30, నవంబర్ 2010, మంగళవారం
జగన్‌కు తొలిదెబ్బ
కాంగ్రెస్ పార్టీని జగన్ చీల్చుతారంటూ వస్తున్న వార్తలు ఎంతవరకూ నిజమవుతాయో గానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం అప్పుడే ఆయన కుటుంబాన్ని చీల్చేసింది. తన వెంటే ఉంటాడనుకున్న బాబాయ్‌ను అబ్బాయి నుంచి దూరం చేసింది. ప్రాణం పోయే వరకూ కాంగ్రెస్‌తోనే ఉంటానంటూ కడపలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ వివేకానంద చాటి చెప్పారంటే, ఆయనకు కాంగ్రెస్ నుంచి ఎంత మద్దతు ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు బాబాయ్‌కీ అబ్బాయికీ గొడవలో ఎన్నో మలుపులు.. మరెన్నో కోణాలు. అవేమిటో చదవండి..
తొలిరోజు కాంగ్రెస్ పార్టీకి జగన్ షాకిచ్చి పైచేయి సాధిస్తే... రెండో రోజు మాత్రం ఆ ఛాన్స్‌ను కాంగ్రెస్ హైకమాండ్ అందుకొంది. ఎంతో నేర్పుగా, జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందనే అస్త్రంగా ప్రయోగించింది. ఇడుపులపాయనుంచి జగన్ రాజకీయం మొదలుకాకుండానే, తొలి పావును కదిపి చెక్ పెట్టింది. కాంగ్రెస్‌ను వదిలి బయటకు వచ్చిన జగన్‌కు అండగా ఉండనని వివేకానందతో చెప్పించింది.
జగన్‌కు కాంగ్రెస్‌కు మధ్య విబేధాలు కొనసాగుతుండగానే, మంత్రి పదవికోసం లాబీయింగ్ చేశారు వైఎస్ వివేకానంద. ఢిల్లీకి కూడా వెళ్లిసంప్రదింపులు జరిపారు. హైకమాండ్‌తో ఢీకొట్టడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న జగన్, దీన్నే ప్రధానాస్త్రంగా మార్చుకున్నారు. తమ కుటుంబాన్ని చీల్చే నీచరాజకీయాలకు కాంగ్రెస్ పాల్పడుతుందంటూ లేఖ రాసి, పార్టీని వీడారు. అయితే.. జగన్ తీరుతో వివేకానంద మనసు మార్చుకోవచ్చంటూ ప్రచారం జరిగింది. బంధువులతో చర్చలు జరపడం, ఇడుపులపాయలో జగన్‌ను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకోవడం, ఆ తర్వాత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం... తీవ్ర ఉత్కంఠను కలిగించాయి.
ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం వివేకానంద జగన్‌తో సమావేశమయ్యారు. అయితే, వీరిద్దరి సమావేశం రెండు నిమిషాలపాటు కూడా సాగలేదు. జగన్ దగ్గర నుంచి విసురుగా వివేకానంద వెళ్లిపోయారు. అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడనని, తన తండ్రి,సోదరుల బాటలోనే ప్రయాణించాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. దీంతో, జగన్‌తో పాటే ఉండడని తేల్చిచెప్పారు. పైగా, కాంగ్రెస్‌పై అభాండాలు వేయడం సరికాదంటూ, సోనియాను కీర్తించారు. మంత్రి పదవిపై ఎప్పటినుంచో ఆశలు పెట్టుకున్న వివేకానంద, కాంగ్రెస్‌తో పాటే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఈ విషయంలో తనను కాంగ్రెస్ ప్రలోభపెట్టలేదని, తానే మంత్రి పదవికోసం లాబీయింగ్ చేశానంటూ ప్రకటించి సంచలనం సృష్టించారు. వైఎస్ వివేకానంద తీరు జగన్ శిబిరంలో ఒక్కసారిగా ఆందోళనను నింపింది. సొంతకుటుంబంలోనే చిచ్చుపెట్టి జగన్‌ను ఒంటరిని చేయడంలో కాంగ్రెస్ విజయం సాధించింది.
వివేకానంద పావు మాత్రమే..!
కాంగ్రెస్ అసలు సిసలు రాజకీయాలు జగన్‌కు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. రాజకీయాలను క్షణాల్లో మార్చేయగలగడంలో కాంగ్రెస్ అనుభవమేమిటో ఇప్పుడిప్పుడే ఆయనకు అర్థమవుతోంది. పార్టీ నుంచి బయటకువస్తే మరెంతో మంది తనవెంట నడుస్తారన్న జగన్ అంచనాలను వమ్ము చేయడం కోసం కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దిగువ శ్రేణి నేతలు జగన్‌వైపు నడవకుండా చూడడం కోసం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ ఇప్పటికే రంగంలోకి దిగారు. నేతలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. పార్టీ తరపున డీఎస్ కూడా పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
ఇడుపులపాయలో వైఎస్ సమాధిని నివాళులు అర్పించడంతో కాంగ్రెసేతర రాజకీయాలకు శ్రీకారం చుట్టిన జగన్‌కు ఆదిలోనే అడ్డంకులను సృష్టించడంలో కాంగ్రెస్ హైకమాండ్ సక్సెస్ అయ్యింది. బాబాయ్‌ను అబ్బాయ్‌ను వేరు చేయగలగింది. వైఎస్ మాట జవదాటకుండా ఇంతకాలం రాజకీయ జీవితాన్ని కొనసాగించిన వివేకానంద, తనకు ఎదురు తిరగవచ్చని జగన్ ఊహించలేదు. అధిష్టానంతో సఖ్యత కోసం చిన్నపాటి ప్రయత్నాలు చేసినా, తనతో పాటే ఉంటారని భావించారు. కానీ, మంత్రి పదవికోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వివేకానంద, జగన్ కన్నా సోనియానే ఎక్కువనుకున్నారు. అందుకే, కాంగ్రెస్ పార్టీపై విధేయతను చాటుకొన్నారు. జగన్‌తో నడవనంటూ స్పష్టం చేసేశారు. దీంతో, జగన్ ప్రయత్నాలకు అతని కుటుంబంలోనే మద్దతు లేదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చాటిచెప్పగలిగింది. కుటుంబాన్నే గెలవలేని జగన్.. ఇక కాంగ్రెస్ శ్రేణులను ఎలా ఆకర్షించగలరన్న సందేశాన్ని పంపించినట్లయ్యింది. ఈ విషయంలో జగన్‌పై కాంగ్రెస్ పైచేయి సాధించింది.
జగన్ కాంగ్రెస్‌నుంచి బయటపడడంతో మరెంతోమంది ఎమ్మెల్యేలు, జిల్లాస్థాయి నేతలు రాజీనామాలు చేసే అవకాశం ఉందని ముందునుంచీ ప్రచారం జరుగుతోంది. దాదాపు 25 మంది ఎమ్మెల్యేల మద్దతు జగన్‌కు ఉన్నట్లు కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర సమాచారం ఉంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో వీరందరినీ కాపాడుకోవడం పార్టీకి కీలకం. జిల్లాల్లో కొంతమంది నేతలు రాజీనామాలు చేసినా దాని ప్రభావం పెద్దగా ఉండదు. ప్రభుత్వాన్ని కాపాడుకోగలిగితే, పార్టీని నిలబెట్టుకోవడం కష్టమేమీ కాదు. అందుకే, వివేకానందను జగన్‌కు దూరం చేసింది. జగన్‌ను దగ్గర నుంచి చూస్తున్న వివేకానందే దూరంగా ఉంటున్నప్పుడు, ఆ సాకు చూపి మిగిలిన ఎమ్మెల్యేలను ఆపవచ్చన్న ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్‌ది.
జగన్ కుటుంబంలో రాజకీయంగా ప్రస్తుతం కీలకంగా ఉన్నది వివేకానంద మాత్రమే. ఆయన్ను దూరం చేసి జగన్‌ను ఒంటరిని చేసిన, కాంగ్రెస్.. మిగిలిన నేతలనూ జగన్‌వైపు వెళ్లకుండా ఆపగలమన్న విశ్వాసంతోనే ఉంది.
విలువ దక్కలేదనే..!
వైఎస్ రాజశేఖరరెడ్డిలా మాస్ ఇమేజ్ ఉండకపోవచ్చు. అంత దూకుడు లేకపోవచ్చు. కానీ, కడప రాజకీయాల్లో మాత్రం చాలా కాలంగా విజయయాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ వివేకానంద రెడ్డి. పులివెందుల నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా, కడప లోక్‌సభ స్థానం నుంచి మరో రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతున్నారు. వివేకానంద ఇంత సుదీర్ఘరాజకీయ ప్రస్థానం కొనసాగించడం వెనుకున్నది దివంగత నేత వైఎస్సారే. ఆయన ప్రోద్భలం, అండదండలతోనే మాస్ ఇమేజ్ లేకపోయినా, ఎన్నికల్లో వివేకానంద విజయాలను సాధించగలిగారు.
అయితే, వైఎస్ కుటుంబం తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదన్న అభిప్రాయం వివేకానందలో ఎప్పటినుంచో ఉంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించినప్పుడు, పులివెందుల లోక్‌సభనుంచి వైఎస్, కడప లోక్‌సభ నుంచి వివేకానందలు గెలుపొందారు. అయితే, జగన్‌ను క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకురావడం కోసం వివేకానందను రాజీనామా చేయమని కోరినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఒకానొకదశలో వివేకానంద రాజీనామాకు సిద్ధపడ్డారు. అధిష్టానం వారించడంతో వెనక్కితగ్గారు. అయితే, 2009 ఎన్నికల్లో మాత్రం వివేకానందకు వైఎస్ మొండిచేయి చూపించారు. లోక్‌సభ టికెట్‌ను తన కొడుకు జగన్‌కు కేటాయించారు. ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి వివేకానందను శాంతిపజేశారు. కానీ, ఈ పరిణామాలతో వివేకానంద తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. వైఎస్ కుటుంబ అవసరాల కోసం తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టడాన్ని తట్టుకోలేకపోయారు. అందుకే, వైఎస్ మృతి చెందినప్పటినుంచీ వివేకానందలో మార్పు మొదలయ్యింది. తొలి నుంచీ జగన్‌కు దూరంగానే ఉంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఓ వైపు కాంగ్రెస్ హైకమాండ్‌ను ధిక్కరించి జగన్ ఓదార్పు యాత్ర మొదలుపెట్టడంతో, తన విధేయతను చాటుకునే అవకాశం తొలిసారి వివేకానందకు వచ్చింది. అంతే, కాంగ్రెస్ అధిష్టానాన్ని కీర్తిస్తూ.. జులై 17 వ తేదీన సోనియాకు ఓ లేఖ రాశారు. అయితే, దీన్ని ఆయన బయటపెట్టలేదు. కానీ, రెండు నెలల క్రితం బయటపడ్డప్పుడు మాత్రం ఈ లేఖ పెద్ద సంచలనాన్నే సృష్టించింది.
వైఎస్ హయాంలో వివేకానంద పూర్తిగా తెరవెనుకకే పరిమితమయ్యారు. ఎలాంటి పదవులనూ ఆయన అనుభవించలేదు. వైఎస్ ఆధిపత్యంతో పూర్తిగా విసిగిపోయారు. అందుకే, ఇప్పటికైనా తన మానాన తాను రాజకీయాల్లో కొనసాగాలనుకుంటున్నారు. జగన్ అసమ్మతి కారణంగా వివేకానందకు మంత్రిపదవి అందే అవకాశమూ ఇప్పుడు వచ్చింది. చేతికందిన ఈ అవకాశాన్ని కాలితో తన్నాలని వివేక భావించడం లేదు. పైగా, జగన్‌వైపు వెళితే, ఇప్పటికిప్పుడు వచ్చేది కూడా ఏమీ లేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయిస్తారన్న నమ్మకమూ లేదు. ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవి ఉండడం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో మూడున్నరేళ్ల అధికారం ఉండడం చూస్తుంటే, జగన్ వైపు కన్నా.. కాంగ్రెస్ వైపు ఉంటేనే లాభమనుకుంటున్నారు. అందుకే జగన్‌కు టాటా చెప్పి, కాంగ్రెస్‌లో కంటిన్యూ అవుతున్నారు.
జగన్‌పై విమర్శల వర్షం..
జగన్ తీరుతో కాంగ్రెస్ నేతలకు కొత్త కష్టం వచ్చిపడింది. పార్టీనుంచి జగన్ బయటపడడంతో పార్టీలో ఉండాలో లేదో తెల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, నిన్నామొన్నటి దాకా జగన్ చుట్టూ తిరిగినవారిలో ఎక్కువమంది కాంగ్రెస్‌లోనే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే, జగన్‌ను విమర్శించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జగన్‌ను విమర్శించడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానానికి దగ్గరవ్వాలన్న ఆలోచనే చాలామంది నేతలది. పైగా, సోనియా ఫ్లెక్సీలను చింపడం, శవయాత్రలను నిర్వహించడంపైనా కాంగ్రెస్ నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
జగన్ కూడా బయటకువెళ్లిపోవడంతో, వైఎస్ వ్యతిరేకులుగా ముద్రపడ్డ చాలామంది హవా మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సీనియర్ నేతలు ప్రభుత్వంపైనా, పార్టీపైనా పట్టు సాధించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్నాచితకా లీడర్లు జగన్‌వైపు వెళ్లినా, కీలకమైన నేతలు ఎవరూ వెళ్లరన్నది సీనియర్ల విశ్వాసం.
కాంగ్రెస్ నేతల నుంచి విమర్శల తాకిడి క్రమంగా ఎక్కువవుతోంది. ముఖ్యంగా సోనియాగాంధీని లక్ష్యంగా చేసుకుంటూ జగన్ లేఖను సంధించడాన్నే కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంలో ఊరుకుంటే జగన్ మరింత రెచ్చిపోతారని భావిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న నేతలందరి లక్ష్యం ఒకటే... అదే జగన్‌ను కట్టడి చేయడం. పైగా, జగన్‌పై విమర్శలు పెరిగితే, కాంగ్రెస్ నుంచి వెళ్లాలనుకునే వారూ ఆగిపోవచ్చన్న అభిప్రాయం వారిది. అందుకే, విమర్శల విషయంలో ఏమాత్రం మొహమాటపడడం లేదు. కాంగ్రెస్ హైకమాండ్ నీచ రాజకీయాలకు పాల్పడలేదని, స్వయంగా వివేకానందరెడ్డే ప్రకటించడం కాంగ్రెస్ నేతలకు కొత్త ఉత్సాహాన్ని అందించింది. జగన్‌పై మరింత దూకుడుగా మాటలదాడి చేయడానికి పురికొల్పింది.
జగన్ ఎదురుదాడి?
కాంగ్రెస్ నేతల విమర్శలకు దీటుగా సమాధానం చెప్పాలనుకుంటున్నారు జగన్. దీనికోసం వీలైనంత త్వరగా తన బలాన్ని ప్రదర్శించాలనుకుంటున్నారు. ఇప్పటికే ఇడుపులపాయకు వైఎస్ అభిమానులు, జగన్ అనుచరులు వెల్లువలా వస్తున్నారు. కీలక నేతలతో ఎప్పటికప్పుడు జగన్ చర్చలు జరుపుతూ భవిష్యత్ కార్యాచరణకు రూపం ఇస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎలాగూ బయటకు వచ్చాం కాబట్టి త్వరలోనే పార్టీ పెట్టి ముందుకు వెళ్లాలన్నదే జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.
సోనియానే టార్గెట్ చేసుకుని జగన్ వర్గం ముందుకు కదులుతోంది. విభజించు పాలించు సూత్రాన్ని అమలు చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. దేశంలోకి మళ్లీ బ్రిటీష్ పాలనను తెస్తోందంటూ విరుచుకుపడుతోంది. కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టడం, కాంగ్రెస్ పార్టీ ఇమేజ్‌ను దెబ్బకొట్టడం ఈ రెండే లక్ష్యంగా జగన్ శిబిరం పావులు కదుపుతోంది.
తెలంగాణకు జగన్ అనుకూలమా?
కాంగ్రెస్ హైకమాండ్‌ను ఇరుకున పెట్టేలానే జగన్ వర్గం పావులు కదుపుతోంది. జగన్ రాసిన లేఖకు సోనియా సమాధానం ఇవ్వాలని, వైఎస్ మృతిపై తమకు ఎన్నో అనుమానాలున్నాయని ప్రకటనలు చేస్తోంది. దీనికితోడు డిసెంబర్ 31లోగా తెలంగాణ ఇచ్చి తీరాల్సిందేనంటూ జగన్ వీరవిధేయురాలుగా ముద్రపడ్డ కొండాసురేఖ ప్రకటించడం కలకలం పుట్టిస్తోంది. కేవలం కాంగ్రెస్ హైకమాండ్‌ను ఇరుకున పెట్టడానికే ఈ ఎత్తుగడ వేశారా లేక.. తెలంగాణకు సానుకూలంగా వ్యవహరించి, పట్టుపెంచుకోవాలని జగన్ భావిస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అప్పుడే కధ కంచికేం చేరలేదులెండి. పొద్దుగూకి తెల్లారేలోగా బాబాయ్ అబ్బాయ్ ల మద్య ఏమైనా జరగొచ్చు. ఎంతైనా ఒకే బ్లడ్ కదా:)