27, జనవరి 2010, బుధవారం
పెద్దమనిషి వీడ్కోలు..
తెలుగు సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది. ప్రముఖ సినీనటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఆదివారం గుండెనొప్పితో హైదరాబాద్ కేర్ అస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి 11.౩౦గంటలకు తుదిశ్వాస విడిచాడు. గుమ్మడి వయసు 83 ఏళ్లు. గుంటూరు జిల్లా రావికంపాడులో ఆయన జన్మించారు. 5గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు దు:ఖసాగరంలో మునిగిపోయారు. బంధువులు, ఆయన శ్రేయోభిలాషులు ఆస్పత్రికి తరలివచ్చారు.
మహానటుడు..
తెలుగు సినీరంగంలో గుమ్మడి తనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పరుచుకున్నారు. ఆరు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఆయన ఎన్నో క్యారెక్టర్లు పోషించి మెప్పించారు. అత్యుత్తమ నటనకుగాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు ఆయన్ను వరించాయి.
1999లో రఘుపతి వెంకయ్య పురస్కారం గుమ్మడికి లభించింది. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన గుమ్మడి.... సుమారు ఆరు దశాబ్దాలపాటు సినిమాల్లో వివిధ పాత్రలు పోషించారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక పాత్రలు చేసి మెప్పించారు. తెలుగువారి గుండెల్లో తనదైన ముద్రవేసుకున్నారు. 1950లో అదృష్టదీపుడు చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆయన ఆఖరి చిత్రం శ్రీకాశీనాయన చరిత్ర. సుమారుగా 500లకుపైగా సినిమాల్లో నటించారు. గుమ్మడి.... 1942లో తొలిసారి ఓ నాటకం కోసం ముఖానికి రంగు వేసుకున్నారు. అందులో ఆయన వృద్ధుడి పాత్ర పోషించారు. యాదృచ్చికమో లేక నాటకంలోని పాత్ర ప్రభావమేమో కాని సినిమాల్లో ఆయనకు తన వయసుకు మించిన పాత్రలే ఎక్కువగా వచ్చాయి. అయిన వాటిలో ఒదిగిపోయారు. వయసుకు మించిన పాత్రలంటే ప్రేక్షకులకు ముందుగా గుమ్మడిపేరే గుర్తుకువచ్చేది. ఆయన అంతగా ప్రాచుర్యం పొందారు. పౌరాణికాలు, సాంఘికాలు ఇలా అన్ని రకాల సినిమాల్లో గుమ్మడి అద్వితీయమైన నటన ప్రదర్శించారు. స్వాత్వికాభినయం పెట్టిందిపేరు ఆయన. శ్రీ వెంకటేశ్వరమహత్యంలో భృగుమహర్షిపాత్రలో గుమ్మడి అభినయం అద్వితీయం. మయాబజార్‌లో బలరాముడిగా.. ఆయన నటన మాటల్లో వర్ణించలేనిది. సహజత్వం ఎక్కడా కోల్పోకుండా నటించడంలో ఆయనకు ఆయనే సాటి. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు, సావిత్రి లాంటి నటులతో ఆయన ఎక్కువ చిత్రాల్లో నటించారు. గుమ్మడి తన ఆరు దశాబ్దాల సినీప్రస్థానంలో పలు అవార్డులు అందుకున్నారు. కులదైవం, మా ఇంటి మహాలక్ష్మి, మహామంత్రి తిమ్మరుసు, మాయాబజార్ చిత్రాలు ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. మహామంత్రి తిమ్మరుసులో నటనకుగాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. మరోమలుపు చిత్రానికి ఉత్తమ నటుడు పురస్కారం లభించింది. 1999లో రఘుపతి వెంకయ్య అవార్డుతో రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. 1989లో తెలుగు యూనివర్సిటీ గుమ్మడికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
గుమ్మడి చనిపోయారా...అయ్యయ్యో, నాకు తెలీదండీ :(
నిజంగానే మహానుభావుడు, గొప్ప నటుడు. ఒక్క మాహమంత్రి తిమ్మరుసు చాలు, ఆయన గురించి చెప్పుకోవడానికి.ఆయన ఇకలేరు అని గ్రహించడానికి చాలా బాధగా ఉంది :(