27, ఏప్రిల్ 2010, మంగళవారం
ఫోన్ ట్యాపర్స్..
రాజకీయ ప్రత్యర్థులపై యూపీఏ బ్రహ్మాస్త్రం?
ఫోన్‌ట్యాపింగ్‌లు చేస్తున్న సర్కార్?
పొలిటికల్ లీడర్సే నిఘా వర్గాల టార్గెట్టా?
పరిస్థితి అలానే ఉంది. రాజకీయ నేతల ఫోన్లలో మాట్లాడుతున్న సంభాషణలను కేంద్ర ప్రభుత్వం రహస్యంగా రికార్డు చేస్తుందన్న ఆరోపణలు.. పార్లమెంట్‌ను కుదిపేశాయి. ముఖ్యంగా ప్రతిపక్షపార్టీ బీజేపీ ఈ అంశంపై సీరియస్‌గానే దృష్టిపెట్టింది. రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేయడం సరికాదంటూ.. ప్రతిపక్ష నేత అద్వానీ విరుచుకుపడ్డారు. ఓ మ్యాగ్‌జైన్‌లో వచ్చిన కథనాలను ప్రస్తావిస్తూ.. పార్లమెంటరీ కమిటీతో ప్రత్యేక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.. అయితే ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయమని ఏ సంస్థనూ ఆదేశించలేదని లోక్‌సభలో హోంమంత్రి చిదంబరం ప్రకటించారు. ఫోన్ ట్యాపింగ్‌కోసం ఎవరికీ అధికారాలు కట్టబెట్టలేదనీ చెప్పారు. అయితే.. ఆరోపణలపై మాత్రం విచారణ జరుపుతామన్నారు.
ఐపీఎల్ లింకులు
ఐపీఎల్ వల్లే ఫోన్‌ట్యాపింగ్ వివాదం మరోసారి వార్తల్లోకి వచ్చింది. కొచ్చి ఫ్రాంఛైజీలో అక్రమ వాటాల లెక్కలను లలిత్‌మోడి బయటపెట్టడంతో నిఘా వర్గాల కళ్లు ఐపీఎల్‌పై పడ్డాయి. బీసీసీఐలో చక్రం తిప్పే కేంద్రమంత్రి శరద్‌పవార్‌కు, లలిత్‌మోడికి సన్నిహిత సంబంధాలుండడంతో రహస్యాల కోసం పథకం వేశాయి. పవార్ ఫోన్‌ను ట్యాప్ చేశాయి. ఐపీఎల్‌కు సంబంధించిన కీలక వివరాలను ఈ ట్యాపింగ్ ద్వారానే సంపాదించినట్లు తెలుస్తోంది. శరద్‌పవార్ ఫోన్ ట్యాప్ అయిన తర్వాతే.. ఫ్రాంఛైజీలపై ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఫ్రాంఛైజీల నిధులకు సంబంధించి.. ఎన్నో కీలక రహస్యాలు కూడా బయటపడ్డాయి.
రాజకీయనేతలే లక్ష్యం..
కేవలం.. పవార్ ఫోన్ మాత్రమే కాదు.. ఎప్పటికప్పుడు రాజకీయ నేతల ఫోన్ సంభాషణలను నిఘా సంస్థలు రికార్డు చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వానికి ఇబ్బందులు తేవడానికి ప్రతిపక్షాలు ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నాయన్నది కనిపెట్టడానికి ప్రత్యేక టీంలే పనిచేస్తున్నాయి. అంతర్గత భద్రత ముసుగులోనే ఇదంతా జరుగుతోంది. ఫోన్ సంభాషణల గుట్టును రట్టుచేస్తున్న వారు.. ప్రభుత్వానికి చెందిన సిబ్బందే అయినా.. జరుగుతోంది మాత్రం అధికార పార్టీ కోసమే. అయితే.. ఈ ఫోన్‌ట్యాపింగ్‌కు పార్టీ బేధం లేదు. స్వపక్షం వారైనా.. విపక్షం వారైనా.. డౌట్ ఉన్న ప్రతీ ఒక్కరి మాటలనూ మూడో చెవి వింటోంది. అవుట్‌లుక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2007 ఫిబ్రవరిలో కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ ఫోన్‌కూడా ఇలానే ట్యాప్ అయ్యింది. అప్పట్లో సీడబ్యూసీ ఎన్నికల సమయంలో పంజాబ్‌కు చెందిన నేతతో మాట్లాడుతున్న సంభాషణలను కాంగ్రెస్ అధిష్టానానికి అందాయి. దీనిపై.. దిగ్విజయ్ సింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇలా చేయకూడదంటున్న ఆయన.. విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక 2007 అక్టోబర్లో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఫోన్ కూడా ట్యాప్ అయ్యింది. ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రణాళికసంఘం నుంచి ఎలా నిధులు పొందాలన్న విషయంపై నితీశ్‌కుమార్ జరిపిన సంభాషణలు మరోచోట రికార్డయ్యాయి. ఆ సమయంలో నితీశ్ వాడింది సొంత ఫోన్‌కూడా కాదు.. ఆయన పక్కనే ఉన్న అధికారి ఫోన్ నుంచి మాట్లాడారు. అయినా.. బీహార్ సీఎం మాటలు రికార్డయ్యాయంటే.. నిఘా వర్గాలు ఎంత బాగా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే.. తనలాంటి వారివల్ల దేశ అంతర్గత భద్రతకు వచ్చిన నష్టమేంటని ప్రశ్నిస్తున్నారు నితీశ్‌కుమార్..
ఇటీవల ఎన్నికలకు ముందు అణుఒప్పందం విషయంలో మద్దతు ఉపసంహరించుకొని.. యూపీఏ సర్కార్‌ను కూలదోయడానికి ప్రయత్నించాయి లెఫ్ట్ పార్టీలు. ఈ సమయంలో.. సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్ కారత్ ఫోన్లో మాట్లాడే సంభాషణలు మూడోచెవి అత్యంత జాగ్రత్తగా వింది. ప్రతిపక్షాలు వేస్తున్న ఎత్తుగడలను ముందుగానే అధికారపక్షానికి అందజేసింది. ఇక మన రాష్ట్రంలోనూ ఇలాంటి నిఘా పెద్ద ఎత్తునే సాగుతోంది. ముఖ్యంగా రాజకీయ నేతలనే ఎక్కువగా నిఘా వర్గాలు టార్గెట్ చేసుకుంటున్నాయి.
టెలిఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు?
చాలామందికి తెలిసిన విషయం ప్రకారం.. ఫోన్ రిసీవర్‌లో రికార్డర్ పెట్టి వాయిస్‌లు రికార్డు చేయొచ్చు. అయితే.. ఇదంతా పాతకాలం పద్దతి. ఇప్పుడు ప్రతీ ఒక్కరి దగ్గరా ఒకటికి రెండు సెల్‌ఫోన్లున్నాయి. సెల్‌ఫోన్స్‌లోనూ ఓ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తే ట్యాప్ చేయొచ్చు. కానీ.. ఎంతమంది ఫోన్లలో ప్రభుత్వం ఈ సాఫ్ట్‌వార్ను పెట్టగలదు. పైగా.. రాజకీయ నాయకుల చేతిలో ఏ ఫోన్ ఎప్పుడు ఉంటుందో ఎవరికి తెలుసు.. అందుకే.. అధునాతన టెక్నాలజీని నిఘావర్గాలకు అందించింది కేంద్ర ప్రభుత్వం. ఈ టెక్నాలజీ సాయంతో.. ఎవరిఫోన్లనైనా.. ఎప్పుడైనా ట్యాప్ చేయొచ్చు..
దేశంలో ఫోన్‌ట్యాపింగ్‌లు చేయడానికి ప్రత్యేకమైన వ్యవస్థే ఉంది. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. సెల్‌ఫోన్స్ నుంచి వెళ్లే ప్రతీ ఎస్.ఎం.ఎస్‌ను, కాల్‌ను NTRO పసిగట్టగలుగుతుంది. జీఎస్‌ఎం, సీడీఎంఏ ఫోన్లు దేశంలో పెరుగుతుండడంతో.. వాటిని ట్యాప్ చేయగలిగే పరికరాలను ఇజ్రాయెల్ కంపెనీల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇంతకు ముందులా టెలిఫోన్ కంపెనీల ఎక్సేంజీల్లో కూర్చుని ట్యాప్ చేయనక్కరలేదు. ఆఫ్‌ది ఎయిర్ జీఎస్‌ఎం మానిటరింగ్ డివైజ్‌లుగా పిలిచే ఈ లేటెస్ట్ మిషనరీ ద్వారా కార్లలో వెళుతూనే.. ఫోన్లు ట్యాప్ చేయవచ్చు. సెల్‌ఫోన్ టవర్స్ నుంచి వచ్చే సిగ్నల్‌ను ఇవి అందుకుంటాయి. ఈ డివైజ్ అమర్చిన కార్‌కు రెండు కిలోమీటర్ల పరిధిలో జరిగే సంభాషణలన్నీ రికార్డు చేయవచ్చు. ప్రస్తుతం పొలిటికల్ లీడర్స్‌పైనా, వీఐపీల పైనా, బడాబడా వ్యాపారవేత్తల ఫోన్లను ఇదే తరహాలో ట్యాప్ చేస్తున్నారు.
ఇలా కార్లలో అమర్చగలిగే ట్యాపింగ్ డివైజెస్.. దాదాపు 90 వరకూ నిఘా సంస్థల వద్ద ఉన్నాయి. ఢిల్లీ,ముంబైతో పాటు.. మన హైదరాబాద్‌లోనూ పెద్ద ఎత్తునే వీటిని ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి కార్గిల్ యుద్ధ సమయంలో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కారణంగా.. టెక్నాలజీపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఈ అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేసింది. 2006లో ఇవి నిఘా వర్గాలకు అందాయి. దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ఉగ్రవాదులు వేసే ప్లాన్స్‌ను తెలుసుకోవాలన్నదే ఈ ఫోన్‌ట్యాపింగ్‌ల ప్రధాన ఉద్దేశం. సగం వరకూ ఈ పనే జరుగుతున్నా.. మరో సగం మాత్రం రాజకీయ అవసరాలకే పరిమితమవుతున్నాయి.
కేంద్ర ఇంటెలిజెన్స్, కేంద్ర గుఢాచార సంస్థలు మాత్రమే ఫోన్ ట్యాపింగ్‌లు చేస్తాయనుకోవడమూ పొరపాటే. ఎందుకంటే.. సీబీఐ దగ్గర నుంచి, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వరకూ.. ఎవరైనా.. ఎవరిపైనైనా నిఘా పెట్టొచ్చు. ఆ పరిస్థితులు ఇప్పుడు వచ్చేశాయి. అంతేకాదు.. టెలికాం కంపెనీలకు లైసెన్సులు ఇచ్చే విధానంలోనూ కేంద్ర ప్రభుత్వం మార్పులు తెచ్చింది. ప్రతీ సిటీలోనూ 400 అడుగుల గదిని, 8 కంప్యూటర్లను తప్పనిసరిగా నిఘా వర్గాల కోసం టెలికాం సంస్థలు కేటాయించాలి. నెట్‌వర్క్ నుంచి వెళ్లే కాల్ వివరాలు ఈ కంప్యూటర్లలో రికార్డవుతాయి. కావల్సిన సమాచారాన్ని కావల్సినప్పుడు వీటి ద్వారా పొందే అవకాశం ఉంటుంది. ఈ వ్యవహారమంతా NTRO ఆధ్వర్యంలోనే జరుగుతోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించకూడదని చెబుతున్నా.. ప్రభుత్వ సంస్థలు అదేమీ పట్టించుకోవు. కానీ... అమెరికాలో ఎఫ్‌బీఐ.. ఇలా ఫోన్ ట్యాప్ చేయాలంటే.. అక్కడి కోర్డు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఇక ఇంగ్లాండ్‌లోనూ అక్కడి నిఘా సంస్థ M15 కు ప్రత్యేక అనుమతి ఉంటే తప్ప ట్యాప్ చేయడానికి వీల్లేదు. ప్రజాస్వామ్యానికి పెద్దకొమ్మని చెప్పుకునే మన దేశంలో మాత్రం.. నిబంధనలు యధేచ్చగా ఉల్లంఘనకు గురవుతున్నాయి. అంతర్గత భద్రత కోసమే చేయడంలో తప్పు లేదు కానీ.. దానికీ కొన్ని పరిధులు ఉండాల్సిన అవసరం ఉంది.
నాట్‌గ్రిడ్
ఓ వైపు ఫోన్ ట్యాపింగ్ వివాదం పార్లమెంటును అట్టుడికిస్తుంటే.. మరోవైపు.. అందరి రహస్యాలను గుప్పిటలో ఉంచుకోవడానికి మహావ్యవస్థనే సృష్టిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీనిపేరు నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్. ముంబై టెర్రరిస్టు దాడుల అనంతరం చిదంబరం ప్రతిపాదించిన వ్యవస్థే ఇది. దేశ అంతర్గత భద్రతకు పెనుసవాల్‌గా మారిన తీవ్రవాదాన్ని తుదముట్టడించడానికి వేసిన ఎత్తుగడలో ఇదో భాగం. దేశంలో నివసించే.. ప్రతీ ఒక్కరి వ్యక్తిగత వివరాలనూ సేకరించి.. వారు నిర్వహించే ప్రతీ లావాదేవీని రికార్డు చేయడమే ఈ ఇంటెలిజెన్స్ గ్రిడ్ ప్రధాన లక్ష్యం. ఇప్పటికే జనగణన మొదలయ్యింది. 15 ఏళ్ల పైబడిన వారి వివరాలను పూర్తిస్థాయిలో సేకరిస్తున్నారు. ఇది తొలిదశ మాత్రమే.
దీనికి తోడు.. ప్రతీ పౌరుడికీ విశిష్ట గుర్తింపు కార్డు ఇవ్వడం కోసం పెద్ద ఏర్పాట్లనే చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. యూనిక్ ఐడెంటికీ కార్డుల ద్వారా.. ఒక్కొక్కరికీ ఒక్కో నెంబర్ ఇచ్చి దానిపైనే అన్ని రికార్డులు నమోదయ్యేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ.. దీనిద్వారా.. ఉగ్రవాదులను గుర్తించడం చాలా కష్టం. అందుకే.. ఇంటెలిజెన్స్ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తోంది. రేషన్‌కార్డు దగ్గర నుంచి మొదలుపెడితే.. డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డు నెంబర్లు, పాస్‌పోర్టులు, ఆదాయ పన్ను రికార్డులు.. ఇలా మొత్తం 21 రకాల సమాచారాన్ని ఒక్కచోట ఈ వ్యవస్థ ద్వారా నిక్షిప్తం చేయాలని ప్రభుత్వం ప్రణాళిక వేస్తోంది. జనగణన, యూనిక్ ఐడెంటిటీ కార్డులతో పాటు.. ఈ సమాచారాన్ని జోడిస్తారు. అంతేకాదు.. మనం కొనే ప్రతీ వస్తువు సమాచారమూ అందేలా స్కెచ్ గీస్తోంది. దీనిద్వారా పేలుడు పదార్థాలు, ఇతర విధ్వంసక పదార్థాలు ఎక్కువమొత్తంలో కొన్నవారి వివరాలను తెలుసుకోవచ్చనుకొంటోంది. కానీ, కొన్న ప్రతీదానికి బిల్లు ఇచ్చే పద్దతి కాని, తీసుకునే పద్దతి కానీ లేని మనదేశంలో ఇది ఎంతవరకూ సక్సెస్ అవుతుందన్నది డౌటే.
ఈ వ్యక్తిగత వివరాలన్నీ ఏదో ఓ కంప్యూటర్లో నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. టెక్నాలజీ రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ డాటా ఉన్న సర్వర్లను ఎవరైనా హ్యాక్ చేస్తే ఏమిటన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకం. వ్యక్తిగత వివరాలు హ్యాకర్లకు దొరికితే జరిగే నష్టాన్ని ఊహించలేం. అందుకే.. ఇదేమంత సురక్షితమైన పద్దతి కాదన్న భావన వ్యక్తమవుతోంది.
వాస్తవానికి ఇక్కడా టెర్రరిస్టుల బూచినే చూపిస్తున్నప్పటికీ, దీనివల్ల ప్రభుత్వ ప్రత్యర్థులకే చిక్కులు ఎక్కువగా ఎదురుకావచ్చు. నాట్‌గ్రిడ్ ద్వారా సేకరించే సమాచారం 11 సంస్థలకు అందుబాటులో ఉంటుంది. మన నిఘా సంస్థలు ఎప్పుడూ అధికారంలో ఉన్న పార్టీకే అనుకూలంగా పనిచేస్తాయి కాబట్టి.. ఈ వ్యవస్థ దుర్వినియోగం అవుతుందన్న అభిప్రాయమే ఎక్కువమందిది. వ్యక్తిగత సమాచారాన్నివాడుకొని రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి ప్రయత్నించే ప్రమాదమూ ఉంది. టెర్రరిస్టుల మాట అటుంచింతే.. ప్రతీ ఒక్కరికీ ఈ వ్యవస్థతో లేనిపోని చిక్కులే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి