
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలంటే కేంద్రంలో ఎన్డీఎ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని టిఆరెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. తొలివిడత ఎన్నికల్లో పోలింగు సరళిపై పార్టీ నాయకులతో చర్చించిన కెసిఆర్ వారికి ఈ నిర్ణయాన్ని తెలిపారు. రాష్ట్రంలో తొమ్మిది లోక్ సభ స్థానాలకు పోటీ చేసిన టిఆరెస్ ఏడు నుండి ఎనిమిది నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉందని కెసిఆర్ ఆశిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో వామపక్షాల బలం గణనీయంగా తగ్గిపోయి, కాంగ్రెస్ పటిష్టమవుతుందనీ, మరో ఏడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలం బాగా తగ్గిపోతుందనీ కెసిఆర్ అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడులలో కాంగ్రెస్ బలహీనపడుతుందని భావిస్తున్నారు. ఈ అంచనాల ప్రకారం కేంద్రంలో ఎన్డీఎ అధికారంలోకి వస్తుందని, వంద రోజుల్లో తెలంగాణ అని బిజెపి ప్రకటించినందువల్ల తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్డీఎకే మద్దతు ఇవ్వాలని కెసిఆర్ పార్టీ నాయకులకు చెప్పారు.రాష్ట్రంలో మహాకూటమి ఆద్వర్యంలోనే ప్రభుత్వం ఏర్పాటవుతుందని, కేంద్రంలో ఎన్డీఎ ప్రభుత్వం ఏర్పడుతుందని కెసిఆర్ భావిస్తున్నారు. రాష్ట్రంలో మహాకూటమికి 160 స్థానాలు లభిస్తాయని, ప్రభుత్వం ఏర్పాటులో టిఆకెస్ కీలకంగా ఉంటుందని ఆయన అంచనా. మొత్తం 45 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన టిఆరెస్ కు 30 స్థానాల్లో గెలుపొందుతుందని చెప్పారు. కేంద్రంలో మూడో ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తెలుగుదేశం అందులో కీలకపాత్ర వహిస్తుందని చంద్రబాబు చెబుతుండగా, కెసిఆర్ మాత్రం మూడో ఫ్రంట్ మీద ఆశలు పెట్టుకోలేదు. లౌకికవాదానికి కట్టుబడిన బిజెపితో పొత్తు పెట్టుకోక పోయినా, వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామన్న ఆ పార్టీ మాటను విశ్వసిస్తున్నామని కెసిఆర్ చెప్పారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి