
బొత్స సత్యనారాయణ.. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి. తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేంటన్నది.. బొత్స సూటి ప్రశ్న. దీనికి సమాధానం ఇచ్చేవారికోసం ఆయన వెతుకుతున్నారు. రాష్ట్రాన్ని రెండుగా విభజించాల్సిందేనని స్పష్టంగా చెప్పకున్నా... వ్యూహం మాత్రం అదే. అయితే.. ఈ విషయంలో ఎంతో తెలివిగా పావులు కదుపుతున్నారు..
తెలుగువారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేంటంటూ.. ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ.. అటు రాష్ట్ర రాజకీయాల్లోనూ వేడి పుట్టించారు సత్తిబాబు. ఓ వైపు తెలంగాణ, మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమాలు రాష్ట్రంలో జోరుగా సాగుతున్న నేపథ్యంలోనే.. కొంతమంది సై ఆంధ్రా అంటూ.. ప్రత్యేక బాట పట్టారు. అయితే.. ప్రభుత్వంలోని పెద్దల నుంచి మాత్రం.. దీనికి తొలినాళ్లలో మద్దతు లభించలేదు. ఇప్పుడా కొరత తీర్చ గలిగారు మంత్రి బొత్స. తన అనుచరులతో మంతనాలు జరిపిన అనంతరం.. రెండు రాష్ట్రాల వాదన వైపే... బొత్స మొగ్గు చూపారు. అయితే.. ఇంతవరకూ.. ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన మాత్రం చేయలేదు. పదాలను చాలా తెలివిగా ఉపయోగిస్తూ.. ప్రకటనలు చేస్తున్నారు. తాను లేవనెత్తిన అంశంపై అందరూ ఆలోచించాలన్నదే.. సత్తిబాబు స్ట్రాటజీ.
బొత్స స్టేట్‌మెంట్ ఇచ్చిన సమయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సమైక్యాంధ్ర ఉద్యమం మొదలుకాగానే ఈ ప్రకటన ఇవ్వలేదు. రాష్ట్రంలోని పరిస్థితులపై అధ్యయానికి ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ హైదరాబాద్‌కు వస్తున్న తరుణంలో చేసిన ప్రకటన ఇది. పైగా.. ఇది తన సొంత అభిప్రాయమంటూ.. శ్రీకృష్ణ కమిటీకి చెబుతానని చెప్పడం కూడా వ్యూహాత్మకమే. అందుకే.. ఈ ప్రకటనపై ఇంత రచ్చ జరుగుతోంది. బొత్స స్టేట్‌మెంట్ రావడం ఆలస్యం.. సీమాంధ్ర నేతలు మండిపడ్డారు. బొత్స వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కొంతమంది విమర్శలు గుప్పిస్తే.. మరికొందరు ఈ వివాదంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించారు. అందరి అభిప్రాయాలు తెలుసుకోవడం కోసమే.. ఈ తరహా ప్రకటనలు చేస్తుండవచ్చన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.
బొత్సపై తొలినాళ్లలో వ్యతిరేకత వ్యక్తమైనా.. ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది. సీమాంధ్ర మంత్రుల్లోనూ చీలిక మొదలయ్యింది. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా.. బొత్స వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. ఆంధ్రలో చాలా వెనుకబడిన ప్రాంతాలున్నాయని మోపిదేవి అంటున్నారు. సీమాంధ్ర మంత్రులంతా త్వరలోనే తమ అభిప్రాయం చెబుతామన్నారు. అయితే.. మీడియాలో వార్తలు రావడంతో.. ఆయన మాటమార్చారు. మరో మంత్రి విశ్వరూప్.. బొత్స వ్యాఖ్యలను ఖండించలేదు. అయితే.. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమంటూ తేల్చేశారు. మరికొంతమంది మంత్రులు కూడా.. బొత్స వ్యాఖ్యలకు మద్దతు తెలపడానికి సిద్ధమవుతున్నారు.
తాజాగా జరిగిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీలోనూ సత్తిబాబు వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి. అయితే.. ఈ వ్యాఖ్యలను ఖండించడానికి అంతా వెనుకడుగు వేస్తున్నారు.
బొత్స సడన్‌గా టోన్ పెంచడం వెనక.. చాలా పెద్ద మంత్రాంగమే నడిచిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఢిల్లీ నుంచి కూడా మద్దతు ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా.. బొత్స మాటలతో.. సీమాంధ్ర ఉద్యమం చీలిక దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. బొత్సకు మరికొంతమంది మంత్రుల నుంచి మద్దతు లభిస్తే.. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం తీవ్రమవడం ఖాయం.
సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న తెలుగుదేశం నేతలు మాత్రం బొత్సపై విరుచుకుపడుతున్నారు. రెండుసార్లు మంత్రిగా ఎన్నికైన బొత్స ఉత్తరాంధ్రకు ఇప్పటివరకూ చేసిందేమిటంటూ ప్రశ్నిస్తున్నారు. పైగా.. రాష్ట్రంలో ఉద్యమాలను అణచి వేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందన్న అనుమానాలనూ టీడీపీ వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర విభజనకు అనుకూలంగా మంత్రి బొత్సా సత్యనారాయణ చేసిన ప్రకటనలపై.. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. బొత్సకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టింది. ఆంధ్రా యూనివర్సిటీలో బొత్సకు దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించింది. కేవలం రాజకీయ లబ్దికోసమే బొత్స ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని.. విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు.
మంత్రి బొత్స పాల్గొన్న కార్యక్రమాలను సమైక్యాంధ్ర ఉద్యమకారులు అడ్డుకుంటున్నారు. రెండు రాష్ట్రాల వ్యాఖ్యలను ఉపసంహరించుకునే వరకూ ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. మొత్తం ఒక చిన్న ప్రకటనతో సత్తిబాబు పెద్ద వివాదంలో చిక్కుకుపోయారు..
రాజకీయ వ్యూహం
విజయనగరం జిల్లాలో రాజకీయంగా ఒక్కో మెట్టూ ఎదిగారు మంత్రి బొత్సా సత్యనారాయణ. కేవలం తాను మాత్రమే కాక.. తనతో పాటే కుటుంబ సభ్యులనూ వెంటేసుకొచ్చారు. డీసీసీబీ ఛైర్మన్‌గా పనిచేసి... ఆ తర్వాత ఎంపీగా గెలిచిన బొత్స.. గత రెండు దఫాలుగా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్నారు. 2004లో విజయం సాధించాక.. వైఎస్ కేబినెట్‌లో స్థానం దక్కించుకున్నారు. మంత్రిగా ఎన్ని వివాదాల్లో చిక్కుకున్నా.. పదవిని మాత్రం నిలబెట్టుకుంటూనే ఉన్నారు. తన భార్యను జెడ్‌పి ఛైర్మన్‌గా.. ఆ తర్వాత ఎంపీగా గెలిపించుకున్నారు. ఇక 2009 ఎన్నికల్లో గజపతి నగరం నుంచి తన తమ్ముడు అప్పలనరస్యయ్యకు, నెల్లిమర్ల నుంచి బంధువు బొడ్డుకొండ అప్పలనాయుడుకి కాంగ్రెస్ టికెట్లు ఇప్పించి.. ఎమ్మెల్యేలను చేశారు. మొత్తంమీద చూస్తే విజయనగరం జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలుంటే.. మూడింటికి బొత్స కుటుంబమే ప్రాతినిధ్యం వహిస్తోంది. దీనికి ఎంపీ సీటు అదనం. ఎన్నికలకు ముందు అడిగినన్ని టికెట్లు ఇవ్వకపోతే.. ప్రజారాజ్యం పార్టీలోకి వెళిపోతానని బొత్స బెదిరించినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇలా జిల్లాపై పట్టుబిగించిన బొత్స రాష్ట్ర రాజకీయాల్లోనూ పావులు కదపాలనుకుంటున్నారు.
ముఖ్యమంత్రి కావాలన్నది ప్రతీ రాజకీయ నాయకుడికీ కలే. బొత్సది కూడా అదే పరిస్థితి. సమయానికి తగ్గట్లుగా ఈ దిశలో ఎప్పటినుంచో పావులు కదుపుతున్నారు. వైఎస్ మరణానంతరం.. జగన్ అభ్యర్థిత్వాన్ని బలపరిచిన బొత్స.. ఆయనకు సీఎం పదవి దక్కదని తెలియడంతో రూటు మార్చారు. తాను కూడా రేసులో ఉన్నట్లు సంకేతాలిచ్చారు. కానీ.. అధిష్టానం మాత్రం రోశయ్య వైపే మొగ్గుచూపింది. ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో.. ఆయన కన్ను సీఎల్పీ పదవిపై పడింది. దీన్ని దక్కించుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ.. ఆ ఆశలూ నెరవేరలేదు. గీతారెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల బొత్స అసంతృప్తితో ఉన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో మొదలైన విభజన, సమైక్య ఉద్యమాలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి లేమిని.. తన అస్త్రంగా చేసుకుంటున్నారు.
ఇంటగెలిచి రచ్చ గెలవాలన్నారు. కానీ.. మంత్రి బొత్సకు సొంత జిల్లాలోనే సంపూర్ణ మద్దతు దక్కడం లేదు. విజయనగరం జిల్లాలో కొంతమంది మాత్రమే ప్రత్యేక ఆంధ్రకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఎక్కువమందిది ఇప్పటికీ సమైక్యవాదమే. ఉత్తరాంధ్ర వెనకబాటుతనాన్ని లేవనెత్తినా.. బొత్సకు మద్దతు అంతంతమాత్రంగానే ఉంది. పైగా.. ఇంతకాలం ఈ ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడని బొత్స.. ఇప్పుడు ఆ ప్రస్తావన తేవడంపై పెదవి విరుస్తున్నవారే ఎక్కువ.
జిల్లాలో మద్దతు దొరక్కపోయినా.. బొత్స తన దారిలో ముందుకు వెళ్లాలనే నిర్ణయించుకున్నారు. ప్రభుత్వంలోని కొంతమంది కీలక మంత్రులు కూడా మద్దతు పలకవచ్చని సంకేతాలు వస్తుండడంతో.. ఆయన రెండు రాష్ట్రాల వాదనపైనే ఎక్కువగా పనిచేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన జిల్లాలకు చెందిన నేతలతోనూ త్వరలోనే సమావేశమై.. తన వాదనకు మద్దతు సేకరించే అవకాశమూ ఉంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి