30, ఆగస్టు 2010, సోమవారం
వివాదాల వర్మ
రక్త చరిత్ర ఎవరి చరిత్ర? రెండు కుటుంబాల కథా? లేక మూడు కుటుంబాల కథా?
అనంతపురం ఫ్యాక్షన్ చరిత్రను తెరకెక్కించే పనిలో ఉన్నారు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. ఇది రెండు కుటుంబాల మధ్య జరిగిన ఆధిపత్య పోరాటమే అయిఉండొచ్చని అంతా భావించారు. కానీ.. ఇది రెండు కుటుంబాల సినిమాలా లేదు. ఈ సినిమాలో మరో కుటుంబానికీ వర్మ స్థానం కల్పించినట్లు తెలుస్తోంది. అంటే మూడు కుటుంబాల కథన్నమాట రామ్‌గోపాల్ వర్మ రక్త చరిత్ర. ఆ మూడో కుటుంబాన్ని చూపించిన తీరుపైనే ఇప్పుడు అనుమానాలు.. అభ్యంతరాలు.
అనంతపురం జిల్లాకు చెందిన ఫ్యాక్షన్ లీడర్ సానా చెన్నారెడ్డి కుమారులు రమణారెడ్డి,ఓబుల్‌రెడ్డిలను విలన్లుగా చిత్రీకరించారని వారి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రయలర్స్‌లో ఉన్న దృశ్యాలు తమ కుటుంబ పరువును చులకనచేసేలా ఉన్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి చెన్నారెడ్డి నలుగురు కుమార్తెలు లీగల్ నోటీస్‌ను రామ్‌గోపాల్ వర్మకు పంపించారు. చంపుతామంటూ ఫోన్‌కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు పదేపదే వస్తున్నాయంటూ వర్మ వాపోతున్నారు. అయితే.. ఎవరి బెదిరింపులకూ తాను లొంగననీ స్పష్టంగా చెబుతున్నారు. దీనికి సంబంధించి ఓ ప్రకటనను కూడా మీడియాకు విడుదల చేశారు. ఓబుల్‌రెడ్డి దెయ్యమై వచ్చినా జంకనని చెప్పి ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశారు రామ్‌గోపాల్ వర్మ.
అయితే.. ఈ వివాదాన్ని రామ్‌గోపాల్ వర్మ కావాలనే పెద్దది చేస్తున్నారా..? సినిమా ప్రచారం కోసం పావుగా వాడుకుంటున్నారా? అన్న అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే, మే 22న ఈ లీగల్ నోటీస్‌ను వర్మకు చెన్నారెడ్డి కుమార్తెలు పంపించారు. ఈ నోటీస్‌ను అందుకొని కూడా చాలా కాలమే అయ్యింది. దాదాపు మూడు నెలల తర్వాత ఈ విషయాన్ని బయట పెట్టడమే ఇప్పుడు సందేహాలను రేకెత్తిస్తోంది. మరికొన్ని రోజుల్లోనే రక్త చరిత్ర విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో.. లీగల్‌నోటీస్ వ్యవహారం ద్వారా లబ్దిపొందాలన్నదే వర్మ ప్లాన్ అన్నఅనుమానాలూ ఉన్నాయి
ఓబుల్‌రెడ్డి ఎవరు?
ఓ వైపు పరిటాల రవి.. మరో వైపు మద్దెలచెర్వు సూరి. ఇద్దరూ ఇద్దరే. పగప్రతీకారాలకు ఇద్దరూ నిలువెత్తు నిదర్శనం. అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్‌ను పతాకస్థాయిలో నడిపించిన వ్యక్తులు. రక్తచరిత్ర సినిమా అందరినీ ఆకట్టుకుంటోందంటే వీరద్దరి పాత్రలే కారణం. అయితే.. ఇదంతా ఇప్పటివరకూ మాత్రమే. ఇప్పుడు మాత్రం మరో పాత్ర అందరినీ ఆకర్షిస్తోంది. అదే ఓబుల్‌రెడ్డి క్యారెక్టర్.
పరిటాల రవి, మద్దెలచెర్వు సూరి, ఓబుల్‌రెడ్డి ముగ్గురూ అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్‌ను పెంచిపోషించినవారనే చెప్పాలి. పరిటాల రవి తండ్రి శ్రీరాములకు, సూరి తండ్రి నారాయణరెడ్డి, అతని అనుచరుడిగా భావించే సానా చెన్నారెడ్డిల మధ్య విభేదాలు మొదలయ్యాయి. అవి క్రమంగా పెరిగి పెద్దవయ్యాయి. శ్రీరాములు హత్య అనంతరం నారాయణరెడ్డి, చెన్నారెడ్డిల హవా పెరిగింది. 1989లో చెన్నారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయన కుమారుడు ఓబుల్‌రెడ్డి అనేక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ధర్మవరంలోని ఓ థియేటర్‌లో తమిళనాడు మహిళపై రేప్‌కేసు ఓబుల్‌రెడ్డిపై నమోదయ్యింది. దీంతో పాటు ఓ ఇంజనీర్ భార్యను కూడా రేప్ చేసినట్లు ఆరోపణలున్నప్పటికీ, అది కేస్‌గా నమోదు కాలేదు. సరిగ్గా ఈ రెండింటినీ రక్తచరిత్రలో ఓబుల్‌రెడ్డి పాత్ర ద్వారా రామ్‌గోపాల్ వర్మ చూపించినట్లు తెలుస్తోంది.
అయితే.. ఈ రేప్ కేసులతో ఓబుల్ రెడ్డికి ఏమాత్రం సంబంధం లేదంటున్నారు ఆయన కుటుంబ సభ్యులు. థియేటర్లో రేప్ను సూరి సోదరుడు చేస్తే.. దాన్ని తమ సోదరుడిపై మోపారని ఆరోపిస్తున్నారు చెన్నారెడ్డి కుమార్తెలు. ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకోకుండానే చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబ పరువు మంటగలిపేలా ఉన్న ఈ సన్నివేశాలను తక్షణం తొలగించాలని చెన్నారెడ్డి కుమార్తెలు డిమాండ్ చేస్తున్నారు.
రక్తచరిత్ర సినిమా తీయడానికి ముందుగానే, రామ్‌గోపాల్ వర్మ అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఈ సినిమా కథతో సంబంధం ఉన్న పరిటాల రవి, మద్దెలచెర్వు సూరి కుటుంబాలను కలిసి కథపై చర్చలు జరిపారు. రెండు కుటుంబాలకూ న్యాయం చేయడం కోసం, రెండు పార్టులుగా సినిమా తీస్తున్నారు. అయితే.. ఫ్యాక్షన్‌ను పెంచి పోషించిన రవి, సూరిలను హీరోలుగా చూపిస్తూ.. ఓబుల్‌రెడ్డిని మాత్రం విలన్‌గా చూపిస్తున్నారని ఆయన కుటుంబసభ్యులు విమర్శిస్తున్నారు. కనీసం ఈ విషయంలో తమ కుటుంబాన్ని సంప్రదించకపోవడంపైనా మండిపడుతున్నారు.
ఈ ఆరోపణలు నిజం కాదంటూ రామ్‌గోపాల్ వర్మ సింపుల్‌గా కొట్టిపడేస్తున్నా, రక్తచరిత్రలో మాత్రం అనేక వివాదాస్పద అంశాలను స్పృశించినట్లు సమాచారం. ఓ తెలుగు సినిమా హీరోకు పరిటాల రవి గుండు కొట్టించినట్లు చూపించే సన్నివేశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోనే స్వయంగా రామ్‌గోపాల్ వర్మే నెట్‌లో పెట్టారు. అయితే.. ఆ క్యారెక్టర్ ఎవరిదన్న విషయాన్ని మాత్రం వర్మ గోప్యంగా ఉంచారు. మొత్తంమీద చూస్తుంటే, వివాదాల ఆధారంగానే సినిమాకు ప్రమోషన్ దక్కించుకోవచ్చని వర్మ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మాఫియాతో పెట్టుకున్నవర్మ
టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు ప్రయాణం సాగించిన వర్మ, సున్నితమైన అంశాలనే తన సినిమాలకు కథగా ఎంచుకున్నాడు. ముఖ్యంగా ముంబై కేంద్రంగా సాగే మాఫియాను ఎక్కువగా టార్గెట్ చేసుకున్నాడు. 1998లో తొలిసారి ముంబై అండర్‌వరల్డ్‌ను సత్య రూపంలో వెండితెరకెక్కించాడు. అప్పట్లోనే వర్మకు మాఫియానేతల బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.
సత్య హిట్‌తో మాఫియా కథలపై మరింత మక్కువ పెంచుకున్నాడు రాము. అందుకే.. 2002లో కంపెనీ పేరుతో మరో సినిమాను తీశాడు. అండర్‌వరల్డ్ కింగ్ దావూద్ ఇబ్రహీంకు, అతని ప్రధాన అనుచరుల్లో ఒకరైన చోటారాజన్‌కు మధ్య చోటుచేసుకున్న సంఘటనలకు సంబంధించిందన్న వాదనలున్నాయి. ఈ సినిమా విషయంలోనూ మాఫియా ముఠాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు వర్మ.
సత్య, కంపెనీ రెండూ విజయవంతం కావడంతో.. మరో మాఫియా సినిమా తీశాడు. ఈసారి నేరుగా దావూద్ గ్యాంగ్‌నే లక్ష్యం చేసుకున్నాడు. D - పేరుతో ఓ సినిమాను నిర్మించాడు. అయితే.. దావూద్ సోదరి ప్రివ్యూ చూసిన తర్వాతే సినిమాను విడుదల చేయాల్సి వచ్చిందన్న వదంతులున్నాయి. అదంతా నిజం కాదని వర్మ చెప్పినా... డీ-కంపెనీ అనుమతి తర్వాతే లైన్ క్లియర్ అయినట్లు సమాచారం.
తీవ్రవాదులకు సంబంధించి తీసిన కాంట్రాక్ట్ సినిమా కూడా వివాదాల్లో చిక్కుకుంది. సినిమా విడుదలైన కొన్ని రోజులకే అహ్మదాబాద్‌లో పేలుళ్లు జరగడం, సినిమాలో చూపించినట్లే ఓ హాస్పిటల్ సమీపంలో బాంబులు పేల్చడం.. వర్మను విమర్శల పాలుచేశాయి.
అంతేకాదు, వర్మ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సర్కార్, సర్కార్ రాజ్‌లు రెండూ వివాదాలతోనే పాపులర్ అయ్యాయి. శివసేన అధినేత బాల్‌థాక్రే జీవితం ఆధారంగా సర్కార్ తీశారని తొలుత ఆరోపణలు వస్తే, రాజ్‌థాక్రే క్యారెక్టర్‌ను చెడుగా చూపించారన్న విమర్శలు సర్కార్‌రాజ్‌లో విషయంలో వచ్చాయి. అయితే, కీలకమైన వ్యక్తులకు ప్రత్యేక ప్రదర్శనలు వేసి చూపించి, సినిమా విడుదలకు ఉన్న ఆటంకాలను తొలగించుకోగలిగాడు వర్మ.
ఇలా మాఫియా ముఠాలతోను, మరాఠా వాదులతోనూ నెగ్గుకొచ్చిన రామ్‌గోపాల్ వర్మ, అనంత ఫ్యాక్షన్ నేతలను ఎదుర్కోవడం పెద్ద సమస్య కాదనుకుంటున్నారు. పైగా, చెన్నారెడ్డితో పాటు, ఆయన కుమారులు ఓబుల్‌రెడ్డి, రమణారెడ్డిలు ప్రస్తుతం జీవించి లేరు కాబట్టి, వారి క్యారెక్టర్లను ఎలా చూపించినా ఇబ్బంది ఉండదన్న అభిప్రాయంలో వర్మ ఉండొచ్చు. ప్రస్తుతానికి, స్టోరీ ఎవరికీ తెలియదని చెబుతున్నా, క్యారెక్టర్లు పోషించిన వారి పేర్లు, ట్రయలర్స్‌లో కనిపిస్తున్న దృశ్యాలు మాత్రం ఓబుల్‌రెడ్డి పాత్రను విలన్‌గానే చూపిస్తున్నాయి. లీగల్‌గా ఇబ్బందులు వచ్చినప్పటికీ, వాటిని తనదైన శైలిలో ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు. పైగా.. వర్మ తీసిన మరికొన్ని సినిమాలు కూడా వివాదాల కారణంగానే ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయి. 60 ఏళ్ల వృద్ధుడికి, 18 ఏళ్ల అమ్మాయికి మధ్య రొమాన్స్‌ను చూపిస్తూ.. నిశబ్ద్‌ను తీశాడు. వర్మ తెగింపును అంతా విమర్శించినా.. దానివల్లే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.
ఇక ఆగ్ విషయంలోనూ ఇదే బాటను ఎంచుకున్నాడు వర్మ. బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ షోలేను రీమేక్ చేశాడు. అయితే, క్యారెక్టర్లు, కథ విషయంలో షోలే డైరెక్టర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పేర్లను మార్చేశాడు. వివాదాల కారణంగానే ఆగ్ పాపులర్ అయినప్పటికీ, సినిమా మాత్రం బాక్సాఫీస్‌వద్ద బోల్తా పడింది. ఇలాంటి సినీట్రిక్కులు బహుశా రామ్‌గోపాల్ వర్మకు తెలిసినంత బాగా మరెవరికీ తెలిసి ఉండకపోవచ్చు. అందుకే, భారీబడ్జెట్ టాప్‌హీరోల సినిమాలు విడుదలైన తర్వాత వచ్చే రక్తచరిత్రకు ఊహించని పాపులారిటీని తెచ్చిపెడుతున్నాడు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి