12, ఫిబ్రవరి 2012, ఆదివారం
భారత్ ను గెలిపించిన ధోనీ
కూల్ కెప్టెన్ ధోనీ ఆపదలో ఆదుకున్నాడు. ముక్కోణపు సిరీస్ లో భాగంగా అడిలైడ్ లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో భారత్ కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. మొదట్లో ఎన్నో బంతులను వృథా చేసిన కెప్టెన్.. చివరి ఓవర్లో మాత్రం రెచ్చిపోయాడు. ఓటమి ఖాయం అనిపించిన తరుణం నుంచి.. గెలుపు దిశగా నడిపించాడు. అసలు చివరి ఓవర్లో ఏం జరిగిందంటే...
బంతులు.. 6.. లక్ష్యం.. 13 పరుగులు..
1. తొలి బంతికి అశ్విన్ స్ట్రైకింగ్ లో ఉన్నాడు. షాట్ మిస్ అయ్యింది. పరుగులేమి రాలేదు.
2. ఇంకా ఐదు బంతుల్లో 13 పరుగులు చేయాలి. అశ్విన్ మిడ్ వికెట్ దిశగా బంతిని తరలించాడు. రెండో పరుగును ధోనీ వద్దన్నాడు.. సింగిల్తోనే సరిపెట్టాడు..
3. నాలుగు బంతులు 12 పరుగులు. అవతల బౌలింగ్ చేస్తోంది అప్పటికే మూడు కీలక వికెట్లు తీసిన మెక్ కే. ధోనీ బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. అందర్లోనూ టెన్షన్ మొదలయ్యింది. మెక్ కే చేతుల్లోంచి బంతి జారడం.. అది ధోనీ బ్యాట్ తగిలి గాల్లోకి లేవడం.. లాంగ్ ఆన్ దిశలో వెళ్లి బౌండరీ అవతల పడడం.. చకచకా జరిగిపోయాయి. అందరిలోనూ ఒక్కసారిగా ఉత్సాహం..
4. మూడు బంతులు.. ఆరు పరుగులు.. లక్ష్యం కాస్త తేలికయ్యింది. మెక్ కే ఈ సారి ఫుల్ టాస్ బాల్ వేశాడు. సిక్స్ బాదిన ఊపులోనే ధోనీ బ్యాట్ ఝలిపించాడు. టీవీలో మ్యాచ్ చూస్తున్న వారంతా సిక్స్ అని అనుకుంటున్న సమయంలో డీప్ స్క్వేర్ లెగ్లో బౌండరీ లైన్ కు కాస్త ముందు క్యాచ్ పట్టాడు.. అందర్లోనూ ఒక్కసారిగా నిస్సత్తువ. కానీ.. అది నో బాల్. ఎక్కువ ఎత్తులో వేయడంతో దాన్ని నోబాల్ గా ప్రకటించాడు ఎంపైర్. అప్పటికే రెండు పరుగులు తీసేశాడు ధోనీ. అందర్లోనూ మళ్లీ ఉత్సాహం.
5. మూడు బంతులు.. మూడు పరుగులు. మళ్లీ అందర్లో ఊపొచ్చింది. ఇక లక్ష్యం తేలిక పడింది. కానీ, అవతల ఉంది ఆస్ట్రేలియా. మెక్ కే వేసిన బంతిని ఆన్ సైడ్ లో నో మ్యాన్స్ ల్యాండ్లోకి నెట్టిన ధోనీ చక చకా పరుగులు తీయడం మొదలుపెట్టాడు. ఫోర్ వెళ్లకుండా వార్నర్ దాన్ని ఆపినా.. అప్పటికే మూడు పరుగులు తీసిన ధోనీ.. విజయగర్వంతో వికెట్ ను పీకాడు.. అంతే.. భారత్ గెలుపు.. జనంలో ఊపు..
కొసమెరుపు: 9 ఓవర్లలో కేవలం 39 పరుగులు మాత్రమే ఇచ్చి.. సెహ్వాగ్, కోహ్లీ, గంభీర్ వికెట్లను తన ఖాతాలో వేసుకుని టీమ్ ఇండియాను ఒత్తిడిలోకి నెట్టేసిన మెక్ కేనే చివరి ఓవర్లో ఒత్తిడికి లోనయ్యాడు.. భారత్ గెలుపుకు బాటలు పరిచాడు.. మరో విషయం.. గంభీర్ చేసిన 92 పరుగులు ఈ మ్యాచ్ లో విజయానికి కారణంగానే చెప్పొచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి