22, జులై 2010, గురువారం
సిగ్గు సిగ్గు
దేశం మొత్తంమీద మనమే నెంబర్ వన్..
మనల్ని మించినోళ్లు.. దేశం మొత్తంమీదా లేనే లేరు..
ఇంతకీ ఈ ఘనత ఎందులో..
అభివృద్ధిలోనా... కాదు..
పోనీ.. టూరిజంలోనా.. కాదు కాదు..
ఐటీ కంపెనీలు ఎక్కువ కాబట్టి.. ఆరంగంలోనా..కానే కాదు..
వ్యవసాయం బాగుంది కాబట్టి.. పాడిపంటల్లోనా..ఛాన్సే లేదు..
భారీగా ప్రాజెక్టులు కడుతున్నాం కాబట్టి.. జలయజ్ఞంలోనా..అదీకాదు...
కార్పొరేట్ కాలేజీలు ఎక్కువ కాబట్టి.. ఎడ్యుకేషన్‌లోనా.. అక్కడా మనది వెనుకడుగే..
మరి ఎందులో అని అనుకుంటున్నారా...?
చెబితే కళ్లు తిరుగుతాయి.. సిగ్గుసిగ్గనుకుంటారు.. ఇంత నీచమా అని ఆలోచిస్తారు..
అదే.. వ్యభిచారం..
అవును.. దేశం మొత్తంమీద ప్రభుత్వం గుర్తించిన సెక్స్ వర్కర్లు మనరాష్ట్రంలోనే ఎక్కువట. కచ్చితంగా సంఖ్య చెప్పాలంటే లక్షా 5 వేల 985 మంది. ఇది అల్లాటప్పాగా చెబుతున్న విషయం కాదు. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ గుర్తించిన సంఖ్య ఇది. దేశంమొత్తంమీద ప్రభుత్వం గుర్తించిన సెక్స్ వర్కర్ల సంఖ్యలో మనల్ని తలదన్నేవారు కాదు కదా.. దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. కేంద్రప్రభుత్వమే ఈ సంచలన విషయాన్ని స్వయంగా వెల్లడించింది.
మరి ఇది సిగ్గుపడాల్సిన విషయం కాదా... మనకు తలవంపులు తెచ్చిపెట్టేది కాదా.. అభివృద్ధిలోనో.. టూరిజంలోనే నెంబర్ వన్ అంటే గొప్పగా చెప్పుకోవచ్చు.. ప్రపంచవ్యాప్తంగా చాటుకోవచ్చు. కానీ.. సెక్స్ వర్కర్లలో నెంబర్ వన్ అని చెప్పుకోగలమా... అసలింతమంది సెక్స్ వర్కర్లు మన
రాష్ట్రంలో ఉన్నారంటే ఏమనుకోవాలి.. ?
ఎక్కడైనా మనవాళ్లే..
వ్యభిచారం చట్టవిరుద్ధం..
శరీరంతో వ్యాపారం చేయడం నేరం..
పట్టుపడితే కారాగారవాసమే.. అంతకు మించి సమాజంలో పరువు కూడా పోతుంది..
ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాదినే వ్యభిచారం ఎక్కువగా సాగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ రిపోర్టులు చెబుతున్నాయి. అయితే.. మన తర్వాత ఉన్నరాష్ట్రాలకు.. మనకూ మధ్య సెక్స్‌వర్కర్ల సంఖ్యలో చాలా వ్యత్యాసం ఉంది. రెండోస్థానంలో ఉన్న కర్ణాటకలో 79 వేల 120 మంది, మూడో స్థానంలో ఉన్న తమిళనాడులో 71 వేల 529 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు. రెడ్‌లైట్ ఏరియాలకు ప్రఖ్యాతి గాంచిన మహారాష్ట్ర.. 56 వేల 929 మంది సెక్స్‌వర్కర్లతో నాలుగోస్థానాన్ని దక్కించుకుంది. ఇందులో సగం మంది ఒక్క ముంబైలోనే ఉన్నారు. మెట్రో నగరాల్లో అత్యధికంగా ఢిల్లీలో 38 వేలమంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లు గుర్తించారు.
అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలతో పాటు.. వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న పూణేల్లోనూ సెక్స్‌ట్రేడ్ చిక్కుకుపోయినవారిలో ఎక్కువమంది తెలుగువారే. ఇటీవల పోలీసులు జరుపుతున్న దాడులు ఈ విషయాన్నే బయటపెట్టాయి. చివరకు పర్యాటక ప్రాంతంగా ఎదిగిన గోవాలోని సెక్స్‌వర్కర్లలో దాదాపు సగం మంది తెలుగువారే అని అంచనా. ఇలా ఇతర నగరాల్లో వ్యభిచారకూపాల్లో చిక్కుకుపోయిన వారిలో.. మన రాష్ట్రానికి చెందినవారు వేలల్లోనే ఉన్నారు.
అరెస్ట్ అయితే తమ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది సెక్స్ వర్కర్లకు తెలుసు. పేరుకు చీకటివ్యాపారమే అయినప్పటికీ మూడోకంటికి తెలియకుండా చేయడం అసాధ్యం. కస్టమర్లు రావాలంటే అందరికీ తెలియాల్సిందే. ఇక్కడే పోలీసులకు సమాచారం అందుతుంది. కానీ.. అందాల్సినవి అందినంతకాలం.. పోలీసులు వీరివైపు కన్నెత్తి కూడా చూడరు. లెక్కల్లో తేడావస్తే మాత్రం రైడ్స్ చేసి అరెస్ట్ చేస్తారు. అందరిముందూ నిలబెడతారు. పరువు తీస్తారు.
అయినా.. వ్యభిచారాన్ని వృత్తిగా ఎంచుకుంటున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా పెరుగుతోంది. ప్రతీ ఊరికీ.. ప్రతీ వాడకూ ఈ మాయదారి వ్యాపారం విస్తరిస్తోంది. ఇలా విస్తరించీ విస్తరించీ.. ఇప్పుడు మనపేరు దేశమంతా మారుమోగేలా చేసింది. ప్రభుత్వం చూపిస్తున్న లెక్కల ప్రకారం.. అధికారికంగా లక్షమంది సెక్స్‌వర్కర్లు మన రాష్ట్రంలో ఉన్నారు. వీరంతా పక్కా ప్రొఫెషనల్స్. శరీరంతో వ్యాపారం చేసుకుంటున్నవారు.. రాత్రీ పగలూ తమశరీరాన్ని పుండు చేసుకుని సంపాదించుకుంటున్నవారు. ఇంతమంది సెక్స్ వర్కర్లు రాష్ట్రంలో ఉండడమే సిగ్గుచేటు. వీరంతా ఈ వ్యాపారంలోకి ఎలా వచ్చారు? అభివృద్ధి విషయంలో ప్రభుత్వాలు చెప్పుకొనే గొప్పలు.. వీరి విషయంలో ఏమయ్యాయి. ? ఆహారం, ఉపాధి సరిగ్గా అందితే.. ఇలా బజారులో నిలబడాల్సిన అవసరం వీరికి వచ్చేదా?
బతుకుదెరువా?
మీకు కనిపించిన ఏ సెక్స్ వర్కర్‌నైనా కదిలించండి.. వారు చెప్పే సమాధానం ఒక్కటే. బతుకుదెరువుకు మరో దారిలేక వ్యభిచారాన్ని ఎంచుకున్నామనే. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు, అదీ అత్యంత సులువుగా సంపాదించుకోగలడమే.. మహిళలను ఈ వృత్తిలోకి దింపుతోంది. గ్రామీణప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు దెబ్బతినడం, పట్టణాలకు వలసలు పెరగడం, వేశ్యావృత్తిని ఎంచుకోవడం.. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడిఉన్నవే. దీనికి తోడు.. వంచించి కొందరు, మాయమాటలు చెప్పి మరికొందరు అమ్మాయిలను ఈ వృత్తిలోకి దించుతున్నారు.
చాలా మంది కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే సెక్స్‌వర్కర్లుగా మారుతున్నట్లు ఇటీవల జరిపిన పరిశోధనలు వెల్లడించాయి. సెక్స్‌వర్కర్లుగా మారుతున్న వారిలో చాలామంది పేద,దిగువ మధ్యతరగతి ప్రజలే ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక మరో కళ్లుచెదిరే వాస్తవం.. హెచ్‌ఐవీ సోకిన వారు వ్యభిచారంలోకి దిగడం. సెక్స్‌వర్కర్లను కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఈ విషయమూ బయటపడింది.
ఎంతోమందితో శృంగారంలో పాల్గొనే సెక్స్‌వర్కర్ల ద్వారా హెచ్‌ఐవీ సోకే అవకాశాలు చాలా ఎక్కువ. మన రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాపించడానికి ప్రధాన కారణం కూడా సెక్స్‌వర్కర్లే. ఈ విషయమూ సెక్స్ కోరుకునే ప్రతీ ఒక్కరికీ తెలుసు. అయినా.. సురక్షితం కాని శృంగారానికి పాకులాడుతుంటారు. ఇలాంటి వారివల్లే.. ఈ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతోంది. స్వచ్చంధ సంస్థలు, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఎంతగా చెప్పినా.. ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా వ్యభిచారానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.
అత్యంత ప్రమాదకరమైన వ్యాపారం సెక్స్. ఇక రాజకీయ నాయకులు, పోలీసుల అండదండలూ ఈ వ్యాపారానికి కావాల్సినంత ఉంటాయి కాబట్టి.. అడ్డుకట్ట వేయడం అంత సులువు కాదు. ఇలానే కొనసాగితే.. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే మనం నెంబర్ వన్ స్థానానికి అత్యంత సులువుగా చేరుకోవడం ఖాయం.
దోషులెవరు?
తరతరాలుగా కొనసాగుతూనే ఉంది వ్యభిచారం. ఓ రకంగా నీచమైన వ్యాపారం. దేశంలోనే మన రాష్ట్రం మొదటిస్థానంలోకి వెళ్లిపోయిందంటే.. ఇంత విశృంఖలంగా ఈ వ్యాపారం సాగుతుంటే.. ఆపలేమా... ఏమాత్రం సాధ్యం కాదు. అందుకు కారణం మనమున్న వ్యవస్థే. వ్యభిచారులు లక్షల్లో ఉన్నారని ఆందోళన చెందుతున్నాం.. కానీ, వారిదగ్గరకు వెళ్లే పురుషులు ఇంకెంతమంది ఉండాలి. అసలు విటులే లేకపోతే.. వ్యభిచారులు ఉంటారా? అందుకే.. మారాల్సింది సెక్స్‌వర్కర్లు కాదు.. సమాజం. అంతవరకూ మనం సిగ్గు పడాల్సిందే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి