10, అక్టోబర్ 2010, ఆదివారం
హిజ్రాల జీవన కథ
రోడ్డుపై కనిపిస్తారు..
చనువుగా మాట్లాడతారు..
డబ్బులివ్వమని అడుగుతారు..
అడుక్కోవడమే వాళ్లకు తెలిసిన విద్య..
చప్పట్లు కొడుతూ.. డబ్బులివ్వమని చుట్టూ తిరుగుతారు..
దుకాణాలు తెరవగానే ప్రత్యక్షమవుతారు..
వాళ్లే హిజ్రాలు..
రైళ్లలోనూ వాళ్లే..
బోగీ బోగీకి.. సీటు సీటుకూ వచ్చి చేయి చాస్తారు..
వాళ్లను చూసి జాలిపడేవారికన్నా.. ఎంతోకొంత ఇచ్చి వదిలించుకుందామనుకునే వారే ఎక్కువ..
చిరాకు పడుతూనే.. కాస్తో కూస్తో చేతిలో పెడతారు..
ఎలా ఇచ్చినా.. ఇచ్చింది పుచ్చుకుని, దీవించి వెళతారు..
దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలూ వీరిపై ఉన్నాయి..
ఇవ్వకపోతే పీడిస్తారని విమర్శించేవారూ ఉన్నారు..
అందుకే.. చాలామందికి వీరంటే అసహ్యం..
అడుగుడుగునా అడ్డం పడుతూ డబ్బులివ్వమని అడిగే వీరంటే చిన్నచూపు..
కానీ.. ఇంతవరకే చూస్తే.. ఒకవైపు చూసినట్లే.. అసలు వీరంతా ఇలా ఎందుకు మారారు. సమాజంలో ఈ రూపంతో జీవించడం కష్టమైనా, ఈ జీవితాన్నే కోరుకోవడానికి ఏమైనా కారణం ఉందా..
కలుపుకోని సమాజం
చూడడానికి ఆడవాళ్లలానే ఉంటారు. కట్టూ బొట్టూ.. వేషం... అంతా ఆడవాళ్ల తరహానే. కానీ.. వారు ఆడవాళ్లు కాదు.. ఎవరూ వారిని మహిళలుగా గుర్తించరు. అలాగని మగవాళ్లూ తమలో కలుపుకోరు. వారితో కలివిడిగా ఎవరూ ఉండరు. అలా ఉండడానికీ ప్రయత్నించరు. వీలైనంతవరకూ దూరంగానే ఉంచుతారు.
హిజ్రాలను అవమానించే వారే కాదు.. జాలి చూపించే వారూ ఉంటారు. అయితే.. అందరిమధ్యలోకి తెచ్చుకుని మాత్రం ఎవరూ పెట్టుకోరు. అంతెందుకు, హిజ్రా ముద్ర పడ్డవారికి అద్దె ఇల్లు దొరకడమే కష్టం. అందరిమధ్యా బతికే అవకాశాన్ని ఎవరూ ఇవ్వరు. ఇలా సమాజం ఛీదరించుకుంటుంది కాబట్టే.. హిజ్రాలు కలిసిమెలిసి ఉంటారు. కొంతమంది బృందంగా ఏర్పడి సామాజిక జీవనాన్ని గడుపుతుంటారు. వీరందరికీ ఇల్లూ వాకిలీ ఒకటే. అంతా కలిసి సంపాదించుకుంటారు.. కలిసి బతుకుతారు. కష్టం సుఖం కలిసి పంచుకుంటారు. ఒకరికొకరు తోడవుతారు. పాత జీవితాన్ని మర్చిపోయి.. హిజ్రా అనే జీవనసముద్రాన్ని ఈదుతారు.
దుకాణాల దగ్గరా, రైళ్లలో, రోడ్లపై దర్జాగా వసూళ్లు చేసుకుంటున్నట్లు కనిపించిన మాత్రాన వీరు బాగా సంపాదించుకొని సుఖపడిపోతున్నారని అనుకోవద్దు. వీరికి సుఖాలకన్నా సమస్యలే ఎక్కువ. కనీసం మనుషులుగా ఎవరూ గుర్తించరు. ఎలాంటి గౌరవమూ ఇవ్వరు. పైగా, సూటిపోటి మాటలతో ఎవరో ఒకరు అవమానిస్తూనే ఉంటారు. ఒంటరిగా కనిపిస్తే నువ్వెవరవంటూ గుచ్చి గుచ్చి అడుగుతుంటారు. ఈ బాధలను, ఇబ్బందులను, అడుగడుగునా ఎదురయ్యే ఛీత్కారాలను మర్చిపోవడానికి... వీలైనంతవరకూ ఉల్లాసంగా గడపాలనుకుంటారు హిజ్రాలు.
ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి.. మళ్లీ నిద్రపోయే వరకూ... ప్రతీ నిమిషమూ వీరికి యుద్ధం లాంటింది. పొట్ట నింపుకోవడానికి పాట్లు పడాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగాలూ రావు, ప్రైవేటు కంపెనీలు ఆదరించవు. హిజ్రాలను ఉద్యోగంలోకి తీసుకుంటే, కస్టమర్లు ఎక్కడ తగ్గిపోతారో అన్న భయం అందరిదీ. అందుకే, వీరికి ఉపాధి దొరకడం చాలా కష్టం. చేయి చాచి పని ఇవ్వమని అడిగినా.. ఇచ్చే సాహసం మాత్రం ఎవరూ చేయరు. ఇక మిగిలింది ఒక్కటే... భిక్షం. అందుకే, హిజ్రాల్లో చాలా మంది, అడుక్కుంటూనే కనిపిస్తారు. అలా వచ్చిన సంపాదనతోనే జీవిస్తారు..
హిజ్రాలు ఎలా తయారవుతారు?
హిజ్రాల్లో కొంతమంది ఆడవాళ్లున్నప్పటికీ, చాలామంది మాత్రం గతజీవితంలో మగాళ్లే. ఆడవారిలా మారాలన్న కోరిక, హిజ్రాలుగా మారడానికి పురికొల్పుతుంది. చిన్నప్పటినుంచే అవకాశం వచ్చినప్పుడల్లా ఆడవారిలా అలంకరించుకుంటూ.. ఆడవాళ్ల దుస్తులు వేసుకుంటూ సంబరపడే వాళ్లు.. ఓ దశకు చేరిన తర్వాత పూర్తి స్థాయిలో రూపు మార్చుకోవాలనుకుంటారు. అదే హిజ్రాలుగా మారడానికి తొలి మెట్టు. కుటుంబ నేపథ్యం, చుట్టు ఉన్న సమాజం వీలైనంతవరకూ ఆపాలని ప్రయత్నిస్తుంది. కానీ, మనసు మాత్రం ఈ బంధాలు, అనుబంధాలను తెంచుకుని.. ఆడదానిగా మారమంటుంది.
హిజ్రాలుగా మారతామంటూ ఎంతోమంది వీరిదగ్గరకు వస్తుంటారు. ఇలా వచ్చినవారందరినీ మార్చరు. కనీసం ఏడాది పాటు వారిని తమతో పాటే ఉంచుకొని పరీక్షిస్తారు. పూర్తిగా నమ్మకం కుదిరిన తర్వాత, సెక్స్‌ఛేంజ్ ఆపరేషన్ చేయిస్తారు. ఇవి ఎక్కువగా విజయవాడ, కర్నూలు, ముంబై, ఢిల్లీల్లో జరుగుతుంటాయి. ఆడతనం తెచ్చుకోవడం కోసం, పుట్టుకతో వచ్చిన అవయవాలను వదులుకుంటారు. ఇదంతా రహస్యంగా జరుగుతుంది. ఈ ఆపరేషన్ జరిగిన 41 రోజులకు జల్సా పండుగ జరుగుతుంది. పూర్తిస్థాయి హిజ్రా మారే సందర్భంలో చేసుకునే పండగ ఇది.
ఆ మరుసటి రోజు తెల్లవారుఝామునే అసలు కార్యక్రమం మొదలవుతుంది. చెప్పాలంటే.. ఓ పెళ్లి తంతులా అత్యంత ఘనంగా దీన్ని నిర్వహిస్తారు. హిజ్రాగా మారే వ్యక్తికి పసుపురాసి, దిష్టితీస్తారు. ఆతర్వాత అభ్యంగన స్నానం చేయించి.. ఆకుపచ్చచీర కట్టి ముస్తాబు చేస్తారు.
ముఖాన్ని ఎవరూ చూడకుండా, చీరకొంగుతో కప్పుతారు. వీరి ఆరాధ్యదైవమైన మురిగిమాత వద్ద ఉంచిన పాలముంతను తెచ్చి, వీరి తలపై పెడతారు. ఊరేగింపుగా తీసుకెళ్లి... వాగులో పాలను పోయిస్తారు. ఇక్కడితో మొదటి అంకం పూర్తవుతుంది. తిరిగి ఇంటికి తీసుకువచ్చిన తర్వాత కొత్త పెళ్లికూతురిలా ముస్తాబు చేస్తారు. రిసెప్షన్ కోసం అంతా సిద్దమవుతుంది. మురిగిమాత చిత్రపటం ముందు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత.. హిజ్రాగా మారిన వారి మెడలో , వారిని మార్చిన వారు తాళి కడతారు. ఇలా తాళికట్టే ఆమెను అత్తగా భావిస్తారు. ఈమెదే పెత్తనమంతా. ఈ కార్యక్రమంతో పూర్తిస్థాయి హిజ్రాగా మారిపోతారు. ఇక ఆ తర్వాతంతా సంబరాలే. పాటలు పెట్టుకుని, డ్యాన్స్‌లు చేస్తూ.. ఈ లోకాన్ని మర్చిపోతారు. ఈ రోజును జీవితంలో మర్చిపోలేని రోజుగా అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు.
హిజ్రాలుగా మారిన వారు.. మారుతున్న వారు.. మారబోయే వారు మనదేశంలో ఎంతోమంది ఉన్నారు. మనసుకు నచ్చినట్లుగా ఉండడం కోసం.. వీరు అందరితోనూ పోరాటం చేయాల్సి ఉంటుంది. అప్పటివరకూ అయినవారే కానివారుగా మారిపోతారు. సొంతకుటుంబమే వారిని మెడపట్టి బయటకు గెంటేస్తుంది. నీదారి నువ్వు చూసుకో అంటుంది. వారితో సంబంధాలు పూర్తిగా తెంచుకుంటుంది. కానీ, ఈ బంధాలు, అనుబంధాలను తెంచుకొని.. మనసుకు నచ్చినట్లుగా జీవించడానికి గడపదాటతారు. తమలాంటి వారితో కొత్త బంధాలను సృష్టించుకుంటారు. హిజ్రాగా జీవితం సాఫీగా సాగితే.. తమ ఆరాధ్యదైవం మురిగి మాతకు మొక్కులు చెల్లించుకుంటారు. మూడేళ్లకు, ఐదేళ్లకు, పన్నెండేళ్లలో ఏదో ఓ సారి తిరుగుపూజ నిర్వహిస్తారు. ప్రత్యేకంగా పూజలు చేస్తారు. తమను ఇలానే చల్లగా చూడమంటూ కోరుకుంటారు. ఆ తర్వాత రిసెప్షన్‌ను నిర్వహిస్తారు. ఆటపాటలతో అంతాకలిసి సందడిసందడిగా గడుపుతారు.
హిజ్రాల రూపంలో బహురూపులు
అన్ని అడ్డంకులనూ ఎదురిస్తూ.. ఏ మాత్రం గుర్తింపులేని థర్డ్‌జెండర్‌గా జీవనప్రయాణాన్ని సాగిస్తున్న వీరికి మాయగాళ్లతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా.. బహురూపులతో సమస్యలు వస్తున్నాయి. ఈ బహురూపులు మగాళ్లే అయినప్పటికీ హిజ్రాల వేషంతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. హిజ్రాల వేషంలో దొంగతనాలకూ పాల్పడుతున్నారు. చేసేది వీరైనా.. అపవాదు మాత్రం అసలు హిజ్రాలపైనే పడుతోంది. బయట రోడ్లపై కనిపించే వారిలో సగానికి సగం మంది అసలైన హిజ్రాలు కాదు. కానీ, వీరిని గుర్తించడం ఎలా..? ఇదే అసలు సమస్య.
గుర్తింపు కోసం పోరాటం
జీవితంతో పోరాడుతున్న హిజ్రాలు.. ఇప్పుడు గుర్తింపు కోసం పోరాటం మొదలుపెట్టారు. దక్షిణాదితో పోల్చితే ఉత్తర భారతంలో హిజ్రాలకు సముచిత గౌరవమే లభిస్తోంది. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు వీరిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. ఇక మన పక్కనే ఉన్న తమిళనాడులోనూ ప్రత్కేక గుర్తింపు ఉంది. వీరికోసం ప్రత్యేకంగా అన్నిచోట్లా T అన్న కాలమ్‌ను ఏర్పాటు చేసింది. స్త్రీపురుషులతో సమానంగా ట్రాన్స్‌జెండర్స్‌ను గుర్తిస్తోంది. కానీ.. మన దగ్గర మాత్రం ఇలాంటి స్పెషల్ ఐడెంటిటీ లేదు. మనుషుల్లో వీరినో వర్గంగానే గుర్తించరు. ఈ పరిస్థితే మారాలంటున్నారు హిజ్రాలు.
ఆత్మాభిమానాన్ని చంపుకొని జీవిస్తున్న హిజ్రాల్లో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. చదువుతోనే జీవితాలను చక్కదిద్దుకోవచ్చన్న విషయాన్ని గ్రహించి అటువైపు దృష్టి సారించారు. డిస్టేన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చదువుకుంటూ డిగ్రీలు సంపాదిస్తున్నారు. వీరిలో కొంతమంది పీజీలు చేయగా.. మరికొంతమంది డిగ్రీ పూర్తిచేశారు. వీలైనంతవరకూ యాచకవృత్తికి దూరమై ఉద్యోగాలు చేస్తూ.. జీవితాన్ని సాగించాలనే ధృక్పథం క్రమంగా పెరుగుతోంది. తమ హక్కుల కోసం పోరాడటానికీ సిద్ధమవుతున్నారు.
కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వీరికి సాయపడుతూ.. ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. వీరిలో కొత్త ఆశలు చిగురింప చేస్తున్నాయి. రూపాన్ని మార్చుకోవాలన్న వీరి నిర్ణయాన్ని అంగీకరించలేక, దూరమైన కుటుంబ సభ్యులు.. ఇప్పుడిప్పుడే మనసు మార్చుకుంటున్నారు. క్రమంగా వీరికి దగ్గరవుతున్నారు. మళ్లీ కుటుంబంలో కలుపుకుంటున్నారు. కానీ, కుటుంబం ఒక్కటీ మారితే సరిపోదు. ఈ సమాజమూ మారాలి. మనుషులంతా వీరిపై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవాలి. అందుకే.. అందరికీ వీరు చేసే విజ్ఞప్తి ఒక్కటే. తమనూ మనుషులుగా గుర్తించమనే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
చాలా బాగా రాసారు, నేను రాయాలనుకున్న పోస్ట్. హిజ్రాల జీవితం చాలా కష్టం. ఎన్నోసార్లు రైళ్ళలో వీరు కనిపించినప్పుడు తోటి ప్రయాణీకులు అసహ్యించుకుంటూ ఉంటే నేను వారికి నచ్చజెప్ప ప్రయత్నించాను, అవసరమైతే దెబ్బలాడాను కూడా. వారికి మన చేయూత ఎంతో అవసరం. వారి తప్పు కానిదానికి వారిని శిక్షించకూడదు.
bagundi..nenu 8,9 months krithame hizrala pi documentary teesanu.chadavagane adhe gurthochindi ..ma channel lone au week top rating vachina documentari adhi..e documentary kosam nandigama lo one day anta hizrala tho gadapatam.....marichipoleni vishayam.vari hakkula porata udyamam kosam media chala cheyalsi undi..but vari samasyalanu na tarvatha e channle kuda promote cheyaledane cheppali..ma tv9 lo varusa kadhanalu,studio discursions n documentary ila chalane chesamu..anni vishayalalo matho poti pade migilina channels enduko hizralanu pattinchukoledu...e madya ABN, inko channel o hizra tho discursion jariparu kaani....adhi TRP kosam maro syamala aunty ni techhinattu anipinchindi.. ANY how...mi post bagundi........ congrats........
రాజమండ్రి నుంచి ప్రయాణించే రోజుల్లో హిజ్రాలని చూసాను. డబ్బులు ఇవ్వకపోతే జేబులో చెయ్యి పెడతారు. హిజ్రావాడిని కొడితే వాడు బలవంతంగా కౌగిలించుకుంటాడని, అప్పుడు శీలం చెడిపోతుందని భయపడి వాళ్లు జేబులో చెయ్యి పెట్టినా కొట్టరు. సంకుచిత నమ్మకాలకి పోతే ఇలాగే అవుతుంది. నా జేబులో డెబిట్ కార్డులు ఉంటాయి. ఎవడైనా నా జేబులో చెయ్యి పెడితే మొహమాటం లేకుండా కొడతాను. పెట్టినవాడు హిజ్రా అయినా, గే అయినా నాకు అనవసరం. హిజ్రాలు సామాజిక పరిస్థితుల నుంచి అలా తయారవుతారనే మాట నిజమే కానీ డబ్బులు, డెబిట్ కార్డుల విషయంలో మన సేఫ్టీ చూసుకోవాలి కదా.
అవున్లే మార్తాండా, ఏమున్నా లేకపోయినా డెబిట్ కార్డుల గురించి మాత్రం మన సేఫ్టీ చూసుకోవాల్సిందే :)
ఏదేమైనా హిజ్రాలతో డేంజర్. వాళ్ళు తగులుకుంటే వదలడం కష్టం. వాళ్ళతో చిన్నవిషయంలో తేడా వస్తే నరకం చూపించడానికి వెనుకాడరు. బ్లాగుల్లో కూడా ఒక కొజ్జా ఉన్నాడు. తను కొజ్జాని అని గర్వంగా చెప్పుకుంటాడు. ఈ మద్య అతగాడు అతని సన్నిహితుల్ని సైతం వెర్రిపప్పల్ని చెయ్యడానికి వెనుకాడలేదు. అందుకే కోజ్జాలతో జాగ్రత్త.