15, మార్చి 2010, సోమవారం
వికృతి విపత్తులు తెస్తుందా?
విరోధినామ సంవత్సరం వీడ్కోలు తీసుకొంది. వికృతినామ సంవత్సరం ప్రవేశించింది. ఈ ఏడాది రాకతోనే అందరిలోనూ ఆందోళన. ఏం ముంచుకొస్తుందో అన్న అనుమానం..
తెలుగు పండుగల్లో ఉగాదికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమయ్యేది ఇప్పటి నుంచే. కొత్త ఏడాది అనగానే ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాలూ ఉంటాయి. ఈ ఏడాదిలో ఏం జరుగుతుందన్న ఉత్సుకతా ఉంటుంది. అయితే.. ఈ కొత్త ఏడాది పేరు వికృతినామ సంవత్సరం కావడంతోనే.. అందరిలోనూ ఆందోళన కనిపిస్తోంది.. ఇంతకీ వికృతి నామ సంవత్సరం అనగానే అందరిలోనూ ఆందోళన ఎందుకు? ముఖ్యంగా పంచాంగ కర్తలు.. పండితులు చెబుతున్న మాటలు వింటుంటే.. ఈ ఏడాది కూడా తిప్పలు తప్పవేమో అనిపిస్తోంది. ఈ కొత్త ఏడాది పేరే వికృతి. అంటే.. జరగాల్సిన దానికి విరుద్ధంగా జరగడం అన్నమాట. పండింతుల అంచనాల ప్రకారం.. ఎన్నో రకాల సమస్యలు ఈ వికృతి నామ సంవత్సరంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ ఏడాది కొత్త కొత్త వ్యాధులు వెలుగులోకి వచ్చే ప్రమాదముంది. ప్రపంచవ్యాప్తంగా విచిత్ర రోగాలు వ్యాపిస్తాయి. పెద్ద ఎత్తున ప్రాణ నష్టమూ తప్పదని శాస్త్రం చెబుతోందంటున్నారు పంచాంగ కర్తలు.
చేదు పంచాంగం...
తెలుగు సంవత్సరాది ఉగాది రోజున పంచాగం వినడం ఎప్పటి నుంచో సంప్రదాయంగా వస్తూనే ఉంది. కొత్త ఏడాదిలో ఆదాయ వ్యయాలు, రాశి ఫలాలు తెలుసుకోవడానికి పంచాగం ఒక్కటే అందరి ముందున్న మార్గం. ఈ వికృతి నామ సంవత్సరాధిపతి రవి కావడంతో.. సంతోషాల కన్నా.. సమస్యల వాటానే ఎక్కువగా ఉంటుందోని పంచాగాలు చెబుతున్నాయి. ఈ ఏడాది వర్షాలు తక్కువగా పడొచ్చు. ఫలితంగా పంటలు పెద్దగా పండవు. ప్రకృతి అంతా వికారంగా ప్రవర్తిస్తుంది. వస్తువుల ధరలు మరింత పెరుగుతాయి. రాజకీయ ఆందోళనల కారణంగా.. ప్రజాపాలన అస్తవ్యస్తమవుతుందని పండితులు చెబుతున్నారు.
ఆందోళనలు, గొడవలు, వివాదాలు.. కొత్త ఏడాదిలో జనజీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఉత్పాతాలు కూడా సంభవించే అవకాశం ఉందని పంచాగం చెబుతోంది. సమాజంలో మంచికి స్థానముండదు. కొత్త ఏడాది తొలి నాలుగు నెలలు .. అంటే.. చైత్రం నుంచి ఆషాఢం దాకా.. ఆహార వస్తువుల ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రావణం, బాధ్రపద మాసాల్లో వర్షా భావ పరిస్థితులుంటాయి. రాష్ట్రంలో ఆందోళన ఈ కాలంలో ఎక్కువగా జరిగవచ్చు. ఆశ్వయుజంలో తుపాను రావచ్చు. మార్గశిర, పుష్యం, మాఘం, పాల్గుణాల్లో అధిక ధరలు జనాన్ని పీడించనున్నాయి.
కుజ ప్రభావం
శ్రీ వికృతి నామ సంవత్సరానికి రాజు కుజుడు. ఈ కారణంగానే.. దేశంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరగొచ్చు. మన సరిహద్దు దేశాలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా అన్ని రకాలుగా ఈ సారి పంచాగం తెలుగువారందరినీ భయపెడుతోంది.
ఈ సారి ఉగాది విషయంలో వింతవింత వాదనలు వినిపిస్తున్నాయి. పేరే వికృతి కాబట్టి... ఈ ఏడాది అంతా.. దారుణమైన పరిస్థితులను చూడాల్సి ఉంటుందని ఎంతోమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయంటూ.. ఇప్పటినుంచే భయాన్ని పెంచుతున్నారు. అయితే.. ఇదంతా కూడా సంవత్సరానికి ఉన్న పేరు మూలంగానే అన్నది ప్రధాన వాదన.
పేరు విషయంలో విభేదిస్తున్న పండితులు కూడా.. అనర్థాల విషయంలో మాత్రం ఒకే మాట చెబుతున్నారు. ఈ ఏడాది సమస్యలు ఎక్కువగానే ఉంటాయంటున్నారు. గ్రహాల స్థానబలమే ఇందుకు కారణమంటూ శాస్త్రాలు తిరగేస్తున్నారు. వికృతి నామ సంవత్సరం రావడం ఇదేమీ తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఎన్నో సార్లు వచ్చింది. చివరగా.. 1950-51 మధ్య వికృతి నామ సంవత్సరం వచ్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. తొలిసారి ఎన్నికల సంగ్రామానికి తెర లేచింది కూడా అప్పుడే. రాజకీయ అనిశ్చితి కూడా ఆ సమయంలో ఎంతో ఉందంటున్నారు పండితులు. ఇప్పుడు కూడా అవే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు. అప్పట్లో సముద్రతీర ప్రాంతాల్లోని గ్రామాలు చాలావరకూ నీట మునిగాయంటున్నారు పంచాంగ కర్తలు. ఇప్పుడు కూడా.. భూకంపాలు, సునామీలు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
విరోధి చేసిందేమిటి?
వికృతి నామ సంవత్సరం విపత్తులను తెచ్చిపెడుతుందా లేదా అన్నది ఆలోచించుకునేముందు.. విరోధినామ సంవత్సరం గురించి తెలుసుకోవాల్సి ఉంది. వికృతి తరహాలోనే విరోధి సంవత్సరం పేరు కూడా సమస్యను సూచించేదే. పేరుకు తగ్గట్లుగానే కొన్ని సంఘటనలూ చోటు చేసుకున్నాయి. అందులో ఎక్కువగా చెప్పుకోవాల్సింది.. విరోధి నామ సంవత్సర అనుమానాలను నిజం చేసిన.. రాష్ట్ర విభజన అంశమే. రాష్ట్ర్లంలో ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాలు పెద్ద ఎత్తున చెలరేగాయి. గత పదేళ్లుగా ఉద్యమాలు జరుగుతున్నా.. ఇంత తీవ్రస్థాయిలో జరిగింది మాత్రం ఇప్పుడే. రెండు ప్రాంతాల మధ్య విరోధం పెరగడానికి కారణం.. విరోధినామ సంవత్సరమేనంటున్నారు పండితులు. దీనికి తోడు.. రాష్ట్రానికి రాజుగా భావించే ముఖ్యమంత్రి చనిపోవడం.. ఆ తర్వాత రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితినీ ప్రస్తావిస్తున్నారు.
ప్రభవతో మొదలై.. అక్షయతో పూర్తయ్యే తెలుగు సంవత్సరాలు మొత్తం 60. ప్రతీ ఏడాదికి దాని లక్షణాన్ని బట్టి ఓ పేరును పురాణాల్లో పెట్టారు. పేరుకు తగ్గట్లుగానే ఆ ఏడాదంతా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా తెలుగు సంవత్సరాల్లో 23 వ సంవత్సరం విరోధి. విరోధి తర్వాత వచ్చింది వికృతి. దాని తర్వాత వచ్చేది ఖర. ఖర అంటే.. ఖడ్గం. ఈ మూడు సంవత్సరాల్లోనే విపత్తులు చాలా ఎక్కువన్న అభిప్రాయాన్ని పంచాంగ కర్తలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడేళ్లు కష్టపడిన తర్వాత మాత్రమే.. సుఖశాంతులు నెలకొంటాయంటున్నారు. అయితే.. యుగాంతం సంభవిస్తుందంటూ.. మాయ క్యాలెండర్ను ఉదహరిస్తూ కొంతమంది చేస్తున్న ప్రకటనలను మనవాళ్లు ఖండిస్తున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినా.. మానవాళిని పూర్తిగా తుదముట్టించే రీతిలో ఉండవన్నది చాలామంది అభిప్రాయం. పేరు కావచ్చు.. లేదంటే.. గ్రహాలు స్థాన బలిమి కావచ్చు.. ఏరకంగా చూసినా ఈ ఏడాది మాత్రం కాస్త కష్టాలు ఎక్కువగానే ఉంటాయన్న విషయం మాత్రం అందరూ చెబుతున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
పోను పోనూ పరిస్థితి మరింత దారుణంగా తయరౌతుంది.ఒక సంవత్సరం కన్నా ఆ తదుపరి సంవత్సరం మరింత చెడ్డగ ఉంటుంది.ఈ విషయం చెప్పడానికి జ్యోతిష్య పరిగ్నానం అవసరం లేదు.
మంచి జరగాలనే ఆశిద్దాం!
ఉగాది శుభాకాంక్షలు!
మీరేం భయపడకండి, నిత్యానందుల స్వామి వార్లకు చెప్పి ఒక మంచి సేవా కార్యక్రమం ఏర్పాటు గావించి, దోషాలన్నిటిని తరిమేద్దాం.
మీరేం భయపడకండి, నిత్యానందుల స్వామి వార్లకు చెప్పి ఒక మంచి సేవా కార్యక్రమం ఏర్పాటు గావించి, దోషాలన్నిటిని తరిమేద్దాం.