మీరెక్కడికో వెళుతున్నారు.. కానీ మీ వెనకే ఎవరో వస్తున్నట్లు డౌట్. మీరు ఏ రెస్టారెంట్‌కో వెళ్లి భోజనం చేస్తున్నారు. కానీ మిమ్మల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారని అనుమానం. ఎటు వెళ్లినా.. ఏం చేసినా.. మిమ్మల్ని ఎవరో ఒకరు ఫాలో అవుతున్నట్లు సందేహం. ఈ పరిస్థితి మీకెదురైతే.. మీ వెనక షాడోలు తిరుగుతున్నట్లే లెక్క
ఎవరీ షాడోలు..
కాలం మారుతోంది... సిటీలైఫ్ పెరుగుతోంది. బంధువుల మధ్య బంధాలేమో గానీ.. ఒకే ఇంటిలో ఉండే వారిమధ్యే సరైన సంబంధాలు ఉండడం లేదు. ఎవరి పని వారిది.. ఎవరి లైఫ్ వారిది. ఒకప్పటిలా ఎవరో ఒకరు పనిచేస్తే కుదరదు.. ఆలుమగలిద్దరూ కష్టపడాల్సిందే. ఉదయాన్నే ఇంటి గడప దాటాల్సిందే. ఇలా... మోడ్రన్ లైఫ్‌లో పడి.. పర్సనల్ లైఫ్‌ను మర్చిపోతున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. లైఫ్ పార్టనర్స్లో ఎవరో ఒకరికి అనుమానం వచ్చిందంటే మాత్రం.. మరొకరి మీద నిఘా పెరుగుతుంది. రోజంతా ఏం చేస్తున్నాడో అన్న ఆరా మొదలవుతుంది.
అయితే.. మీ జీవిత భాగస్వామి మీ వెంట రారు. ఆ పని చేసిపెట్టడానికి ఇప్పుడు ప్రైవేటు డిటెక్టివ్లు ఉన్నారు. పెళ్లికి ముందు.. అబ్బాయి, అమ్మాయిల వ్యవహారశైలిని పర్యవేక్షించడానికే ఎక్కువగా పరిమితమయ్యే డిటెక్టివ్‌ల దగ్గర ఇప్పుడు సస్పెక్టెడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది..
భర్తపై భార్యకు అనుమానం. ఇంటి నుంచి వెళుతున్న భర్త.. ఆఫీసుకు కాకుండా... మరెక్కడో వెళుతున్నాడన్న సంశయం. అందుకే.. నిజం నిగ్గు తేల్చడానికి ప్రైవేటు డిటెక్టివ్‌లను ఆశ్రయించడం మొదలవుతోంది. ఇక భర్తలూ తక్కువేమీ కాదు. వ్యాపార పనుల నిమిత్తం.. నిత్య నగరాల మధ్య తిరిగే వారు ఇంటి పట్టున ఉండే అవకాశం తక్కువే. ఈ సమయంలో తన భార్య ఏం చేస్తుందో అన్న డౌట్.. సదరు భర్తది. ఇంకేముంది.. చలో డిటెక్టివ్ ఏజెన్సీ. వివరాలు చెప్పడం.. ఆరా తీయమనడం.. వేలల్లో ఫీజు కట్టేయడం..
సమస్యకు మూలం
భార్యా.. భర్త.. ఒకరో ఇద్దరో పిల్లలు.. అంతకన్నా ఆనందమైన జీవితం ఉండదు. కానీ.. ఆస్తి, అంతస్థులు, హోదా కోసం.. పరితపించే ఎంతోమంది.. కుటుంబానికి ప్రాధాన్యం తగ్గించి.. ఇతర విషయాలకు టైం ఎక్కువగా కేటాయిస్తున్నారు. అందులో భాగంగానే కొత్త కొత్త పరిచయాలు.. కొత్త కొత్త సంబంధాలు. రాత్రుళ్లు ఆలస్యంగా ఇంటికి రావడాలు.. ఎక్కువగా టూర్లకు వెళ్లడాలూ... ఇవే కుటుంబసభ్యుల్లో అనుమానపు బీజాన్ని నాటుతున్నాయి. అది కాస్తా విషవృక్షంగా మారి.. పూర్తిగా అనుమానించేలా చేస్తోంది. ఇలా ఎక్కువగా జరుగుతోంది.. హైక్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కుటుంబాల్లో కావడం విశేషం. అందులోనూ.. భర్తలపై నిఘా పెట్టమంటూ... భార్యలే ఎక్కువగా డిటెక్టివ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి వారిలో.. దాదాపు 75 శాతం మంది హైక్లాస్ వారే.
హైక్లాస్ సొసైటీలోనే ఇలాంటి కేసులు ఎక్కువగా వెలుగు చూడడానికి ఎన్నో కారణాలున్నాయి. భర్త పట్టించుకోకపోతే.. ఈ కుటుంబాల్లో భార్య దాదాపుగా ఒంటరిదై పోతోంది. ఆస్తి, అంతస్తు ఉన్నప్పటికీ.. భర్త తనకు దూరమవుతున్నాడేమో అన్న ఆందోళన కలవరపెడుతోంది. తనకు మాత్రమే పరిమితం అనుకున్న అతని జీవితంలో మరొకరికి చోటుందేమో అన్న సందేహమూ తలెత్తుతుంది. తన అనుమానం నిజమో కాదో తెలియదు.. ఈ రకమైన ఊగిసలాట ధోరణి హైక్లాస్ ఫ్యామిలీ లేడీస్‌ను వేధిస్తుంది. ఈ అనుమానాలన్నింటినీ నివృత్తి చేసుకోవడానికే.. డిటెక్టివ్ ఏజెన్సీల దారి పడుతున్నారు...
భర్తలను అనుమానించే భార్యల డౌట్స్ తీర్చడానికి హైదరాబాద్ డిటెక్టివ్ ఏజెన్సీలన్నీ సర్వదా సిద్ధంగా ఉంటాయి. నిఘా కోసం.. రకరకాల కెమెరాలు.. రకరకాల ట్రిక్కులూ ఉపయోగిస్తాయి. అంతేకాదు.. ఉదయం ఇంటి దగ్గర నుంచి రాత్రి మళ్లీ ఇంటికి చేరే వరకూ నీడలా డిటెక్టివ్లు వెంటాడతారు. ప్రతీ క్షణం ఏం చేస్తున్నదీ గమనిస్తారు. అనుమానం రాకుండా ఉండడానికి.. సినిమాల్లో నటించే జూనియర్ ఆర్టిస్టులనూ ఉపయోగించుకుంటున్నారు.
ఒక్కో కేసు పూర్తిగా శోధించడానికి దాదాపు వారం రోజులు పడుతుంది. ఈ వారం రోజుల్లో సస్పెక్ట్ ఎవరెవరిని కలిశాడు.. ఎక్కడెక్కడ తిరిగాడు.. అన్న విషయాన్ని పూర్తిగా నోట్ చేసి... అవసరమైతే వీడియోలతో సహా.. పని అప్పగించిన వారికి అందిస్తారు. సో.. బిజీబిజీగా ఉన్నామని చెప్పే భర్తలూ... ఇంట్లో మస్కా కొట్టినా.. షాడో కంటికి మాత్రం చిక్కక తప్పదు.
నో లిమిట్స్
డిటెక్టివ్‌ల దగ్గరకి రకరకాల కేసులు వస్తున్నా.. వాటిలో ఎక్కువభాగం మాత్రం పర్సనల్ రిలేషన్స్‌ను బేస్ చేసుకున్నవే ఎక్కువ. ఇప్పుడంతా ఫాస్ట్ లైఫ్ కావడంతో.. ఎవరిపైనా ఎవరికీ నమ్మకాలు లేవు. ఫారిన్ ఉండే తల్లిదండ్రులు.. మన రాష్ట్రంలో ఉండే పిల్లలపైనా నిరంతరం నిఘా ఉంచుతున్నారు. బంధువులకు అప్పజెప్పితే.. సరికాదని.. నేరుగా డిటెక్టివ్లనే ఆశ్రయిస్తున్నారు. ఇక లవ్మ్యారేజ్ల విషయంలోనూ.. ఈ పరిశోధక సంస్థల పాత్ర ఎక్కువగానే ఉంది. అమ్మాయి ఏం చేస్తుందన్న విషయంపై.. అబ్బాయి తల్లిదండ్రులు ప్రతీ క్షణాన్ని డిటెక్షన్ చేస్తున్నారు.. రెండు మూడేళ్లు ప్రేమించుకుంటున్న వారూ.. డిటెక్టివ్‌ల దగ్గరకు వెళుతున్నారు. అమ్మాయి ఎక్కడెక్కడ తిరుగుతోంది.. ఎవరెవరిని కలుస్తోందని అబ్బాయి నిఘా పెడుతుంటే.. అబ్బాయికి గర్ల్‌ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఉన్నారా.. అలవాట్లు ఎలాంటివని అమ్మాయి డిటెక్షన్ చేస్తోంది.
గూఢచర్యం
డిటెక్టివ్ ఏజెన్సీల వద్దకు వెళ్లలేని వారూ... తమకు అనుమానం ఉన్నవారిని ప్రతీక్షణం అబ్జర్వ్ చేయడానికి లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. ప్రతీ ఒక్కరి చేతిలో ఉండే సెల్‌ఫోనే... ధర్డ్ ఐలా పని చక్కపెడుతుంది. మనం ఎవరినైతే.. అబ్జర్వ్ చేయాలనుకున్నామో వారి సెల్‌ఫోన్.. ఓ పది నిమిషాలు మన చేతిలో ఉంటే చాలు.. పని పూర్తైపోతుంది. ఓ చిన్నసాఫ్ట్వేర్ను.. ఆ ఫోన్లో ఇన్స్టాల్ చేస్తే చాలు.. కాల్ వివరాలు, మెసేజ్‌లు అన్నీ మన కంప్యూటర్లోకి వచ్చేస్తాయి. అవసరం అనుకుంటే... వారు మాట్లాడుతున్న మాటలనూ లైవ్‌లో వినే అవకాశాన్ని కూడా ఈ సాఫ్ట్ వేర్లు కల్పిస్తున్నాయి. ఇక ఈ సెల్‌ఫోన్ స్పై సాఫ్ట్ వేర్ ఎక్కడ దొరుకుతుందనేనా మీ డౌట్.. ఇంటర్నెట్లోకి వెళ్లి.. సెల్‌ఫోన్ స్పై సాఫ్ట్వేర్ అని టైప్ చేస్తే చాలు.. వందలకొద్దీ సైట్లు ఓపెన్ అయిపోతాయి. రీజనబుల్ ప్రైస్‌కే సాఫ్ట్‌వేర్‌ను అమ్ముతాయి. వీటిని మన దగ్గరా వాడుతున్న వారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. అయితే.. ఒకరికి తెలియకుండా వారి ఫోన్ ట్యాపింగ్ చేయడం అన్నది నేరం. ఈ విషయంలో దొరికిపోతే మాత్రం శిక్ష పడక తప్పదు.
డిటెక్షన్ మంచిదేనా?
భార్యాభర్తల మధ్య అపోహలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అనుమానం ఊరికే రాదు. దాని వెనుక ఎంతో పెద్ద కథే ఉంటుంది. ఎన్నో రోజుల బాధ కూడా ఉంటుంది. భర్త అదే పనిగా గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతున్నా.. రోజూ టైంకి ఇంటికి రాకపోయినా.. భార్యకు అనుమానం కచ్చితంగా వచ్చి తీరుతుంది. మరో మహిళతో అతనికి రిలేషన్ లేకపోయినా.. ఈ పరిస్థితి మాత్రం విపత్తునే సృష్టిస్తుంది. ఇది భార్య తప్పు ఎంతమాత్రమూ కాదు.
అయితే.. భర్తతోనే కూర్చుని మాట్లాడి.. సమస్యను పరిష్కరించుకోవాల్సిన భార్య.. డిటెక్టివ్‌ల గడప తొక్కితే మొదటికే మోసం రావచ్చు. ఒక్కోసారి అనుమానం నిజం కాదని తేలవచ్చు. మరి దాన్ని నమ్మగలిగే పరిస్థితుల్లో ఆ మహిళ ఉంటుందా.. చెప్పడం కష్టమే. ఆమె అనుకున్నట్లే నిజమని తేలితే.. ఆ సంసారం కూలిపోవడం ఖాయం. ఈ విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్లే.. డిటెక్టివ్‌లను ఆశ్రయిస్తున్నవారి సంఖ్య పెరుగుతుందంటున్నారు మానసిక విశ్లేషకులు.
భార్య కావచ్చు... భర్త కావచ్చు.. ఒకరు డిటెక్షన్ చేస్తున్నారన్న విషయం మరొకరికి తెలిస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఒకవేళ వారి తప్పు లేదని తేలిందనుకోండి.. మీతో జీవితం గడపడానికి సిద్ధమవుతారా... ఆలోచించండి..
19, మార్చి 2010, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
makki ki makki from
Z TV
V
కనిపెట్టినందుకు ధన్యవాదాలు..
అక్కడ రాసేది కూడా నేనేనని గుర్తించగలరు.
- సతీష్ దేవళ్ల
then u r great ,really very nice. congrats.