తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు తీవ్రస్థాయికి చేరింది. చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించేదెవరన్న దానిపై చర్చ జోరందుకొంది. పార్టీ ముందు కనిపిస్తున్న దారులు రెండే.. ఒకటి చంద్రబాబు తనయుడు లోకేశ్ వైపైతే.. మరొకటి హరికృష్ణ తనయుడు ఎన్టీఆర్. మరి వీరిద్దరిలో టీడీపీ పగ్గాలు చేపట్టేదెవరు..? అసలు టీడీపీలో ఇప్పుడు వారసత్వ పోటీ తెరపైకి రావడానికి కారణం ఏమిటి?
నారా వర్సెస్ నందమూరి
టీడీపీలో కుటుంబ పోరాటం
వారసత్వం తెచ్చిపెట్టిన వివాదం..
నాయకత్వం కోసం రెండు కుటుంబాల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం
బరిలోకి వారసులొచ్చారు..
ఓ వైపు జూనియర్ ఎన్టీఆర్..
మరో వైపు నారా లోకేశ్
వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నారు..
ఎన్టీఆర్ మనుమడన్న బలం జూనియర్‌ది
చంద్రబాబు తనయుడన్న బలం లోకేశ్‌ది
పార్టీ పగ్గాలు ఎవరికి చిక్కుతాయి..? ఎన్టీఆర్‌కా..? లోకేశ్‌కా..?
టీడీపీలో ప్రధాన చర్చ ఇదే.. భవిష్యత్తులో పార్టీని నడిపించబోయేది ఎవరు? చంద్రబాబు ఏం చేయబోతున్నారు..?
తెలుగుదేశం పార్టీని తన చేతుల్లోనుంచి జారిపోకుండా ఉంచుకోవాలనుకుంటున్న చంద్రబాబు.. నాయకత్వ మార్పుకు సిద్ధమవుతారా..?
టీడీపీలో అప్పుడప్పుడూ హడావిడి చేసే హరికృష్ణ, తన కొడుక్కి పట్టం కట్టించుకోగలుగుతారా..?
వాస్తవానికి ఇప్పుడు ఎన్నికలు లేవు.. టీడీపీ నాయకత్వం మారాల్సిన అవసరమూ లేదు.. నాయకత్వంపై పార్టీలో భిన్నాభిప్రాయాలూ లేవు.. మరి వారసత్వ పోటీ ఎందుకొచ్చింది..? పార్టీలో అంతా సవ్యంగానే ఉన్నా, ఫ్యామిలీలోనే పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. కలిసికట్టుగా పార్టీని నడిపించిన రెండు కుటుంబాల్లో మళ్లీ ఆధిపత్యపోరాటం మొదలయ్యింది. చంద్రబాబుకు వారసుడిగా ఎవరు వస్తారన్నదానిపై మొదలైన వివాదం... మలుపులు తిరుగుతోంది.. టీడీపీలోనూ విబేధాలను రేకెత్తించింది. వారసత్వ పోరును తెరపైకి తెచ్చిపెట్టింది. మరి చంద్రబాబుకు వారసుడయ్యేది ఎవరు..? తనయుడు చంద్రబాబా.. మేనల్లుడు ఎన్టీఆరా..?
ఎన్టీఆర్ ప్రయత్నాలు
ఎన్టీఆర్.. టాలీవుడ్ టాప్ హీరో. తాత వారసత్వాన్ని అందిపుచ్చుకుని వెండితెరను ఏలుతున్న యంగ్ టైగర్.. వరసగా సినిమాలు చేయడంలో.. తన తోటి హీరోలందరినీ మించిపోయాడు ఎన్టీఆర్. క్లాస్,మాస్, ఫాంటసీ సినిమాలు చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.
ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు టార్గెట్‌ను మార్చుకున్నాడు. టాలీవుడ్‌లో టాప్‌హీరోగా ఎదిగిన జూనియర్.. ఇక రాజకీయాల్లోనూ రాటుదేలాలనుకుంటున్నాడు. అందుకే.. తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై దృష్టి పెట్టాడు. వీలైనంత త్వరగా, టాప్ లీడర్ అవ్వాలనుకుంటున్నాడు. టీడీపీలో తన హవా సాగడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తాతరూపం పుణికిపుచ్చుకున్న ఎన్టీఆర్.. తెలుగుదేశం పార్టీకి ఎప్పటినుంచో తన సహాయాన్ని అందిస్తున్నాడు. ఎన్నికల్లో ప్రచారం చేశాడు. అద్భుతమైన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకున్నాడు. 2009 ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ ప్రసంగాలు చూస్తే.. అతను కేవలం సినిమా హీరో మాత్రమే అని ఎవరూ అనుకోలేదు.. ఆ ప్రసంగాలే.. జూనియర్ ఎప్పటికైనా రాజకీయాల్లోకి వచ్చేస్తాడన్న సంకేతాలను అందించింది.
లోకేశ్ అడుగులు
నారా లోకేశ్. చంద్రబాబు తనయుడు. ఇంతవరకూ ఫ్యామిలీ బిజినెస్‌నే చూసుకున్నా, గత ఎన్నికల నుంచీ పార్టీ వ్యవహారాల్లోనూ పాలుపంచుకుంటున్నారు. టీడీపీ ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేసుకున్న నగదు బదిలీ స్కీంను.. లోకేశే ప్రతిపాదించారన్న ప్రచారమూ జోరుగా సాగింది. ఇప్పటివరకూ తెరవెనుక పాత్ర పోషించిన లోకేశ్, ఇకపై తెరముందు కూడా కనిపించాలనుకుంటున్నారు. తన తండ్రి బాటలోనే నడవాలని లోకేశ్ డిసైడ్ అయిపోయారు. చంద్రబాబు తర్వాత టీడీపీ పగ్గాలు అందుకోవాలనుకుంటున్నారు.. దీనికి బలం చేకూర్చే సంఘటనలూ ఇటీవల కొన్ని జరిగాయి.
2014 ఎన్నికల నాటికి టీడీపీలో క్రియాశీల నేతగా లోకేశ్ ఎదగాలనుకుంటున్నారు. దీనికోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీపై తన పట్టును మరింతగా పెంచుకోవాలన్నది జూనియర్ ప్లాన్. లోకేశ్‌కు చంద్రబాబు మద్దతుంటే, ఎన్టీఆర్‌కు నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. వీరిద్దరిలో ఆధిపత్యం ఎవరికి దక్కుతుందన్నదే ఇప్పుడు టీడీపీలో జోరుగా సాగుతున్న చర్చ.
వారసులెవరు?
తెలుగుదేశం పార్టీ పగ్గాల కోసం వీరిద్దరూ పోటీ పడుతున్నారు.. కాదు కాదు.. పోటీ పడేలా చేశారు. ఇలా చేసింది ఎవరు..? రెండు కుటుంబాలు.. ఒకటి నారా కుటుంబం.. మరొకటి నందమూరి కుటుంబం..
లోకేశ్, ఎన్టీఆర్‌లను తరచి చూస్తే ఇద్దరి వ్యక్తిత్వాల్లోనూ ఎంతో వైరుధ్యం కనిపిస్తుంది. సినీ హీరో కావడం, సీనియర్ ఎన్టీఆర్‌ను పోలి ఉండడం.. జూనియర్‌కు కలిసొచ్చే అంశాలు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా అభిమానులు బ్రహ్మరథం పడతారు. అద్భుతమైన వాక్చాతుర్యం ఎన్టీఆర్‌కున్న అదనపు అర్హత. ఆవేశం, ఆవేదన కలగలిపి మాట్లాడే ఎన్టీఆర్.. కాస్త కష్టపడితే టాప్ లీడర్‌గా ఎదగ గలడు. అయితే.. పార్టీని నడపాలంటే ఎంతో చాణక్యం కావాలి. వ్యూహప్రతివ్యూహాలు పన్నాలి. ఎన్టీఆర్‌కు ఇదే మైనస్ కావచ్చు.
ఇక లోకేశ్ సంగతికి వస్తే, కంప్లీట్‌గా బిజినెస్ మ్యాన్. ఎన్టీఆర్‌లా జనంలోకి వెళ్లలేడు. జనాన్ని ఆకర్షించలేదు. అయినా.. వ్యూహప్రతివ్యూహాలు వేయడంలో దిట్ట. ఈ విషయంలో తండ్రే ఆదర్శం. ఎన్టీఆర్‌లా మాస్ ఇమేజ్ లేకపోయినా, మేనేజ్ చేయడంలో మాత్రం లోకేష్‌దే పై చేయి. పైగా, టీడీపీలో అంతా చంద్రబాబుకు కావల్సినట్లే జరుగుతుంది కాబట్టి, పార్టీ పగ్గాలు కూడా లోకేశ్‌కే దక్కే అవకాశాలున్నాయి. చంద్రబాబు ఆశిస్తున్నదీ అదే.
2009 ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ దూకుడు చూసిన తర్వాత చంద్రబాబులో అంతర్మథనం మొదలైఉండొచ్చు. ఎప్పటికైనా ఎన్టీఆర్ టీడీపీలో ప్రధాన లీడర్‌గా ఎదుగుతారన్న అంచనాలు కూడా చంద్రబాబును తొందరపడేలా చేసి ఉండొచ్చు. అందుకే, తన తనయుడు లోకేశ్‌ను పార్టీలోకి రప్పించే ప్రయత్నాలను మొదలుపెట్టారు. కుప్పంలో ప్రచారబాధ్యతలను అప్పజెప్పారు.
తన వారసుడిగా లోకేశ్‌ను ప్రకటించడం ఒక్కటే చంద్రబాబుకు మిగిలింది. ఆ పని చేసేస్తే, పార్టీలో అతనికి సపోర్ట్‌ను పెంచొచ్చు. అయితే.. దానికి అనువైన సమయం మాత్రం ఇంతవరకూ రాలేదు. రైతుదీక్ష సమయంలోనే, లోకేశ్‌ను వారసుడిగా ప్రకటించాలనుకున్నారు చంద్రబాబు. కానీ, అప్పుడు తొందరపడితే, వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో వెనక్కి తగ్గారు. అయినా, లోకేశ్ మాత్రం దీక్షా శిబిరం వద్దే ఉంటూ .. తండ్రి తర్వాత తానేనన్న సంకేతాన్ని ఇచ్చారు.
ఈ సంఘటన నందమూరి కుటుంబంలో కలకలాన్ని సృష్టించింది. సీనియర్ ఎన్టీఆర్ నుంచి పార్టీ పగ్గాలను చేజిక్కించుకున్న చంద్రబాబు, ఎప్పటికైనా మళ్లీ తమకే అప్పజెప్పుతారని హరికృష్ణ అండ్ ఫ్యామిలీ ఎన్నో ఆశలతో ఉంది. కానీ, చంద్రబాబు తీరు చూసిన తర్వాత, తమకు ఇక ఛాన్స్ రాదన్న విషయం అర్థమయ్యింది. దీంతో, ఎన్టీఆర్‌కు పార్టీలో పట్టు తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. కృష్ణా జిల్లాలో దేవినేని ఉమ, వల్లభనేని వంశీల మధ్య వివాదానికీ ఓ రకంగా ఇదే కారణం. ఎన్టీఆర్‌కు సన్నిహితులైన నాని, వంశీలు తిరగబడడం ద్వారా, నారా, నందమూరి కుటుంబాల మధ్య అగాధం పెరుగుతుందన్న విషయాన్ని బయట పెట్టారు. చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి, పార్టీలో హరికృష్ణ పెత్తనం సాగేలా చేసుకోవాలనుకున్నారు. కానీ, చంద్రబాబు వ్యూహంతో సీన్ రివర్స్ అయ్యింది. హరికృష్ణ సైలెంట్ అయ్యారు.
ప్రస్తుతం టీడీపీలో నందమూరి ఫ్యామిలీకి పట్టు లేదు. అంతా చంద్రబాబు పాలనే. హరికృష్ణను నమ్ముకొని ముందుకొచ్చే నేతలు కూడా పెద్దగా లేరు. కానీ, తమ తండ్రి స్థాపించిన పార్టీలో తమకు ప్రాధాన్యం కావాలన్నది హరికృష్ణ డిమాండ్. మాస్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్‌నే చంద్రబాబుకు వారసుడిగా ప్రకటించాలని కోరుతున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం అందుకు సిద్ధంగా లేరు. అందుకే ప్రస్తుతానికి ఎన్టీఆర్‌కు పార్టీలో ఎదిగే ఛాన్స్ ఉండకపోవచ్చు. మరి రెండు కుటుంబాలు సర్దుకుపోతాయా..? లేక తాడోపేడో తేల్చుకుంటారా..? ఇదే టీడీపీకి భవిష్యత్ లీడర్ ఎవరన్నది తేల్చబోతోంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి