22, జనవరి 2010, శుక్రవారం
చట్టబద్దమవుతున్న వరకట్నం?
కాళ్ల పారాణి ఆరకముందే.. కట్నం కోరలకు బలి.. నవ వధువుపై అదనపు కట్నం వేధింపులు.. కట్నం వేధిపులకు అబల బలి.. ఇలా నిత్యం ఏదో వార్తను వింటూనే ఉంటాం. సమాజం ఎంతగా అభివృద్ధి చెందుతుంటే.. అంతగా ఈ కట్నపిశాచి పాతుకుపోతోంది. కట్నం బారినుంచి రక్షించుకోవడానికి చట్టం అందుబాటులో ఉన్నా.. దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నవారు తక్కువమందే. అందుకే.. ఈ వేధింపుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. వీటిని అరికట్టలకేపోతున్న ప్రభుత్వం.. కొత్త ఎత్తుగడ వేసింది.
కట్నం తీసుకోవడం నేరం.. కట్నం ఇవ్వడమూ నేరమే. కానీ.. దేశం మొత్తంమీద కట్నం లేకుండా జరిగే పెళ్లిళ్లు ఎన్ని.. నూటికి ఒక్కటి కూడా ఉండకపోవచ్చు. అమ్మాయికి ఈడు రాగానే పెళ్లిచేయడానికి తాపత్రయపడే తల్లిదండ్రులు.. ముందుగా ఆలోచించుకునేది.. ఎంత కట్నం ఇవ్వగలమనే. అబ్బాయి ఆస్థి.. అంతస్తులకు తగ్గట్లుగా.. కట్నంగా ఇవ్వాల్సిన మొత్తం కూడా పెరిగిపోతుంటుంది. పోనీ.. అప్పోసొప్పో చేసి.. కష్టపడి పెళ్లిచేసినా.. అక్కడితో ఆగిపోదు. పండగకో పబ్బానికో.. అల్లుడికి మళ్లీ ఏదో బహుమతి ముట్టజెప్పాలి. ఇక.. వరుడి కుటుంబానికి ఆశ కాస్త ఎక్కువే అయితే మాత్రం.. పెళ్లైన తర్వాత అదనపు కట్నం కోసం ఒత్తిడి పెరుగుతుంది. హింసకూడా మొదలవుతుంది.
రాష్ట్రంలో ఎక్కువగా వేధింపులు
చదువుకున్నోళ్లు.. చదువుకోని వాళ్లు.. ఈ వేధింపుల విషయానికి వచ్చేసరికి అంతా ఒక్కటే. గ్రామాలతో పోల్చితే.. నగరాల్లోనే ఈ వేధింపుల సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. చాలాసంఘటనల్లో.. అబలలు.. ఇలా వరకట్న వేధింపులకు బలవుతున్నారు. 1980లో ఏడాదికి 400 వరకట్నచావులు సంభవిస్తే.. 1990 నాటికి ఏడాదికి ఈ మరణాలు 5800కి చేరాయి. 2000 నాటికి ఈ సంఖ్య మరింత పెరిగింది. నేషనల్ క్రైంబ్యూరో రికార్డ్స్ ప్రకారమే.. 2006లో 7618 మంది మహిళలను వరకట్నపిశాచి బలితీసుకొంది. మన రాష్ట్రం విషయానికి వస్తే.. 2006లో కట్నం వేధింపుల్లో 538 మంది, 2007లో 613 మంది, 2008లో 724 మంది, 2009లో 582 మంది చనిపోయారు. ఈ లెక్కన చూస్తే.. రాష్ట్రంలో.. రోజు ఒకరికన్నా ఎక్కువే.. ఇలా అదనపు కట్నం ఇవ్వలేక ప్రాణం కోల్పోతున్నారు. ఇవన్నీ అధికారికంగా ప్రభుత్వ లెక్కల్లోకి వచ్చిన వివరాలు మాత్రమే. పోలీసుల రికార్డుల్లో చేరని మరణాలు మరెన్నో జరుగుతున్నాయి. పెళ్లి సమయంలో కొంతమొత్తానికి అంగీకరించే వరుడి కుటుంబం.. పెళ్లైన తర్వాత మాత్రం అసలు రూపాన్ని చూపిస్తోంది. అడిగినంత పుట్టింటినుంచి తీసుకురాకపోతే... అమ్మాయి ప్రాణాన్ని తీసేస్తోంది.
చట్టాలేం చేస్తున్నాయ్?
వరకట్న దురాచారాన్ని రూపుమాపడానికి కేంద్ర ప్రభుత్వం.. ఎప్పుడో చర్యలు తీసుకొంది. వరకట్నవేధింపులను అరికట్టడానికి 1961లో వరకట్న నిషేధ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. కట్నం అడగడం ఈ చట్టం ప్రకారం నేరం. కట్నం తీసుకున్నవారికి ఐదేళ్లవరకూ జైలు శిక్షతో పాటు.. ఫైన్‌ను కూడా విధిస్తారు. 1983లో ఇండియన్ పీనల్ కోడ్‌ను మార్పు చేసి.. 498A సెక్షన్‌ను ఏర్పాటు చేశారు. భర్త కానీ, అతని బంధువులు కానీ.. భార్యను వేధిస్తే.. ఈ సెక్షన్ ప్రకారం మూడేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. వరకట్న దురాఘతాలను దృష్టిలో పెట్టుకొని 1986లో ఐపీసీలో మరో మార్పు చేశారు. 304B సెక్షన్‌ను ఏర్పాటు చేశారు. పెళ్లైన ఏడేళ్లలోపు.. అసాధారణ పరిస్థితుల్లో ఓ మహిళ మరణిస్తే.. దాన్ని వరకట్నపు చావుగానే భావిస్తారు. హత్య చేసిన వారికి ఏడేళ్లకు తక్కువ కాకుండా శిక్ష పడుతుంది.
ఎంతో పటిష్టంగా ఈ చట్టం ఉన్నప్పటికీ.. అమల్లో మాత్రం ఎన్నో లోపాలు. మరెన్నో సమస్యలు. అసలు నిందితులు చట్టం కళ్ల నుంచి సులువుగా తప్పించుకుంటుంటే.. చాలా సార్లు అమాయకులే బలవుతున్నారు. ఇక, కట్నం రూపేణా.. ముట్టజెప్పిన నగదు, నగలు, ఖరీదైన కానుకలు.. అమ్మాయి చనిపోయినా, విడాకులు తీసుకున్నా వెనక్కి మాత్రం రావు. ఒకవేళ ధైర్యం చేసి అడుగుదామంటే.. దానికి సాక్ష్యాలుండవు. కోర్టులకు వెళ్లినా.. ఉపయోగం ఉండదు. చాలా కుటుంబాలు.. ఇలా అమ్మాయితో పాటు.. డబ్బునూ పోగొట్టుకోవాల్సి వస్తుంది. దశాబ్దాలుగా.. మన దేశంలో ఇదే పరిస్థితి. ఎంతో మంది విడాకులు తీసుకుంటున్నా... కట్నం రూపేణా ఇచ్చిన స్త్రీ ధనాన్ని మాత్రం తిరిగి అందుకోలేకపోతున్నారు.
చట్టానికి మార్పులు
కట్నాన్ని ఇవ్వడాన్ని.. తీసుకోవడాన్ని అడ్డుకోలేక పోతున్న ప్రభుత్వం.. ఇప్పుడు వరకట్ననిషేధ చట్టానికి మార్పులు చేయాలనుకొంటోంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే.. వివాహసమయంలో ఇచ్చిపుచ్చుకునే వస్తువుల జాబితాను అఫిడవిట్ చేయించి.. నోటరీ కూడా చేయించాల్సి ఉంటుంది. దీన్ని ధృవీకరిస్తూ నవదంపతులతో పాటు.. వారి తరుపు పెద్దలు .. వరకట్న నిషేధ చట్ట అధికారి కూడా సంతకాలు చేయాలి. ఒకవేళ ఇలా చేయని పక్షంలో.. వధూవరులతో పాటు.. వారి తల్లిదండ్రులూ చట్టం ముందు దోషులుగా నిలబడాల్సి ఉంటుంది. వీరికి... మూడేళ్ల జైలును, జరిమానాను విధించే అవకాశం ఉంది. ఇలా కానుకుల అఫిడవిట్‌ను రూపొందించడమంటే.. ఓ రకంగా వరకట్నాన్ని చట్టబద్ధం చేసినట్లే. వరకట్నాన్ని సమర్దవంతంగా నియంత్రించలేకపోతున్న ప్రభుత్వం.. ఇలా కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసింది. దీనివల్ల.. మహిళలకు, వారి తల్లిదండ్రులకు.. వరకట్న కేసులను ఎదుర్కోవడం ఓ రకంగా సులువు కావచ్చని సర్కార్ భావిస్తోంది.
మిశ్రమ స్పందన
పెళ్లిళ్లు జరగడంలో కట్నానిది ప్రధాన భూమిక. అయితే.. దీన్ని ఇచ్చినట్లుగానీ.. తీసుకున్నట్లుగానీ ఎక్కడా సాక్ష్యాలు ఉండవు. కానీ.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంతో.. దీనికి కూడా ఇకపై ఆధారాలుండబోతున్నాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చినా.. విడిపోయినా.. చివరకు.. వరకట్నపు హత్యలు సంభవించినా.. పెళ్లి సమయంలో రూపొందించిన అఫిడవిట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అమ్మాయి తరుపు వారు.. తామిచ్చిన కానుకలను పూర్తిగా వెనక్కి పొందడానికి అవకాశం ఉంటుంది. వరకట్న నిషేధ చట్టానికి ప్రభుత్వం మార్పు చేయాలనుకొంటోంది కూడా దీనికోసమే. పెళ్లైన అమ్మాయిలకు, వారి కుటుంబాలకు దీనివల్ల ఎంతో మేలు జరిగే అవకాశమూ ఉంది. అయితే.. ఈ విషయంలో మహిళా సంఘాల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తవుతోంది. వరకట్న నిషేధ చట్టం అమల్లో ఉంటేనే.. వరకట్న చావులు పెద్ద ఎత్తున జరుగుతుంటే.. ఇక చట్టబద్దం చేస్తే.. దాన్ని ఎలా అడ్డుకుంటారని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దీనిబదులు.. ఉన్నచట్టాలనే మరింత సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. పెళ్లి సమయంలో ఇచ్చే కానుకలను తప్పకుండా రిజిస్టర్ చేయాలన్న నిబంధన అమల్లోకి వస్తే.. కుటుంబాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతింటాయన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే ఉన్న చట్టాల అమల్లో లోపాలు ఉన్నట్లే.. ఈ అఫిడవిట్‌ల విషయంలోనూ.. అనేక అక్రమాలు జరుగుతాయన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కట్నంతీసుకోవడం నేరమన్న చట్టం ఏవిధంగా దుర్వినియోగమైపోయిందో ప్రస్తుతం చేయనున్న చట్టంకూడా అదేవిధంగా దుర్వినియోగమవుతుందన్న విషయంలో మనకేఅనుమానాలూ అక్కర్లేదు. సమస్య చట్టాలు కాదు మనవద్ద అవి పుష్కలంగా వున్నాయన్న విషయం మనకందరకూ తెలిసిందే. వచ్చిన సమస్యల్ల వాటి అమలుబాటులోనే. ఇప్పుడుకూడా ఏ రికార్డులకూ అందకుండా కట్నం తీసుకోవడం కొనసాగుతుంది -ఎప్పటిలాగే.
ఎప్పటివరకైతే తేరగా వచ్చిన సొమ్ముతో ఆస్థులు కూడాబెట్టుకుందామన్న మనస్తత్వాలు మారవో, ఎప్పటివరకైతే ఇలాంటివారిళ్ళకు ఆడపిల్లలను పంపి వాళ్ళు సుఖంగా కూడా వుండాలని ఆశించే పిచ్చి తల్లిదండ్రులు వుంటారో, ఎప్పటివరకైతే అమ్మాయిలు డబ్బు, హోదాలున్న అబ్బాయిలను మాత్రమే "తగిన" వరులుగా భావిస్తూ వారితో జీవితాన్ని పంచుకోవడంకోసం వెంపర్లాడుతూవుంటారో అప్పటివరకూ ఈ పరిస్థితి మారదు.
మహిళా సంఘాల వారి వాదన పూర్తి అర్ధరహితమూ కాదు అలాగని పూర్తి అర్ధవంతమూ కాదు.
I dont know abt real victims but this will be good for guys who are blackmailed using stupid laws like 498A.
ప్రస్తుతం స్త్రీ సంరక్షణ కోసం పుట్టగొడుగుల్లా లెఖ్ఖలేనన్ని చట్టాలు ఉన్నాయి. ప్రతీ చట్టానికీ లూప్ హోల్స్ ఉంటాయి, ఉన్నాయి, వెతుకుతున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేయడం కావాలి. ఇకపోతే ఈ కొత్త వరకట్న చట్టం గురించి నా అభిప్రాయం: దీనివల్ల ఆడపిల్లలకు ఏ రకమైన మేలూ జరగదు. ఎందుకంటే స్థలాలూ, ఇళ్ళూ, పొలాల రిజిస్ట్రేషన్ చూస్తున్నాంగా, అలాగే కట్నం కూడా అసలుగా ఒక మొత్తం, కాగితాల మీద ఒక మొత్తం చూపిస్తారు. అలాగ ఒప్పుకుంటేనే వివాహం సమ్మతం అంటారు. చిన్నా చితకా కట్నాలు ఇచ్చే వాళ్ళకు ఓకే. కానీ పెద్ద మొత్తాల్లో కట్నం ఇచ్చినప్పుడు, అందులో నల్ల ధనం పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఆడపిల్లల తల్లితండ్రులు కూడా పైన చెప్పినట్టు అండర్ వాల్యూ రిజిస్ట్రేషన్ కి ఒప్పుకుంటారు. అలాంటి విషయాల్లో ఈ చట్టం ఏ రకంగానూ ఉపయోగపడదు.