6, జులై 2009, సోమవారం
ఈవీఎంలతో రిగ్గింగ్ ఈజీ
Categories :
వివాదాస్పద ఈవీఎంల ద్వారా రిగ్గింగ్ సాధ్యమేనని ఈవీఎంల నిపుణుడు, 1962 బ్యాచ్ ఐఎఎస్ అధికారి, ఢిల్లి ఐఐటి అలూమ్ని, ఢిల్లి మాజీ చీఫ్ సెక్రటరీ ఒమేష్ సైగల్ ఎన్నికల కమిషన్ ఎదుటే నిరూపించారు. శుక్రవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. ఒక కోడ్ నెంబర్‌ను మార్చడం ద్వారా ప్రతి అయిదు ఓట్లకు ఒక ఓటు అంతకు ముందు నిర్ణయించిన పార్టీ లేదా అభ్యర్థికి ఆటోమాటిక్‌గా పోలవుతుందని ఆయన నిరూపించినట్టు అధికార వర్గాల ద్వారా వెల్లడైంది. అంతకుముందు...
ఒమేష్ సైగల్ ఈవీఎంల ద్వారా రిగ్గింగ్ సాధ్యమేనని వివరిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ చావ్లాకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. సమాచార, సాంకేతిక నిపుణులు పలువురితో తాను సంప్రతించిన తర్వాతే రిగ్గింగ్ సాధ్యమని తేలిందని ఆయన పేర్కొన్నారు. మన దేశ ప్రజాస్వామ్యం దీనివల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆయన 'ది సండే ఎక్స్‌ప్రెస్'తో అన్నారు. ఈవీఎంల సోర్స్ కోడ్‌ను ఎవరు తెలుసుకున్నా రిగ్గింగ్ చేయడం సాధ్యమేనని జాన్ హోప్‌కిన్స్, రైస్ యూనివర్శిటీలలో జరిపిన పరిశోధనలలో వెల్లడైన అంశాన్ని ఆయన గుర్తు చేశారు. ఈవీఎంల ద్వారా రిగ్గింగ్ చేయడానికి పెద్ద నిపుణత ఏమీ అవసరం లేదని ఆయన అన్నారు. చిన్న ప్రోగ్రామర్ కూడా సోర్స్ కోడ్ తెలిస్తే మార్చి వేయవచ్చునని ఆయన పేర్కొన్నారు. ముందు పది ఓట్లు ఆయా పార్టీ లేదా అభ్యర్థికి పోలైన తర్వాత ప్రతి అయిదు ఓట్లకు ఒక ఓటు అదే పార్టీ లేదా అభ్యర్థికి ఆటోమాటిక్‌గా పోల్ అవుతాయని సైగల్ వివరించారు. ఓటు ఎవరికి పోలైనా బీప్ శబ్దం వస్తుందని, అయితే, ఎవరికి పోలైందీ తెలియదని ఆయన వివరించారు.
ఈవిఎంలపై అనుమానాలు వద్దుఃసిఈసి
ఈవీఎంల పనితీరుపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదని, వాటి విశ్వసనయతపై ఎన్నికల సంఘానికి పూర్తి నమ్మకం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈవిఎంల పనితీరుపై బిజెపి సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ అనుమానాలు వ్యక్తం చేసిన నేపధ్యంలో ఎన్నికల సంఘం ఈ వివరణ ఇచ్చింది. ఎన్నికలలో ఈవిఎంల వినియోగాన్ని సమర్ధిస్తూ సుప్రీం కోర్టు సహా పలు కోర్టులు తీర్పులు కూడా ఇచ్చాయని పేర్కొంది. 1990లో ఎన్నికల సంస్కరణలపై పార్లమెంటరీ కమిటీ నియమించిన సాంకేతిక సబ్‌కమిటీ ఇవిఎంల పనితీరు, సాంకేతిక సామర్థ్యాలను నిర్థారించిందని ఎన్నికల సంఘం పేర్కొంది. దేశంలో ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ పేపర్లనే వాడాలని పేర్కొంటూ అద్వానీ ఈవిఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ వివరణ ఇచ్చింది. ఇవిఎంల పనితీరుపై పలు పార్టీలు, నాయకులు వెలిబుచ్చిన సందేహాల నివృత్తికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం పేర్కొంది
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి