15, అక్టోబర్ 2010, శుక్రవారం
టాలీవుడ్లో టైటిల్ గోల
ఈ ఫోటోలో కనిపిస్తున్నది హీరో శ్రీకాంతే అయినా.. ఫోటో మాత్రం ఎవరినో కాపీ కొట్టినట్లు ఉంది కదూ...ఇది ఎవరిదో కాదు... ప్రపంచ ప్రఖ్యాత విప్లవకారుడు.. విప్లవ చైతన్యానికి ప్రతీక.. యువతరానికి స్ఫూర్తి ప్రధాతగా పేరుపొందిన చే గెవరాది. వరల్డ్‌వైడ్‌గా మోస్ట్ పాపులర్ అయిన ఈ ఫోటోలోనే... హీరో శ్రీకాంత్ ఫేస్‌ను మార్ఫింగ్ చేసి తన సినిమాకు పోస్టర్‌ను తయారు చేసుకున్నారు పోసాని.
చురకత్తుల్లాంటి చూపులు.. స్వేచ్ఛకు ప్రతీకగా కనిపిస్తూ గాలికి ఎగురుతున్న జుట్టు.. తలపై టోపీ.. ఎంతో విలక్షణంగా ఉన్న ఈ ఫోటోనే.. చేగెవరాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కట్టబెట్టింది. ఈ ఒక్క ఫోటో చూస్తే చాలు.. చే జీవితం అందరి కళ్లముందూ మెదులుతుంది. అందుకే కాబోలు.. ఈ ఫోటోనే మార్ఫింగ్ చేశాడు పోసాని కృష్ణమురళి. ఈ ఫోటోతో సినిమాకు కావల్సినంత ప్రచారం వస్తుందనుకున్నాడు. అయితే.. పోసాని ప్రయత్నం ఓ వివాదానికి బీజం వేసింది. ప్రపంచ దేశాలను బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేయాలని తపన పట్టాడు చేగెవెరా. అంతటి విప్లవ యోధుడిని పోలిన ఫోటోకింద ఉన్న టైటిల్... దుశ్సాసన. అసలు, ఈ ఫోటోకు.. ఈ టైటిల్‌కు ఏమన్నా సంబంధం ఉందా..? చేగెవెరాను ఎంతగానో అభిమానించే వారికి.. పోసాని చేసిన ఈ దుస్సాహసం ఏ మాత్రం మింగుడు పడలేదు. ఓ రకంగా.. ప్రపంచ విప్లవారాధ్య దైవాన్ని కించపరిచారంటూ ఎంతోమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫొటోపైనా.. టైటిల్‌పైనా వస్తున్న విమర్శలపై ముందు అడ్డగోలు వాదన చేశారు పోసాని. చేగెవరా ప్రపంచ సొత్తంటూ ప్రకటించారు. కానీ, అన్ని వైపులనుంచి వచ్చిన ఆగ్రహావేశాలకు తలొగ్గారు. సినిమా టైటిల్‌ను మార్చకపోయినా... శ్రీకాంత్ గెటప్‌ను మార్చడానికి అంగీకరించారు. అసలు చేగెవరా ఫోటోను మార్ఫింగ్ చేయడం ఎందుకు? చివరకు గెటప్ మార్చుతామని చెప్పడం ఎందుకు..? ఇదంతా పబ్లిసిటీ కోసమే వేసిన ఎత్తులేనా.
ఖలేజా తిప్పలు
సినిమా తీయడానికి మూడేళ్ల పాటు ఎంత కష్టపడిందో.. టైటిల్ విషయంలో అంతకన్నా ఎక్కువ శ్రమించింది ఖలేజా బృందం. ఈ టైటిల్‌ను ముందే రిజిస్టర్ చేసుకున్నామన్న ఓ నిర్మాత, మహేశ్ నటించిన సినిమాకు దాన్ని పెట్టడానికి వీల్లేదన్నారు. అది .. మహేశ్ ఖలేజాగా మారినా, వివాదం సద్దుమణగలేదు. పైపెచ్చు.. కోర్టు మెట్లనూ ఎక్కింది. చివరకు, అన్ని అడ్డంకులనూ దాటుకొని మహేశ్ ఖలేజాగానే విడుదలయ్యింది.
కత్తుల గొడవ
ఖలేజా తరహాలోనే మరో వివాదం టాలీవుడ్లో మొదలయ్యింది. ఖలేజా పేరుతో ప్రస్తుతం ఒకే సినిమా రిలీజ్ అయ్యింది. కానీ... ఇప్పుడు ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు రెడీ అవుతున్నాయి... ఆ సినిమా పేరే కత్తి. రవితేజ హీరోగా.. గుణశేఖర్ డైరెక్షన్లో ఈ సినిమా షూటింగ్‌కు సిద్ధమయ్యింది. ఈ టైటిల్‌ను డి.వి.వి.దానయ్య ఛాంబర్లో చాలాకాలం క్రితమే రిజిస్టర్ చేసుకున్నారు. కానీ, ఇప్పటికే చాలావరకూ షూటింగ్ పూర్తి చేసుకున్న కళ్యాణ్‌రామ్ సినిమాకూ ఇదే టైటిల్‌ను పెట్టాలనుకున్నారు. కానీ, గుణశేఖర్ బృందం ఈ టైటిల్‌ను ఇవ్వడానికి నిరాకరించడంతో.. ఆ పేరు కాస్తా.. కళ్యాణ్‌రామ్ కత్తిగా మారింది. మహేశ్ ఖలేజాలానే.. కళ్యాణ్‌రామ్ కత్తి కూడా విడుదలవుతుందన్నమాట. కాకపోతే.. ఈ రెండు సినిమాల్లో ఏ కత్తి నెగ్గుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే..
బెజవాడ బాంబు
ఇక ఒకే ఒక్క టైటిల్‌తో బాంబు పేల్చారు వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. బెజవాడ రౌడీల పేరుతో సినిమా తీస్తున్నానంటూ ఇటీవలే వర్మ అనౌన్స్ చేశారు. బెజవాడ రౌడీరాజకీయాన్ని వెండితెరపై చూపిస్తానని ప్రకటించారు. అంతే.. బెజవాడ భగ్గుమంది. రాజకీయ నాయకులు గొంతు సవరించుకున్నారు. బెజవాడలో అంతా రౌడీలా అంటూ నిలదీశారు. సినిమా టైటిల్‌ను పెట్టుకోవడానికి ఏమాత్రం ఒప్పుకోమన్నారు. కానీ, రౌడీలకే రౌడీనని చెప్పుకునే రామ్‌గోపాల్ వర్మ .. తాను ఏ మాత్రం వెనక్కి తగ్గనంటున్నారు. బెజవాడ రౌడీలు తీయడం ఖాయమేనంటున్నారు. దీనికి సంబంధించి స్ర్కిప్ట్ పూర్తైందని చెప్పినా.. ఇంకా ఆర్టిస్టులు ఎవరు.. ఎలా తీస్తారు.. ఎప్పుడు తీస్తారన్నది వర్మ ప్రకటించలేదు. కానీ.. ఒక్క టైటిల్‌తోనే కావల్సినంత ప్రచారం మాత్రం వర్మ సినిమాకు దక్కింది. ఈ సినిమా ఎలా ఉండొచ్చన్న ఆసక్తి మాత్రం జనంలో పెరిగిపోయింది.. మరి బెజవాడ రౌడీలనే సినిమా వస్తుందా..... లేదంటే, మరో టైటిల్‌ను వర్మ వెతుక్కుంటారా అన్నది త్వరలోనే తేలిపోవచ్చు..
ఆనందపురమైన అనంతపురం
రక్తచరిత్ర.. ఇది విపరీతమనుషుల కథ.. పైగా.. ఒక విపరీత మనస్తత్వం ఉన్న డైరెక్టర్ తీసిన వాస్తవగాథ. ఏది ఏమైనా.. రక్త చరిత్ర మాత్రం, తెలుగు సినిమాల్లోనే అతిపెద్ద సంచలనం. ఎవరు హీరోలో.. ఎవరు విలనో చెప్పలేని ఓ కథను తీసుకొని తీసిన సినిమా ఇది. ఇప్పటికే ట్రైలర్స్.. ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్‌ను పెంచేశాయి..
సాహసం చేసి ఈ సినిమాను వర్మ తీసినప్పటికీ.. మరెన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అనంతపురం ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా.. హింసాత్మకంగా ఉంటుందనడంలో ఏ మాత్రం అనుమానపడనవసరం లేదు. అయితే.. అసలు సమస్య ఇది కాదు. సినిమాలో అనంతపురం అని వాడుకోవడంపై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పేరు మార్చుకోమని సలహా ఇచ్చింది. దీంతో అనంతపురం కాస్తా.. ఆనందపురంగా మారిపోయింది. ఇక్కడే మరో గొడవ మొదలయ్యింది. ఆనందపురం పేరును పెట్టడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. విశాఖపట్నం సమీపంలో ఉన్న ఆనందపురం గ్రామస్తులు.. తమ ఊరి పేరును సినిమాలో వాడొద్దంటూ ధర్నా నిర్వహించారు. వర్మపై విరుచుకుపడ్డారు.
సినిమా విడుదల కాకముందే.. ఇంత గొడవ జరిగితే.. ఇక సినిమా విడుదలైన తర్వాత.. ఇంకెంత వివాదం చెలరేగుతుందో ఊహించుకోవచ్చు. ఎందుకంటే.. సినిమాలో క్యారెక్టర్లను వర్మ ఎలా తీశారన్నదానిపై ఇప్పటికే రకరకాల అనుమానాలున్నాయి. అనంతపురం జిల్లాకే చెందిన ఫ్యాక్షన్ లీడర్ ఓబుల్‌రెడ్డిని, అతని సోదరుడిని విలన్‌గా చూపించారన్న ఆరోపణలూ ఉన్నాయి. ట్రయలర్స్లో కనిపిస్తున్న దృశ్యాలు దీన్నే ధృవీకరించేలా ఉన్నాయంటూ ఓబుల్‌రెడ్డి కుటుంబం ఆరోపిస్తోంది. పరిటాల రవిని, మద్దెలచెర్వు సూరిని హీరోలుగా చూపించడం కోసం తమ కుటుంబ సభ్యులను విలన్లుగా చిత్రీకరించారని విమర్శిస్తోంది. దీనికీ ఘాటుగానే జవాబిచ్చారు వర్మ.
ఇక సినిమాపైనా వర్మ చేసిన రకరకాల ప్రకటనలు వివాదస్పదమయ్యాయి. వాస్తవ గాధని కొన్నిసార్లు.. వాస్తవ గాథ ప్రేరణతో సృష్టించిన కల్పితకథ మరికొన్నిసార్లు చెప్పి అందరినీ అయోమయంలో పడేశారు.
ఏ పేరు పెట్టాలి?
సినిమాలకు వివాదాలు కొత్త కాదు. ఏదో ఓ వర్గాన్ని కించపరిచారంటూ వివాదాలు రావడం సాధారణమే. కానీ, ఇప్పుడది టైటిళ్లకు వ్యాపించింది. ఈ టైటిల్ పెట్టొద్దంటే.. ఆ టైటిల్ పెట్టొద్దంటూ డిమాండ్ చేసే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. అనంతపురం నుంచి ఆనందపురం దాకా అందరికీ అభ్యంతరమే అయితే.. సినిమాలో ఏ పేరు వాడాలి.. ఏ ప్రాంతాన్ని చూపించాలి. ఎవరికీ లేని పేరును.. ఎక్కడా లేని ఊరి పేరును పెట్టడం సాధ్యమేనా...? ఈ ప్రశ్ననే ఇప్పుడు సినీ ఇండస్ట్రీ వేస్తోంది..?
సంచలనం కోసం.. ఈజీగా పబ్లిసిటీ చేసుకోవడం కోసం.. త్వరగా జనంలోకి వెళ్లడం కోసం ఇలాంటి వివాదాస్పద పేర్లను పెడుతున్నారన్న విమర్శ కూడా తెలుగు సినీ ఇండస్ట్రీపై ఉంది. ఇందులో వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే, చేగెవరా ఫోటోను మార్ఫింగ్ చేసి.. దుశ్సాసన టైటిల్ పెట్టాల్సిన అవసరం ఏముంది..? ఇక పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసిన పులి సినిమాలో కొమరంభీం ఇంటిపేరును వాడుకోవాల్సిన అవసరం ఉందా..? ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఇలాంటి తప్పిదాలే.. ఇండస్ట్రీకి చెడ్డపేరును తెస్తున్నాయి.
ఇటీవలి కాలంలోనే వివాదాస్పదమవుతున్న టైటిళ్లు ఎక్కువగా వస్తున్నాయి. టైటిళ్ల రిజిస్ట్రేషన్‌కు ప్రత్యేకంగా ఓ వ్యవస్థ ఉన్నా... ప్రజల మనోభావాలకు అనుగుణంగా అది నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. అందుకే.. కొమరం పులి రిలీజ్ అయిన తర్వాత పేరు మార్చుకోవాల్సి వచ్చింది. ఇండస్ట్రీలోనూ, దర్శకనిర్మాతల్లోనూ మార్పు వస్తే తప్ప.. టైటిళ్ల గోల తగ్గకపోవచ్చు.
అయితే.. జనంలోనూ కాస్త మార్పు రావాల్సి ఉంది. వాస్తవాన్ని ప్రతిబింబించేవి సినిమాల్లో ఉన్నప్పుడు దాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. లేదంటే.. సినిమాల్లో వాడుకోవడానికి ఏ పేరూ ఉండదు. ఏ ప్రాంతమూ ఉండదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
mee post bagundi