20, మార్చి 2010, శనివారం
యానాంలో వరల్డ్ వండర్..
యానాం.. మన పక్కనే ఉంది. కానీ.. యానాం గురించి అందరికీ తెలిసింది తక్కువ. ఇంకా చెప్పాలంటే.. మందు తక్కువ ధరకే దొరుకుతుందన్న అభిప్రాయమే ఎక్కువ మందిది. కానీ, అంతకన్నా ఎంతో ప్రాధాన్యం యానాంకు ఉంది. పర్యాటకరంగంలో మరే ప్రాంతానికీ.. తీసి పోదు. మరి యానాంలో చూడాల్సిన ప్రాంతాలేమిటి?
ప్రపంచంలోనే అతి పెద్ద ఏసుక్రీస్తు విగ్రహం... క్రైస్ట్ రీడీమర్... బ్రెజిల్ రాజదాని రియో డి జనెరీ లో ఉంది. 1922 లో ఈ విగ్రహం నిర్మాణం మొదలై.. 1931లో పూర్తయ్యింది. అంటే.. తొమ్మిదేళ్ల సమయం పట్టిందన్నమాట. ఈ విగ్రహం పొడవు 131 అడుగులు. వెడల్పు.. 31 అడుగులు. ఈ విగ్రహాన్ని చూడడానికి రెండు కళ్లూ చాలవు... అందుకే.. కొత్త ప్రపంచ వింతల్లో ఈ విగ్రహానికీ స్థానం దక్కింది.. ఈ విగ్రహాన్ని రియో డీ జనెరీలోని 2300 అడుగుల ఎత్తైన పర్వతంపై ఏర్పాటు చేశారు. విగ్రహం బేస్ దగ్గర నుంచి చూస్తే.. బ్రెజిల్ రాజధాని అంతా కనిపిస్తుంది. పూర్తిగా కాంక్రీట్‌తో నిర్మితమైన ఈ విగ్రహం చూడడానికి శిలువ ఆకారంలో ఉంటుంది. రెండు చేతులూ చాపిన జీసస్.. అందరినీ ఆహ్వానిస్తున్నట్లు కనిపిస్తుంది.
ఈ విగ్రహానికి పర్యాటకుల తాకిడి చాలా ఎక్కువ. దేశదేశాల నుంచి.. ప్రత్యేకంగా ఈ విగ్రహం చూడడానికి బ్రెజిల్ వస్తుంటారు. అయితే.. ఈ విగ్రహాన్ని చూడడానికి మనం.. బ్రెజిల్దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. కారణం.. మన పక్కనే ఉన్న యానాంలో దీన్ని తలపించే జీసస్ విగ్రహం ఏర్పాటయ్యింది. పర్యాటక రంగంలో అనూహ్య ప్రగతి సాధిస్తున్న యానాం.. ఇప్పుడు కొత్త కొత్త సొబగులు అద్దుకొంటోంది. అందులో భాగమే.. ఈ విగ్రహం ఏర్పాటు. దీని పొడవు 62 అడుగులు. ఇందులో.. 25 అడుగుల ఎత్తుతో.. కృత్రిమ కొండను తయారు చేశారు. ఈ కొండపైన 37 అడుగుల ఏసుక్రీస్తు విగ్రహాన్ని నిర్మించారు.
కోల్‌కతాకు చెందిన నిర్మల్‌రాయ్ పర్యవేక్షణలో కేవలం ఆరు నెలల కాలంలోనే ఈ విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఉగాది రోజున ప్రారంభమైన.. యానం క్రైస్ట్ రీ డీమర్.. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకొంటోంది. కేవలం కొండ.. కొండపైన విగ్రహం మాత్రమే కాదు.. ఏసు క్రీస్తు జీవిత విశేషాలకూ నెలవు.. ఈ అద్భుత కట్టడం. కొండ లోపలి భాగంలో.. ఏసు జననం, లాస్ట్ సప్పర్తో పాటు.. జీసస్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను అత్యద్భుతంగా విగ్రహాల రూపంలో ఏర్పాటు చేశారు. యానాంలో నిర్మించిన... ఈ 62 అడుగుల క్రీస్తు విగ్రహంలాంటిది భారత దేశంలో మరెక్కడా లేకపోవడం విశేషం.
ఫ్రెంచ్ సువాసనలు..
యానాం.. తెలుగువారుండే ప్రాంతమే అయినా.. మన రాష్ట్రంలో భాగం మాత్రం కాదు. ఒకప్పటి ఫ్రెంచి కాలనీ కావడంతో.. దీన్ని రాష్ట్రంలో విలీనం చేయకుండా ప్రత్యేకంగా కేంద్రపాలిత ప్రాంతగా చేశారు. అక్కడి సంస్కృతిని రక్షించాలన్నదే ఇలా చేయడానికి కారణం. అందుకే కాబోలు.. మన రాష్ట్రంలోని ఏ ప్రాంతంతో పోల్చినా.. అన్ని రకాలుగా.. యానాం కాస్త భిన్నంగానే ఉంటోంది.
గోదావరి నది పాయ అయిన గౌతమీ ఒడ్డున ఉన్న ఈ ప్రాంతానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఫ్రెంచి కాలం నాటి పురాతన చర్చి ఇప్పటికీ ఇక్కడ తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ సెయింట్ ఆన్స్ కేథలిక్ చర్చిని 1846లో పూర్తిగా యురోపియన్ శైలిలో నిర్మించారు. శతాబ్ధంన్నర గడిచినా.. ఏ మాత్రం చెక్కుచెదరకుండా.. ఆనాటి వైభవానికి ప్రతీకగా నిలిచే ఉంది..
రివర్ బీచ్
గౌతమీ ఒడ్డున ఉండడంతో.. అక్కడ రివర్బీచ్ను అభివృద్ధి చేస్తున్నారు. నదిపై నుంచి వచ్చే చల్లగాలులను ఆస్వాదిస్తూ.. హాయిగా నడవడానికి వీలుగా.. కాలిబాటను కూడా నిర్మించారు. ఈ రివర్బీచ్కు సాయంకాలం వెళితే.. అలసట క్షణాల్లో మాయం కావడం ఖాయం. దీన్నిమినీట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేస్తున్నారు.
ఇప్పటికే జీసస్ క్రైస్ట్ విగ్రహ నిర్మాణం పూర్తి కావడంతో.. ముస్లింల కోసం నాగూర్ మీరా సాహెబ్ మందిరాన్ని, హిందువుల కోసం ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఇక్కడ నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉగాది రోజే.. ఈ పనులకు శంకుస్థాపన కూడా చేశారు. వీటితో పాటు.. పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ను తలపించేలా.. యానాం టవర్‌ను నిర్మింస్తున్నారు. మొత్తం 100 మీటర్ల ఎత్తుతో దీన్ని కడుతున్నారు. ఈ టవర్లోనే రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఫ్రాన్స్‌ను తలపించే రీతిలో.. ఈ టవర్ నిర్మితమవుతోంది. ఈ కొత్త కట్టడాలన్నీ కూడా పూర్తైతే.. దేశంలోనే తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల్లో యానాం చేరిపోతుంది.
మీసాల రాయుడు
ఏడుకొండల వాడు.. శ్రీనివాసుడు.. శ్రీవేంకటేశ్వరుడు.. ఇలా వివిధ పలు పేర్లతో పిలుచుకున్నప్పటికీ.. కోనేటి రాయుడు మాత్రం ఒక్కరే. తిరుమల గిరులపై కలియుగదైవంగా వెలిసి నిత్యపూజలు అందుకుంటూ.. భక్తుల గోవింద నామస్మరణతో మునిగి తేలుతున్నారు. మన రాష్ట్రంలోనే కాదు.. దేశ విదేశాల్లోనూ.. ఏడుకొండలవాడి ఆలయాలు లెక్కకు మిక్కిలిగానే ఉన్నాయి. అలాగే.. యానాంలోనూ.. 15వ శతాబ్దంలోనే.. శ్రీవెంకటేశ్వరుడు కొలువుతీరాడు. అప్పట్లో రెడ్డిరాజులు... ఇక్కడి విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు చరిత్ర చెబుతోంది.
ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడి మూలవిరాట్టును చూస్తే.. కొత్తవారెవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అన్ని చోట్లా ఉన్నట్లు ఇక్కడ వెంకటేశ్వరుడి విగ్రహం ఉండదు. బంగారు మీసాలతో దర్శనమివ్వడం యానాం శ్రీవారి ప్రత్యేకత. ముందు విగ్రహాన్ని తిరుమల విగ్రహంలానే తయారు చేయించినా.. రెడ్డిరాజులకు మాత్రం ఏదో లోపం ఉన్నట్లు కనిపించిందంట. అంతే... బంగారు మీసాలు అలంకరించి.. విగ్రహాన్ని ప్రతిష్టించారు. అందుకే.. ఈ ఆలయంలో దేవుడు.. మీసాల వెంకన్నగా ప్రసిద్ధికెక్కాడు..
తిరుమల తరహాలోనే ప్రతీయేటా.. ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. యానాం వెళితే.. తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయం ఇది. ఎందుకంటే... మీసాల వెంకన్నగా మరెక్కడా కనిపించడు.. కోనేటి రాయుడు.
మరి.. ఇన్ని ప్రత్యేకతలున్న యానాంను తప్పకుండా చూడాల్సిందే. అందుకే.. వీకెండ్లో చలో యానాం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
very fine essay
for historical importance of yanam visit this link
http://yanamgurimchi.blogspot.com/2008/05/blog-post.html