27, జనవరి 2010, బుధవారం
ప్రపంచంలో అతిపెద్ద గిరిజన మేళా
శతాబ్దాలుగా వస్తున్న ఆచారం.. గిరిజన జీవనానికి అద్దం పట్టే సంప్రదాయం.. అడవి బిడ్డలే కాదు.. నాగరిక జనం కూడా తరలివస్తున్న దృశ్యం. అన్నీ కలగలిస్తే.. మేడారం మహోత్సవం. అదే సమ్మక్క సారలమ్మ జాతర. కులమతాలకు అతీతంగా.. ఎంతోమంది.. మేడారానికి తరలివచ్చి.. వనదేవతలను దర్శించుకుంటారు.
ఎప్పుడూ నిశ్సబ్ధంగా ఉండే.. అటవీప్రాంతం.. జనఘోషతో హోరెత్తుతోంది. వందలు.. వేలు కాదు.. లక్షలాది జనం మేడారానికి దూసుకువస్తున్నారు. అడవితల్లి ఆకాశమంత సంబరం చేసుకుంటుంటే.. భక్తుల రాకతో.. దారిపొడవునా నేలనున్న ఎర్రని ధూళి పైకెగసి హోళీ ఆడుకుంటోంది. అడవిలో పారే స్వచ్ఛమైన జంపన్న వాగు లక్షలాది భక్తులను పునీతులను చేస్తోంది.. ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజనుల జాతర మేడారం సమ్మక్కసారలమ్మ తీర్థం అందరినీ ఆహ్వానిస్తోంది. లక్షలాది భక్తులతో కిటకిటలాడుతున్న ఈ మేడారం జాతర రెండేళ్లకోమారు జరుగుతుంది. గిరిజనుల గుండెల్లో కొలువైన సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొని ముడుపులు చెల్లించుకోవడానికి జనం తరలివస్తున్నారు. మార్గశిర పౌర్ణమి అయిన గురువారం.. చిలకల గుట్ట నుంచి సమ్మక్కను తీసుకువచ్చి గద్దెపైన ప్రతిష్టించడంతో.. అధికారికంగా జాతర మొదలవుతుంది. సమ్మక్క రాకకన్నా ముందురోజే.. అంటే బుధవారం నాడే.. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ప్రతిష్టాపన జరుగింది. సమ్మక్క సారలమ్మ జాతరలో ఇదే తొలిఘట్టం. గిరిజన ఇలవేల్పులు సమ్మక్క- సారలమ్మలను ప్రతిష్టించిన తర్వాత.. మేడారానికి వచ్చే వారి సంఖ్య మరింతగా పెరుగుతుంది. అమ్మవార్లను దర్శించుకొని.. తమ ముడుపులను సమర్పిస్తారు. చీరసారెలు పెట్టి పూజిస్తారు. మూడురోజుల పాటు ఘనంగా సాగే.. ఈ గిరిజన కుంభమేళా.. మళ్లీ సమ్మక్క, సారలమ్మలు వనప్రవేశం చేయడంతో ముగుస్తుంది.
ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతర
అడుగడుగునా.. గిరిజన సంప్రదాయం.. అచ్చమైన కోయ ఆచారాలతో కొలువుతీరుతుంది మేడారం జాతర. సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో మేడారం కిటకిటలాడుతుంది. గిరిజన దేవతలకు నైవేధ్యంగా పెట్టడానికి ఒడిబియ్యంతో పాటు.. రవికెలను నడుముకు కట్టుకుని వస్తారు భక్తులు. సమ్మక్క, సారలమ్మలను దర్శించుకోవడానికి ముందు ప్రతీ ఒక్కరూ జంపన్నవాగులో స్నానం చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ సమయంలో శివసత్తులు చేసే వీరంగం.. భక్తుల కోలాహలం అంతా ఇంతా కాదు.. సమ్మక్క సారలమ్మల ప్రస్తుతితో నినాదాలు హోరెత్తుతాయి.
వరంగల్ నగరానికి దాదాపు 110 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలోని మేడారం గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. మామూలు సమయాల్లో ఇక్కడి వెళ్లడమూ ఎంతో కష్టమైన పనే. కానీ.. జాతర సమయంలో అలాంటి కష్టనష్టాలను భక్తులు పట్టించుకోరు. సమ్మక్కసారలమ్మలను దర్శించుకోవాలనే తపన ముందు.. ఈ కష్టాలు భక్తులకు దూదిపింజల్లానే కనిపిస్తాయి. రెండేళ్లకోమారు జరిగే సంబంరం కావడంతో.. పెద్ద ఎత్తునే.. ఇలా జాతరకు వస్తారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గిరిజనులు, చెంచులు, వడ్డెరలు, గోండులు, కోయల్లాంటి అనేక తెగల వాళ్లకు ఇది అపురూపమైన సంబరం. జాతకాలు చెప్పే కోయదొరలు.. పాము పుట్టలకు పూజలు.. చిలక జోస్యాలు.. కోళ్లు మేకల జంతు బలులు.. ఒకటా రెండా.. అచ్చమైన గిరిజన సంప్రదాయాన్ని మేడారం పుట్టతేనంత స్వచ్ఛంగా ప్రతిబింబిస్తుంది. ఈ జాతరకు ప్రత్యేక ఆకర్షణ తులాభారం. కొత్తకోర్కెలను కోరుకుంటూ.. తీరిన వాటికి మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు పోటీపడుతుంటారు. నిలువెత్తు బంగారాన్ని ముడుపుగా సమర్పించుకుంటారు. బంగారమంటే.. ఇక్కడ బెల్లమే.
మిగతా తీర్థాలకు భిన్నంగా మేడారం జాతరలో.. గిరిజనులతో పాటు నాగరికులు కూడా సరిసమానంగా పాల్గొంటారు. హైదరాబాద్‌తో పాటు.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా మేడారంకు ప్రజలు తరలివస్తారు. అంతేకాదు.. మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్.. ఇలా సుధూరప్రాంతాల నుంచి కూడా.. ఈ జాతర కోసం వస్తారు. ఒక్కసారి మేడారంలో ప్రవేశించగానే ప్రజలు తమ అస్తిత్వాన్ని పూర్తిగా మరచిపోతారు.. ఇక్కడ కులాలు లేవు. మతాలు లేవు. వర్గాలు లేవు. సమాజం లేదు. జాతి లేదు.. భక్తులు తమ పేర్లను సైతం మరచిపోయేంతగా జాతరలో మమేకం అవుతారు..
సమ్మక్క దేవతెలా అయ్యింది.. ?
మేడారం సంస్థానానికి రాజైన మేడరాజుకు అడవిలో దొరికిన ఆణిముత్యం సమ్మక్క. ఆమెను పెంచి పెద్ద చేసి.. తన మేనల్లుడు పగిడిద్దరాజుతో సమ్మక్కకు వివాహం జరిపించాడు మేడరాజు. వీరికి కలిగిన సంతానమే సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. కాకతీయుల సామంతులైన సమ్మక్క కుటుంబం.. మేడారం పరిగణాను పాలించేది. ఓ సారి వరసగా నాలుగేళ్ల పాటు అనావృష్టి కారణంగా కరువు విలయతాండవం చేసింది. అయినా కప్పం కట్టమంటూ కాకతీయ రాజులు ఒత్తిడి చేశారు. కట్టలేమనే సరికి యుద్ధానికి వచ్చారు. రాజరిక దురహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం మొదలయ్యింది. యుద్ధరంగంలో కాకతీయుల ధాటికి తట్టుకోలేక పగిడిద్దరాజు నేలకూలాడు. ఈ అవమానం తట్టుకోలేక సమ్మక్క కుమారుడు జంపన్న.. సమీపంలోని సంపెంగ వాగులో దూకి ప్రాణాలు వదిలాడు. గిరిజన రాజులు నేలరాలినా.. మొక్కవోని ధైర్యంతో.. సమ్మక్క, సారలమ్మలు అపరకాళీల్లా కాకతీయ సైన్యంపై విరుచుకుపడ్డారు. వారిని కకావికలం చేశారు. సమ్మక్క ప్రతాపాన్ని ధైర్యంగా ఎదుర్కోలేక.. బల్లెంతో వెన్నుపోటు పొడిచారు శత్రువులు. దీంతో యుద్ధం నుంచి వైదొలిగి సమీపంలోని చిలకలగుట్టవైపు వెళ్లి మాయమైపోయింది సమ్మక్క. సారలమ్మ కూడా సంపెంగ వాగులోకి దూకి ప్రాణత్యాగం చేసింది. సమ్మక్కకోసం వెతికి గిరిజనులకు గుట్టపైన ఓ కుంకుమభరిణ మాత్రం దొరికింది. దీనినే సమ్మక్క గుర్తుగా భావించి.. ఆ ప్రాంతంలోనే ముత్తయిదవులు పండగ జరుపుకునేవారు. కాలక్రమంలో ఇదే మేడారం జాతరగా గుర్తింపు పొందింది. గిరిజనం కోసం ప్రాణత్యాగాలు చేసిన సమ్మక్క, సారలమ్మలనే ప్రత్యక్ష దైవాలుగా కొలుస్తూ.. గిరిజనులు వారికి దైవత్వాన్ని ఆపాదించారు. రెండేళ్లకోమారు వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ.. మేడారం జాతరను నిర్వహిస్తారు.
శతాబ్దాలుగా సాగుతున్న ఈ ఆచారం క్రమంగా అతిపెద్ద ఉత్సవంగా రూపుదాల్చింది. ఈ జాతర అడవిబిడ్డల పౌరుషానికి ప్రతీక. సమ్మక్క కూతురు సారలమ్మను ఆదిశక్తిగా భావించి భక్తులు తమ మొక్కులు చెల్లించి కోరికలు విన్నవించుకుంటారు. ఈ అడవితల్లుల ఆప్యాయతలే సుదూరప్రాంతాల నుంచి భక్తులను తమ వద్దకు రప్పించుకుంటున్నాయి. సమ్మక్క, సారలమ్మలను మొక్కుకుంటే.. ఎంతటి కోరుకైనా తీరుతుందన్నది భక్తుల విశ్వాసం. తమ కోసం పోరాడిన తల్లులను స్మరించుకుంటూ గిరిజనులు జరుపుకుంటున్న ఉత్సవం. శతాబ్దాలు గడిచినా.. తమ గుండెల్లోనే సమ్మక్క, సారలమ్మలు కొలువై ఉన్నారని చూపించడానికి నిదర్శనం. వారి అభిమానానికి, ఆత్మ గౌరవానికి అచ్చమైన ప్రతిరూపం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి