8, డిసెంబర్ 2010, బుధవారం
వైరస్ డైరెక్టర్స్
"ఒక సినిమా ఎన్నిరోజుల్లో తీయాలో కూడా తెలియని తెలివితక్కువ డైరెక్టర్లు ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్లకి నిర్మాత ఏమైపోతాడన్న ఆలోచన కూడా లేదు. నా సినిమా కదా.. ఎన్ని రోజులైనా తీయొచ్చనుకుంటున్నారు. ఇండస్ట్రీని సర్వనాశనం చేస్తున్నారు. శరీరంలో వైరెస్ అనే ఒక జీవి ఉంటుంది. అది శరీరాన్ని మొత్తం నాశనం చేసి... చివరకు అదీ నాశనం అయిపోతుంది. నిర్మాత అన్నవాడు లేకపోతే, ఇండస్ట్రీనే ఉండదు. "
ఈ డైలాగ్‌లు చెప్పింది ఎవరో కాదు నాగబాబు. నాగబాబు.. యాక్టర్ మాత్రమే కాదు.. ప్రొడ్యూసర్ కూడా. చిన్నా చితకా సినిమాలు కాదు భారీ సినిమాలు మాత్రమే తీసే ప్రొడ్యూసర్. పైగా మెగాస్టార్ తమ్ముడు. తాజాగా... మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో ఆరెంజ్ అంటూ ఓ భారీ సినిమానే తీశాడు. నిర్మాతలను కష్ట పెడుతూ డైరెక్టర్లు సినిమాలు తీసేస్తున్నారన్నది నాగబాబు కోపానికి కారణం. పైగా, తన కడుపులో ఉన్న మంటనంతా ఇలా వెళ్లగక్కాడు.
నాగబాబు దృష్టిలో తెలుగు సినిమా డైరెక్టర్లు ఇప్పుడు వైరస్ల లాంటి వారు. తెలుగు సినిమాను, నిర్మాతలను పీల్చిపిప్పిచేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సినిమాను, నిర్మతాలను చంపేస్తున్నారు. ఇది నాగబాబు అభిప్రాయం మాత్రమే కాదు.. ఇండస్ట్రీలోని చాలామంది నిర్మాతల ఫీలింగ్ కూడా ఇదే. ఇందుకు కారణం.. మన తెలుగు డైరెక్టర్ల భారీ తనమే.
నాగబాబు దెబ్బకు తెలుగు సినీ ఇండస్ట్రీలో బడ్జెట్ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. డైరెక్టర్ల అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపింది. తెలుగు సినిమాకు ఇప్పుడు డైరెక్టర్లే ప్రధాన శత్రువులుగా మారిపోయారన్న అనుమానం చాలా మందిలో కలుగుతోంది. ఈ ఏడాది తక్కువ బడ్జెట్‌తో వచ్చిన సినిమాలు మంచి హిట్లను అందుకొంటే... భారీ బడ్జెట్‌తో వచ్చిన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. అదే నిర్మాతల ఆగ్రహానికి కారణం. నాగబాబుకూ ఈ దెబ్బ తగిలింది. ఎంతో ఎక్స్పెక్ట్ చేసి, రామ్ చరణ్‌కు హ్యాట్రిక్ ఇవ్వడంతో పాటు, తన బ్యానర్ ఖాతాలో మంచి హిట్‌ను వేసుకుందామనుకున్న నాగబాబుకు, బొమ్మరిల్లు భాస్కర్ ఊహించని షాక్ ఇచ్చాడు. ఓ నార్మల్ లవ్‌స్టోరీకి మగధీర లెవల్లో ఖర్చుపెట్టించాడు. ఆస్ట్రేలియాలోనే తీస్తే స్టోరీ పండుతుందంటూ యూనిట్ మొత్తాన్ని అక్కడికి తీసుకొనివెళ్లి సినిమాతీశాడు. ఫలితం ఓ లవ్‌స్టోరీ తీయడానికి 30 కోట్లకు పైగా ఖర్చయ్యింది.
పోనీ, సినిమా హిట్ అయ్యి భారీగా లాభాలొస్తాయనుకుంటే.. మొదటిరోజే బొమ్మ తిరగబడింది. సినిమా స్టోరీ జనానికి ఎక్కలేదు. మాస్ సెంటర్ల సంగతి దేవుడెరుగు.. కనీసం మల్టీప్లెక్స్‌ల్లోనూ ఆడే సీన్ కనిపించడంలేదు. మరి నాగబాబుకు కోపం రాకుండా ఉంటుందా..? పైగా, తన కళ్లముందే చిన్న చిన్న నిర్మాతలు, తక్కువ బడ్జెట్‌తో, అదీ అతి తక్కువ సమయంలో మంచి మంచి సినిమాలు తీసేస్తుంటే కడుపు మండదా..? అందుకే, నాగబాబు దృష్టిలో డైరెక్టర్లు వైరెస్లా మారిపోయారు.
అందరిదీ అదే దారి..!
కొమరం పులి 40 కోట్లు.. మహేశ్ ఖలేజా దాదాపు 35 కోట్లు.. ఆరెంజ్.. 30 కోట్ల బడ్జెట్.. వరుడుది ఇదే లెక్క. చెప్పాలంటే.. తెలుగు ఇండస్ట్రీ బడ్జెట్ లెక్కల్లో అంచనాలు దాటిపోతోందనడానికి ఇదే నిదర్శనం. పైగా ఈ సినిమాల్లో నటించినవారంతా సూపర్స్టార్లు. మెగా హిట్స్ దక్కించుకున్న యంగ్ హీరోలు. టాలీవుడ్లో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. పైగా, ఈ సినిమాలను తీసింది కూడా టాప్ డైరెక్టర్లే. షూటింగ్లో ఉండగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమాలన్నీ థియేటర్లలో మాత్రం తేలిపోయాయి. వీర ఫ్యాన్స్ కూడా ఈ బొమ్మలను చూసి బుర్ర బాదుకున్నారు. ఇంకేముంది... బాక్సులు ఎంత వేగంగా థియేటర్లకు వెళ్లాయో.. అంతే వేగంగా వెనక్కి తిరిగి వచ్చాయి.
సినిమా తీయడానికి కోట్లల్లో డబ్బులు కుమ్మరిస్తున్నా.. రిజల్ట్ మాత్రం రావడం లేదు. పైరసీ వల్ల సినిమాలు ఆడడం లేదంటూ ఇంతకాలం హడావిడి చేసిన నిర్మాతలు.. ఇప్పుడు అసలు తప్పును గుర్తించినట్లే కనిపిస్తున్నారు. సినిమాలు సరిగ్గా ఆడకపోవడానికి కారణం డైరెక్టర్లేనంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. అందులోనూ, తెలుగులో వరసపెట్టి సినిమాలు తీస్తున్న రాంగోపాల్ వర్మను చూసే సరికి నిర్మాతల్లో మరింత చలనం వచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే, మిరపకాయ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో రామ్‌గోపాల్ వర్మను ఆకాశానికి ఎత్తేశారు నాగబాబు. అతి తక్కువ బడ్జెట్‌తో, అతి తక్కువ టైంలో సినిమాలు తీస్తున్న వర్మ ఏమైనా చేతగాని డైరెక్టరా.. ఆయన్ను చూసి నేర్చుకోండంటూ భారీ డైరెక్టర్లపై విరుచుకుపడ్డారు. సర్కార్‌ను 30 రోజుల్లోనే పూర్తి చేశారని, అప్పల్రాజు కోసం రోజుకు ఆరేడు సీన్లు తీస్తున్నారనీ చెప్పుకొచ్చారు. వర్మను మరికొంత కాలం తెలుగు సినిమాలు తీసి, ఇండస్ట్రీని బాగుచేసి వెళ్లాలని కోరారు.
నాగబాబుకు సి.కళ్యాణ్ కూడా జతకలిశారు. పనిలో పనిగా వర్మనూ పొగిడేశారు. రక్తచరిత్రను ఐదు సినిమాలుగా మలిచిన వర్మ టాలెంట్‌ను మెచ్చుకున్నారు. మొత్తం 80 రోజుల్లో మూడు భాషల్లో దేనికదే ప్రత్యేకంగా షాట్లు తీస్తూ, ఐదు నెగిటివ్‌లను కేవలం 30 కోట్ల బడ్జెట్లోనే
డైరెక్టర్ల తప్పేమిటి?
మన డైరెక్టర్లకు భారీ పిచ్చి పట్టింది. కనీసం 25 నుంచి 30 కోట్లపైన ఖర్చు చేస్తే గానీ సినిమా తీయలేమన్న నిర్ణయానికి వచ్చేశారు. ఒకరితో ఒకరు పోటీపడుతూ బడ్జెట్‌ను పెంచుకుంటూ పోతున్నారు. పైగా, నవతరం డైరెక్టర్లలో చాలామంది పూర్తిస్థాయి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకోకుండానే షూటింగ్‌కు రెడీ అయిపోతున్నారు. ఏమి తీయాలో, ఎక్కడెక్కడ తీయాలో నిర్ణయించుకోకుండానే తొలిక్లాప్ కొట్టేస్తున్నారు. అందుకే రెండు మూడు నెలల్లో పూర్తి చేయగలిగే మహేశ్ ఖలేజా మూడున్నరేళ్లు పట్టింది. సినిమాలో దమ్ము లేక వారం రోజుల్లోనే థియేటర్లలో ఎగిరిపోయింది. కొమరం పులిదీ అంతే. హాలీవుడ్ స్థాయిలో సెట్టింగ్ వేసి, రెండేళ్లు సాగదీసి తీసి నిర్మాతలకు కష్టాలనే మిగిల్చాడు డైరెక్టర్ సూర్య.
ఇక సెట్టింగ్ లేకుండా సీన్ తీయలేనంటాడు డైరెక్టర్ గుణశేఖర్. అందుబాటులో లొకేషన్ ఉన్నా సెట్ వేస్తేనే పనిమొదలుపెట్టడు. హైదరాబాద్‌లోనే చార్మినార్ ఉన్నప్పటికీ, ఒక్కడు కోసం కోటిరూపాయలతో సెట్ వేయించాడు. సైనికుడు కోసం ఓరుగల్లు కోటను, క్లైమాక్స్‌లో ఫైట్ కోసం భారీ బ్రిడ్జిని కట్టించాడు. వరుడు కోసం గుణశేఖర్ వేయించిన సెట్ సంగతి సరేసరి. ఈయన సినిమాల్లో సెట్స్‌కు మార్కులు పడుతున్నాయే తప్ప, సినిమాలకు పడడం లేదు.
వైవిఎస్ చౌదరిది మరో దారి. సినిమా అంతా రిచ్‌నెస్ కనపడాలంటే విపరీతంగా తీస్తాడు. ముందు పాటలు తీసేసి ఆ తర్వాత స్టోరీ మొదలుపెడతాడు. ఫారిన్లో షూటింగ్ చేయనిదే ఈయనకు సినిమా కంప్లీట్ కాదు. తనపై ఉన్న అతినమ్మకమే ఆయన్ను ముంచేస్తుంది. నిర్మాతల నెత్తిన తడిగుడ్డ వేస్తోంది.
రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. లో బడ్జెట్లో సినిమా తీయడం ఆయన వల్ల కాదు. లో బడ్జెట్ అంటూ తీసిన మర్యాదరామన్నకే దాదాపు 20 కోట్లు ఖర్చుపెట్టినట్లు సమాచారం. రాజమౌళి సినిమాల బడ్జెట్ పెరగడానికి కారణం బౌండెడ్ స్ర్కిప్ట్ లేకపోవడమే. ఎంత తీయాలో ఇప్పటికీ రాజమౌళికి తెలియదు. రెండున్నర గంటల మగధీర కోసం దాదాపు నాలుగు గంటల ఫైనల్ అవుట్‌పుట్‌ను తయారు చేశాడంటే ఏమనాలో ఆలోచించండి. కొన్ని సీన్లు సినిమా విడుదలైన తర్వాత అతికించినా, ఓ పాట సహా ఎన్నో సీన్లు గాల్లో కలిసిపోయాయి. వాటిని తీయడానికి అయిన ఖర్చంతా వృథానే కదా. ఇలా అవసరానికి మించి తీసే వారి జాబితాలో ఉండే మరో డైరెక్టర్ శేఖర్ కమ్ముల.
అనవసరమైన షాట్లను తీయడంతో పాటు.. రెండు మూడు నెలల్లో పూర్తి చేయాల్సిన ఒక్కో సినిమాకు సంవత్సరం నుంచి రెండుమూడు సంవత్సరాలు తీసుకోవడంతో నిర్మాతలపై భారం పెరిగిపోతోంది. అంత ఖర్చూ పెట్టినా చివరకు బొమ్మ తిరగబడడంతో అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తోంది.
తప్పంతా డైరెక్టర్లదేనా..?
డైరెక్టర్ల వల్లే తమ జేబులకు చిల్లు పడుతోందన్నది నిర్మాతల ఆరోపణ. ఇందులో చాలావరకూ వాస్తవమే. ఆ విషయం డైరెక్టర్లకూ తెలుసు. కానీ, తమ పద్దతులను మాత్రం డైరెక్టర్లు మార్చుకోవడం లేదు. కానీ, పూర్తిగా వారిదే తప్పని చెప్పలేం. కథ చెప్పగానే బుట్టలో పడిపోతున్న నిర్మాతల తప్పు కూడా ఉంది. సినిమా తీయడం అంటే కేవలం డబ్బులు అందించడం మాత్రమే అనుకునే వారు ఉన్నంత కాలం, ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. సినిమాను ఎలా తీయాలి.. ఎంత తక్కువ బడ్జెట్లో తీయాలి, ఎలాంటి షెడ్యూల్‌ను తయారు చేసుకోవాలన్న అవగాహనే చాలామంది నిర్మాతలకు ఉండడం లేదు. బాధ్యతంతా డైరెక్టర్లపై పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు. తీరా, రిజల్ట్ బ్యాడ్‌గా వచ్చే సరికి నెత్తీ నోరు బాదుకుంటున్నారు.
సినిమా యూనిట్‌కు కెప్టెన్ డైరెక్టరే అయినప్పటికీ, ఆ డైరెక్టర్‌ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాత్రం నిర్మాతదే. సినిమాకు ఏది అవసరమో ఏది కాదో, తన బడ్జెట్ ఎంతో, ఎప్పటిలోగా సినిమా కంప్లీట్ కావాలో.. ముందే డైరెక్టర్‌కు క్లియర్‌గా చెప్ప్లాల్సింది కూడా నిర్మాతే. ఇదేమీ చేయకుండా, డైరెక్టర్ చేయమన్నదల్లా చేస్తే.. చివరకు మిగిలేది బూడిదే. అనుకున్న టైం కన్నా షూటింగ్ ఒక్కరోజు కూడా ఎక్కువ కాకుండా చూసుకోవాల్సిందీ నిర్మాతే. అందుకే, ఈ విషయంలో డైరెక్టర్ తప్పు ఎంతగా ఉందో నిర్మాతలదీ అంతే ఉంది.
షూటింగ్‌కు ఎక్కువ సమయం పట్టడం వల్లే ఖర్చు పెరుగుతుందన్న విషయం మాత్రం మనవాళ్లకు కాస్త ఆలస్యంగా తెలిసొచ్చింది. మరి, దాన్ని చక్కదిద్దుకోవడంపైనే, నిర్మాతల కష్టాలు గట్టెక్కే సంగతి ఆధారపడి ఉంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
It is not mistake of Directors, it is mistake of Producesrs only. Why don't they learn from RamaNaidu?. తెలుగులో సామెత ఉంది, రౌతు వెధవయితే గుర్రం మూడు కాళ్లతో నడుస్తుంది అని, అలాగే most producers in Telugu don't know what is a producer means, they are giving too much control to Directors and they have to face the results too (whether it is hit or not)
By blaming directors is not the solution, first they(producers) have to understand what their role is in making a movie.
If Nagabaabu brother of Chiru and connected to one of those 4 families, and not able to control budget whoose fault is that? Why did he let the budget or the length of the shooting go way more than expected (assuming it happend)? Also if Orange movie is hit like Magadheera does one expect him to be blaming directors as he is today? Who is showing double standards here?
One more thing, for one to become Director and also to get a big movie, he/she go through lot, first work as asst. to some body for years, then showing the industry atleast couple of hits, then only they get a chance to do big movie.
But, tell me what is a qualification of producer? Does he/she are also going through same training other than brining illegal money into Industry and claiming a big producer (in most cases)!!