15, మార్చి 2010, సోమవారం
మల్లెపూలు పెట్టుకునేదెవరికోసమూ?
వేసవి వచ్చేస్తోంది.. తనతో ఎండలనే కాదు.. మల్లెపూల గుబాళింపునూ వెంటేసుకొస్తోంది. అందరినీ తన్మయంలో ముంచెత్తనుంది. పగటిపూట వేసవితాపానికి.. సాయంకాలం పిల్ల గాలులతో వచ్చే మల్లెల పరిమళమే.. ఉపశమనం...
మల్లెపూలంటే మనసు పాడేసుకోని వారు ఎవరూ ఉండరు. సూర్యుడు.. అస్తమిస్తూ.. చీకట్లు కమ్ముకుంటున్న వేళలో.. వికసిస్తూ.. గాలి ద్వారా ప్రేమసందేశాన్ని పంపిస్తాయి.. మల్లియలు. సాయంకాలం అవ్వగానే.. చల్లని నీళ్లతో స్నానం చేసి.. తెల్లటి గ్లాస్కో చీర కట్టుకొని.. మల్లెపూలు పెట్టుకుని బయటకు వస్తే.. ఏ పురుషపుంగవుడైనా.. దాసోహం అనాల్సిందే.
కొత్తగా పెళ్లైన జంటలకు మల్లెపూలు లేనిదే క్షణం గడవదు. అందుకే.. పెళ్లి దగ్గర నుంచి ఎక్కడచూసినా మల్లెలు కనిపించాల్సిందే. ముఖ్యంగా ఫస్ట్‌నైట్ విషయంలో మల్లెలకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. బెడ్‌నిండా.. మల్లెపూలను అందంగా అలంకరించాల్సిందే.. ఎలాంటి టెన్షన్‌నైనా పోగొట్టి.. మంచి మూడ్‌లోకి క్షణాల్లో తీసుకువచ్చేవి.... ఈ మల్లెపూలే..
మల్లెల వాసనలోనే అమోఘమైన మత్తు ఉంటుంది. ఆ వాసన పీల్చగానే.. మనసు తేలిపోతోంది. మనసుదోచిన వారు.. మల్లెపూలు పెట్టుకొని.. దగ్గరకు వచ్చారంటే.. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోవడం ఖాయం.
నా ఆప్తులు మల్లెపూలు
అర్ధరాత్రులు విచ్చి
జుట్టు పరిమళంతో కలిసి
నిద్ర లేపి
రక్తాన్ని చిందులు తొక్కించే మల్లెపూలు
సన్నని వెన్నెట్లో
ప్రియురాలి నుదుటి కన్నా తెల్లగా
ఏమి చెయ్యలో తెలీని ఆనందంతో
గుండె పట్టి చీలికలు చేసే మల్లెపూలు
తెల్లారకట్ట లేచి చూసినా
ఇంకా కొత్త పరిమళాలతో
రాత్రి జ్ఞాపకాలతో
ప్రశ్నించే మల్లెపూలు
అలిసి నిద్రించే రసికత్వానికి
జీవనమిచ్చే ఉదయపు పూలు
రాత్రి సుందర స్వప్నానికి సాక్షులుగా
అవి మాత్రమే మిగిలిన నా ఆప్తులు! మల్లెపూలు!!.....
అంటూ.. మనసులో మాట బయటపెట్టారు.. రచయత చలం.. మల్లెపూలకు అక్షరాలతో అర్చన చేశారు..
మాఘమాసం కన్నా ముందుగానే.. మన ఇంటిగడప తొక్కుతాయి మల్లెపూలు. ముందొచ్చేదంతా మంచికాలమేనని సంకేతాలను పంపిస్తాయి. పైగా.. తెలుగిళ్లలో ఎక్కువగా పెంచుకునే పూలచెట్లలో.. మల్లె కూడా ఒకటి. అందుకే.. సాయంకాలం అయ్యిందంటే చాలు.. మల్లెమొగ్గలు కోసి.. దండలు కట్టుకోవడంలో అమ్మాయిలు మునిగిపోతారు. మల్లెపూలు పెట్టుకోవడానికి వయసుబేధం అడ్డురాదు. చిన్నారుల నుంచి.. వృద్ధుల దాకా ప్రతీ ఒక్కరూ ఎంతో ఇష్టపడి పెట్టుకునే పూలివి. చెట్టుకు పూయడం కన్నా.. మగువల వాలుజడలో పూసినప్పుడే మరింత అందంగా కనిపిస్తాయి. మల్లెపూలంటే.. మహిళలకు ప్రాణంకన్నా ఎక్కువనే చెప్పాలి. అందుకే.. మూరలకొద్దీ మల్లెలలను జడలతో తురుముకుంటారు.
రొమాంటిక్ ఛాయిస్..
మల్లెలంటే.. మల్లెలే. ఇంతమంచి సువాసన వచ్చే పువ్వు మరొకటి ఉండదు. అందుకే.. పుష్పజాతికి రారాజుగా వెలుగొందుతోంది మల్లెపువ్వు. మల్లెపూలు జడలో పెట్టుకుంటే ఆ అందమే వేరు. నల్లని కురుల్లో.. తెల్లని పూలు చేరితే.. ఆ ముఖవర్చస్సే మారిపోతుంది. అందుకే.. ఎన్నిరకాల పూలున్నా.. హీరోయిన్ల తలలో పెట్టాల్సి వచ్చే సరికి.. డైరెక్టర్ల ఛాయిస్ మల్లెపూవుకే పరిమితమవుతుంది. మల్లెపూలతో హీరోయిన్ కనపడితే.. ఆ సీన్ అదే స్పెషల్ ఎఫెక్ట్...
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో పాటలు మల్లెపూలపై వచ్చాయి. శృంగారాన్ని పండిచాలంటే.. రచయతలకు పాటలో పడే మొదటి పువ్వు మల్లే మరి. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి.. ఇప్పటికీ.. మల్లెలపై పాటలు వస్తూనే ఉన్నాయి. మల్లెపూలు గొల్లుమన్నవని ఒకరంటే.. ఇదిగో తెల్లచీర.. అదిగో మల్లెపూలంటే మరొకరు అందుకుంటారు. తెల్లచీర కట్టుకున్నది ఎవరికోసమూ.. మల్లెపూలు పెట్టుకున్నది ఎవరికోసమూ అంటూ... మరో సినీ కవి హృదయం స్పందిస్తుంది.
ఇక.. బెడ్‌రూం సన్నివేశాలకు వస్తే.. తెల్లచీర.. మల్లెపూల జోడీ ఉండాల్సిందే. పాల గ్లాసు లేకుండా అయినా ఫస్ట్ నైట్ సీన్లుంటాయోమోగానీ.. మల్లెపూల దండలు లేకుండా మాత్రం.. కనిపించవు. మురారి సినిమాను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి..
వేసవి బహుమతి
మల్లెపూలకు ఉండే డిమాండ్ మరేపువ్వుకూ ఉండదు. మల్లెపూలు కనపడితే కనీసం మూరైనా కొనుక్కోవాలని ముచ్చటపడే మహిళలు ఎంతోమంది. గ్రామీణప్రాంతాల్లో అయితే.. ఇళ్లల్లోనే మల్లె పందిళ్లుంటాయి. కానీ.. పట్టణాల్లో ఆ పరిస్థితి ఉండదు. అందుకే.. ప్రధాన కూడళ్లల్లో మల్లెపూలు అమ్మేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది..
పూలదుకాణాల్లోనూ.. ఈ సీజన్ అంతా మల్లెపూలదే. మాఘమాసం వచ్చేసిందంటే.. ఇక మల్లె తప్ప మరో పువ్వు కనపడదు. పెళ్లిళ్లకు మల్లెపూలే ఎక్కువగా కొనడానికి ఎన్నో కారణాలుంటాయంటారు దుకాణుదారులు.
మన రాష్ట్రంలో గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున మల్లెలు సాగవుతున్నాయి. తూర్పుగోదావరిలో.. కడియం, ఆలమూరు, ఆత్రేయపురం మండలాల్లో ఎక్కువమంది మల్లెల సాగునే జీవనాధారంగా ఎంచుకున్నారు. ఇప్పుడే సీజన్ మొదలుకావడంతో.. మొగ్గలను కోసి.. మార్కెట్‌కు తరలించడంలో.. రైతులు బిజీ అయ్యారు.
ఇప్పుడే.. మల్లెపూలు కేజీ వంద రూపాయల దాకా పలుకుతోంది. పెళ్లిళ్ల సీజన్ మొదలైతే.. ఈ ధర రెట్టింపు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
సౌందర్యానికి చిరునామా
పరిమళానికి, సోయగానికి, స్వచ్చమైన ధవళ కాంతులకు మారుపేరైన మల్లెపూలు స్త్రీల సిగలో సహజ ఆభరణాలుగా మాత్రమే ఉంటాయనుకోవడం పొరపాటు. తలలో ధరించటానికి, దేవుని పటాలను అలంకరించటానికి, పెళ్లి వేదికలను ఆకర్షణీయంగా చేయటంలోనూ మల్లెలకు సరితూగేవి లేవు మరి. స్త్రీల సౌందర్యాన్ని పెంచడంలో మల్లెది ప్రత్యేక పాత్రే..
రోజంతా శారీరక కష్టంతో అలసి పోయిన శరీరాన్ని సేదతీర్చి, మనసంతా ఆహ్లాదాన్ని నింపేది మల్లెల గుబాళింపే. ప్రతిరోజూ మల్లెపూలను తలలో పెట్టుకోవటం వల్ల ఆహ్లాదంగా వుండడమే కాదు, కళ్లకూ మేలు జరుగుతుంది. అలసిన కనురెప్పలపై మల్లెలను కొద్దిసేపు పరిచి వుంచితే చలవ చేస్తాయి. బాగా నిద్రపడుతుంది. సబ్బులు, తలనూనెలు, సౌందర్య సాధనాలు, అగరు బత్తీల తయారీల్లో మల్లెపూలను ఉపయోగిస్తారు. సెంట్లు, ఫర్‌ఫ్యూమ్‌లలో అయితే మల్లెపూలను విరివిగా ఉపయోగిస్తారు.
తలలో చుండ్రు సమస్య అధికంగా వుంటే మెంతులలో కాసిన్ని ఎండు మల్లెపూలు కలిపి నూరి తయారైన పూతను తలకు పట్టిస్తే మంచిది. జుట్టుకూడా పట్టుకుచ్చులా మెరిసిపోతుంది. కొబ్బరి నూనెలో మల్లెపూలు వేసి ఓ రాత్రంతా బాగా నాననిచ్చి, మరిగే వరకూ కాచి వడగట్టి వాడితే తల సువాసన భరితం కావడమే కాకుండా క్లేశాలకు మంచి పోషణ అవుతుంది. మాడుకు మేలు చేస్తుంది. మల్లెల్ని ఫేస్ ప్యాక్‌గా కూడా వాడుకోవచ్చు. మల్లెల్ని పేస్టుగా చేసి, కొద్దిగా పచ్చిపాలు కలిపి, నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత ముల్తానా మట్టి, గంధం, తేనె అరస్పూన్ చొప్పున కలిపి ప్యాక్ వేసుకోవాలి.
మల్లెపూల రసం తీసి గులాబీ పువ్వుల రసం, గుడ్డులోని పచ్చసొన రెండేసి స్పూన్ల చొప్పున కలిపి ముఖానికి రాస్తే మృదువుగా, కాంతివతంగా మెరిసిపోతుంది. చర్మానికి అవసరమయ్యే సి విటమిన్ మల్లెల్లో విరివిగా వుంటుంది. అందుకే మల్లె తూడులను అన్నంలో కలిపి తినటం కూడా గ్రామీణ జీవితంలో కనపడుతుంది. ఇలా ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది మల్లెపువ్వు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి