16, నవంబర్ 2010, మంగళవారం
పదేళ్ల ఎన్టీఆర్
సినిమాను చూడడం వేరు.. సినిమాల్లో నటించడం వేరు. కానీ, వెండితెరనే ప్రపంచంగా, సినిమానే జీవితంగా మార్చుకునేవాళ్లు.. .సినిమా అన్న పదాన్నే శ్వాసిస్తూ.. జీవితాన్ని గడపాలనుకునేవారు కొంతమందే ఉంటారు. అలాంటివారిలో ఒకడు.. ఎన్టీఆర్. అందుకే.. పదేళ్ల కాలంలో ఎన్నో సినిమాలు.. మరెన్నో ప్రయోగాలు..
ఎన్టీఆర్... పరిచయం అక్కర్లేని పేరు. సీనియర్ ఎన్టీఆర్ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని వెండితెరపై అడుగుపెట్టినా.. అతి తక్కువకాలంలోనే తన నటనతో తారాస్థాయికి చేరుకోలిగాడు. తాతకు తగ్గ మనవడనిపించుకోగలిగాడు. బాలనటుడిగానే నటజీవితం మొదలైనా... పూర్తిస్థాయి హీరోగా మారి ఇప్పటికి (నవంబర్ 16, 2010) సరిగ్గా పదేళ్లు పూర్తయ్యింది. సరిగ్గా ఇదే సమయంలో ఎన్టీఆర్లో మరో కోణాన్ని అభిమానులకు చూపించింది బృందావనం.
ఎన్టీఆర్ పేరు చెప్పగానే సినిమా ఎలా ఉంటుందో అర్థమైపోతుంది. కానీ, బృందావనంలో మాత్రం రోటిన్‌కు భిన్నంగా, డిఫరెంట్ గెటప్‌లో కనిపించి అందరినీ మెప్పించాడు ఎన్టీఆర్. మాస్ మాత్రమే కాదు.. క్లాస్ కూడా మెచ్చుకునే గోవిందుడు అందరివాడనిపించాడు. ఎన్టీఆర్ కెరీర్‌లో బృందావనం సినిమాది ప్రత్యేకస్థానం. తన గెటప్‌ను, యాక్టింగ్ స్టైల్‌ను పూర్తిగా మార్చేసుకుని సరికొత్తగా ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించాడు. అంతేకాదు, లవర్‌బాయ్‌లా కనిపించి, తోటి హీరోలకు సవాల్ విసిరాడు.
యాక్షన్ కింగ్
డైలాగ్స్‌ను పర్‌ఫెక్ట్‌గా చెప్పడంలో ఎన్టీఆర్ స్టైలే వేరు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోల్లో డైలాగ్ కింగ్ ఎన్టీఆర్ మాత్రమే. ఆవేశాన్ని మాత్రమే కాదు నవరసాలను తన గొంతులో పలికించగల నటుడు ఎన్టీఆర్. అందుకే, ఎన్టీఆర్ ఏ డైలాగ్ చెప్పినా అది సూపర్ హిట్టే. జనం కేరింతలు కొట్టాల్సిందే. డైలాగ్స్ లేని సన్నివేశాలను ఫీలింగ్స్‌తో నడిపించగల సమర్ధుడు ఎన్టీఆర్. ఇక యాక్షన్ సన్నివేశాల్లో ఎన్టీఆర్లోని నటకౌశలం పూర్తిగా బయటపడుతుంది.
మాస్‌ను మెప్పించడంలో ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా. అందుకే, పదేళ్లలో ఎన్టీఆర్ హీరోగా నటించిన పదిహేడు సినిమాల్లో ఎక్కువ భాగంయాక్షన్ సినిమాలే. లవ్,కామెడీ ఎంటర్‌టైరనర్స్‌లా కొన్ని సినిమాలు కనిపించినా, వాటిలోనూ యాక్షన్‌పాళ్లు ఎక్కువగానే ఉంటాయి. ఎన్టీఆర్ సినిమాల్లో ఫైట్స్ స్పెషల్ రేంజ్‌లో ఉంటాయి. సినిమా ఎలాంటిదైనా, ఎన్టీఆర్ మార్క్ ఫైట్స్ మాత్రం తప్పకుండా ఉండాల్సిందే.
తొలి సినిమా నుంచి ఫైట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూనే ఉన్నాడు తారక్. బాబాయ్ బాలకృష్ణకు మాస్ హీరోగా మంచి ఇమేజ్ ఉండడం, నందమూరి ఫ్యామిలీ నుంచి రావడంతో, మూడో సినిమాకే పూర్తిస్థాయి మాస్ సినిమావైపు అడుగులు వేయాల్సి వచ్చింది. చెప్పాలంటే మాస్‌ఫార్ములాను ఎన్టీఆర్ ఎంచుకోవడం వల్లే, తక్కువ కాలంలో టాప్ హీరోగా ఎదిగగలిగాడు.
స్టెప్పుల్లో రారాజు
టాలీవుడ్‌లో డ్యాన్స్‌కు కేరాఫ్ అడ్రస్ ఎన్టీఆర్. చిన్నప్పటినుంచి డ్యాన్స్ అంటే ఎంతో ఇంట్రెస్ట్ చూపించే ఎన్టీఆర్.. సినీరంగ ప్రవేశం చేసిన తర్వాత డ్యాన్స్‌తో మరింతగా మమేకమయ్యాడు. డైలాగ్స్, యాక్షన్ ఎన్టీఆర్‌కు ఎంత పేరు తెచ్చిపెట్టాయో.. స్టెప్పులు కూడా అంతే కీర్తిని అందించాయి. కళ్లు చెదిరే స్టెప్పులు వేయడం ఎన్టీఆర్ మాత్రమే సాధ్యం.
హెవీ పర్సనాలిటీతోనూ అదిరిపోయే డ్యాన్స్ చేయడం ఎన్టీఆర్‌కు మాత్రమే చెల్లింది. టాలెంట్ ముందు అడ్డంకులేవీ ఉండవని ఎన్నో సార్లు నిరూపించాడు యంగ్ టైగర్. ఎన్టీఆర్ సినిమా విడుదలవుతుంటే చాలు.. ఎలాంటి స్టెప్పులు వేసి ఉంటాడా అని అభిమానులు ఎదురు చూసేలా చేశాడు. హెవీ పర్సనాలిటీతోనే అదరగొట్టేసిన ఎన్టీఆర్.. ఆ తర్వాత సైజ్ తగ్గి దుమ్ము దులిపేశాడు.
ఎన్టీఆర్ సినిమాల్లో పాటలే స్పెషల్ అట్రాక్షన్. అందుకనే ప్రతీసినిమాలోనూ అన్ని రకాల పాటలు ఉండేలా దర్శక నిర్మాతలు జాగ్రత్తపడతారు. మాస్‌ను మెప్పించే సాంగ్స్‌తోపాటు.. సోలో, కామెడీ, ఐటెం సాంగ్స్‌కు ప్రాధాన్యం ఇస్తారు.
ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేయడమంటే హీరోయిన్లకు సవాలే. ఎన్టీఆర్‌తో సమానంగా చేయలేక, అంత వేగంగా కదల్లేక ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అందుకే, కష్టమైన స్టెప్పులు స్క్రీన్‌పై ఎన్టీఆర్ మాత్రమే చేస్తాడు. ఆ తర్వాతే హీరోయిన్లు జతకలిసి ఆడిపాడతారు.
కలెక్షన్లలో మేటి
బృందావనానికి మాత్రమే కాదు, ఎన్టీఆర్ సినిమా విడుదలైన ప్రతీసారి ఇదే పరిస్థితి. ఫస్ట్‌డేనే ఫస్ట్ షో చూడడం కోసం ఫ్యాన్స్ ఎగబడతారు. టికెట్ బ్లాక్‌లో కొనైనా, సినిమా చూసేయాలన్నది నందమూరి ఫ్యాన్స్ ఫిలాసఫీ. అందుకే, యంగ్ హీరోల్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించే హీరోగా ఎన్టీఆర్ ఫస్ట్‌ప్లేస్‌లో ఉంటాడు.
నవంబర్ 16. 2000. ఎన్టీఆర్ లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేని రోజు. తొలిసారి హీరోగా కెమెరా ముందుకు ఎన్టీఆర్ వచ్చిన రోజు. అప్పటికి ఎన్టీఆర్‌పై ఎవరికీ ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాలరామాయణంలో బాలనటుడిగా కనిపించినా, ఎన్టీఆర్ హీరోగా మారతాడని, ఇండస్ట్రీ తన పేరు కలవరించేలా చేస్తాడని ఎవరూ అనుకోలేదు. నందమూరి ఫ్యామిలీ ఇమేజ్ తోడున్నప్పటికీ, సొంత టాలెంట్‌వల్లే టాప్ హీరో కాగలిగాడు ఎన్టీఆర్.
తొలి సినిమా నిన్నుచూడాలని నిరాశ పరిచినా, రెండో సినిమాతోనే తానేంటో నిరూపించుకున్నాడు ఈ నందమూరి నటవారసుడు. స్టూడెంట్ నెంబర్ వన్‌తో అందరి మనసుల్లోనూ చోటు దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఆది సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేశాడు. ఆది దెబ్బకు పెద్ద హీరోలే కలవరపడే పరిస్థితిని తెచ్చాడు. ఆదితో ఎన్టీఆర్‌లోని మాస్ హీరో నిద్రలేచాడు. సింహాద్రితో తన పవర్‌ను అందరికీ చూపించాడు.. బాక్సాఫీస్ వసూళ్లలో అగ్రహీరోలను మించిపోయాడు. చెప్పాలంటే హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూడంటే మూడేళ్లలోనే టాప్‌స్టార్‌గా ఎదిగిపోయాడు.
అయితే.. ఆ తర్వాత మాత్రం వరసగా పరాజయాలు వెక్కిరించాయి. సింహాద్రి తర్వాత రాఖీ వరకూ మధ్యలో 5 సినిమాలు చేసినా కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. రాఖీ విజయంతో ఎన్టీఆర్ నిరీక్షణ ఫలించింది. ఆ తర్వాత యమదొంగ సినిమా ఎన్టీఆర్‌కు కొత్త ఉత్సాహాన్నిఅందించింది. యముడిగా కనిపించిన ఎన్టీఆర్ పౌరాణికపాత్రల్లోనూ మెప్పించగలనని నిరూపించుకున్నాడు.
యమదొంగ తర్వాత అదుర్స్, తాజాగా బృందావనం సక్సెస్‌తో మళ్లీ విజయాల బాటలో పయనిస్తున్నాడు ఎన్టీఆర్. యమదొంగ నుంచి మళ్లీ
ఎన్టీఆర్ సినిమాలకు కలెక్షన్ల వర్షం కురవడం మొదలయ్యింది. ప్రతీసినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి. అదుర్స్‌కు, బృందావనానికి ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ రావడమే ఇందుకు నిదర్శనం.
నిత్యవిద్యార్థి
చిన్న వయస్సులోనే స్టార్ హోదా వచ్చేసింది. సినిమా కలెక్షన్లు అంచనాలను దాటి పోయేవి. ఎన్టీఆర్ ఇండస్ట్హ్రీలో అడుగుపెట్టిన మూడేళ్ల తర్వాత పరిస్థితి ఇది. ఇంకా చెప్పాలంటే సింహాద్రి సమయానికి మంచి స్వింగ్‌లో ఉన్నాడు తారక్. మాస్ స్టోరీలకు ఏకైక యంగ్‌హీరోగా ఇండస్ట్రీకి కనిపించాడు. అంతే వరసగా ఎన్నో స్టోరీలు ఎన్టీఆర్ కోసం రెడీ అయ్యాయి. మాస్ ఇమేజ్ ఉండడంతో ఎన్టీఆర్ కూడా వాటివైపే మొగ్గు చూపాడు. కానీ, అది రాంగ్‌స్టెప్ అని త్వరలోనే అర్థమయ్యింది. అందుకే, రోటీన్ ఫార్ములాను వదిలి రాఖీగా ప్రత్యక్షమయ్యాడు.
రాఖీ సినిమా సమయానికి ఎన్టీఆర్ పర్సనాలిటీ బాగా పెరిగిపోయింది. వయసుకు మించిన శరీరంతో కనపడేసరికి అందరినుంచీ విమర్శలు మొదలయ్యాయి. అప్పటివరకూ నటనపైనే తప్ప శరీరంపై దృష్టి పెట్టని ఎన్టీఆర్ ఇక రూపు మార్చుకోకతప్పదని డిసైడ్ అయ్యాడు. అంతే, యమదొంగలో కొత్త ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కనిపించాడు. అప్పటి నుంచి దాన్నే ఫాలో అవుతున్నాడు.
రాఖీ తర్వాత ఎన్టీఆర్ స్టోరీ సెలక్షన్‌లోనూ ఎంతో తేడా కనిపించింది. మూస పాత్రలకు నో చెప్పి, అందరికీ చేరువ కావాలని నిర్ణయం తీసుకున్నాడు. కేవలం ఫైట్లు చేసి, హాడావిడి చేయడమే కాక, తనను సంపూర్ణ నటుడిగా నిరూపించుకోవాలని తపనపడ్డాడు. అందుకే, అదుర్స్‌లో చారి పాత్రలో కామెడీతో కుమ్మేశాడు. అంతటితో సరిపెట్టుకోలేదు, బృందావనంతో లవర్‌బాయ్‌గా, ఫ్యామిలీ హీరోగా తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు.
ఇకపై లవర్‌బాయ్‌గానే సెటిల్ అయిపోతాడా అంటే లేదనే చెప్పాలి. శక్తి రూపంలో మళ్లీ మాస్‌హీరోగా అభిమానులకు కనిపించబోతున్నాడు ఎన్టీఆర్. ఇకపై ఒకే తరహా పాత్రలకు పరిమితం అయ్యే అవకాశాలు మాత్రం లేవు. ఎప్పటికప్పుడు విభిన్నంగా కనిపిస్తూ.. ఈ తారకరాముడు అందరివాడని అనిపించుకోవాలనుకుంటున్నాడు ఎన్టీఆర్. అంతేకాదు.. తన తాత నటించిన గుండమ్మకథ, పాతాళభైరవి లాంటి టాలీవుడ్ క్లాసిక్స్‌ను రీమేక్ చేయాలనుకుంటున్నాడు. ధుర్యోధనుడి పాత్రకే కళతెచ్చేలా సీనియర్ ఎన్టీఆర్ నటించిన దానవీరశూర కర్ణలో జూనియర్ కనిపించాలని ముచ్చటపడుతున్నాడు. ఆ కోరికా త్వరలోనే తీరాలని ఆశిద్దాం. ఒకేమూస పద్ధతికి అతుక్కోకుండా, మళ్లీ పర్సనాలిటీ పెంచకుండా, ఎన్నో అద్భుతమైన పాత్రల్లో అభిమానులకు ఎన్టీఆర్ కనిపించాలని ఆశిద్దాం..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అద్భుతంగా ఉంది మీ వ్యాఖ్యాణం