7, జులై 2010, బుధవారం
విశ్వం చిక్కింది
భూమి ఎలా పుట్టింది?
సూర్యమండలం ఎలా ఏర్పడింది..?
గ్రహాలు ఎలా తయారయ్యాయి?
ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది?
ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానం దొరకనుంది
గ్రహాలు.. నక్షత్రాలు.. నక్షత్ర మండలాలు.. పాలపుంతలతో నిండిపోయింది విశ్వం. అయితే.. ఈ విశ్వం ఎలా ఏర్పడింది.. గ్రహాలను, వాటికి ఆధారమైన నక్షత్రాలను సృష్టించిన శక్తి ఏమిటన్నది మాత్రం ఇంతవరకూ అంతు చిక్కలేదు. ఎన్నో సిద్ధాంతాలు.. మరెన్నో పరిశోధనల అనంతరం శాస్త్రవేత్తల్లో ఎక్కువమంది అంగీరించింది బిగ్‌బ్యాంగ్ థియరీనే. ఓ మహావిస్పోటనం వల్లే ఈ సృష్టి ఏర్పడిందని వివరిస్తుంది ఈ బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతం. అయితే.. ఈ సిద్దాంతాన్ని వ్యతిరేకించేవారు శాస్త్రసాంకేతిక ప్రపంచంలో కోకొల్లలు. అందుకే.. విశ్వసృష్టికి మూలం ఏమిటన్నది ఇంతవరకూ రహస్యంగానే ఉంది. ఈ రహస్యాన్ని ఛేదించడానికే.. తరతరాలుగా సైటింస్టులు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఒక్కో అడుగూ ముందుకు వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న దేశాలన్నీ కూడా ఈ ప్రయోగాల్లో తలమునకలై ఉన్నాయి. అంతరిక్షంలోకి ఉపగ్రహాలను, మహాటెలిస్కోప్‌లను పంపిస్తూ.. ఆధారాలను సేకరిస్తున్నాయి.
చాలామంది అంచనాల ప్రకారం.. ఈ విశ్వానికి అంతే లేదు. ఇప్పటివరకూ జరిగిన పరిశోధనల ప్రకారం.. విశ్వం మొత్తంలో కేవలం 5 శాతం మాత్రమే మన కంటికి కనిపిస్తోంది. మొత్తం విశ్వాన్ని చూడడం సాధ్యం కాదనీ ఇంతవరకూ అంతా భావిస్తూ వచ్చారు. కానీ.. ఈ విశ్వాసాన్ని పటాపంచలు చేసే.. ఓ మహత్తర విజయాన్ని సాధించింది యురోపియన్ స్పేస్ ఏజెన్సీ. అంతరిక్షం మొత్తాన్ని ఒకే ఫోటోలో బంధించగలిగింది.
ఈఎస్‌ఏ ప్రయోగం
సృష్టి ఎలా ఏర్పడిందో తేల్చాలని కంకణం కట్టుకున్న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్‌ఏ).. అందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. ఆకాశం మొత్తాన్ని చిత్రించాలన్న లక్ష్యంతో ప్రత్యేకంగా ఓ టెలిస్కోప్‌నే సృష్టించింది. అదే ప్లాంక్ టెలిస్కోప్. 2009లో ఈ టెలిస్కోప్‌ను రోదసీలోకి పంపించింది.
అనంత విశ్వంలో మన భూమి పరిమాణం ఇసుకరేణువంత. మరి మన దగ్గర నుంచి పంపించిన టెలిస్కోప్‌తో మొత్తం విశ్వాన్ని ఒకేసారి తీయగలమా..? అందుకే.. ఇందుకు ప్రత్యేక పద్దతులను ఎన్నుకొంది. భూమిచుట్టూ తిరుగుతూనే.. విశ్వాన్నంతటినీ బంధించేలా టెలిస్కోప్‌ను తయారు చేసింది. గుండ్రంగా తిరుగుతూ.. విశ్వంలోని ప్రతీభాగాన్ని ఈ ప్లాంక్ టెలిస్కోప్ స్కాన్‌చేసింది. స్కానింగ్ పూర్తైన తర్వాత.. దాన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో విశ్లేషించి.. యూనివర్స్ ఇమేజ్‌ను యురోపియన్ ఏజెన్సీ తయారు చేసింది. "ప్రతీ నిమిషానికోసారి ప్లాంక్ పరిభ్రమిస్తూఉంటుంది. భూమి చుట్టూ, సూర్యుడి చుట్టూ తిరుగుతూ.. విశ్వంలోని తీప్రాంతాన్ని ప్లాంక్ స్కాన్ చేసింది. కొంతకాలానికి ఆకాశం అంతటినీ చిత్రించగలిగింది. దీనిద్వారా.. మొత్తం విశ్వానికి సంబంధించిన ఫోటోను తయారు చేయగలిగాం." అని చెబుతున్నారు ప్లాంక్ ప్రాజెక్ట్ శాస్త్రవేత్త జాన్ టూబర్.
ప్లాంక్ తీసిన చిత్రంలో విశ్వం మొత్తం ఇమిడిపోయిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటివరకు మన పాలపుంత.. ఇతర గెలాక్సీల ఫోటోలను తీయగలిగినప్పటికీ.. అన్నింటినీ ఒకేసారి ఇంతవరకూ ఎవరూ తీయలేదు. ఈ ఫోటోలో మధ్యలో కాంతిపుజంలా కనిపిస్తున్నదే మన పాలపుంత. ఇందులోనే సూర్యుడు.. భూమి, ఇతర గ్రహాలు, నక్షత్ర మండలాలు ఉన్నాయి. కేవలం పాలపుంత మాత్రమే కాదు.. మనకు సుదూర ప్రాంతాల్లో ఉన్న వాటిని ప్లాంక్ తన లెన్స్‌లో బంధించింది. భూగోళంపైన ధృవాల తరహాలోనే.. విశ్వం అంచులను కూడా ఈ ఫోటోలో మనం చూడొచ్చు.
మన విశ్వంలో నిండి ఉన్న ధూళిమేఘాలు కూడా ఈ ఫోటోలో చూడొచ్చు. మన పాలపుంతకు చుట్టూ ఇవి కనిపిస్తాయి. ఇక ధూళిమేఘాలకు ఎగువన ఎరుపురంగులో కనిపించేదంతా.. కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్‌గ్రౌండ్ రేడిషన్. విశ్వం ఆవిర్భావ సమయంలో విడుదలైన రేడియేషన్ కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనిపై పరిశోధనలు చేయడం కోసమే.. ప్లాంక్‌ను అంతరిక్షంలోకి పంపించారు. మన చుట్టూ కూడా ఈ రేడియేషన్ ఉన్నప్పటికీ.. పాలపుంత నుంచి వెలువడుతున్న కిరణాలు.. రేడియేషన్‌ను కనిపించకుండా చేశాయి.
నాలుగు సార్లు స్కానింగ్
విశ్వమంతా కనిపించే తొలి ఫోటోను తీసి రికార్డు సృష్టించింది ప్లాంక్ టెలిస్కోప్. అయితే.. ఇది తొలి ఫోటో మాత్రమే. ఆకాశాన్నంతటినీ బంధించడానికి ఆగస్టు 2009లో ప్లాంక్ మొదలుపెట్టిన స్కానింగ్.. జూన్ 2010తో ముగిసింది. ఇది ఫస్ట్ సర్వే మాత్రమే. ఈ సర్వేలో ప్లాంక్ సేకరించిన సమాచారం ఆధారంగా మనం చూస్తున్న విశ్వం తాలూకు ఫోటో తయారయ్యింది.
కేవలం ఈ ఫోటోను తయారు చేయడంతోనే ప్లాంక్ పని అయిపోలేదు. 2012 వరకూ పనిచేసేలా ఈ టెలిస్కోప్‌ను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తయారు చేసింది. ఈ మధ్యకాలంలో మొత్తం నాలుగు సార్లు విశ్వాన్నంతటినీ స్కాన్ చేస్తుంది. అన్ని సర్వేల్లో వచ్చిన సమాచారం ఆధారంగా పూర్తిస్థాయి ఫోటోను శాస్త్రవేత్తలు తయారు చేస్తారు. నాలుగుసార్లు స్కానింగ్ జరుగుతుంది కాబట్టి.. ఒక్క చిన్న ఆబ్జెక్ట్ కూడా మిస్ అవదని ప్లాంక్ ప్రాజెక్ట్ సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.
ప్లాంక్ టెలిస్కోప్ అందించే తుది ఫలితాల తర్వాత విశ్వంలోని రేడియేషన్ ఎఫెక్ట్ ఎంత ఉండొచ్చన్నది కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. గెలాక్సీల్లో వస్తున్న మార్పులు.. గ్రహాలు ఏర్పడడానికి దారితీసిన పరిస్థితులను కూడా తెలుసుకోవచ్చు. మన భూమి ఎలా ఏర్పడిందన్నది విశ్లేషించడానికి ప్లాంక్ టెలిస్కోప్ అందించే సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది.
మన స్నేహితులు దొరుకుతారా?
ఈ సువిశాల విశ్వంలో మనలాంటి బుద్ధిజీవులు ఉండి ఉండొచ్చన్న అనుమానాలు ఎంతోమందివి. అందుకే.. గ్రహాంతరవాసుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. సూర్యమండలం అవతల జీవులు ఉంటే కనిపెట్టడానికి.. నాసా ప్రత్యేకంగా వోయేజర్ స్పేస్‌షిప్‌లను కూడా ఎప్పుడో పంపిచింది. అయితే.. ఇప్పుడు యురోపియన్ స్పేస్ ఏజెన్సీ సాధించిన ఫలితాలతో ఈ ప్రయత్నాలకు మంచి ఊతం లభించనుంది. ప్లాంక్ ఇచ్చే సమాచారంతో.. రోదసీలో మనలాంటి గెలాక్సీలు ఎన్ని ఉన్నాయో సులువుగా గుర్తించవచ్చు. దీన్నిబట్టి భూమిన పోలిన గ్రహాలు ఎన్ని ఉన్నాయో కూడా కనిపెట్టవచ్చు. ప్రయోగాల కోసం ఆ గ్రహాలపైకే నేరుగా స్పెషల్ మిషన్స్‌ను పంపించే వీలు కూడా కలుగుతుంది. విశ్వం మొత్తం కంటికి చిక్కడం వల్ల ఇలాంటి ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఇంకా వివరంగా ఇస్తే బాగుండేది .
కనిపించే ఫోటోలో ..ఒక బుడగ లాంటి ఆకారంలో అనంత విశ్వం ఇమిడి ఉన్నట్లు అర్ధం వస్తుంది ..అది నిజం కాదు కదా ..
ఎల్లిప్టికల్ షేప్ లో ..నక్షత్ర మండలాలూ ..శూన్యం లో సస్పెండ్ అయినట్లు కనిపిస్తుంది ..కాదుకదా ..అసలు అంతులేదు ..ఈ ఫోటో కేవలం మన భూమి ఉన్న నక్షత్ర మండల ప్రాంతాన్ని శూన్యంలో చూపిస్తున్నది ..అంతే కదా ..మీరు ఇంకా వివరాలు ఇవ్వాలి.
మన విశ్వం ఒక గాజుగోళం లో ఒక aquarium లాంటి కంటైనర్ లో లేదు కదా ..
దయచేసి ..విపులంగా విశదీకరించండి ..
వాస్తవానికి ఇది ఎన్‌లార్జ్ చేసిన ఇమేజ్. కేవలం మన భూమి మాత్రమే ఉన్న నక్షత్రమండలానికి సంబంధించిన దృశ్యం కాదు. మధ్యలో వెలుగురేఖలా పొడవుగా ఉన్న ప్రాంతంలో మన నక్షత్ర మండలం ఉంది. పూర్తి విశ్వానికి సంబంధించిన ఫోటో ఇది. విశ్వంలో జరిగే పరిణామాల వల్ల దాదాపుగా ప్రతీ వస్తువు(గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, నక్షత్రాలు, పాలపుంతలు అన్నీ గుండ్రని ఆకారంలోనో, కోడిగుడ్డు ఆకారంలోనే ఉంటాయన్న విషయాన్ని గుర్తించాలి. ఇక ఈ ఫొటో తీసిన విధానం గురించి తెలియాలంటే మీరు యూట్యూబ్‌లో ఈ లింక్‌ను చూడాల్సి ఉంటుంది. అప్పుడు పూర్తిగా అవగతం కావచ్చు.
http://www.youtube.com/watch?v=k19ZtdIxNOY