన్నై గ్యాంగ్ కోసం సిఐడి అధికారులు వాకబు మొదలు పెట్టారు.
పెరుగుతున్న ఒత్తిడి
బాధిత విద్యార్థినుల రంగ ప్రవేశంతో రామారావు అరెస్టుకు ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటి వరకూ హోంమంత్రి, సిఐడి అధికారులు, రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని కలిసిన కేరళ విద్యార్థినులు ఆదివారం గవర్నర్‌ను కలిసారు. రామారావుపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కేసును వీలైనంత త్వరగా పరిష్కరించాలంటూ గవర్నర్ సిఐడికి సూచించారు. కాలేజీలో హత్య, అత్యాచారం జరిగినట్టు నిడదవోలు పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. అయితే ఇంతకాలం బాధితుల ఫిర్యాదు లేకపోవడం వల్ల పోలీసులు రామారావును అరెస్టు చేయలేదు. తాజాగా విద్యార్థినులు ఘటన పూర్వాపరాలను సిఐడికి లిఖిత పూర్వకంగా ఇచ్చారు. చట్ట ప్రకారం ఇక రామారావును అరెస్టు చేయాల్సి ఉంది. మరో పక్క మహిళా సంఘాలు, దళిత సంఘాలు ఉద్యమిస్తున్నారు. కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దర్యాప్తు ప్రక్రియను సిఐడి అధికారులు వేగవంతం చేస్తున్నారు. ముందుగా సోమవారం రామారావు, ఆయన కుమారుడు శేఖర్‌ను అరెస్టు చేసే అవకాశం ఉంది.
రామారావుపై గవర్నర్‌కు ఫిర్యాదు
హైదరాబాద్, జూలై 5 : కొవ్వూరు ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేరళ విద్యార్థినులు ఆదివారం రాష్ట్ర గవర్నర్ ఎన్‌డి తివారీని కోరారు. ఈ మేరకు వారు లిఖిత పూర్వక వినతి పత్రం ఆయనకు సమర్పించారు. స్పృహ నర్సింగ్ కాలేజీలో తమకు జరిగిన అన్యాయాన్ని బాధితులు అందులో పేర్కొన్నారు. కళాశాల యజమాని రామారావు తమను అనేక విధాలుగా లైంగిక వేధింపులు జరిపారని వివరించారు. తనకు సహకరించాలని బెదిరించారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు అక్కడకు వచ్చినప్పుడు భయంతోనే వాస్తవాలు వెల్లడించలేదని తెలిపారు. ఆ తర్వాత తమను రామారావు కొడుకు శేఖర్ బలవంతంగా ఇంటికి పంపాడని చెప్పారు. నిరుపేద కుటుంబానికి చెందిన తమకు ప్రభుత్వం ఉచిత విద్య అందించాలని వేడుకున్నారు. బాధితుల ఫిర్యాదు అందుకున్న గవర్నర్ ఈ కేసును త్వరగా విచారించాలని సిఐడి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కేరళ విద్యార్థినులు నీతూమల్ జాయ్, ధనలక్ష్మి, నిమిషా జాకబ్, లీనాలు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. తమకు జరిగిన సంఘటనపై శనివారం వారు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, సిఐడి అధికారులు, మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం విధితమే.
స్పందించిన కేరళ ప్రభుత్వం
తమ రాష్ట్రానికి చెందిన విద్యార్థినులపై జరిగిన లైంగిక వేధింపులను కేరళ ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకొచ్చింది. ఇందుకు బాధ్యుడైన స్పృహ నర్సింగ్ కాలేజీ యజమాని టీవి రామారావుపై సమగ్ర విచారణ జరిపించాలని కోరింది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి టికె శ్రీమతి ఆదివారం ప్రధాని మన్మోహన్ సింగ్, హోంమంత్రి చిదంబరంకు ఓ లేఖ రాశారు. సమగ్ర దర్యాప్తు జరిపి, వాస్తవాలు వెల్లడించాలని ఆమె కోరారు. బాధితులకు సరైన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు
6, జులై 2009, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి