1, సెప్టెంబర్ 2010, బుధవారం
వైఎస్ హైజాక్
జగన్ కాళ్లకు కాంగ్రెస్ పార్టీ బంధం వేసింది. వైఎస్ తొలి వర్ధంతికి ముందే దెబ్బ కొట్టింది. ఇంతవరకూ సుతిమెత్తగా, మాటలతో చెప్పి చూసినా.. జగన్ వెనక్కి తగ్గకపోవడంతో ప్రత్యక్ష చర్యలు చేపట్టింది. వైఎస్‌కు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ జగన్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే లక్ష రూపాయాల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.
వైఎస్ మరణించి ఏడాది పూర్తికావస్తోంది. ఇంతవరకూ వైఎస్ మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారి గురించి కాంగ్రెస్ అధినాయకత్వం ఎప్పుడూ స్పందించలేదు. కొంతమంది సీనియర్ నేతలైతే అవి, వైఎస్‌కోసం చేసుకున్న ఆత్మహత్యలే కావని చెప్పారు. మరి, ఇప్పుడు సడన్‌గా ఆర్థిక సాయాన్ని ఎందుకు ప్రకటించింది? నిజంగా వైఎస్ అభిమానులపై ప్రేమతోనా? ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలను ఆదుకోవాలనేనా? లేదంటే జగన్‌ను అడ్డుకోవడం కోసమేనా? నిజంగా వైఎస్ అభిమానుల కోసమే అయితే.. ఏడాది పాటు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వేచి చూసిందన్నది సమాధానం లేని ప్రశ్నే. కనీసం, ఆత్మహత్యలు చేసుకున్నవారి కుటుంబాలను ఆదుకుంటామని ఎప్పుడూ మాటమాత్రంగానైనా చెప్పలేదు. కాబట్టి, ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసమే ఈ సాయం చేస్తున్నారని భావించలేం. ఇక మిగిలింది.. జగన్‌ను అడ్డుకోవడం కోసమే. జగన్‌ను ఓదార్పుయాత్రకు బ్రేక్ వేయాలంటే.. ఇంతకన్నా మేలైన మార్గం కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు కనిపించినట్లు లేదు. వైఎస్ పేరు చెప్పుకొని జనంలోకి దూసుకువెళుతున్న జగన్‌ను అడ్డుకోవడానికి చిట్టచివరి అస్త్రంగా ఈ లక్ష రూపాయల ప్రకటన చేసి ఉండొచ్చు. అయితే.. దీనిపై జగన్ వర్గం మాత్రం కాస్త ఘాటుగానే స్పందించింది.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, జగన్ ఓదార్పు యాత్ర విషయంలో చూపిస్తున్న పట్టుదల, యాత్రను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు.. ఇలా అన్నింటినీ పరిశీలిస్తే... ఆర్థికసాయం ప్రకటన విషయంలో ఏదో మతలబు ఉందన్న విషయం బోధపడుతుంది. అయితే.. ఈ ఆర్థిక సాయం ద్వారా ఢిల్లీ పెద్దలు అనుకున్నది సాధించగలగుతారా? కాంగ్రెస్ క్యాడర్‌లో జగన్ ప్రతిష్ట పెరగకుండా చూడగలుగుతారా..?
జగన్ చేస్తున్న ఓదార్పు యాత్ర.. కాంగ్రెస్ పార్టీని మొదట్నుంచీ కలవరపెడుతూనే ఉంది. పార్టీ అభిమతానికి పూర్తిగా విరుద్ధంగా జరుగుతుండడం.. పార్టీ యాత్రలా కాకుండా వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునే యాత్రలా సాగుతుండడంపై ఎన్నో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జగన్ దూకుడుకు కళ్లెం వేయడానికి స్వయంగా సోనియానే రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది. ఓదార్పు వద్దని చెప్పినప్పటికీ, ఫలితం లేకపోయింది. అందరి ఆదేశాలనూ ధిక్కరిస్తూ జగన్ ఓదార్పు యాత్రను కొనసాగిస్తూనే ఉన్నారు.
టార్గెట్ జగన్
ఆర్థికసాయం అందించే విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆర్థిక సాయాన్ని అందించే విషయంలో, జిల్లాస్థాయి పార్టీ కేడర్‌నే క్రియాశీలకం చేసింది. స్థానిక ఎంపీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు కలిసి సాయాన్ని అందించేలా ప్రణాళికను రూపొందించింది. దీని ద్వారా.. జగన్‌ను రాష్ట్రమంతటికీ కాకుండా, కేవలం కడప జిల్లాకు మాత్రమే పరిమితం చేసింది. దీన్నిబట్టి కాంగ్రెస్ హైకమాండ్ ఎత్తుగడను అర్థం చేసుకోవచ్చు. ఓదార్పు యాత్రను ఆపమని ఈ ప్రకటన ద్వారా సంకేతాలను కాంగ్రెస్ ఇచ్చింది. మరి జగన్ యాత్రను ఆపివేస్తారా..? పార్టీ ఓదార్పులో పాల్గొంటారా? దీనికి జగన్ అనుచరుల నుంచి మాత్రం స్పష్టమైన సమాధానమే వస్తోంది. పార్టీ అందించే ఆర్థిక సాయంతో పోల్చితే, బాధిత కుటుంబాలకు జగన్ అందించే అండదండలే ముఖ్యమంటున్నారు.
జగన్ చేస్తున్నఓదార్పు యాత్రకు, కాంగ్రెస్ పార్టీ చేయబోయే ఆర్థిక సాయం ఏమాత్రం ప్రత్యామ్నయం కాదన్న అభిప్రాయాన్ని జగన్ వర్గం వ్యక్తం చేస్తోంది. అసలు జగన్ చేస్తున్న ఓదార్పు యాత్రను ఆపాల్సిన అవసరమే లేదంటోంది. దీన్ని బట్టి, కాంగ్రెస్ అధిష్టానానికి అనుగుణంగా మారే ఆలోచనే లేదని సంకేతాలిస్తోంది. దీనికి అనుగుణంగానే జగన్ కూడా ఓ ప్రకటనను విడుదల చేశారు. సోనియాకు కృతజ్ఞతలు చెబుతూనే, పార్టీ నేతలంతా తనతో కలిసి రావాలని కోరారు. మొత్తంమీద చూస్తే, కాంగ్రెస్ వేసిన ఈ ఎత్తుగడకూ జగన్ లొంగేలా కనిపించడం లేదు. ఓదార్పు యాత్ర విషయంలో ముందుగా అనుకున్నట్లే సాగిపోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
అంతా వైఎస్ కోసమే..?
వైఎస్ రాజశేఖరరెడ్డి.. రాష్ట్ర రాజకీయాలనే.. కాంగ్రెస్ భవిష్యత్తును మలుపు తిప్పిన మహానేత. ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన నాయకుడు. ప్రజల ఆదరాభిమానాలను అందిపుచ్చుకుని తన ప్రతిష్టను ఆకాశమంత ఎత్తుకు పెంచుకున్న గొప్ప నాయకుడు. వివాదాలు, ఆరోపణలు ఎన్ని ఉన్నప్పటికీ, ప్రజాధారణ విషయంలో మాత్రం వైఎస్‌ను మించిన వారు ఇటీవలి కాలంలో లేరనే చెప్పాలి. అందుకే, కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపిస్తున్న సోనియా, రాహుల్‌గాంధీలకు ఏమాత్రం శ్రమ ఇవ్వకుండా.. అన్నీతానై కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకురాగలిగారు వైఎస్.
పథకాల విషయంలోనూ వైఎస్‌ది ప్రత్యేక శైలి. ప్రభుత్వంపై భారం పడుతున్నా లెక్కచేయక, ఎన్నో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయగలిగారు. ఉచిత విద్యుత్, రెండు రూపాయల కిలోబియ్యం, నెలనెలా ఫించన్లు, విద్యార్థులకు స్కాలర్‌షిప్పు, ఫీజు రీఎంబర్స్‌మెంట్లు... ఇలా ఎన్నో పథకాలతో ప్రజలకు దగ్గరయ్యారు. అంతేకాదు, ముఖ్యమంత్రైనంత మాత్రాన రాజధానికే పరిమితం కాకుండా.. రాష్ట్రం నలుమూలలా విశేషంగా పర్యటించారు. ప్రజలతో మమేకమయ్యారు. కాంగ్రెస్ ప్రతిష్టను ప్రజల్లో పెంచారు. చెప్పాలంటే, కాంగ్రెస్‌కే ఐకాన్‌గా మారిపోయారు.
2009 ఎన్నికల్లో కలిసికట్టుగా కదిలిన విపక్షాలను ఓడించి, కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే దానికి కారణం వైఎస్ మాత్రమే. కొత్త పథకాలను ప్రకటించకుండానే, కాంగ్రెస్‌కు విజయాన్ని అందించి సంచలనం సృష్టించారు వైఎస్. అలాంటి వైఎస్.. అనూహ్యంగా తెరమరుగయ్యారు. చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వెళుతూ.. పావురాలగుట్టలో అంతనార్థమయ్యారు. రాష్ట్రాన్ని శోకసంద్రంలో ముంచెత్తారు.
వైఎస్‌కు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్‌కు ఈ అభిమానం అవసరం ఎంతో ఉంది. వైఎస్ తనయుడిగా, ఆయన అడుగుజాడల్లో రాష్ట్ర నేతగా ఎదగాలని జగన్ కోరుకుంటున్నారు. అయితే, అందుకు ఎక్కువ కాలాన్ని వెచ్చించడానికి మాత్రం ఆయన సిద్ధంగా లేరు. అందుకే, ఇంటిటికీ ఓదార్పుయాత్రను చేపట్టారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తున్నారు. అంతేకాదు.. యాత్రలో భాగంగా చాలా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ర్యాలీలు చేపడుతున్నారు. చెప్పాలంటే.. ఓ రాజకీయ యాత్రలా ఓదార్పును సాగిస్తున్నారు. వైఎస్‌కి ప్రత్యామ్నయంగా జనానికి చేరువ కావాలని జగన్ భావిస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం, ఇతర నేతలు ఎంత చెప్పినా వినడం లేదు.
వైఎస్ ఇమేజ్‌నంతటినీ జగన్ క్యాష్ చేసుకోగలిగితే, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పకపోవచ్చు. అందుకే వైఎస్ తమ పార్టీనేతన్న విషయాన్ని కాంగ్రెస్ అందరికీ చాటి చెప్పాలనుకొంటోంది. జనంలో వైఎస్‌కు ఉన్న ఇమేజ్‌ను పార్టీకి ఆపాదించుకునే ప్రయత్నంలో ఉంది. ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వైఎస్‌లాంటి ప్రభావశీలి కాంగ్రెస్‌పార్టీకి ఎంతో అవసరం. వైఎస్ లేరు కాబట్టి ఆయన పేరును వాడుకుంటే ఓట్లు రాలతాయి. పైగా జగన్ శక్తికూడగట్టుకుంటే కాంగ్రెస్‌కు పక్కలో బల్లెంలా తయారవుతారు. ఇప్పటికే చెప్పిన మాట వినని జగన్‌ను ఎదగనిస్తే, మరింత ప్రమాదకరమని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. వైఎస్ ఇమేజ్‌ను పార్టీకి దక్కించుకోవడం కోసమే ఆత్మహత్యలు చేసుకున్నవారి కుటుంబాలకు ఆర్థికసాయాన్ని ప్రకటించింది.
వైఎస్ ఓట్లు తెచ్చిపెట్టే మంత్రదండమన్న విషయం తెలుసుకాబట్టే, జగన్ దేనికైనా సిద్ధమంటున్నారు. ఆ విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ కూడా తెలుసుకుంది కాబట్టే, చరిత్రలో తొలిసారిగా ఆత్మహత్యలు చేసుకున్నవారిని ఆర్థికంగా అడ్డుకోవడానికి ముందుకొచ్చింది. మొత్తంమీద చూస్తే.. అటు జగన్, ఇటు కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి వారే, వైఎస్ ఇమేజ్‌ను హైజాక్ చేయాలని భావిస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Congress Party లొ చచ్చిన వాళ్ళకు వున్న విలువ భ్రతికివున్న వారికి వుండదు.
ఉదాహరణకు:
1) Mahatma Gandhi
2) Nehru
3) India
4) Rajiv
5) YSR
6) and many more ....
They name all development programs after dead people. Mainly after Nehru, Indira and Rajiv. It looks like that Sonia name will be added to this list later.
"2009 ఎన్నికల్లో కలిసికట్టుగా కదిలిన విపక్షాలను ఓడించి, కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే దానికి కారణం వైఎస్ మాత్రమే".
It was Chiranjeevi who was responsible for Congress win by splitting votes in about 70 seats.
In majority of those seats Congress won with less than 1000 votes.
YSR was the most corrupt person in 21st century all over the world. He looted about 2 Lakh Crore Rupees in about 6 years.
He was a Jackal in Sheep's cloths. He served his masters well, who were handling him from West Asia and Italy.
నా అభిప్రాయం వైఎస్ కరెప్టా కాదా అన్నదానిపై కాదు. రాష్ట్రంపై తనదైన ముద్ర వేశాడా అన్నదానిపైనే. వైఎస్ హయాంలో ఎంతో అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిని ప్రస్తుత ప్రభుత్వం వెలికి తీయాలి. దోషులెవరో, ఎంత అవినీతి జరిగిందో తెలియాలి.
అయితే, వైఎస్ వల్ల రాష్ట్రానికి, సామాన్యులకు కలిగిన లబ్ది గురించి మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావించాను. దాన్ని గమనించగలరు.
108, ఆరోగ్య శ్రీ అవసరంలో ఉన్న ఎంతోమందికి ఉపయోగపడడం కళ్లారా చూశాను. అంతేకాదు, పెన్షన్ వస్తుందో రాదో అంటూ ప్రభుత్వకార్యాలయాల చుట్టూ ఒకప్పుడు తిరిగినవారు ఇప్పుడు, ఒకటో తేదీనే దర్జాగా అందుకోవడమూ చూశాను. స్వతహాగా కాంగ్రెస్ పార్టీ అన్నా, వైఎస్ అన్నా సదభిప్రాయం ఉండేది కాదు. కానీ, వీటిని చూసిన తర్వాత వైఎస్ పై ఉన్న చెడు అభిప్రాయం మాత్రం తొలిగిపోయిందని చెప్పగలను.