17, ఏప్రిల్ 2010, శనివారం
ఇండియన్ పైసా లీగ్..
Categories :
ఐపీఎల్ విజయాలు నిజమైనవేనా?
ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌లు జరుగుతున్నాయా?
ఫలితాలు స్టేడియం బయటే డిసైడ్ అవుతున్నాయా?
ప్రతీరోజూ కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయా?
ఈ అనుమానాలన్నీ ఇప్పుడు ఎవరికైనా కలగాల్సిందే. ఐపీఎల్ చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు ఈ సందేహాలను రేకెత్తిస్తున్నాయి. కొచ్చి ఫ్రాంఛైజీ ఓనర్లెవరంటూ మొదలైన వివాదం.. సుడిగాలిలా ఐపీఎల్‌ను చుట్టుముడుతోంది.
ఐపీఎల్‌పై ప్రతీరోజు దాదాపు 10 నుంచి 20 వేల కోట్ల రూపాయల బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఇంతపెద్ద మొత్తంలో బెట్టింగ్‌లు జరుగుతున్నాయంటే.. అండర్‌వరల్డ్ హస్తం తప్పకుండా ఇందులో ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. బెట్టింగ్‌ల ప్రభావం ఎక్కువగా ఉంటే.. కచ్చితంగా మ్యాచ్ఫిక్సింగ్లూ జరుగుతాయని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
మ్యాచ్‌ఫిక్సింగ్ జరగడం నిజమైతే.. మన క్రికెట్ పాతాళానికి పడిపోయినట్లే. ఇక అండర్ వరల్డ్ మాఫియాకు ఐపీఎల్‌కు లింకులు ఉన్నాయన్న అనుమానాలు బలపడడానికి మరోకారణం.. కేంద్ర మంత్రి శశిథరూర్‌కు వచ్చిన SMS మెసేజ్. లలిత్‌మోడికి, శశిథరూర్‌కు మధ్య కోచి ఫ్రాంఛైజీ వివాదంలో ఈ SMS వచ్చింది. డి-కంపెనీ పేరుతో వచ్చిన ఈ మెసేజ్ ఎక్కడిదన్న ఆరా తీయడంలో నిఘా సంస్థలు బిజీ అయ్యాయి. అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయం.. మోడి-థరూర్ గొడవలో.. డి-కంపెనీ ఎందుకు జోక్యం చేసుకొంటోంది ? ఐపీఎల్‌పై మాఫియాకు ఎందుకింత మమకారం... ? ఇదే ఇప్పుడు తేలాల్సి ఉంది..
దీనికి తోడు.. ఐపీఎల్ ఫ్రాంఛైజీల కోసం కోట్లాది రూపాయలను వ్యాపారవేత్తలు వెదజల్లారు. తొలివిడత బిడ్డింగ్‌తో పోల్చితే.. ఇటీవల జరిగిన రెండో బిడ్డింగ్‌లో ఒక్కో టీం కోసం వెచ్చించే మొత్తం దాదాపు నాలుగింతలు పెరిగింది. ఫస్ట్ బిడ్డింగ్‌లో ముంబై టీం కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ దాఖలు చేసిన బిడ్ వాల్యూ.. 447.6 కోట్ల రూపాయలు మాత్రమే. ఐపీఎల్లో ఇదే అత్యధికం. కానీ.. ముంబై తో పోల్చితే తక్కువస్థాయి నగరాలైన పూణే ప్రాంఛైజీ కోసం సహారా గ్రూప్ 1702 కోట్లు.. కోచి ఫ్రాంఛైజీ కోసం రెండేవూ స్పోర్ట్స్ వరల్డ్ కన్సార్టియం 1533 కోట్ల రూపాయలు వెచ్చించాయి. టైర్-టూ సిటీల ఫ్రాంఛైజీల కోసమే.. ఇన్నికోట్ల రూపాయలను వెచ్చించడానికి కారణం ఏమిటి? ఇంత డబ్బు ఖర్చు పెడితే.. ఫ్రాంఛైజీకి లాభం వస్తుందా... ఇవన్నీ చూస్తుంటే.. ఐపీఎల్లో.. మనీగోల్మాల్ జరుగుతోందని తెలుస్తోంది. బ్లాక్మనీనే.. ఐపీఎల్లో ఇన్వెస్ట్ చేసి.. వైట్ మనీగా మార్చుతున్నారన్న ఆరోపణలూ వస్తున్నాయి. ఏదేమైనా.. ఈ మొత్తం వ్యవహారం చూస్తే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాస్తా.. ఇండియన్ పైసా లీగ్‌గా మారిపోయిందని అర్థమవుతుంది.
