19, సెప్టెంబర్ 2010, ఆదివారం
మా నిమజ్జనం వేరు...
Categories :
వినాయకచవితిన వినాయకుడి విగ్రహాలను పెట్టడం, ఆ తర్వాత నిమజ్జనం చేయడం భక్తిభావాలకు,మత విశ్వాసాలకు సంబంధించింది అయితే కావచ్చు గానీ, నాకు మాత్రం అతిపెద్ద సామాజిక పండుగ. అన్ని ఊళ్లలో జరిగే నిమజ్జన ఉత్సవాలకు మా ఊరిలో జరిగే ఉత్సవాలకు ఎంతో తేడా ఉంది. మా ఊరిలో ఎన్నో విగ్రహాలను పెట్టినా, రామాలయంలో పెట్టే విగ్రహమే ప్రధానమైందని చెప్పుకోవచ్చు. వినాయకచవితి రోజు నుంచి హడావిడి మొదలవుతుంది. ప్రతీరోజు గుడి దగ్గర ఏదో ఓ కార్యక్రమం. మా చిన్నప్పుడు రోజూ నాటకాలు వేసేవారు, సినిమాలను తెచ్చి తెరపై వేసేవారు. ప్రస్తుతం ఈ ఉత్సవాలు కాస్త కళతప్పాయనుకోండి. చివరి రోజు మాత్రం ఓ ఆర్కెస్ట్రా బృందాన్ని తెచ్చి హడావిడి చేస్తున్నారు.
ఇక, అసలు ఉత్సవం అంతా నిమజ్జనం రోజుదే. నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు రెండు రోజుల ముందునుంచే మొదలవుతాయి. దేవుడి విగ్రహంతో పాటు దాదాపు నాలుగైదు ట్రాక్టర్లను నిమజ్జన ఊరేగింపు కోసం ప్రతీసారి ఏర్పాటు చేస్తారు. ఈ ట్రాక్టర్లను దక్కించుకోవడానికి మంచి పోటీనే జరుగుతుంది. రెండు రోజుల ముందే దీనికోసం వేలంపాట నిర్వహిస్తారు. ఎవరు ఎక్కువ చెల్లించడానికి ముందుకువస్తే వారికి దేవుడి విగ్రహాన్ని తమ ట్రాక్టర్లో ఊరేగించే అవకాశం దక్కుతుందన్నమాట. ఇలా ఒక్కోట్రాక్టర్ను ఒక్కొక్కరు పాడుకొంటారు.
అసలు సంగతి ఏమిటంటే...
వేలం పాటల సంగతి పక్కన పెడితే, మిగిలిందంతా అన్ని చోట్లా జరిగేది ఇదే కదా అన్న అనుమానం మీకు రావచ్చు. కానీ, మా అందరికీ నిమజ్జనంపై ఆసక్తి పెరగడానికి మరో కారణం ఉంది. వినాయకుడితో పాటు, సీతారామలక్ష్మణులను హనుమంతుడి సమేతంగా ఊరేగించడం ఆనవాయితీ. ప్రతీయేటా అందమైన పిల్లలను దీనికోసం ఎంపిక చేస్తారు. రాముడు, లక్ష్మణుడు, సీత, చిన్న హనుమంతుడి పాత్రలకు చిన్న పిల్లలను ఎంపిక చేస్తారు. ఆ వేషాలు వేసుకొని చక్కగా మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా ట్రాక్టర్లో కూర్చొని ఉండాలన్నమాట. ఇప్పటికీ ఈ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. ఇక మరో హనుమంతుడుంటాడు. అతనంటే అందరికీ హడల్. ఆయనే పెద్ద హనుమంతుడు. అసలు నిమజ్జనంలో ఉత్సాహం నింపేది, ముందుకు తీసుకెళ్లేది ఈ పెద్ద హనుమంతుడే. హనుమంతుడన్నాక తోక ఉంటుంది కదా.. దీన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు, గద, కిరీటం సంగతి సరేసరి. అసలు సిసలైన హనుమంతుడే వచ్చినట్లుగా ఉండేది మా ఊరి ఆంజనేయులుని చూస్తే.
హనుమంతుడు ముందు పరుగుపెట్టడం.. ఆయన వెనక మేం పరుగులు పెట్టడం.. రోడ్డుపక్కన ఊరేగింపు చూడడానికి నిల్చున్నవారిని భయపెట్టి ఏడిపిస్తుంటే, మేమంతా నవ్వడం. అంతేనా, చక్కగా కిరాణా దుకాణాల్లోకి దూరి చాక్లెట్ పొట్లాలు ఎత్తుకొచ్చి మాపైకి విసురుతుంటే, వాటిని అందుకోవడానికి మేం పడే పాట్లు అన్నీ ఇన్నీ కాదు. హనుమంతుడు వస్తే ఎవరైనా పక్కకు తప్పుకోవాల్సిందే. అలా కాదని ఎవరైనా దర్జాగా సైకిల్ పై ఎదురొచ్చారనుకోండి (స్కూటర్లు, బైకులు ఎక్కిరాకూడదా అని అనుకోకండి, ఎందుకంటే మా చిన్నప్పుడు మా ఊరిలో ఎక్కువగా సైకిళ్లే ఉండేవి), వాటిన్ని లాక్కొని హనుమంతుడు గారు తొక్కుకుంటూ వెళ్లిపోయేవారు. ఇక తెలిసిందే కదా.. దానివెనుకే మా పరుగులు.
ఆర్టీసీ బస్సులు మా సామి ముందు ఆగాల్సిందే. బస్సులపైకి ఎక్కడం.. డ్రైవర్ ముందు తోక ఊపుతూ అల్లరి చేయడం, ధైర్యంగా చూస్తున్న చిన్నపిల్లలకు అరటిపళ్లు అందించడం ఇలా ఎన్నో పనులు చేసేవాడు. ఆ హనుమంతుడితో తిరిగితే మాకు సమయం తెలిసేదే కాదు. ఇక రంగులు పూసుకోవడాలన్నీ మాకు తెలియకుండానే జరిగిపోయేవి. మధ్యాహ్నం ఇంట్లోంచి బయటపడినవాళ్లం తిరిగి ఇంటికొచ్చేసరికి ఏ తొమ్మిదో పదో అయ్యేది.
హనుమంతుడి గురించి చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఒకరున్నారు. ఆయనే ఆదయ్య. మా ఇంటి పక్కనే ఇల్లు. చూడడానికి భారీ విగ్రహం. చాలా మంచి మనిషి, నిదానస్తులు. చాలా కాలం పాటు ఆయనొక్కడే హనుమంతుడి వేషాన్ని వేశారు. ఆ వేషం వేయగానే, పూర్తిగా మారిపోయేవారు. 50 ఏళ్లు దాటిన తర్వాత కూడా అత్యం ఉత్సాహంగా చిందులు వేస్తూ పరుగులుపెడుతుంటే, మేం ఆశ్చర్యపోయేవాళ్లం. ప్రస్తుతం ఆయన లేరు. ఆయన తర్వాత కొంతమంది వేసినా, ఆయనలా మాత్రం ఎవరూ మెప్పించలేకపోయారు.
ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నాననే డౌట్ మీకొచ్చిందా.. హైదరాబాద్లో జరుగుతున్న నిమజ్జనాలు చూస్తుంటే, కళ్లముందు నా చిన్ననాటి ఈ జ్ఞాపకాలు లీలగా మెదిలాయి. అందరితో పంచుకుందామని. ఇంతకీ మీ ఊరిలో ఎలా జరిగేది? ఓపిక ఉంటే మీ అనుభవాలూ పంచుకోండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
చాలా బాగా వ్రాసారు. ఒక సరదా విషయం గానే కాక పండుగలవెనుక వుండే ఆంతర్యాన్ని ఈ ఉదంతం తెలియచెబుతుంది.