8, అక్టోబర్ 2010, శుక్రవారం
మరో భూగోళం
Categories :
ఖగోళ పరిశోధనల్లో సరికొత్త విజయం
గ్రహాంతరవాసుల శోధనలో మరో ముందడుగు
విశ్వంలో కనిపించిన భూమి సోదరి..
భూమిన పోలిన గ్రహం
ఈ గ్రహంపై జీవరాశి ఉందా..?
ఈ అండపిండ బ్రహ్మాండం లాంటి విశ్వంలో.. మన భూమి కున్న విలక్షణత మరే గ్రహానికీ లేదు. వాతావరణం, నీరు, గురుత్వాకర్షణ, అన్నింటికన్నా ముఖ్యంగా జీవరాశి. మనుషులతో పాటు కొన్ని కోట్ల రకాల జీవులు భూమిపై మనుగడ సాగిస్తున్నాయి. అయితే.. ఎంతో సువిశాలమైన విశ్వంలో మనలాంటి గ్రహం మరొకటి ఉందా?... ఈ ప్రశ్నే ఎంతోమంది మేథస్సును తొలిచింది. ఎన్నో ప్రయోగాలకు నాంది పలికింది. శతాబ్దాలుగా సాగుతున్న ఈ పరిశోధనలకు ఇప్పుడు అనూహ్యమైన విజయం దక్కింది. ఆ విజయమే... గ్లిసే 581 g గుర్తింపు..
గ్లిసే 581g ని కనిపెట్టడం.. ఖగోళ పరిశోధనల్లో చాలా ముందడుగనే చెప్పాలి. వేలకోట్ల సంవత్సరాలుగా విశ్వంపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నా.. కొన్ని వందల గ్రహాలను గుర్తించినా.. వాటన్నింటిలోకి గ్లిసే 581g కి ఉన్న ప్రత్యేకతే వేరు. చెప్పాలంటే.. మన భూమికి జిరాక్స్ కాపీ లాంటింది ఈ కొత్త గ్రహం. మన భూమి మీద ఉన్నట్లే.. అక్కడా వాతావరణం ఉంది, భూమికి ఉన్నట్లే గురుత్వాకర్షణ ఉంది. ఈ రెండూ రుజువు కావడంతో.. ఇక తేలాల్సింది జీవరాశి విషయమే. ప్రస్తుతానికి మాత్రం అక్కడ పుష్కలంగా నీరు ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
మన సౌరమండలానికి సమీపంలోనే ఈ గ్రహాన్ని కనిపెట్టారు అమెరికన్ పరిశోధకులు. ఇది గ్లిసే 581 అనే నక్షత్రం చుట్టూ తిరుగుతున్న గ్రహం. ఇప్పటికే ఈ నక్షత్ర మండలంలోని ఆరు గ్రహాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో తాజాగా గుర్తించిన దానికి తాత్కాలికంగా g అని నామకరణం చేశారు. మన సూర్యుడితో పోల్చితే.. ఈ గ్లిసే581 నక్షత్రం విడుదల చేసే కాంతి తక్కువే. అందుకే.. ఈ నక్షత్రానికి అతి తక్కువ దూరంలోనే హాబిటవుల్ జోన్ ఏర్పడింది. అందులోనే ఉంది.. ఈ g అనే గ్రహం.సాధారణంగా, వాతావరణం, గురుత్వాకర్షణ ఉండడం వల్లే జీవరాశి మనుగడ సాగించగలుగుతుంది. ఈ రెండు లక్షణాలు కొత్త గ్రహం గ్లిసే 581g కి ఉన్నాయి కాబట్టి.. అక్కడా జీవరాశి ఉండొచ్చన్న నమ్మకం శాస్త్రవేత్తల్లో పెరుగుతోంది. మనకు కేవలం 20 కాంతి సంవత్సరాల దూరంలోనే ఉన్న ఈ గ్రహం ఇప్పుడు ప్రపంచ ఖగోళ పరిశోధకులందరినీ ఆకర్షిస్తోంది.
మళ్లీ గ్రహాంతరవాసులు
గ్రహాంతరవాసులు ఉన్నారా..?
అమెరికాపై దాడి చేయబోయారా?
తరచుగా భూమిపైకి వస్తున్నారా..?
ఏలియన్స్ మనకైనా తెలివైనవా..?
గ్రహాంతరవాసులపై ఎన్నోవార్తలు.. మరెన్నో వివాదాలు. ఏలియన్స్ తరచుగా భూమిపైకి వచ్చాయని.. ఇప్పటికీ వస్తున్నాయని వాదించేవారు ఎంతోమంది. అసలు గ్రహాంతరవాసులు ఉన్నారా ? అంటూ ప్రశ్నించేవారూ మరెంతోమంది. . ఒకవేళ ఉంటే.. ఎక్కడ ఉన్నారు..? ఎలా ఉన్నారు? మనుషుల రూపంలోనా.. జంతువుల రూపంలోనా...?
భూమిని పోలిన కొత్త గ్రహం మనకు చిక్కడంతో... ఏలియన్స్ ఉండొచ్చన్న నమ్మకం మరింత పెరిగింది. ఈ విశ్వంలో మనలాంటి గ్రహాలు.. మనలాంటి జీవులు ఉన్నాయన్న అనుమానాలకు ఈ కొత్త గ్రహం కారణంగా మరింత బలం చేకూరింది. తాజా ఫలితాలతో ఏలియన్స్‌ను కనిపెట్టడానికి సాగుతున్న పరిశోధనలు కూడా మరింత వేగం పుంజుకోనున్నాయి. అంతేకాదు.. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి, గ్రహాంతరవాసులతో సంభాషించడానికి మలేషియాకు చెందిన ఆస్ట్రోఫిజిసిస్ట్ మజ్లాన్ ఓథ్మాన్కు బాధ్యతలు అప్పగించిందన్న వార్తలూ సంచలనం సృష్టించాయి. దీన్నిబట్టి చూస్తే.. విశ్వంలో మనలాంటి బుద్ధిజీవులు ఉన్నారన్న విశ్వాసం ఐక్యరాజ్యసమితి వ్యక్తం చేసిందనుకోవచ్చు. అయితే.. ఇదంతా వాస్తవం కాదన్న వాదనా ఉంది.
ఇక మరో వార్త.. అమెరికాపైకి ఏలియన్స్ వచ్చాయంటూ ఇటీవలే మరో వార్త వెలువడింది. పైగా 1948 నుంచీ.. అమెరికా, బ్రిటన్లకు చెందిన అణ్వాయుధ కేంద్రాలపై దాడికి ప్రయత్నించాయంటూ.. యూఎస్ ఎయిర్‌ఫోర్స్ మాజీ అధికారులు ప్రకటించారు. అంతేకాదు.. యూఎస్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది ఎన్నోసార్లు యూఎఫ్ఓలను చూశారనీ వారు చెబుతున్నారు. దీనికి సంబంధించిన కీలక వివరాలను లండన్‌కు చెందిన డైలీ మెయిల్ పత్రిక ఇటీవలే ప్రచురించింది. ఇవి సమీపంలోకి వచ్చినప్పుడు మిసైల్స్ సహా ఇతర ఆయుధాలు పనిచేయకుండా పోయాయని ఈ పత్రిక పేర్కొంది. కానీ.. వీటికి సంబంధించిన ఆధారాలు ఇంతవరకూ బయటపడలేదు కాబట్టి.. నిజం కాకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా వైమానిక దళ మాజీ అధికారుల అనుమానాలు నిజం కాకపోవచ్చు. గ్రహాంతరవాసులు వచ్చాయన్న వాదన అవాస్తవమే కావచ్చు. కాని.. కొత్తగ్రహంపై జీవరాశి మనుగడకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్న వార్తలు మాత్రం.. విశ్వ జీవులు ఉండొచ్చన్న ఆశలను సజీవంగా ఉంచుతున్నాయి.
అన్నీ భూమిపై ఉన్నట్లేనా..?
గ్లిసే 581g పై జీవరాశి ఉందా...?
అక్కడా భూమిపై ఉన్న పరిస్థితులే ఉన్నాయా?
సముద్రాలు, చెట్లూ, చేమలు ఉన్నాయా?
ఖగోళపరిశోధకులు గుర్తించిన గ్లిసే 581g కొత్త ఆశలు మొలికిస్తోంది. మన సౌరమండలం సహా ఇతర నక్షత్ర మండలాల్లోనూ ఎన్నో గ్రహాలను గుర్తించినా.. వీటిలో వేటికీ లేని ప్రత్యేకతలు గ్లిసే 581gకి ఉన్నాయి. మన భూమితో పోల్చితే.. ఈ కొత్తగ్రహం ద్రవ్యరాశి దాదాపు 5 రెట్లు ఎక్కువ. అయితే భూమి చుట్టుకొలతతో పోల్చితే ఈ కొత్తగ్రహం చుట్టుకొలత కేవలం రెండు రెట్లు మాత్రమే ఎక్కువ. ఈ విలక్షణత కారణంగానే .. దీని ఉపరితలమంతా రాళ్లతో నిండిఉండడంతో పాటు.... సముద్రాలు కూడా ఉండి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
మన భూమితో పోల్చితే గ్లిసే 581g గ్రహంపై వాతావరణం ఎంతో విభిన్నం. ఈ గ్రహ భ్రమణాల్లో తేడా వల్ల... ఓ వైపు ఎప్పుడూ నక్షత్రంవైపే ఉంటుంది. అందుకే.. ఓ వైపు ఎప్పుడూ వెలుతురు ఉంటుంది. ఇక మరోవైపు పూర్తిగా చీకటిగా ఉంటుంది. ఈ చీకటి భాగంలో మంచుఖండాలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పైగా.. ఈ గ్రహం నక్షత్రాన్ని కేవలం 37 రోజుల్లోనే చుట్టి వస్తుంది. వాతావరణం ఉందన్న విషయం ఎలాగూ తేలిపోయింది.. ఇక నీరు ఉందన్న విషయమూ తేలితే... అక్కడ జీవరాశి ఉండొచ్చన్న విషయం నిర్దారణ అవుతుంది. సాంకేతికంగా మనలానే వారూ అభివృద్ధి చెందిఉంటే మాత్రం సంప్రదింపులూ జరపగలం.
అక్కడికి వెళ్లగలమా..?
ఇప్పటివరకూ గుర్తించిన గ్రహాల్లో అత్యంత చేరువలో ఉన్న గ్రహం గ్లిసే 581g. భూమికి 20 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దూరం తక్కువే అని చెప్పుకున్నా... దీని దగ్గరకు వెళ్లడం అంత ఈజీ కాదు. ఖగోళ భాషను వదిలిపెట్టి... మన లెక్కల్లో వస్తే.. 118 లక్షల కోట్ల మైళ్ల దూరమని చెప్పుకోవచ్చు. ఈ గ్రహాన్ని చేరుకోవడానికి మన భూవాతావరణంతో పాటు.. గ్రహాలు నక్షత్రాలను దాటుకుని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మధ్యలో ఎన్నో అడ్డంకులను, విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న రాకెట్లను, స్పేస్‌షిప్‌లలో ప్రయాణిస్తే... కొన్ని లక్షల సంవత్సరాలు పడుతోంది. అదే సెకనుకు 11 వేల మైళ్ల వేగంతో వెళ్లగలిగే స్పేస్‌క్రాఫ్ట్‌ను తయారు చేసుకోగలిగితే మాత్రం ఈ గ్రహానికి చేరుకోవడానికి ఎంత లేదన్నా 75 సంవత్సరాలు పడుతుందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియాకు చెందిన రఘునందన్ అంచనా వేస్తున్నారు.కాంతి వేగంతో ప్రయాణిస్తేనే 20 సంవత్సరాలు పడుతుంది. కానీ.. ఈ తరహా పరిజ్ఞానం ఇంతవరకూ మన దగ్గర లేదు.
గ్లిసే 581 నక్షత్రమండలాన్ని దాదాపు చాలా ఏళ్ల క్రితమే.. ఖగోళపరిశోధకులు కనిపెట్టారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో జీవరాశి ఉండొచ్చన్న ఆశాభావంలోనే ఉన్నారు. ఆగస్టు 2009లో నాసా ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన మెసేజ్‌లను ఈ నక్షత్రమండలానికి ట్రాన్మిట్ చేసింది. అయితే.. ఇవి ఆ ప్రాంతానికి 2031 సంవత్సరంలో చేరే అవకాశం ఉన్నాయి. ఒకవేళ అక్కడ మనలాంటి వారే ఉంటే.. ఈ సందేశాన్ని అందుకోగలిగి, దాన్ని అర్థం చేసుకొని తిరిగి మళ్లీ మనకు సమాచారాన్ని అందిచాలనుకున్నా... అప్పటి నుంచి మరో 32 ఏళ్లు పట్టొచ్చు. కాబట్టి.. దగ్గరే అని చెప్పుకోవడమే తప్ప... ప్రస్తుతానికి మనకు అది అందని ద్రాక్షే.
లాజిక్..
ఈ అనంత విశ్వంలో మన భూమి ఓ చిన్న గ్రహం మాత్రమే. కానీ.. మనం మాత్రం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందాం.. మన సూర్యమండలం అవతల ఉన్న ఇతర గ్రహాలను కనిపెడుతున్నాం. చందమామపైకి చేరుకున్నాం... అంగారకుడిపై అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నాం.. ఓ చిన్న గ్రహంపై ఉన్న మనమే.. ఇతర గ్రహాలను చేరుకుంటున్నప్పుడు.. ఇతర గ్రహాలకు చెందిన వారు మన భూమిపైకి రాకుండా ఉండగలరా...? విశ్వంలో మనం ఒంటరివాళ్లం కాదనీ.. మనకు తోడుగా మరికొంతమంది ఉండొచ్చని విశ్వసించడానికి ఈ చిన్న లాజిక్ చాలు. మన భూమిపైకి గ్రహాంతరవాసులు వస్తున్నారని, వారు ప్రయాణిస్తున్న వాహనాలను చూశామని చాలామంది చెబుతూనే ఉన్నారు. ఎక్స్ట్రా టెర్రిస్ట్రియల్ లైఫ్‌కు సంబంధించిన వార్తలు నిత్యం ఏదో రూపంలో వస్తూనే ఉన్నాయి. హాలీవుడ్ సినిమాల ఎఫెక్టో.. కొంతమంది సృష్టించిన ఫొటోలు.. లీక్డ్ ఫూటేజ్ ద్వారా ఇంటర్నెట్లో విహరిస్తున్న ఆటోస్పై వీడియోల ప్రభావమో గానీ.. ఏలియన్స్ ఇలానే ఉండొచ్చంటూ ఓ రూపాన్ని విశ్వజీవులకు ఇచ్చేశాం.
స్టీఫెన్ హాకింగ్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన శాస్త్రవేత్తలే గ్రహాంతరవాసులు ఉండొచ్చని భావిస్తున్నారు. మనిషి మాత్రమే ఈ సువిశాల ప్రపంచంలో బుద్ది జీవి కాకపోవచ్చని, మనకు తెలియని ప్రపంచంలో మనలాంటి వారు.. మనకన్నా తెలివితేటల్లో మించినవారు ఉండొచ్చన్నది ఈ ఆస్ట్రో ఫిజిక్స్ సైంటిస్ట్ నమ్మకం. గ్రహాంతరవాసులు ఉన్నారో లేదో... ఉంటే ఎలా ఉంటారో ఇప్పటివరకూ ఎవరూ శాస్త్రీయంగా నిరూపించలేకపోయారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
నిజమా, ఆశ్చర్యంగా ఉంది. మంచి వ్యాసం అందించారు. వీటికి సంబంధించిన లింక్స్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేది.
"ఓ చిన్న గ్రహంపై ఉన్న మనమే.. ఇతర గ్రహాలను చేరుకుంటున్నప్పుడు.. ఇతర గ్రహాలకు చెందిన వారు మన భూమిపైకి రాకుండా ఉండగలరా...?"
Well said. It is true that there is a scope for life in some form in any of the extra territorial space to us and they too may be trying to explore all the possibilities to find out similar to what we r trying to find out.