మోడి.. థరూర్.. మధ్యలో లేడి
సజావుగా సాగుతున్న ఐపీఎల్లో తుఫాను మొదలవ్వడానికి కారణం.. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన బ్యూటీ ఎక్స్పర్ట్ సునందా పుష్కర్. ఐపీఎల్ లేటెస్ట్ ఫ్రాంఛైజీల్లో ఒకటైన కొచ్చిలో ఆమెకు 4.7 శాతం వాటా దక్కింది. దీని విలువ దాదాపు 70 కోట్ల రూపాయలు. ఇంతవరకూ బాగానే ఉంది. సునందకు ఈ వాటా ఎలా దక్కింది అని ఎవరికైనా డౌట్ వస్తే.. స్టోరీలో టర్నింగ్ పాయింట్ మొదలవుతుంది. ఏదైనా కంపెనీలో వాటా కావాలంటే.. ఎంతో కొంత పెట్టుబడి పెట్టాలి. కాబట్టి.. సునంద కూడా 70 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేసిందని ఎవరైనా అనుకోవచ్చు.. కానీ.. ఆమె ఒక్కపైసా కూడా చెల్లించలేదు. ఈ 70 కోట్ల వాటా అంతా ఆమెకు ఫ్రీగానే వచ్చింది. అదే అసలు పాయింట్.. సునందకు కొచ్చి ఫ్రాంఛైజీ ఫ్రీగా వాటా ఎందుకు ఇచ్చింది? దీనికి సంతృప్తి కరమైన సమాధానం ఎవరినుంచీ రావడం లేదు. స్వతహాగా మార్కెటింగ్ ఫ్రొఫెషనల్ అయిన సునందకు... ఫ్రాంఛైజీకి ఇమేజ్ తెచ్చే సత్తా ఉంది కాబట్టి.. ఆ వాటా ఇచ్చామంటోంది.. రెండేవూ కన్సార్టియం.
కేవలం మార్కెటింగ్ ఎక్స్పర్ట్ కాబట్టే.. సునందకు ఇచ్చారని నమ్మలేం. అసలు జమ్మూకాశ్మీర్కూ.. కేరళలోని కొచ్చికి ఏమాత్రమైనా సంబంధం ఉందా.. ఈ లింకునే బయటపెట్టారు ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడి. సునంద పుష్కర్.. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి శశిథరూర్ ప్రియురాలు. త్వరలోనే ఆమెను పెళ్లాడడానికి ఆయన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. శశిథరూర్‌ది కేరళ కావడం... కొచ్చి ఫ్రాంచైజీ విషయంలో రెండేవూ కన్సార్టియాన్ని ఆయన సపోర్ట్ చేయడం.. అదే ఫ్రాంఛైజీలో ఆయన లవర్‌కు ఫ్రీగా వాటా దక్కడం.. ఇవన్నీ ఒకదానికొకటి లింకున్నట్లు కనిపిస్తాయి. శశిథరూర్వల్లే సునందకు ఫ్రీగా వాటా దక్కిందన్నది అందరి అనుమానం. అంటే పెళ్లికి ముందే.. మ్యారేజ్ గిఫ్ట్ ఇచ్చినట్లా....
కేరళ నుంచి ఒక్క శ్రీశాంత్ తప్ప ఇటీవలి కాలంలో మరో ఇంటర్నేషనల్ క్రికెట్ లేడు. అలాంటిది.. ఆ ఫ్రాంఛైజీ కోసం. .రెండేవూ వరల్డ్ స్పోర్ట్స్ కన్సార్టియం... ఏకంగా 1533 కోట్ల రూపాయలు చెల్లించడానికి ముందుకు వచ్చింది. ఇంత డబ్బు ఒక్క కొచ్చి ఫ్రాంఛైజీ కోసమా అంటూ అంతా ఆశ్చర్యపోయారు. ఐపీఎల్ క్రేజ్‌కి ఇది నిదర్శనం అని చాలా మంది సరిపుచ్చుకున్నారు. అయితే.. ఇంత డబ్బును రెండేవూ కన్సార్టియం ఎలా చెల్లిస్తుందన్న సందేహం వచ్చిన వారికి మాత్రం.. ఇందులో ఏదో గోల్మాల్ ఉందని అర్థమవుతుంది. ఈ కన్సార్టియం వాటాలు కూడా గందరగోళంగానే ఉన్నాయి. లలిత్ మోడీ చెబుతున్న దాని ప్రకారం.. కన్సార్టియాన్ని లీడ్ చేస్తున్న రెండేవూకు కేవలం ఒకే ఒక్కశాతం వాటా ఉంది. యాంకర్ కంపెనీకి 27 శాతం, పారినీకి 26 శాతం, ఫిల్మ్ వేవ్స్స్ కంబైన్‌కు 12 శాతం, ఆనంద్శ్యామ్కు 8 శాతం, వివేక్ వేణుగోపాల్‌కు 1 శాతం వాటా ఉంది. మిగిలిన 25 శాతం వాటా రెండేవూకు ఫ్రీగా ఇచ్చారు. అంటే.. ఐపీఎల్‌కు చెల్లించాల్సిన 1533 కోట్ల రూపాయలను 75 శాతం వాటా ఉన్న స్టేక్ హోల్డర్స్ మాత్రమే చెల్లించాలి. ఇక రెండేవూ ఫ్రీస్టేక్లో చాలామందికి వాటాలున్నాయి. కేంద్ర మంత్రి శశిథరూర్ గర్ల్‌ఫ్రెండ్ సునందకు ఇలానే వాటా దక్కింది. ఇప్పుడు డౌట్ అంతా.. కన్సార్టియంను లీడ్ చేస్తున్న రెండేవూకు 25 శాతం వాటాను ఫ్రీగా ఎందుకిస్తున్నారు? దీనికి తోడు వాటాదార్ల విషయంలోనూ ఇంకా గందరగోళం ఉందంటున్నారు.. ఐపీఎల్ ఛైర్మన్ లలిత్‌మోడి. దీనికి సమాధానం చెప్పే పరిస్థితిలో లేదు కొచ్చి ప్రాంఛైజీ అందుకే.. ఎదురు దాడి మొదలుపెట్టింది. కొచ్చికి బదులు అహ్మదాబాద్‌కు ఫ్రాంఛైజీని మార్చాలని మోడి చూస్తున్నారని.. అందుకే.. ఇలా వివాదాస్పదం చేస్తున్నారంటోంది.
మొత్తం మీద.. శశిథరూర్ గర్ల్‌ఫ్రెండ్‌కు ఫ్రీగా వాటా ఇవ్వడం కొచ్చి ఫ్రాంఛైజీని ఇబ్బందుల్లో పడేసింది. పైగా.. ఐపీఎల్‌లోకి డబ్బు ఎలా వస్తోందన్న అనుమానాలు రేకెత్తించింది. కొచ్చిలో 25 శాతం ఉచిత వాటాకోసం.. బ్లాక్‌మనీని పంప్ చేస్తారన్న అనుమానాలు వస్తున్నాయి.
ఫ్రాంఛైజీల అసలు ఓనర్లు ఎవరు?
ప్రస్తుతం.. ఐపీఎల్లో 8 టీంలు ఉన్నాయి. ఇందులో.. అందరికన్నా ఎక్కువ మొత్తం ఖర్చుపెట్టి ముంబైటీంను సొంతం చేసుకుంది రిలయన్స్ ఇండస్ట్రీస్. దీనికోసం 447.6 కోట్ల రూపాయలను ఐపీఎల్‌కు చెల్లించడానికి ముందుకువచ్చింది. ఇందులో హండ్రెడ్ పర్సెంట్ స్టేక్.. రిలయన్స్ ఇండస్ట్రీస్‌దే. సెకండ్ ప్లేస్.. రాయల్ ఛాలెంజర్స్ది. విజయమాల్యాకు చెందిన యునైటెడ్ బేవరేజెస్ గ్రూప్.. 446.4 కోట్లకు బెంగళూరు టీంను కొనుక్కొంది. ఇందులో ఇతర వాటాదారులెవరూ లేరు. మూడో ప్లేస్.. డెక్కన్ ఛార్జర్స్ది. 428.04 కోట్ల రూపాయలకు హైదరాబాద్ టీంను డెక్కన్ క్రానికల్ కొనుగోలు చేసింది. చెన్నై టీంను ఇండియా సిమెంట్స్ 364 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ ఫ్రాంఛైజీకి యజమాని ఎన్.శ్రీనివాసన్. ఈయన బీసీసీఐకి సెక్రటరీగా పనిచేస్తూనే.. ఈ టీంను సొంతం చేసుకున్నారు. ఢిల్లీ డేర్ డెవిల్స్‌ను జీఎంఆర్ గ్రూప్.. 336 కోట్ల రూపాయల బిడ్‌తో సొంతం చేసుకుంది. ఇలా పెద్దమొత్తాలు చెల్లించిన టీంలన్నీ సింగిల్ స్టేక్ ఉన్న కంపెనీలవే.
ఇక తక్కువ మొత్తాలకే వెళ్లిపోయిన మూడు ఫ్రాంఛైజీల విషయంలోనే కాస్త గందరగోళం ఉంది. అందులోనూ వీటికి ప్రాతినిధ్యం వహిస్తోంది బాలీవుడ్ స్టార్లే. ప్రతీ ఐపీఎల్‌లోనూ ఎంతో హంగామాతో హడావిడి చేసే టీం.. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కింగ్‌ఖాన్ షారుక్ ఒక్కడే యజమాని కాదు. షారుక్‌ఖాన్ సంస్థ రెడ్ చిల్లీస్ కు 65 శాతం.. బాలీవుడ్ నటి జూహీచావ్లా, జై మెహతాలకు 35 శాతం వాటా ఉంది. ఈ ముగ్గురూ కలిసి 300.36 కోట్ల రూపాయలకు కోల్‌కతా ఫ్రాంఛైజీని దక్కించుకున్నారు.
బాలీవుడ్ నటి ప్రీతిజింతా ఎప్పుడూ కనిపించే కింగ్స్ లెవన్ పంజాబ్‌కు ఆమె ఒక్కరే యజమాని కాదు. ఈ మొహాలీ టీంను జింతా అండ్ కో.. 304 కోట్లకు కొనుగోలు చేశారు. ఇందులో ప్రీతిజింతాకు ఉన్నది కేవలం 25 శాతం వాటానే. గ్లామర్ ఉండడంతో బ్రాండ్ అంబాసిడర్‌గా హల్చల్ చేస్తోంది. ఈ ఫ్రాంచైజీలో నెస్ వాడియాకు 25 శాతం , కరన్ పాల్‌కు 25 శాతం, మోహిత్ ,గౌరవ్ బర్మన్‌లకు కలిసి 25 శాతం వాటాలున్నాయి. అయితే.. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం.. గౌరవ్ బర్మన్కు లలిత్ మోడికి బంధుత్వం ఉండడం. మోడి భార్యకు మొదటి భర్త ద్వారా పుట్టిన అమ్మాయి భర్తే ఈ గౌరవ్. మోడికి గౌరవ్ బినామీ అనే ఆరోపణలూ ఉన్నాయి. దీనికి తోడు.. తక్కువ ధరకే ఫ్రాంఛైజీని ప్రీతిజింతా టీం దక్కించుకోవడంలోనూ మోడి పాత్ర ఉందని తెలుస్తోంది.
చివరగా మిగిలిన టీం.. ఫస్ట్ ఐపీఎల్ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్. ఎమర్జింగ్ మీడియా కన్సార్టియం ఈ టీంను కేవలం 268 కోట్లకే కొట్టేసింది. ఐపీఎల్ వేలం పాటల్లో అతి తక్కువ బిడ్ ఇదే. ఇందులో ఎమర్జింగ్ మీడియాకు చెందిన మనోజ్ బదాలేకు 33.33 శాతం, లాచ్లాన్ ముర్దోక్‌కు 33.33 శాతం. ఆదిత్య చెల్లారాం, సురేష్ చెల్లారాంలకు సంయుక్తంగా 33.33 శాతం వాటాలున్నాయి. సురేశ్ చెల్లారం కూడా లలిత్ మోడికి బంధువే. మోడి భార్య చెల్లిలిని సురేశ్ చెల్లారాం వివాహం చేసుకున్నాడు. ఇందులో.. 11.7 శాతం వాటాను అమ్మేశారు. ఇంత తక్కువ మొత్తానికే బిడ్ గెలుచుకోవడంలో మోడి క్రియాశీలక పాత్ర పోషించినట్లు అనుమానం. అంతేకాదు.. ఇందులోనూ మోడికి వాటాలున్నట్లు ఎంతోమంది వాదిస్తున్నారు. కానీ.. దీన్ని లలిత్ మోడీ మాత్రం ఖండిస్తూనే ఉన్నాడు.
ఐపీఎల్ నిజంగా లాభమేనా...?
ఐపీఎల్ అంటేనే క్రేజ్.. సింపుల్‌గా పాపులారిటీ తెచ్చుకునే ఛాన్స్.. అంతేకాదు.. అతిపెద్ద బిజినెస్ కూడా. మొదటి ఐపీఎల్‌తో పోల్చితే.. రెండో ఐపీఎల్లో అన్ని ఫ్రాంఛైజీలు లాభాలను మూటగట్టుకున్నాయి. ముంబై ఇండియన్స్ 7 కోట్ల లాభాన్ని పొందితే, రాయల్స ఛాలెంజర్స్ 8.15 కోట్ల లాభాన్ని, డెక్కన్ ఛార్జర్స్ 14.8 కోట్లను, చెన్నై సూపర్ కింగ్స్ 21.8 కోట్లను, ఢిల్లీ డేర్‌డెవిల్స్ 23.3 కోట్లను, కింగ్స్ లెవన్ పంజాబ్ 26.1 కోట్లను, కోల్‌కతా నైట్ రైడర్స్ 25.8 కోట్లను, రాజస్థాన్ రాయల్స్ 35.1 కోట్ల లాభాన్ని ఆర్జించాయి. అందుకే.. కొత్త ఫ్రాంఛైజీలకు ఇంత డిమాండ్. వేలాది కోట్లు పోసి కొనుగోలు చేయడానికి పెద్దపెద్ద సంస్థలే ముందుకు వచ్చాయి.
ఇక రెండోది ఫ్రాంఛైజీల విలువ విపరీతంగా పెరగడం. ఒక్కో ఫ్రాంచైజీ వాల్యూ.. ఇప్పుడు వెయ్యి కోట్లకు పైమాటే. అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. వరస పరాజయాలతో ఉన్న కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు.. ఇప్పుడు అమ్మకానికి వచ్చింది. వెయ్యి కోట్లకు పైన కొనడానికి ఎవరైనా వస్తే.. అమ్మడానికి నెస్ వాడియా సిద్ధంగా ఉన్నాడు. ఐపీఎల్లో లాభాల పంట పండుతున్నప్పుడు అర్జెంట్‌గా టీంను అమ్ముకోవాలని నెస్ వాడియా ఎందుకనుకుంటున్నారు?
ఇంకో విషయం.. కొత్త టీంలకు నష్టాలే స్వాగతం పలకనున్నాయి. వచ్చే ఐదేళ్లపాటు.. ఏడాదికి కనీసం వందకోట్లను కొత్త ఫ్రాంఛైజీలు వదలించుకోవచ్చని తెలుస్తోంది. టీంల నిర్వహణ, ఆటగాళ్లకు చెల్లింపులు.. ఫ్రాంఛైజీలకు భారంగా మారనున్నాయి. పైగా.. ఇప్పుడున్న టీంలకు కూడా.. ఆదాయ సమీకరణ మరింత కష్టమే. ఆటగాళ్ల చెల్లింపులు ఎక్కువవుతాయి కాబట్టి.. వాటాలను అమ్ముకోవడం ఒక్కటే మార్గం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Good and thought provoking.
Check this...
http://www.tehelka.com/story_main44.asp?filename=Ne240410the_indian.asp