10, సెప్టెంబర్ 2010, శుక్రవారం
చవితి చంద్రుడిని ఎందుకు చూడకూడదు?
చందమామ అంటే అందరికీ ఇష్టమే. సూర్యుడినైనా అప్పుడప్పుడు తిట్టుకుంటామేమో కానీ, పండువెన్నెలను పంచే చందమామను మాత్రం తిట్టుకోం. ఎంతో అందంగా కనిపించి, అందరినీ ప్రశాంతతను అందించే చంద్రుడికి వినాయకచవితి రోజు మాత్రం తిప్పలు తప్పవు. చవితి రోజున చంద్రుడిని చూడకూడదంటూ చెప్పడమే అందుకు కారణం. అసలు చవితి రోజున చంద్రుడుని ఎందుకు చూడకూడదు..? ఏదైనా బలమైన కారణం ఉందా..?
శ్రీకృష్ణుడిపై నిందలు
అవతారపురుషుడైన శ్రీకృష్ణుడూ వినాయకుడి శాపం వల్ల ఇబ్బందులు పడాల్సి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ప్రచారంలో ఉన్న కథల ప్రకారం చవితిరోజున అనుకోకుండా చందమామను చూశాడు శ్రీకృష్ణుడు. వాస్తవానికి చంద్రుడిని చూడకూడదని మనసులో ఎంతగానో అనుకున్నా... పాలల్లో కనపడి శ్రీకృష్ణుడి ప్రయత్నాలను వమ్ము చేస్తాడు చంద్రుడు. ఆ తర్వాత, శమంతకమణిని అపహరించారడన్న అపవాదును శ్రీకృష్ణుడిపై వేస్తాడు దాని యజమాని సత్రాజిత్తు. ఈ నిందను మాపుకోవడానికి శ్రీకృష్ణుడు శమంతకమణిని వెతకడానికి బయల్దేరతాడు. జాంబవంతుడివద్ద ఉందని తెలుసుకుని యుద్ధం చేసి, దాన్ని సాధిస్తాడు. శమంతకమణిని తెచ్చి సత్తాజిత్తుకు ఇచ్చి అసలు విషయాన్ని చెప్పాడు శ్రీకృష్ణుడు. తన తప్పు తెలుసుకున్న సత్రాజిత్తు క్షమాపణ కోరడంతో పాటు, తన కుమార్తె సత్యభామను కృష్ణుడికిచ్చి వివాహం జరిపిస్తాడు.
ఎన్నో కథలు..
చవితి రోజు చంద్రుడిని చూడొద్దని చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. గణాధిపతి పట్టాభిషేకం సమయంలో జరిగిన సంఘటనను పార్వతీపరమేశ్వరులకు సాష్టాంగ నమస్కారం చేయాలనుకుంటాడు వినాయకుడు. అయితే పెద్దబొజ్జకావడంతో తల నేలకానితే, కాళ్లు గాలిలోకి తేలిపోవడం, కాళ్లు నేలకు ఆనితే, తల గాల్లోకి తేలిపోవడం జరుగుతుంది. గణపతి పాట్లు చూసి పక్కున నవ్వుతాడు చంద్రుడు. అంతే దిష్టి తగిలి, బొజ్జపగులుతుంది. దీంతో పార్వతీదేవి చంద్రుడిని శపించిందని కొంతమంది, గణపతే స్వయంగా శపించాడని మరికొంతమంది చెబుతుంటారు.
మరో కథ ప్రకారం చవితిరోజున భూలోకంలో ఉండ్రాళ్లు బాగా తిని, ఆయాసంతో కైలాసానికి వస్తున్న గణపతికి చంద్రుడు ఎదురవుతాడు. నడవలేకనడుస్తున్న బొజ్జగణపయ్యను చూసి చంద్రుడు పరిహాసమాడతాడు. దీంతో, కోపం తెచ్చుకున్న చంద్రుడు నిన్ను చూసినవాళ్లకు నిందలు తప్పవని హెచ్చరిస్తాడు. దేవతలంతా శాంతించమని వేడుకొనడంతో శాపాన్ని చవితిరోజుకే పరిమితం చేస్తాడు. ఆ రోజు నుంచి చవితినాడు చంద్రుడిని ఎవరైనా చూస్తే, నీలాపనిందలు పడతాయని ప్రతీతి. శ్రీకృష్ణుడి కథనూ ఇందులో భాగంగానే చెబుతారు. భగవంతుడికే తప్పనప్పుడు సామాన్యులకూ తప్పవని హెచ్చరిస్తారు.
కారణం ఉందా?
ఈ కథలన్నీ అందరికీ తెలిసిందే. అయితే, ఇందులో శాస్త్రీయమైన కారణాలూ లేకపోలేదు. వినాయకచవితి వర్షాకాలంలో వస్తుంది. వాతావరణం చల్లగా ఉంటుంది. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ఉరుములు, మెరుపులు ఎక్కువగా వస్తుంటాయి. దీంతో పాటు చవితినాడు అతినీలలోహిత కిరణాలు ఎక్కువగా విడుదలవుతాయన్న వాదన కూడా ఉంది. ఆ సమయంలో ఆకాశంలోకి చూస్తే కళ్లు దెబ్బతింటాయని, దాన్ని నివారించడానికి ఎన్నో ఆచారాల్లానే చంద్రుడిని చూడకూడదన్న కట్టుబాటును విధించారని కొంతమంది చెబుతారు.
ఇక, వినాయకుడికి, చంద్రుడికి మధ్య జరిగిన సంఘటనలను గమనిస్తే మరో కోణం కూడా ఇందులో కనబడుతుంది. మానవుల ప్రవర్తను సన్మార్గంలో పెట్టడానికి చంద్రుడి శాపాన్ని ప్రస్తావిస్తారని భావించవచ్చు. వికృతరూపుడైన విఘ్నేశ్వరుడిని చూసి పరిహాసం ఆడడం వల్లే చంద్రుడికీ శాపం తగిలింది. ఎదుటివారు ఎలా ఉన్నా, వారిని సరిగ్గా గౌరవించకుండా, హేళన చేస్తే, ఎంతటివారికైనా ఇబ్బందులు తప్పవని మన పెద్దలు చేసిన హెచ్చరికను ఈ చంద్రుడిపై వినాయకుడి శాపం ద్వారా తెలుసుకోవచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
వినాయకచవితి శుభాకాంక్షలు!
Chala baga chepparu.. thanks. n happy vinayaka chavithi
వినాయక చవితి శుభాకాంక్షలు.
satyam గారూ...,గణేష్ భక్తి గీతాల పారాయణం చేద్దాం
హారం