సమోసాలో ఆలూ ఎంతకాలం ఉంటుందో.. బీహార్ లో లాలూ అంతకాలం ఉంటాడంటూ తనగురించి తానే గొప్పలు చెప్పుకున్న మనిషి లాలూప్రసాద్ యాదవ్. ఆలూ లేకుండానూ సమోసాలు తయారవుతున్నట్లే, బీహార్ నుంచి లాలూ కూడా కనుమరుగవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది. దాణా కుంభకోణంలో దోషిగా తేలి జైలుపాలైన లాలూకు ముందున్నవన్నీ కష్టాలుగానే కనిపిస్తున్నాయి. మొదటిది అక్టోబర్ 3న శిక్ష ఖరారు కావడం. ఇదే కేసులో మూడేళ్లలోపు శిక్షపడేవారందరికీ రాంచీ కోర్టు సోమవారమే బెయిల్ మంజూరు చేసింది. లాలూకు మాత్రం బెయిల్ ఇవ్వలేదు అంటే, మూడేళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడే అవకాశాలున్నాయని సంకేతాలిచ్చినట్లే. ఇక ఐదేళ్లకన్నా ఎక్కువ శిక్ష పడితే మాత్రం బెయిల్ కోరే హక్కు కూడా లాలూకు ఉండదు. అంతేకాదు, శిక్ష ఖరారైన తర్వాత పైకోర్టుకు అప్పీల్ కు వెళ్లి బెయిల్ తెచ్చుకోవాలనుకుంటున్నాడు లాలూ. కానీ, ఇప్పటికిప్పుడు ఆ అవకాశం కూడా అతనికి దక్కేలా లేదు. రాంచీ హైకోర్ట్‌కు అక్టోబర్ 4 నుంచి 15 రోజుల పాటు దసరా సెలవలున్నాయి. అక్టోబర్ 3న తీర్పు వెలువడిన వెంటనే హైకోర్టును ఆశ్రయించే అవకాశం లాలూకి లేనట్లే అంటే.. అక్టోబర్ 19 వరకూ ఆయన జైల్లోనే గడపాలి. ఆ తర్వాతన్నా హైకోర్టు బెయిల్ ఇస్తుందా లేదా అన్నది డౌటే.
ప్రస్తుతం న్యాయనిపుణుల అంచనాల ప్రకారం లాలూకు ఐదు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు నేరచరితులపై ఇటీవలే ఇచ్చిన తీర్పు ప్రకారం జైలు శిక్ష పడితే అనర్హత వేటు పడి పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. శిక్ష పూర్తైన తర్వాత కూడా ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతి ఉండదు. కనీసం ఐదేళ్ల శిక్ష పడుతుందనుకున్నా, పదకొండేళ్ల పాటు ఎన్నికల్లో పోటీకి లాలూ దూరంగా ఉండాలి. ఇప్పటికే లాలూకు 65 ఏళ్లు. పదకొండేళ్ల తర్వాత అతని వయస్సు 76. ఐదేళ్ల కోసారే ఎన్నికలు జరిగితే, 2023లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ లాలూకు పోటీ చేసే అవకాశం ఉండదు. పైగా అప్పటికే వయస్సు మీదపడుతుంది కాబట్టి, ఉపఎన్నికలను సృష్టించుకుని పోటీ చేసే శక్తి కూడా ఉండకపోవచ్చు. ఓ రకంగా లాలూ రాజకీయ జీవితానికి దాణాకుంభకోణమే చరమగీతం పాడుతోందని చెప్పుకోవచ్చు.
1, అక్టోబర్ 2013, మంగళవారం
లాలూ ఛాప్టర్ క్లోజ్
Categories :
BIHAR . FODDER SCAM . LALU PRASAD YADAV . POLITICS . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి