13, జులై 2010, మంగళవారం
జగన్ కొత్త పార్టీ!
జగన్ కొత్త పార్టీ పెడుతున్నారా...?
జగన్ యాత్ర ఓదార్పుకా?
లేక రాజకీయ బలం చాటుకోవడానికా..?
జగన్ యాత్ర కొనసాగిస్తున్న తీరు చూస్తే.. ఈ అనుమానం ఎవరికైనా రావాల్సిందే. రాజకీయాలకు అతీతంగా యాత్ర సాగిస్తానని జగన్ చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం దానికి పూర్తిగా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. రాజకీయ విమర్శలను జగన్ ఎక్కుపెడుతున్నారు.. అదీ పార్టీపైనా కావడం కలవర పరుస్తోంది.. అందుకే.. జగన్ యాత్రపై ఎన్నో అనుమానాలు.. మరెన్నో విమర్శలు..
కాంగ్రెస్ పార్టీ చీలిక దిశగా పయనిస్తోందా..?
పార్టీ రెండు ముక్కలు కావడం ఖాయమా..?
జగన్ జోరు చూస్తుంటే ఈ పరిస్థితి తప్పకపోచ్చని తెలుస్తోంది. పేరుకు ఓదార్పు యాత్రే అయినా.. బహిరంగ సభల్లోనూ, రోడ్‌షోల్లోనూ జగన్ పాల్గొంటున్నారు. భారీగా జనసమీకరణ కూడా జరుగుతోంది. వైఎస్ ఆశీస్సులకు తోడు .. జనం కూడా తనతోనే ఉన్నారంటూ.. తరచుగా ప్రసంగిస్తున్నారు జగన్. ఇదంతా సానుభూతి అస్త్రంతో ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నమనే విమర్శలు వస్తున్నాయి. అందుకే.. పార్టీని చీలిపోయేందుకు కుట్ర జరుగుతోందంటూ కాంగ్రెస్ సీనియర్లు కలవర పడుతున్నారు. జగన్ యాత్రంతా కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి జరుగుతున్న కుట్రగా అనుమానపడుతున్నారు.
జగన్ బలపడుతున్నారా?
కాంగ్రెస్ క్యాడర్ జగన్‌కు అనుకూలమా?
వైఎస్‌లా రాష్ట్రస్థాయి నేతగా మారాలనుకుంటున్న జగన్.. అందుకు ఎక్కువ సమయం తీసుకోవాలనుకోవడం లేదు. ఓదార్పుయాత్రతోనే అనుకున్నవన్నీ సాధించాలనుకుంటున్నారు. అందుకే.. తనశక్తియుక్తులన్నీ ప్రదర్శించారు. అధిష్టానం వద్దన్నాయాత్ర కొనసాగిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పూర్తైన ఓదార్పు యాత్రను పరిశీలిస్తే.. జగన్‌కు జనాదరణ ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్ హైకమాండ్ వద్దన్నా.. దిగువస్థాయి శ్రేణులు యాత్రలో పెద్దఎత్తునే పాల్గొన్నాయి. దీనికి తోడు.. చిన్నచిన్న లీడర్లను కూడా కలుసుకుంటూ.. తనకు అనుకూలంగా మార్చుకోవడానికి జగన్ ప్రయత్నించారు. ఈ విషయంలో చాలావరకూ సక్సెస్ అయ్యారు. వైఎస్ ఇమేజ్ను తనకు మలుచుకోవడంలోనూ జగన్ పాక్షికంగా విజయం సాధించారనే చెప్పాలి. అందుకే.. ఇప్పుడు తన మాటల్లో పదును పెంచుతున్నారు. పార్టీ క్యాడర్ నుంచి మద్దతు దక్కించుకోగలిగానని జగన్ భావిస్తున్నారు. అందుకే.. నేరుగా అధిష్టానాన్ని ఢీకొట్టడానికే ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా జగన్‌కు నేరుగా మద్దతు పలకుతుండడంతో.. పరిస్థితి అదుపు తప్పేలానే ఉంది.
దారిమళ్లిన ఓదార్పు
వైఎస్ జయంతి సందర్భంగా శ్రీకాకుళంలో యాత్ర మొదలుపెట్టాలని జగన్ నిర్ణయించుకున్నప్పుడే కాంగ్రెస్‌లో విభేదాలు మొదలయ్యాయి. సోనియా సుముఖంగా లేకపోయినా.. ప్రజలకిచ్చిన మాటమేరకు యాత్ర చేస్తానని ప్రకటించిన జగన్.. అన్నట్లుగా శ్రీకాకుళం పర్యటన మొదలుపెట్టారు. తొలిరోజు పూర్తిగా వైఎస్ జ్ఞాపకాలు, ఓదార్పులకే పరిమితమైన జగన్.. ఆ తర్వాత మాత్రం తన వేగం పెంచారు. రాజకీయ విమర్శలు ఎక్కుపెట్టారు. ముఖ్యమంత్రిని, అధినాయకత్వాన్ని చివరకు కాంగ్రెస్ పార్టీని కూడా తులనాడుతున్నారు.
ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న జగన్‌కు ఆ అవకాశాన్ని ముఖ్యమంత్రే స్వయంగా అందించారు. ముఖ్యమంత్రి పదవికోసం జగన్ మరికొంత కాలం వేచి ఉండాలంటూ రోశయ్య చెప్పడం.. కాంగ్రెస్‌లో విభేదాలకు మరింత ఆజ్యం పోసింది. దీనిపై జనంలోనే జగన్ స్పందించారు. ముఖ్యమంత్రికి అంత భయమెందుకంటూ ప్రశ్నించారు. సీఎంను జగన్ నేరుగా విమర్శించడం ఇదే తొలిసారి.
జగన్‌కు, ముఖ్యమంత్రి రోశయ్యకు మధ్య అగాధం రోజురోజుకూ పెరుగుతోందనడానికి ఈ కామెంట్లే ఓ నిదర్శనం. ఎవరినీ లెక్కచేయకుండా.. ఎవరన్నది కూడా చూడకుండా.. జగన్ కామెంట్లు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? కాంగ్రెస్ హై కమాండ్‌ను, ముఖ్యమంత్రిని ఎందుకు విమర్శిస్తున్నారు?. ఓ వైపు రాజకీయ యాత్ర కాదంటూనే ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొనడంలేదంటూ ఎందుకు మండిపడుతున్నారు..? ఈ ప్రశ్నలు జగన్ వ్యతిరేకుల్లో ఎన్నో అనుమానాలను కలిగిస్తున్నాయి. పార్టీని తన గుప్పిటలోకి తీసుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారన్న విమర్శలూ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి.. పార్టీని చీల్చే అవకాశాలున్నాయన్నది కొంతమంది సందేహం.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జగన్ అనుకూల వర్గం, వ్యతిరేకవర్గాలుగా చీలిపోయింది. రెండు వర్గాలు నిత్యం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. సోనియాగాంధీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓదార్పు యాత్ర చేయడాన్ని జగన్ వ్యతిరేకులు విమర్శిస్తుంటే.. ఓదార్పుకు అడ్డుచెప్పాల్సిన అవసరం ఏముందంటూ అనూకూల వర్గం వాదిస్తోంది. ఈ రెండు వర్గాలు ఇప్పుడు తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును అయోమయంలో పడేసింది.
కొత్తపార్టీ పెడతారా?
కాంగ్రెస్‌లో వైఎస్.రాజశేఖరరెడ్డి ఎదురులేని నాయకుడనే చెప్పాలి. పాదయాత్ర దగ్గర నుంచి తుదిశ్వాస విడిచేవరకూ కాంగ్రెస్‌పార్టీలో ఆయనమాటే చెల్లుబాటయ్యింది. కొంతమంది నుంచి ఇబ్బందులు ఎదురైనా వాటిని తనదైన శైలిలో పరిష్కరించుకొని.. ఆధిపత్యాన్ని కొనసాగించారు వైఎస్సార్. ఆయన స్థానాన్ని దక్కించుకోవాలని ఆరాటపడుతున్న జగన్‌కు ముందునుంచే వ్యతిరేకులతో సమస్యలు మొదలయ్యాయి. ఓదార్పు యాత్రకు అడుగడుగునా అడ్డంకులూ ఎదురయ్యాయి. అన్నింటినీ అధిగమించి జనం మధ్యకు వెళ్లిన జగన్.. ఇప్పుడు తనదైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. పార్టీలోని ప్రత్యర్థుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు..
అసెంబ్లీ సమావేశాలు పెట్టి.. ఎమ్మెల్యేలను కట్టడి చేయాలన్న ముఖ్యమంత్రి రోశయ్య ప్రణాళిక పారేలా కనిపించడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యేలు ఎవరూ జగన్‌తో పెద్దగా యాత్రలో పాల్గొనలేకపోయినా.. తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. రోశయ్యకు, అధిష్టానానికి ప్రత్యక్షంగా తన బలాన్ని చూపించాలనుకున్న జగన్ అందుకు తగ్గట్లుగా పావులు కదిపారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా జగన్‌కు మద్దతుగా యాత్రలో పాల్గొంటామంటూ ప్రకటించడంతో.. కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొంది.
రాజకీయాలకు అతీతంగా ఓదార్పు యాత్ర చేస్తానని జగన్ ముందుగా చెప్పినప్పటికీ.. పరిస్థితి మాత్రం క్రమంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో తాను ఒంటరివాడిని కాదని నిరూపించుకోవాలనుకున్న జగన్.. అందుకు తూర్పుగోదావరి జిల్లా ఓదార్పు యాత్రనే వేదిక చేసుకుంటున్నారు. అందులో భాగంగానే.. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో బలప్రదర్శనకు ప్రణాళిక రచించారు. తూర్పుకు చెందిన ప్రధాన నాయకులంతా తునిలో జగన్‌కు ఆహ్వానం పలకి.. తామంతా వెన్నంటే ఉన్నామన్న స్పష్టమైన సంకేతాన్ని హైకమాండ్‌కు పంపించారు. కొంతమంది మంత్రులు కూడా జగన్ వెంట నడిచే అవకాశం ఉన్నట్లూ తెలుస్తోంది.
జగన్‌పై ఇంటెలిజెన్స్ నిఘా..
ఎవరిమాట వినకుండా ఓదార్పుకు వెళ్లిన జగన్‌ను నిఘాకళ్లు వెంటాడుతున్నాయి. జగన్ వ్యూహప్రతివ్యూహాలను పసిగట్టడానికి పావులుకదుపుతున్నాయి. ఎవరెవరు కలుస్తున్నారో.. ఏమేమి చేయబోతున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాయి. ఈ వివరాలన్నీ గుట్టుచప్పుడు కాకుండా కాంగ్రెస్ అధినేత్రి సోనియా చేతికి చేరిపోతున్నాయి. జగన్‌కు సంబంధించిన కొన్ని రహస్యాలు తెలిశాయి కాబట్టే.. కాంగ్రెస్ హైకమాండ్ చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నట్లు సమాచారం..
జగన్‌కు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నేరుగా మద్దతిస్తున్నవారు దాదాపు 30 మంది దాకా ఉండగా.. తెరవెనుక ఉండి మద్దతు ప్రకటించిన వారు మరో 30 మంది ఉంటారన్నది నిఘా వర్గాల అంచనా. ఒకవేళ జగన్‌పై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ యాక్షన్ తీసుకుంటే.. వీరంతా జగన్ పక్షాన నిలబడే ప్రమాదముందని ఇంటెలిజెన్స్ రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. అందుకే.. జగన్ ధైర్యంగా యాత్ర మొదలుపెట్టినా కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి చర్యాతీసుకోలేదు. కాంగ్రెస్ హైకమాండ్ అంగీకారం లేదంటూ జగన్ యాత్ర ప్రారంభానికి ముందురోజు ఓ మాట చెప్పిన సీఎం.. ఆ తర్వాత రోజే మాటమార్చారు. దీనివెనుక కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌లే కారణమని తెలుస్తోంది.
ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 156 స్థానాలున్నాయి. ఒకవేళ జగన్ పార్టీని చీల్చడమంటూ జరిగితే.. ప్రభుత్వం పడిపోవడం ఖాయం. పైగా.. తనవైపు ఉన్న ఎమ్మెల్యేలతోనే ఓదార్పుయాత్ర చేస్తూ అధిష్టానం గుండెల్లో జగన్ బాంబులు పేల్చుతున్నారు. నిఘా వర్గాలు అనుమానిస్తున్నట్లు 60 మంది ఒక్కసారిగా మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. ముఖ్యమంత్రి పీఠాన్ని రోశయ్య వదులుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ అధికారంలో కొనసాగాలంటే.. జగన్‌ను సీఎం చేయక తప్పనిసరి పరిస్థితి హైకమాండ్‌కు ఎదురవుతుంది. అయితే.. జగన్‌కు బహిరంగంగా మద్దతు పలుకుతున్న 30 మంది మాత్రమే పూర్తిస్థాయిలో ఆయన పక్షాన ఉన్నట్లుగా భావించాలి. మిగిలిన 30 మంది ఎలా వ్యవహరిస్తారన్నది అంతుబట్టడం లేదు. పైగా.. ఇప్పటికిప్పుడు పార్టీని చీల్చినా జగన్‌కు అధికారం దక్కడం సాధ్యం కాదు. ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకే.. ఈ విషయంలో జగన్ ధైర్యంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. కాకపోతే.. పార్టీని చీల్చగలిగే సత్తా తనకు ఉన్నట్లు స్పష్టం చేయడం ద్వారా అధిష్టానానికి చెక్ చెప్పే ప్రయత్నాన్ని మాత్రం పెద్దఎత్తునే చేస్తున్నారు. అయితే.. ఇప్పటికే పార్టీ ఏర్పాటుకు సంబంధించి గాలిజనార్దనరెడ్డితో చర్చలు జరుపుతున్నట్లు, పార్టీ లోగో తయారు చేసే బాధ్యతను ఓ యాడ్ ఏజెన్సీకి అప్పజెప్పినట్లు వదంతులు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకూ నిజమన్నది తేలాల్సి ఉంది.
కొత్తగాలి
కాంగ్రెస్ పార్టీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జగన్‌వైపే ఉండడానికి ఇష్టపడుతున్నారు. కృష్ణాజిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు, గుంటూరులో ఇద్దరు ఎమ్మెల్యేలు, ప్రకాశంలో ఐదుగురు ఎమ్మెల్యేలు జగన్‌కు మద్దతు పలుకుతున్నారు. ఇందులో ఓ మంత్రి కూడా ఉన్నట్లు సమాచారం. పరిస్థితులను బట్టి.. జగన్‌కు మద్దతు పెరుగుతూ ఉంటే.. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా వీరి దారిలోకే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద చూస్తే... ఎమ్మెల్యేల బలం పెంచుకోవడం ద్వారా.. అధిష్టానం దగ్గర ఎదురులేకుండా చేసుకోవాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.
జగన్ యాత్రలో ప్రజాప్రతినిధులు పాల్గొనకుండా కట్టడి చేయడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఏం చేస్తున్నదన్నదే ఆసక్తికరంగా మారింది. జగన్ హవాను అడ్డుకోవడానికి కొత్త ఎత్తుగడ ఏమైనా వేస్తుందా.. లేక జగన్ విషయంలో రాజీ పడుతుందా.. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మాత్రం జగన్ వ్యవహారంపై ఢిల్లీస్థాయిలో చర్చలు జరుగుతున్నా... చర్యలు తీసుకునే అవకాశాలు మాత్రం పెద్దగా లేవనే చెప్పాలి. ఏమాత్రం తొందరపడ్డా.. పార్టీ ఎక్కడ చీలుతుందోనన్నభయం కాంగ్రెస్ వర్గాల్లో కనిపిస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
IAM ANJI NENU JAGAN GARIKI NA SUBAKANSHALU TELUPUTUNANU NEW PARTY PEDUTHUNANDUKU SMALL REQUESTED YOUTH KI MAIN PREFENCE EVANDE