25, జనవరి 2010, సోమవారం
అరవైఏళ్లలో అభివృద్ధి ఎంత?
సర్వసత్తాక సార్వభౌమ, గణతంత్ర దేశంగా మనం ఏర్పడి ఆరు దశాబ్దాలు పూర్తయ్యింది. మనకోసం.. మనం రూపొందించుకున్న అపూర్వమైన రాజ్యాంగం అమల్లోకి వచ్చి.. అరవైఏళ్లయ్యింది. అందుకే.. ఈ రిపబ్లిక్‌డే సంబరాలు.. అన్నింటికన్నా ప్రత్యేకమైనవనే చెప్పాలి. ఈ ఆరు పదుల ఏళ్ల కాలంలో.. మనం సాధించిన విజయాలు ఎన్నో. భారతశక్తి సామర్ధ్యాలను ప్రపంచ దేశాలకు ఈ కాలంలోనే చాటిచెప్పగలిగాం..
అసలైన స్వాతంత్ర్యం
భారత దేశానికి స్వాతంత్ర్యం 1947లోనే వచ్చినా.. పూర్తిస్థాయి గణతంత్ర రాజ్యంగా అవతరించడానికి మరో మూడేళ్ల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. అప్పటివరకూ.. వలసపాలకులు రూపొందించిన నియమనిబంధలకు అనుగుణంగానే మన పాలన కొనసాగింది. ఈ కాలంలోనే.. భారతదేశం కోసం.. దేశ ప్రజలకోసం.. పరిపాలన కోసం.. ఎంతోమంది మహానుభావుల కృషి ఫలితంగా ఓ అపూర్వగ్రంథం రూపుదిద్దుకొంది.. అదే భారత రాజ్యాంగం. ఎన్నో సవరణలు, మార్పుల అనంతరం.. జనవరి 24, 1950న రాజ్యాంగానికి భారత పార్లమెంటు ఆమోదం లభించింది. జనవరి 26, 1950న అమల్లోకి వచ్చింది. అప్పటివరకూ ఉన్న బ్రిటీష్ సిద్ధాంతాలకు తిలోదకాలిస్తూ.. సరికొత్త ప్రజాస్వామ్య పాలన మొదలయ్యింది. అదే రిపబ్లిక్ డే.
జనవరి 26 ఎందుకు?
జనవరి 26 నే రిపబ్లిక్ డేగా ఎంచుకోవడం వెనుక ప్రత్యేక మైన చరిత్ర ఉంది. 1930లో ఇదే రోజున.. భారత జాతీయ కాంగ్రెస్ లాహోరు సమావేశంలో తొలిసారి త్రివర్ణ పతకాన్ని ఎగరవేశారు. మనకు స్వాతంత్ర్యం వచ్చేవరకూ.. ఈరోజునే.. పూర్ణ స్వరాజ్యదినంగా... కాంగ్రెస్ పాటించింది. అందుకే.. రాజ్యాంగాన్ని కూడా.. అదే రోజునుంచి అమలు చేసి.. జనవరి 26కు రిపబ్లిక్ డేగా ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టారు. మనకోసం, మనం రాసుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చి అరవైఏళ్లు పూర్తైపోయాయి. మరి ఈ కాలంలో మనం సాధించిందేమిటి? ఈ ప్రశ్న వేసుకుంటే దానికి వెంటనే ఎన్నో సమాధానాలు దొరుకుతాయి. తెల్లదొరల పాలనలో అట్టడుగున ఉన్న ఎన్నో రంగాలు.. అనూహ్యమైన అభివృద్ధిని సాధించాయి. అయితే.. ప్రపంచ దేశాలన్నింటినీ ఆకర్షించింది మాత్రం అంతరిక్ష రంగంలో మన విజయాలే. తొలి ఉపగ్రహాన్ని ఇతర దేశాల సాయంతో.. రోదసీలోకి పంపించిన మనం.. ఇప్పుడు.. ప్రపంచ దేశాలే మన సాయాన్ని అర్థించే స్థాయికి చేరుకున్నాం..
ఇక ఆర్థిక విషయాలకు వస్తే.. స్థూలదేశీయోత్పత్తి.. ఈ 60 ఏళ్ల కాలంలో దాదాపు 500 రెట్లు పెరిగింది. 1951లో 255 రూపాయలుగా ఉన్న జీడీపీ.. 2008 నాటికి 33283 రూపాయలకు చేరింది. పారిశ్రామికంగానూ ఎన్నో మార్పులు ఈ కాలంలోనే చోటుచేసుకున్నాయి. ఉక్కు ఉత్పత్తిలో 50 రెట్లు, సిమెంట్ ఉత్పత్తిలో 70 రెట్లు, విద్యుదత్పత్తిలో 128 రెట్ల వృద్ధిని సాధించగలిగాం. ఆహారధాన్యాల ఉత్పత్తి కూడా 1950తో పోల్చితే దాదాపు 4 రెట్లు పెరిగింది. గణతంత్రరాజ్యంగా అవతరించిన సమయానికి దేశ జనాభాలో 45 శాతం దారిద్ర్య రేఖకు దిగువనుంటే.. తాజా అధ్యయనాల ప్రకారం.. ఇది 37 శాతానికి చేరింది.
పరిపాలనలోను, దేశంలోనూ జరిగిన ఎన్నో ప్రయోగాల ఫలితమే.. ఈ మార్పు. ఒక్కమాటలో చెప్పాలంటే.. మన అభివృద్ధిలో మూడు దశలున్నాయి. మొదటి దశ అంటే.. నెహ్రూ కాలమని చెప్పాలి. పరిశ్రమలు, జాతీయ రహదారులు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం.. ఇలా అన్ని రంగాల్లోనూ.. ప్రభుత్వమే భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇప్పటికీ మనకు ఎంతగానో ఉపయోగపడుతున్న స్టీల్ప్లాంట్లు, బహుళార్ధసాధక ప్రాజెక్టులు ఈ కాలంలోనే నిర్మితమయ్యాయి. ఇక రెండోదశలో హరిత విప్లవం చోటు చేసుకుంది. ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధిని ఈ సమయంలోనే సాధించాం. బ్యాంకుల జాతీయకరణ, ఫారిన్ ఎక్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అమలు ఈ సమయంలోనే జరిగాయి. ఇక కీలకమైన మూడో దశ.. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో మొదలయ్యింది. భారత్‌లో వ్యాపారాలకు.. అంతర్జాతీయ సమాజాన్ని ఆహ్వానిస్తూ.. గేట్లను బార్లా తెరిచారు. అప్పటినుంచే.. దేశంలో మార్పు మరింత వేగవంతమయ్యింది. మొదటినుంచీ మనది వ్యవసాయ ఆధారిత దేశం. కానీ.. మూడోదశ మొదలుతో.. ఆ స్థానాన్ని సర్వీస్ సెక్టార్ అందిపుచ్చుకుంది. జీడీపీలో 1950 నాటికి వ్యవసాయ వాటా 53 శాతం ఉంటే.. అది 2008 నాటికి 21 శాతానికి చేరుకుంది. 33 శాతంగా ఉన్న సర్వీస్ సెక్టార్.. 52 శాతానికి చేరుకుంది. ఇలా అరవైఏళ్ల కాలంలో సమూలమైన మార్పులే మన దేశంలో చోటు చేసుకున్నాయి.
సమస్యలే లేవా?
అరవైఏళ్లలో మనదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య టెర్రరిజం. దేశ విభజన జరిగినప్పటి నుంచీ.. ఈ సమస్య ప్రభుత్వాలను కలవరపెడుతూనే ఉంది. కాశ్మీర్ సమస్యతో మొదలైన టెర్రరిజం.. మతోన్మాదంగా మారి దేశాన్ని భయపెడుతోంది. తొలినాళ్లలో కాశ్మీర్‌కే పరిమితమైన టెర్రరిస్టు గ్రూపులు.. ఇప్పుడు దేశమంతా విస్తరించాయి. టెర్రిరిజపు నెత్తుటి మరకలు పడని ప్రాంతం దేశంలో ఉందని ఎవరూ చెప్పలేని స్థితికి చేరుకున్నారంటే.. ఉగ్రవాద ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మన పోలీసు వ్యవస్థ ఎంత బలంగా ఉన్నా.. ఇంటెలిజెన్స్ విభాగం ఎంత పటిష్టంగా ఉన్నా.. టెర్రరిస్టుల దాడులు మాత్రం ఆగడం లేదు. పైపెచ్చు.. రోజుకో కొత్త ప్రాంతానికి విస్తరిస్తున్నాయి. దేశంలో ఆర్థికంగా వృద్ధి చెందిన ప్రాంతాలను టార్గెట్ చేసుకుంటున్న కసాయిలు.. ఆ ప్రాంతాల్లో భయాందోళనలు సృష్టించడానికి రక్తపాతం సృష్టిస్తున్నారు. హైదరాబాద్‌లోని మక్కామసీదు, గోకుల్‌చాట్, లుంబినీ పేలుళ్ల దగ్గర నుంచి చూస్తే.. బెంగళూరు, మాలేగావ్ పేలుళ్లదాకా.. ఎంతోమంది సామాన్యులు.. టెర్రరిస్టులు బాంబులకు బలయ్యారు. టెర్రరిస్టుల దాడులు జరగొచ్చంటూ.. ఇంటెలిజెన్స్ విభాగం ప్రతీరోజూ హెచ్చరికలు జారీ చేసే పరిస్థితికి వచ్చేసింది. అందుకే.. దేశంలో ఏ ప్రాంతమూ ఇప్పుడు సురక్షితం కాదు.
ముంబైదాడులే ఓ హెచ్చరిక
దేశంలో అంతర్గత భద్రత ఎంత అలసత్వంతో ఉందో తెలుసుకోవడానికి.. నవంబర్ 26 నాటి ముంబై దాడుల దుష్టాంతం చాలు. సముద్రమార్గం గుండా వచ్చిన పదిమంది కరుడుగట్టిన లష్కరే ట్రైనీలు... మూడురోజుల పాటు.. ముంబైని వణికించారు. తాజ్, ట్రైడెంట్ హోటళ్లతో పాటు.. నారీమన్ హౌస్‌లోనూ చొరబడి దాదాపు రెండు వందల మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ సంఘటనతో మన భద్రతావ్వవస్థలోని డొల్లతనం మరోసారి బయటపడింది. ఈ విషయంలో పాకిస్తాన్ వైపే మనం వేలెత్తి చూపించగలిగినా.. ఆ దేశాన్ని నియంత్రించగలిగే పరిస్థితి మాత్రం లేదు.
ఇక సరిహద్దుల విషయానికి వస్తే.. మన వైఫల్యం మరీ ఎక్కువ. పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, చివరకు చైనా నుంచి కూడా అక్రమ చొరబాట్లు జరుగుతున్నా.. వాటిని అడ్డుకోలేకపోతోంది భారత సైన్యం. పాకిస్తాన్ నుంచి, భారీగా ఆయుధసామాగ్రితో దేశంలోకి చొరబడుతున్న తీవ్రవాదులు.. దేశంలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తున్నారు. ఇది సరిపోదన్నట్లు.. పాకిస్తాన్ ఆర్మీ.. సరిహద్దుల్లో నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటోంది. అయినా.. దాన్ని మనం పూర్తిస్థాయిలో తిప్పికొట్టలేకపోతున్నాం. పైగా.. అంతర్జాతీయంగానూ.. మన పక్కదేశంపై ఒత్తిడి తేవడంలో.. భారతప్రభుత్వం విజయం సాధించలేకపోయింది. దీన్ని అలుసుగా తీసుకున్నపాకిస్తాన్.. ఇప్పుడు సరిహద్దుల్లో భారీగా బంకర్లను, సొరంగాలను నిర్మిస్తోంది. ఇక్కడ తవ్వుతున్న సొరంగాలను చూస్తుంటే.. యుద్ధానికి తక్షణం ఉపయోగించే అణ్వాయుధాలను నిల్వ చేయవచ్చని మన ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. చైనా విషయానికి వస్తే.. కాశ్మీర్ నుంచి.. అరుణాచల్ ప్రదేశ్ వరకూ.. ఆ దేశ సైనికులు.. మన భూభాగంలోకి దర్జాగా చొరబడుతున్నారు. దుష్ట చైనా పన్నాగాలను అడ్డుకోవడంలోనూ.. మనది వైఫల్యమే.
కలవరపెడుతున్న నక్సలిజం
దేశంలోని చాలారాష్ట్రాల్లో మావోయిస్టుల అలజడి. పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లలో అయితే.. ఏకంగా సమాంతర ప్రభుత్వాలనే నడపగలుగుతున్నారు. నక్సలిజాన్ని పూర్తిగా ఏరివేయడానికి కేంద్రం ఎన్ని ప్రణాళికలు వేస్తున్నా.. మావోయిస్టుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. పశ్చిమబెంగాల్లో ఓ యుద్ధం చేసినట్లుగా.. సైనికబలగాలు పోరాడినా.. లాల్‌గఢ్ నుంచి నక్సల్స్‌ను పూర్తిగా మట్టుబెట్టలేకపోయాయి. దేశంలోని సమస్యలనే ఊపిరిగా చేసుకుంటూ.. మావోయిస్టులు దేశమంతా విస్తరించడానికి వేగంగా పావులు కదుపుతున్నారు. ఇలా ఏరకంగా చూసినా.. అంతర్గత భద్రత విషయంలో మాత్రం.. ఈ అరవైఏళ్లలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఇకనైనా.. ఈ విషయంలో సీరియస్‌గా దృష్టిసారించకపోతే.. పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారవుతుంది.
భిన్నత్వంలో ఏకత్వం ఏది?
మన భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పడానికి నిదర్శనం.. జాతీయగీతం జనగణమనే. అన్నిప్రాంతాలను ప్రస్తావిస్తూ.. భారతదేశ భిన్నత్వాన్ని ఒక్కతాటిపైన చూపిస్తుందీ గీతం. బ్రిటీష్ దాస్యశృంఖలాలను తెంచుకోవడానికి .. ఇలా కుల,మత,జాతి వివక్ష లేకుండా కలిసికట్టుగా అంతా పోరాడారు కాబట్టే.. స్వాతంత్ర్యం సాధించుకోగలిగాం. మనది భిన్నత్వంలో ఏకత్వమని గణతంత్రరాజ్యంగా ఆవిర్భవించేముందే ఘనంగా చెప్పుకున్నాం. అయితే.. ఈ స్ఫూర్తి ఇప్పుడు పూర్తిగా దెబ్బతిందనే చెప్పాలి. ప్రాంతాల మధ్య విభేదాలు పెరిగిపోయాయి. భుజం భుజం కలుపుకొని తిరిగిన భిన్నప్రాంతాల వారంతా.. ఇప్పుడు కయ్యానికి కాలుదువ్వుతున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం భాషాప్రయుక్త రాష్ట్రాలుగా దేశాన్ని విభజించినప్పటినుంచీ.. భాషాదురాభిమానం విపరీతంగా పెరిగిపోయింది. దీనికితోడు.. ప్రభుత్వాలు కూడా కొన్ని ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడమూ దీనికి ఊతమిచ్చింది. మహారాష్ట్రలో శివసేన ఆవిర్భావానికి మూలం ఇదే. ఆ తర్వాత.. రాజ్ థాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన.. విధ్వంసం దిశగా నడిచింది. మహారాష్ట్రలో మరాఠేతరులపై దాడులు చేసింది. ఉద్యోగాలు వెతుక్కోవడానికి వచ్చిన బీహారీలను రైల్వేస్టేషన్లలోనే చితక్కొట్టింది. మరాఠానే మాట్లాడాలంటూ ఆర్డర్లు పాస్ చేసింది. చివరకు.. అక్కడి ప్రభుత్వం కూడా ఇదే దిశలో సాగి.. ముంబైలోని ట్యాక్సీ డ్రైవర్లకు తప్పకుండా మరాఠీ రావాల్సిందేనంటూ ఆదేశాలిచ్చింది.. మహారాష్ట్రలోని ఉద్యోగాలను ఇతరప్రాంతాల వారు తన్నుకుపోతున్నారన్న భావనే.. ఈ పరిస్థితులకు కారణం. దీన్ని సరిచేయడానికి ప్రభుత్వాలెప్పుడూ ప్రయత్నించిన దాఖలాలు మనకు కనిపించవు. అందుకే.. ఈ వివాదం.
ఇక మనరాష్ట్రం విషయానికి వస్తే.. ప్రత్యేక వాదం. ఒకప్పుడు ప్రత్యేకరాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. మళ్లీ అదే హోదాను దక్కించుకోవాలనుకొంటోంది. ఆంధ్రరాష్ట్రంతో కలిసి.. ఆంధ్రప్రదేశ్‌గా అవతరించిన తర్వాత.. అన్నింటా అన్యాయమే జరిగిందన్నది తెలంగాణ వాదుల ఆరోపణ. ఇదే సమయంలో సమైక్యంగా ఉండడం కోసం.. సీమాంధ్రలోనూ ఆందోళనలు మొదలయ్యాయి. ఏదైతేనేం.. రాష్ట్రంలో ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మధ్య విభేదాలు మాత్రం తారాస్థాయికి చేరుకున్నాయనే చెప్పాలి. మహారాష్ట్ర తరహాలో కాకుండా.. ఇక్కడ చాలావరకూ శాంతియుతంగానే ఆందోళనలు కొనసాగుతున్నాయి. తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్... ఇప్పుడు విభజన అంచులో నిలబడి ఉంది.
దేశంలోనూ చాలా రాష్ట్రాల్లో ఇదే తరహా గొడవలు. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్, బీహార్ నుంచి జార్ఘండ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఉత్తరాంచల్ కొన్నేళ్లక్రితమే విడిపోయాయి. బెంగాల్లో గుర్ఖాల్యాండ్, మహారాష్ట్రలో విదర్భ, ఉత్తరప్రదేశ్‌లో పూర్వాంచాల్, హరితప్రదేశ్, అసోంలో బోడోల్యాండ్.. ఇలా ఎక్కడికక్కడ తమకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలంటూ కొన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నో భాషల సంగమమైన భారతదేశంలో.. ఒక భాషవారికి.. మరో భాషవారికీ పడదు. ఒకరంటే మరొకరికి కోపం. గణతంత్రరాజ్యంగా ఏర్పడిన తర్వాత ఈ అరవైఏళ్లలో మరింత సమైక్యం కావాల్సిన మనం.. ఎక్కడికక్కడ గిరి గీసుకొనే స్థితికి దిగజారిపోయాం. దీనికి ప్రజలను.. ఉద్యమాలను తప్పుపట్టలేం. నిర్లక్ష్యంగా పాలించిన ప్రభుత్వాలే.. ఈ పరిస్థితికి కారకులు.
అభివృద్ధిపై సంకీర్ణ నీడలు
దేశ పాలన జాతీయ పార్టీల చేతినుంచి.. ప్రాంతీయ పార్టీల చేతికి వచ్చింది. దేశంలో అతిపెద్ద పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే పరిస్థితులు ఏమాత్రం లేవు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ సంకీర్ణాన్నే తీసుకుంటే.. దాదాపు పదిపార్టీలు ప్రభుత్వంలో భాగస్వాములు. మరో ఆరు పార్టీలు బయటనుంచి మద్దతు ఇస్తున్నాయి. ఈ సంకీర్ణానికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్నా.. సొంతగా నిర్ణయం తీసుకునే అవకాశం ఎంతమాత్రమూ లేదు. అన్ని పార్టీల అంగీకారం ఉంటే తప్ప.. ఏ విషయంలోనూ ముందడుగు వేయలేదు. దేశంలో పెరిగిన ప్రాంతీయ భావనే దీనికి ప్రధాన కారణం. ఓ రకంగా ఈ పరిస్థితి మన రాజ్యాంగం కల్పించిందే అని చెప్పాలి. పూర్తి ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ను మలచడానికి ప్రయత్నించిన.. మన పెద్దలు.. ఎన్నికల్లో పోటీ చేసే విషయంలోను, ఓటు వేసే విషయంలోనూ విస్తృతమైన అవకాశాలు కల్పించారు. చాలాదేశాల్లో రెండు పార్టీల వ్యవస్థలే ఉన్నవిషయాన్ని గమనించినప్పటికీ.. మన దేశంలో మాత్రం బహుళపార్టీ వ్యవస్థకు రూపకల్పన చేశారు. దీనివల్ల పార్టీల ఆధిపత్యం ఉండదన్నది రాజ్యాంగ పెద్దల భావన. దాని ఫలితమే ఇప్పటి సంకీర్ణరాజకీయాలు. ఓ రకంగా ఇది మంచి పరిణామం.. మరో రకంగా దుష్పరిమాణం. దేశంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం.. సంకీర్ణంలోని పార్టీల ఒత్తిడితో.. కొన్ని ప్రాంతాలకే అభివృద్ధిని పరిమితం చేస్తోంది. గత ప్రభుత్వంలో జాతీయరోడ్లన్నీ తమిళనాడుకు తరలిపోతే.. రైల్వే ప్రాజెక్టులన్నీ బీహార్‌కు వెళ్లిపోయాయి. ఇప్పుడు రైల్వే ప్రాజెక్టులన్నీ బెంగాల్ వైపు ప్రయాణం చేస్తున్నాయి. మిగిలిన ప్రాంతాలకు కేటాయింపులు నామమాత్రమే. ఈ సమస్యను అధిగమించడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు.
సంకీర్ణ శకం వచ్చినా.. అధికారం అందరికీ అందడం లేదు. ముఖ్యంగా దేశ జనాభాలో సగమైన మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ ఇప్పటికీ కలగానే ఉంది. ప్రభుత్వాలు మారుతున్నా.. సంకీర్ణంలో పార్టీలు మారుతున్నా.. ఈ బిల్లుకు మాత్రం ఇంకా మోక్షం కలగలేదు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విషయాన్ని చూస్తే.. కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చాక.. పదేళ్లపాటే ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. అప్పటిలోగా.. ఆయా వర్గాలను పూర్తిగా అభివృద్ధి చేయాలన్నదే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశం. కానీ.. జరిగింది మాత్రం వేరు. ఇప్పటికీ రాజ్యాంగంలో సవరణలు చేస్తూ కొత్త కొత్త రిజర్వేషన్లను చేర్చుతున్నారు. తమకూ కావాలనే కులాలు, వర్గాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అంతేకాదు.. అరవైఏళ్లుగా.. పంచవర్ష ప్రణాళికలు వేసుకుంటున్నా.. వేలకోట్లు ఖర్చుపెడుతున్నా.. అన్ని రంగాలు సమానంగా అభివృద్ధి చెందడం లేదు. మన అభివృద్ధి అంతా పట్టణాల్లో మేడలు, షాపింగ్‌మాళ్లు, ఫ్లైఓవర్ల రూపంలోనే కనిపిస్తుంది. అదే గ్రామాల్లోకి తొంగిచూస్తే.. అభివృద్ధి అసలు రంగు బయటపడుతుంది. దేశ అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని జాతిపిత మహాత్మాగాంధీ చెప్పినా.. మన పాలకులు మాత్రం గ్రామాలను చిన్నచూపే చూస్తున్నారు. వ్యవసాయరంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే.. దేశంలో ఇప్పుడు ఆకలికేకలు. నిత్యావసరాల ధరల మంటలు. గత పదేళ్లుగా.. ఈ ధరల పెరుగుదల తీవ్రంగా ఉంది. సామాన్యుడి జీవితం అతలాకుతలమయ్యింది. ఇదేనా మనం అరవైఏళ్లలో సాధించిన అభివృద్ధి ?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Very well written. we might be asking these questions even after 60 years later.