6, ఏప్రిల్ 2010, మంగళవారం
తిరుమలలో మహాయజ్ఞం
దేవదేవుడిని దర్శించుకోవడానికి నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలగిరులు ఎక్కుతుంటారు. కానీ.. స్వామి వారి దర్శనం.. సామాన్యుడికి అంత సులువుగా జరగదు. తనవంతు వచ్చే వరకూ ఆగాలి. పిల్లాజెల్లాతో వచ్చే వారికి.. ఇంతసేపు వేచి ఉండడం కష్టమే. పైగా.. కడుపులో అవతరించే ఆకలి... నానా తిప్పలూ పెడుతుంది. స్వామి వారి సన్నిధిలో భక్తులు ఆకలితో అలమటించకూడదనే.. ఓ బృహత్తర పథకం అమల్లోకి వచ్చింది. పాతికేళ్లుగా దిగ్విజయంగా కొనసాగుతోంది.. అదే అన్నదాన మహాయజ్ఞం...
కలియుగంలో భక్తులను తరింపచేయడానికి.. ఆ శ్రీ మహావిష్ణువే.. తిరుమల గిరులపై స్వయంభువుగా వెలిచాడని ప్రతీతి. అందుకే కాబోలు.. స్వామివారి ఖ్యాతి దినదినమూ ప్రవర్థమానమవుతోంది. జిల్లాలు.. రాష్ట్రాలు దాటి... విదేశాలకూ వ్యాపించింది. స్వామిని దర్శించుకోవడానికి ప్రతీరోజూ.. లక్షలాది మంది భక్తులు వెల్లువలా తిరుమలకు వస్తుంటారు. దాదాపు 40 వేల మందికి మాత్రమే దర్శనభాగ్యం నిత్యం కలుగుతుంది. అయితే.. అంతకు రెట్టింపు సంఖ్యలో భక్తులు దర్శనం కోసం క్యూల్లో ఉంటారు. ఒక్కోసారి రోజుకుపైబడి వేచి ఉంటే తప్ప తప్ప స్వామివారి దర్శన భాగ్యం కలగదు.
సుధూర ప్రాంతాలు ప్రయాణించి.. స్వామిని చూడడం కోసం వచ్చే భక్తులకు.. ఒక్కోసారి దర్శనానికి వెళ్లే అవకాశమూ ఉండదు. దర్శనం కోసం గంటల తరబడి క్యూల్లో ఉన్నవారికూడా.. ఆకలికి కొన్నిసార్లు అలమటించాల్సి వస్తుంది. ఇలాంటి వారికోసమే.. టీటీడీ నిత్యాన్నదాన పథకాన్ని నిర్వహిస్తోంది. దీన్ని అన్నదానంలా కాకుండా.. శ్రీవారు పెట్టే ప్రసాదంలో భక్తులు భావిస్తుంటారు.
పాతికేళ్ల క్రితం
కుటుంబ సమేతంగా వచ్చిన వారు.. భోజనం కోసం హోటల్‌కు వెళ్లితే.. నిలువుదోపిడీనే. అందుకే.. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత.. తిరుమలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. భక్తులకు ఉచిత భోజన సదుపాయాన్ని కల్పిస్తే.. ఎలా ఉంటుందన్న ఆలోచన అప్పుడే మొగ్గ తొడిగింది. టీటీడీ పాలకమండలి ప్రతిపాదన పెట్టడమే ప్రభుత్వం దానికి ఆమోద ముద్ర వేసింది. ఏప్రిల్ 6, 1985.. ఉగాది పర్వదినాన.. ఈ మహోన్నత పథకం అమల్లోకి వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేతుల మీదుగా.. నిత్నాన్నదాన పథకం మొదలయ్యింది. అప్పటి నుంచి విరామమన్నది లేకుండా... పాతికేళ్లుగా వెంకటేశ్వరుని భక్తులకు... నిత్యాన్నదానం చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.
శ్రీవారి చెంతకు వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా ఒక్కసారైనా ఇక్కడ భోజనం చేయాలనుకుంటారు. లడ్డూమాత్రమే శ్రీవారి ప్రసాదంగా పేరుపొందినప్పటికీ.. వరప్రసాదంగా భక్తులు భావించేది మాత్రం ఈ భోజనాన్నే. అందుకే.. కోటీశ్వరుడి నుంచి... సామాన్యుడి వరకూ.. ఈ నిత్యాన్నదానం కాంప్లెక్స్‌కు తప్పకుండా వస్తారు. తృప్తిగా భోజనం చేసి స్వామి ఆశీస్సులను సంపూర్తిగా పొందుతారు.
ఉదయం తొమ్మిదన్నరకు మొదలయ్యే నిత్నాన్నదానం.. మధ్యాహ్నం మూడున్నర వరకూ సాగుతుంది. మధ్యలో రెండు గంటల విరామం తర్వాత.. మళ్లీ సాయంత్రం ఐదున్నరకు ప్రారంభమై.. రాత్రి పదిన్నర వరకూ కొనసాగుతుంది. ఈ సమయంలో వచ్చే భక్తులందరికీ లేదనకుండా భోజనాన్ని పెడతారు శ్రీవారి సేవకులు. ఇలా నిత్యాన్నదాన కాంప్లెక్స్‌లోనే రోజుకు 30 వేలమందికి పైగా అన్నదానం జరుగుతుంది.
తొలినాళ్లలో రెండు వేలమందికే నిత్యాన్నదానం జరిగినా.. ఈ పాతికేళ్లలో అంచెలంచెలుగా ఈ పథకం విస్తరించింది. వేలాదిమందికి భోజనాన్ని ఉచితంగా అందిస్తోంది. మొదట్లో దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే.. టోకెన్లు తీసుకుని భోజనం చేయాల్సి వచ్చేది. అయితే.. ఇప్పుడు దర్శనంతో సంబంధం లేకుండా... తిరుమల వచ్చే వారందరికీ ఈ పథకం అందుబాటులో ఉంది. ఒక్క కళ్యాణకట్టకు ఎదురుగా ఉన్న క్యాంటిన్‌లో మాత్రమే కాదు.. క్యూకాంప్లెక్స్ 2లోధర్మదర్శనం కోసం వేచిఉండేవారికీ, రద్దీ సమయాల్లో కాంప్లెక్స్ బయట ఉండేవారికి కూడా ఆహారాన్ని అందిస్తోంది.
అన్నం పరబ్రహ్మ స్వరూపమంటారు. ఈ పరబ్రహ్మాన్ని శ్రీవారి భక్తులకు చేరువచేస్తోంది టీటీడీ నిత్యాన్నదాన ట్రస్ట్. భక్తులు భోజనం చేయడమే పరమావధిగా భావించి.. ఎన్నో జాగ్రత్తలు తీసుకొంటోంది. వేలాది మంది నిత్యం వస్తూ పోతూ ఉన్నా... క్యాంటిన్ మాత్రం ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది. నిత్యాన్నదానంలో మరో ప్రత్యేకత.. అరిటాకు భోజనం. ఇళ్లల్లో పండగలప్పుడే.. అరిటాకులో భోజనం చేయడం సాధ్యం కాదు. కానీ.. వేలాదిమందికి నిత్యం అరిటాకు భోజనం పెడుతూ.. సంప్రదాయానికి పెద్ద పీటవేస్తోంది. భక్తులకు వడ్డించే పదార్థాల విషయంలోనూ కాస్త ప్రత్యేకత ఉంది. ఒక పచ్చడి, బెల్లం పొంగలి, అన్నం, సాంబారు, రసం, మజ్జిగను ఈ నిత్యాన్నదానంలో వడ్డిస్తారు. గతంలో ముద్దపప్పు నెయ్యి కూడా పెట్టేవారు. పప్పు,నెయ్యి సేకరించడం కష్టం కావడం.. భక్తులు కూడా చాలామంది వృథాగా వదిలివేస్తుండడంతో వాటిని ఉపసంహరించుకున్నారు. ఇక వడ్డింపు విషయానికి వస్తే.. ముందు.. టేబుళ్లపై.. అరిటాకులు పెట్టి.. అందులో.. పొంగలి, చట్నీ వేసిన తర్వాతే భక్తులను లోపలికి అనుమతిస్తారు. అన్నం, సాంబారు, రసం.. ఇలా వరసగా వడ్డిస్తారు.
భోజనాలు అయిపోయిన తర్వాత.. వెంటనే.. అరటిఆకులను తీసి.. మరో బంతికి సిద్ధమవతారు. ఇదంతా ఓ మహాయజ్ఞం. ప్రతీదీ ఓ పద్దతి ప్రకారం చకచకా జరిగిపోతుంది. అందుకే.. ప్రతీరోజూ 30 వేల మందికి టీటీడీ భోజనాన్ని పెట్టగలుగుతుంది. అయితే.. ఇక్కడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఒకేసారి ఎక్కువ ఎక్కువ వడ్డించడం వల్ల... చాలామంది తినకుండా వదిలివేస్తుంటారు. ఈ వృథాను అరికట్టగలిగితే.. ఈ అన్నదానం వల్ల మరికొంతమందికి మేలు కలుగుతుంది. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే మరెక్కడా.. ఇంత పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమం జరగడం లేదు. అదికూడా పాతికేళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతూ.. రోజురోజుకూ భోజనానికి వచ్చే వారి సంఖ్యను పెంచుకుంటూ పురోగమిస్తుంది నిత్యాన్నదాన ట్రస్ట్.
వందలాది మంది సేవకులు
నిత్యాన్నదాన భోజనం వెనక ఎంతోమంది శ్రమ ఉంటుంది. ఉదయం తొమ్మిదిన్నరకే భోజనాలు మొదలవుతాయి కాబట్టి.. రాత్రి నుంచి పని మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నిత్యాన్నదాన క్యాంటిన్‌లో పొయ్యిలు ఆరకుండా పనిచేస్తూనే ఉంటాయి. దాదాపు 30 వేలమందికి భోజనం కాబట్టి.. అంతేస్థాయిలో వంటకాలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. దీనికోసం వందలాది మంది పనిచేస్తూ ఉంటారు. అన్నం వండడానికి తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని.. వంటలు వండుతారు. వందలాది కిలోల బియ్యాన్ని, కూరగాయలను ప్రతీరోజు ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ నిత్యాన్నదాన పథకానికి కోట్లాది రూపాయలు ఖర్చవుతున్నాయి. అయితే.. ఈ పథకానికి నిధుల సమస్య మాత్రం లేదు. ఎంతోమంది ఉదారంగా స్పందించి.. కోట్లాది రూపాయలను విరాళాలను అందించారు. పథకం ప్రారంభమైనప్పుడు .. ఎల్.వి.రామయ్య.. పది లక్షల రూపాయలు ఇవ్వడంతో విరాళాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఇవి.. 220 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఈ నిధులను బ్యాంకులో డిపాజిట్ చేశారు. దీనిపై వచ్చే వడ్డీని మాత్రమే నిత్యాన్నదానం కోసం ఉపయోగిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న కాంప్లెక్స్ భోజనాలకు సరిపోకపోవడంతో.. మరో కొత్త భవనాన్నినిర్మిస్తున్నారు. వరహస్వామి గెస్ట్‌హౌస్ ప్రాంతంలో దాదాపు 20 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక క్యాంటిన్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో ఐదు కోట్ల రూపాయలతో.. ప్రత్యేకంగా కిచెన్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో నాలుగువేల మంది ఒకేసారి భోజనం చేసే సదుపాయం ఉంటుంది. ఈ బిల్డింగ్‌లో భోజనం చేయడానికి వచ్చిన భక్తులు వెయిటింగ్ చేయడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది పూర్తైతే.. భక్తులకు ఉచిత భోజనం కోసం పెద్దగా వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.
కూరగాయలు కొనక్కరలేదు..
నిత్యాన్నదాన పథకంకోసం కూరగాయలు కొనడం.. ట్రస్ట్ అతిపెద్ద పనిగా ఉండేది. కాంట్రాక్టర్లు కుమ్మక్కై.. ఎక్కువ డబ్బు తీసుకోవడంతో పాటు నాణ్యమైన సరుకు అందించేవారు కాదు. అయితే.. రెండేళ్లుగా.. అసలు కూరగాయ అనేదే కొనే అవసరం లేకుండా పోయింది. విజయవాడకు చెందిన మండవ కుటుంబరావు.. ఉచితంగా కూరగాయలు అందించడంతో.. అన్నదాన పథకానికి పెద్ద భారం తగ్గింది. మండవ స్పూర్తితో.. ఇప్పుడు రోజుకొకరు కూరగాయలను ఉచితంగా సరఫరా చేస్తున్నారు. ఈ రకంగా పెద్ద సమస్య టిటీడీ అన్నదాన ట్రస్ట్‌కు తీరిపోయింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి