8, జులై 2010, గురువారం
అమరజీవి వైఎస్
ఆయనిప్పుడు మన మధ్య లేరు...
కానరాని లోకాలకు వెళ్లిపోయారు...
మనల్ని విడిచి దాదాపు పదినెలలు అయిపోయింది.
కానీ.... ఎవరూ మర్చిపోలేకపోతున్నారు...
అదే ఆయన గొప్పతనం..
మనపై ఇంకా ఉన్న వైఎస్ ప్రభావం..
కాంగ్రెస్ పార్టీలో మూడొంతుల మందికి వైఎస్సే ఆరాధ్యదైవం. ఆయన పేరే తారకమంత్రం. ఆయన పేరు చెప్పుకోనిదే రాజకీయనేతలకు పొద్దు గడవదు. ఏదో సందర్భంలో.. ఏదో రకంగా.. ఎక్కడోదగ్గర.. వైఎస్ పేరు మారుమోగుతూనే ఉంటుంది. వైఎస్ ఆశయాల సాధనకు కృషి చేస్తామన్న హామీలు వినిపిస్తూనే ఉంటాయి. అదే వైఎస్ గొప్పదనం.
వైఎస్ లేకపోయినా.. ప్రభుత్వాన్ని నడిపిస్తోంది వైఎస్సే. ముఖ్యమంత్రి స్థానంలో రోశయ్య ఉన్నప్పటికీ.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు.. ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తోంది కూడా వైఎస్సార్ చూపించిన మార్గమే. ఆ మార్గం కాదని మరో మార్గంలోకి వెళ్లే సాహసాన్ని ప్రభుత్వం చేసే పరిస్థితిలో లేదు. ఒకవేళకాదూ కూడదని చేస్తే.. జనం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో కూడా తెలుసు. అందుకే.. వైఎస్ నామస్మరణతో ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి రోశయ్య.
కాంగ్రెస్ పార్టీలోకి కొత్త రక్తాన్ని ఎక్కించి పరుగులుపెట్టించిన ఘనత కూడా వైఎస్‌దే. అనామకులైన ఎంతోమంది ఇప్పుడు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో ఉన్నారంటే.. అది కూడా వైఎస్ చలువే. పార్టీలో యోధానుయోధులు ఎంతోమంది ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ భవిష్యత్తు కోసం.. గత అసెంబ్లీ ఎన్నికల్లో యువకులకే పెద్దపీట వేశారు. ఎంతోమంది అనుమానాలు వ్యక్తం చేసినా.. వారిని గెలిపించి తన సత్తా చాటుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వృద్ధులపార్టీ మాత్రమే కాదు.. నవయవ్వనంతో ఉరకలు వేస్తున్న పార్టీ. ఇదంతా వైఎస్ మహత్యమే.
అందుకే.. వైఎస్‌ను ఎవరూ మర్చిపోలేరు. జనంలో పేరు తెచ్చుకోవడం అంత సులువేమీ కాదు. కానీ, ముఖ్యమంత్రి పదవిని వైఎస్ చేపట్టిన తర్వాత.. అతి తక్కువకాలంలోనే జనంగుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆయన మరణించినా... ఆ ముద్ర మాత్రం చెరిగిపోలేదు. చిరంజీవిగా మిగిలిపోయారు.
ఇంత ప్రభావం ఎందుకు?
పరిపాలనలో వైఎస్ పాటించిన సూత్రాలే.. ఆయన్ను జనానికి చేరువ చేశాయని చెప్పొచ్చు. ప్రతీ పథకాన్ని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్ది.. ప్రజల సమస్యలను తీర్చడానికి పాటుపడ్డారు వైఎస్. ముఖ్యంగా పేద మధ్యతరగతి వారి జీవన ప్రమాణాలను పెంచడానికి.. తొలినుంచి ప్రయత్నించారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి మొదలుపెడితే.. ప్రాణం పోయే వరకూ కూడా.. ప్రజలకోసమే పనిచేశారు. ఎప్పటికప్పుడు కొత్త పథకాలను ప్రవేశపెడుతూ.. జనంలోకి దూసుకువెళ్లారు.. ప్రభుత్వ పథకాలను వివరించడానికి రూపొందించిన రచ్చబండ కార్యక్రమానికి వెళుతూనే.. తనువు చాలించారు. ప్రజలకు అంకితమయ్యారని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముటుంది.
2004 కు ముందు రాష్ట్ర ప్రజలకు అన్నీ కష్టాలు, కడగండ్లే. ప్రకృతి కరుణించేది కాదు.. చినుకు చిందేది కాదు. అన్ని రంగాలు.. అన్ని వర్గాలు తీవ్రంగా సతమతమయ్యాయి. జనం కష్టాలను దగ్గర నుంచి చూసిన వైఎస్.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచీ సంక్షేమ పథకాలపైనే దృష్టి పెట్టారు. ఉచిత విద్యుత్ ఇచ్చి రైతులపై భారాన్ని దింపారు. రాష్ట్రంలో వ్యవసాయం సాఫీగా సాగుతోందంటే అది వైఎస్ పుణ్యమే.
ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన సాగునీటి రంగంపైనా తనదైన ముద్రవేశారు వైఎస్. జలయజ్ఞం పేరుతో రాష్ట్రచరిత్రను మార్చేసే మహాయజ్ఞాన్ని తలపోశారు. వైఎస్సార్ మదిలో ఉన్న ఆలోచనల ప్రకారం చిన్నాపెద్దా కలిపి 49 ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అంతా సక్రమంగా జరిగిఉంటే.. ఈ పాటికి రాష్ట్రమంతా పచ్చగా కళకళలాడుతూ ఉండేది. అయితే.. అక్కడక్కడా చేసిన పొరపాట్లు జలయజ్ఞంపై అవినీతి మరకను అంటించాయి. ప్రాజెక్టుల నిర్మాణంలో చోటుచేసుకుంటున్న పరిస్థితులను తప్పు పట్టొచ్చేమో గానీ.. ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలన్న వైఎస్ ఆలోచనను మాత్రం ఎవరూ తప్పుపట్టలేరు.
పేద ప్రజలకోసం ఎన్నో పథకాలను సరికొత్తగా వైఎస్ సృష్టించారు. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించే ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. పేదలకు భూములు పంచారు. వాటిని అభివృద్ధి చేసుకోవడానికి నిధులు మంజూరు చేశారు. ఇందిరమ్మ పేరుతో ఇళ్లు కట్టించారు. చివరకు.. హామీ ఇవ్వకున్నా రెండురూపాయల కిలో బియ్యం పథకాన్నీ ప్రారంభించారు. చాలామంది పేదలు ఈరోజు కడుపునిండా తినగలుగుతున్నారంటే.. అది వైఎస్ వల్లే.
వైఎస్సార్‌పై ఎన్నో విమర్శలు చేయొచ్చు.. ఎన్నో ఆరోపణలూ గుప్పించవచ్చు. కానీ.. ప్రజలకు జరిగిన మేలుతో పోల్చితే.. అవన్నీ దిగదుడుపే. పైగా.. జనాన్ని వైఎస్ నమ్మారు.. వైఎస్‌ని జనం నమ్మారు. రాజశేఖరరెడ్డి అందరిలా కాదు.. మాట ఇస్తే నిలబడే మనిషి. హామీ ఇస్తే అమలు చేసే నేత. సమస్యను పరిష్కరించగలమని దమ్ముంటేనే హామీ ఇవ్వాలంటారాయన. ఆ ధైర్యం ఉంది కాబట్టే.. తన పాలనలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టగలిగారు.
ఈ ధృక్పథంతోనే అతితక్కువ కాలంలో అపరకీర్తిని రాజశేఖరరెడ్డి గడించగలిగారు. ప్రజలమనస్సుల్లో నిలిచిపోయారు.
మంచి మాటకారి..
ప్రజలను పలకరించడంలోనూ వైఎస్ స్టైలే వేరు. మాటల్లో ఆయన చూపించనంత ఆప్యాయతను మరే నేత చూపించలేరంటే అతిశయోక్తి కాదు. అమ్మలారా.. అక్కలారా.. చెల్లలారా అంటూ సంభోదించి.. చేతులెత్తి సవినయంగా నమస్కారం చేసింది వైఎస్ ఒక్కరే.
2009 అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడూ లేనంత వాడీవేడిగా జరిగాయి. తెలుగుదేశం,వామపక్షాలు, టీఆర్‌ఎస్ కలిసికట్టుగా ఓ వైపు.. చిరంజీవి ఇమేజ్‌నే పెట్టుబడిగా పెట్టుకొని దూసుకువచ్చిన ప్రజారాజ్యం మరోవైపు కాంగ్రెస్‌ను కలవరపెట్టాయి. కాంగ్రెస్ నేతలు ముక్కోణ పోటీతో కాస్త డీలాపడ్డా.. వైఎస్ మాత్రం దీటుగా ఎదుర్కొన్నారు. ప్రచారంలోనూ.. సినీనటులు తొడలు కొడుతూ.. మీసాలు మెలేస్తుంటే.. వైఎస్ మాత్రం తనదైన శైలిలో ప్రచారం చేశారు. గాల్లోకి ముద్దులు విసురుతూ ప్రేమపంచడం మాత్రమే తెలుసన్నారు. ప్రతిపక్ష పార్టీలను మట్టి కరిపించారు. తన గ్లామర్ ముందు సినీ గ్లామర్ పనిచేయదని నిరూపించారు.
ప్రతిపక్షాలను ఇరుకున పెట్టడంలో వైఎస్‌ను మించిన వారు లేరు.. విమర్శించడంలోనూ సరిసాటి లేరు. ఆయన్ను అసెంబ్లీలో ఎదుర్కోవడం ఎవరితరమూ కాదు. మాటల్లో గెలవడం అసలు సాధ్యమే కాదు..
ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడానికి ఏ ప్రకటనో ఇస్తే సరిపోతుంది. కానీ.. పేదలకోసం అమలు చేస్తున్న పథకాలను అందరికీ చేరువ చేయడానికి వైఎస్సే బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. తన ఇమేజ్‌ను కూడా పక్కనపెట్టి.. 108 కు విశేష ప్రచారం కల్పించారు. ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఏ సభలో పాల్గొన్నా.. కుయ్యి కుయ్యి మంటూ 108 ప్రాధాన్యతను వివరించేవారు..
వైఎస్ ఏది మాట్లాడినా అది అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. సూటిగా స్పష్టంగా ఉంటుంది. తడబడడం ఆయనకు అలవాటు లేదు. . ప్రతిపక్షాలను ఎంత ఆగ్రహంగా విమర్శిస్తారో.. ప్రజలతో అంత స్వాంతనగా మాట్లాడతారు. సమయానికి తగ్గట్లుగా హవభావాలను పలికించడంలోనే ఆయనకు ఆయనే సాటి. మాటలతో వైఎస్‌లా ఆకట్టుకున్న నేత మరొకరు లేరనే చెప్పాలి
ఘనంగా తొలి జయంతి
వైఎస్ జయంతి సందర్భంగా జగన్ సాహసోపేతయాత్రకు శ్రీకారం చుట్టారు. మాట ఇస్తే దానిపై నిలబడే కుటుంబంగా ఉన్న పేరును సార్థకం చేసుకుంటూ.. అధిష్టానాన్ని ధిక్కరించి మరీ ఓదార్పు యాత్ర చేపట్టారు. తన తండ్రికిచ్చే నివాళి ఇదేనంటున్న జగన్.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి యాత్ర సాగిస్తున్నారు. పార్టీ అధినేతల దృష్టిలో చెడ్డ పేరు తెచ్చుకున్నా... ప్రజల్లో తండ్రికి ఉన్న మంచిపేరు తనకు రక్షగా ఉంటుందన్నది జగన్ అభిమతం కావచ్చు. అందుకే.. ధైర్యంగా ముందడుగు వేశారు..
ప్రభుత్వం కూడా వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. పట్టుబట్టి అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రోశయ్య, సభలోనే మహానేతకు నివాళులు అర్పించనున్నారు.
ఇక తొలి జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ విగ్రహాలను కాంగ్రెస్ నేతలు ఆవిష్కరించనున్నారు. వెయ్యికి పైగా వైఎస్ విగ్రహాల ప్రతిష్టాపన జరగనుంది. ఇంత పెద్ద ఎత్తున విగ్రహావిష్కరణలు ఇంతకుముందెన్నడూ జరగలేదు. ఒక్క అనంతపురం జిల్లాలోనే వంద విగ్రహాలను జయంతి రోజున ఏర్పాటు చేయనున్నారు.
వైఎస్ అభిమానులు కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. వైఎస్ బాటలో నడవాలని నిర్ణయించుకున్న గుంటూరు జిల్లాలోని ఓ అభిమాని.. జయంతి రోజు నుంచి సిగరెట్ తాగడం మానేయాలని నిర్ణయించుకున్నాడు. సిగరెట్లు, మద్యానికి పెట్టే ఖర్చుతో పేదలకు సాయం చేస్తానంటూ ప్రతిన పూనాడు.
మార్పు తెచ్చిన పేరు
2003కు ముందు వైఎస్ వేరు.. 2004 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ వేరు. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన వైఎస్‌కు.. సీనియర్లు పెట్టిన ముద్దు పేరు నిత్య అసమ్మతి వాది. ముఖ్యమంత్రులుగా ఎవరున్నా.. వారికి వ్యతిరేకంగా ఎన్నో పనులు చేశారు వైఎస్.. అయితే అదంతా గతం. అప్పటివరకూ వైఎస్ రాయలసీమ నేత మాత్రమే. అయితే, రాష్ట్ర ప్రజలందరికీ నాయకుడిగా ఎదగాలన్నా.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలన్నా తన పద్దతిని మార్చుకోవాలని తెలుసుకున్నారు. ఆ తర్వాత చేపట్టిందే మహా పాదయాత్ర. 2003 మండు వేసవిలో రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రారంభమైన వైఎస్ పాదయాత్ర.. 64 రోజుల పాటు.. 1500 కిలోమీటర్లకు పైగా సాగి.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. ఆ యాత్రే వైఎస్ ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసింది.
ఎమ్మెల్యేగా, ఎంపీగా, ప్రతిపక్ష నేతగా ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన వైఎస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. తనకు వ్యతిరేక వర్గమంటూ లేకుండా చేసుకున్నారు. ఒకవేళ ఎవరన్నా ఉన్నా.. వారికి అవకాశం అందకుండా జాగ్రత్తపడ్డారు.
ప్రజల సమస్యలను తీర్చడంలో వైఎస్ చూపించే వేగం కూడా ఆయన కీర్తిని పెంచింది. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాల విషయంలో మాత్రం ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.
వైఎస్ మరణం తర్వాత రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయశూన్యత ఏర్పండిందని చెప్పొచ్చు. సంక్షేమ పథకాల అమలు అయోమయంలో పడింది. జనం ఉద్యమం చేస్తే గానీ.. ప్రభుత్వం దిగిరాలేదు. అధికారపక్షంలోనే వర్గాలు మళ్లీ మొదలయ్యాయి. కుమ్ములాటలు సాగుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వైఎస్‌లాంటి నేత ఒకరు కావాలి. కానీ... ఆ స్థానాన్ని భర్తీ చేయగలవారు ఉన్నారా..?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
దొంగ లండీకె వాడు అమరజీవి ఏంటి? ఫక్తూ నరక జీవి. ఈ పాటికి ఏ గాడిదగానో, పందిగానో పుట్టి వుంటాదు కూడా.
నిజం,
అధికారం లోకి రాగానే వందలమంది ని నరికించాడు..
మొద్దు శీను "చిన్న బాస్ "బండారం బయట పెడతాను అనేటప్పటికి మొద్దుశీను కు కూడా నూకలు చెల్లించాడు.
జనానికి అన్నీ ఫ్రీ అని మభ్యపెట్టగానే సరిపోయిందా..